అవతల్నుంచి మళ్ళీ నవ్వు. "ఆ తాగటం గురించంత సీరియస్ గా తీసుకోకు. డ్రింక్ చెయ్యటమనేది ఈ రోజుల్లో చాలా చిన్నసంగతి. ఆ మాట కొస్తే నేనూ డ్రింక్ చేస్తాను."
"ఏమిటి? నువ్వూ డ్రింక్ చేస్తావా?"
"అవును ఏం?"
"నువ్వు..."
"చెప్పు."
"నువ్వు... డ్రింక్ చెయ్యటం నాకిష్టంలేదు."
"ఎందుకని?"
"..... ....."
"చెప్పు."
"ఎందుకంటే..."
"చెప్పు-ఫరవాలేదు."
"ఎందుకంటే.....ఏమోనబ్బా చెప్పలేను."
"సరే, నువ్వోపని చేస్త్ఘే నేను డ్రింక్ చెయ్యటం మానేస్తాను."
"ఏమిటది?"
"చెప్పెయ్యనా?"
"ఊఁ"
"ఒక తీయని ముద్దివ్వాలి!"
"ఛీ!" సిగ్గుతో, రకరకాల భావాలతో ఆమె ముఖం వివిధ వర్ణ కిర్మీరిత మయింది.
"ఏం?"
"ఏమిటీ?"
"ముద్దు"
"వద్దు"
"ఏం?"
"నా కిలాంటివంటే భయం."
"భయమా? ఇష్టం లేదా?"
"రెండూనూ."
"బావుంటుంది."
"ఏమిటి?"
"ముద్దు."
"అలాంటి మాటలు అనవద్దన్నానా? అమ్మో ఏదో చప్పుదావుతుంది. ఎవరో వస్తున్నట్టున్నారు. ఉంటానేం" అని ఆమె ఫోన్ పెట్టేసి, గబగబా పుస్తకం చేతిలోకి తీసుకుంది.
అర్ధనారీశ్వరరావు ఊడిపోతూన్న లుంగీ ముడి బిగించుకుంటూ హాల్లోకి వచ్చాడు. అతని కళ్ళలో నిద్రమత్తు కనబడుతోంది.
కూతురివంక పరీక్షగా చూశాడు. దేవీప్రియ తండ్రిని చూడనట్లు పుస్తకంలో లీనమైపోయినట్లు యాక్షన్ చేస్తోంది.
"అమ్మాయ్!" అని పిల్చాడు.
దేవీప్రియ పుస్తకంలోంచి తలెత్తి తండ్రిని అప్పుడే చూసినట్లు నటిస్తూ "ఏమిటి నాన్నా" అంది.
"ఎవరితోనో మాట్లాడుతున్నట్లు చప్పుడయినాదేమిటి?"
"పాఠాలు సరిగ్గా అర్ధంకాకపోతే బయటకు చదువుకుంటున్నాను నాన్నా."
ఆమె కళ్ళలోని భయం అతనికి చాలా తృప్తినిచ్చింది.
ఆడపిల్లలంటే అలా ఉండాలి. తల్లిదండ్రులంటే అగ్గగ్గలాడిపోతూ ఉండాలి. చదువు-ఇల్లు, భయం-అంతే అవే జీవితాశయాలు.
"బాగా చదువుతున్నావా?" అన్నాడు.
"చదువుతున్నాను నాన్నా!"
"పిచ్చి పిచ్చి స్నేహాలు చెయ్యటం లేదు కదా!
దేవీప్రియ గుండె దడదడ కొట్టుకుంది. తండ్రి ప్రశ్న అర్ధం కానట్లు చూసింది.
"ఎదురుగా ఉన్న వినూత్న-అలాంటి వాళ్ళతో."
"లేదు నాన్నా"
"ఆ అమ్మాయి చాలా చెడ్డది అల్లరి చిల్లరి కుర్రాళ్ళతో స్కూటర్లమీద తిరగటం చూశాను."
తను కూడా అలా ఓ అందమైన కుర్రాడితో స్కూటర్ మీద అతని నడుం చుట్టూ చెయ్యి వేసుకుని కూర్చుని రయ్ మని వెళ్ళిపోతూన్న దృశ్యం ఊహించుకుంటూ ఆనందిస్తున్నది.
"ఏమిటి మాట్లాడవేం?"
"అలాగే నాన్నా!"
"ఏమిటి అలాగే?"
"ఆ అమ్మాయి చాలా చెడ్డది- అలాంటి వాళ్ళతో తిరక్కూడదు."
"గుడ్" అనుకున్నాడు. "బాగా చదువు, బాగా చదువు" అని లోపలకు వెళ్ళిపోయాడు.
"హమ్మయ్య" అని దేవీప్రియ గుండెమీద నుంచి బరువు తొలగిపోయినట్లు తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది. తండ్రిని చూస్తుంటే ఆమెకు పెద్దపులినో, సింహాన్నో చూస్తున్నట్లుగా ఉంటుంది. ఊపిరాడదు. ఆయన ఇంట్లో ఉంటె, ఎదురుగా నిలబడితే మెదడు పని చెయ్యదు. బయటకు వెళ్ళిపోగానే ఎగిరి గంతులెయ్యాలన్నంత ఆనందంగా, స్వేచ్చగా ఉంటుంది.
పిల్లలకూ తండ్రికీ మధ్య ఉండవలసిన బంధం ఏమిటి? ఓ విధమైన భయమా? భక్తా? స్వేచ్చతో కూడిన ప్రేమా?
ఓ అరగంట గడిచాక పుస్తకం పక్కన పెట్టేసి, లైటార్పేసి, తన గదిలోకి వెళ్ళి పడుకుంది.
ఇందాకటి ఫోన్ సంభాషణ అదేపనిగా గుర్తు వస్తున్నది.
ఎవరతను?