Previous Page Next Page 
మోహిత పేజి 15


    మరో అరగంట తర్వాత ఇద్దరూ  జలపాతానికి రెండు కిలోమీటర్ల దూరంలో వున్న బురదగుంట దగ్గరున్నారు. దాదాపు రెండు ఎకరాల విస్తీర్ణంలో నేలంతా ఎర్రటి బురద.

 

    "అడవిలో యిన్ని విచిత్రాలుంటాయని నాకు తెలీదు" అన్నాడు మైత్రేయ.

 

    "ఈ బురదలో ప్రతి పున్నమినాడూ, గిరిజన పురుషులు సామూహికంగా స్నానాలు చేస్తారు. ఎందుకో తెలుసా?"

 

    "ఎందుకు?"

 

    "సెక్స్ సామర్థ్యం పెరుగుతుందని..... అలాగే అమావాస్య రోజుల్లో పిల్లల్లేని గిరిజన దంపతులు యిక్కడ ప్రణయం సాగిస్తారు....." చెట్టుచాటుకి వెళ్ళి చీర విప్పి నైటీ వేసుకుని బురద మడుగులోకి దిగిందామె.

 

    ఆమెవేపు అలా కళ్ళప్పగించి చూస్తున్నాడు మైత్రేయ.

 

    "ఏం చూస్తున్నావ్...... బురద మధ్యలో నేను కలువపువ్వులా వున్నానా?" నవ్వుతూ అంది మోహిత.

 

    "అంతకన్నా అందంగా వున్నావు" అన్నాడతను.

 

    బురద మధ్యలో కూర్చుందామె. రెండుచేతులతో ఎర్రటి బురదను తీసుకుని గుండెకు, కాళ్ళకు రాసుకుంది. బురదలో వెల్లకిలా పడుకుంది.

 

    "నువ్వు చేసే విచిత్రమయిన పనుల్ని ఎన్నాళ్ళిలా చూడాలి......"అసహనంగా అడిగాడతను.

 

    "ఆ మూడు మర్డర్స్ అయ్యేవరకూ!" వెంటనే చెప్పిందామె.

 

    "ఆ ప్లాన్ స్టార్ట్ చేసేది ఎప్పుడూ?"

 

    "రేపట్నుంచే..... సడెన్ గా  చెప్పానని ఆశ్చర్యపోకు. యిదే నా పద్ధతి.... సాయంత్రం ఆరుగంటలకు అంటే ఇంకో మూడుగంటల్లో మనం ఇక్కడినుండి బయలుదేరుతున్నాం..... మొదట ఇక్కడినుండి బయలుదేరుతున్నాం.... మొదట విజయవాడ వెళతాం!" చెప్పింది మోహిత.

 

    అరగంట తర్వాత, బురదలోంచి బయటికొచ్చి జలపాతం దగ్గర స్నానం చేసి, గెస్ట్ హౌస్ వేపు నడుస్తున్నారిద్దరూ.

 

    "నిన్నీవాల్టి నుంచి నుంచి పూర్తిగా ప్రేమిస్తున్నాను మైత్రేయ!" అంది తమకపు చూపులతో మోహిత.

 

    "నీకు సడన్ గా చెప్పి, సర్ ప్రయిజ్ చెయ్యడం అలవాటన్నావు గదా..... నిన్ను చూస్తుంటే నీలో, నీకు తెలీని ఇంకో మనసు వుందని నాకర్థమవుతోంది" అన్నాడతను.

 

    "నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నావన్న మాట.... అంటే నువ్వు నా మనుసుకు దగ్గరగా వస్తున్నావన్నమాట...." వేదాంతిలా అంది మోహిత.

 

    గెస్ట్ హౌస్ కు చేరుకున్నారిద్దరూ.

 

    "మరో అరగంటలో మనం యిక్కడినుంచి బయలుదేరాలి. మరే మాత్రం ఆలస్యం చేసినా ప్రమాదం ముంచుకు రావచ్చు. మనల్ని అనుమానిస్తే, వెనకా ముందు చూడకుండా కాల్చిపడేసి అడవి జంతువులకు ఆహారంగా వేసి చేతులు దులిపేసుకుంటాడు...." డ్రెస్సింగ్ టేబిల్ ముందు అలంకరించుకుంటూ అంది మోహిత.

 

    "నేను రెడీ" అన్నాడతను.

 

    మరో అరగంటకి, ఇద్దరూ అవసరమయిన లగేజ్ తో బయటికి వచ్చారు.

 

    ట్రైబల్ గ్రామాల మధ్యనుంచి, అడ్డదారిలో నడుచుకుంటూ రోడ్  పాయింట్ కి వచ్చారు. అక్క షెడ్ లో రహస్యంగా వుంచిన కారుని తీసుకున్నారు. కారు మైసూర్ వేపు పరిగెడుతోంది.

 

    కారుని మోహిత డ్రైవ్ చేస్తోంది!

 

    అప్పటికి సమయం రాత్రి ఎనిమిది గంటలయింది.

 

                                            *    *    *

 

    సరిగ్గా అదే సమయానికి, అడవిలో గెస్ట్ హౌస్ కి రాజేంద్రకుమార్ దీన్రాజుతో సహా వచ్చాడు.

 

    ఆ రావడం మరో అరగంట ముందు జరిగి వుంటే, అక్కడ రెండు హత్యలు జరిగేవి.

 

    వచ్చీ రాగానే, వేరే కార్యక్రమాలేవి పెట్టుకోకుండా, మోహిత గురించి, అపరిచిత యువకుడి గురించి గిరిజనుల్ని ఎంక్వయిరీ చేయడం ప్రారంభించాడు.

 

                                            *    *    *

 

    అంతకు కొన్నిగంటలు ముందు పల్లగిరి గట్టు వెంకటేశ్వర స్వామి ఆలయం గుడిమెట్లమీద కూర్చున్నారు ఇందు, సరోజ.

 

    ఇందు చెప్పిందంతా విన్నాక "అయితే నీ నిర్ణయం ఏమిటి?" అడిగింది సరోజ.

 

    మైసూర్ వెళ్ళి బావని కలుస్తాను....."స్థిరనిశ్చయంతో చెప్పింది ఇందు.

 

    "అతనెక్కడున్నాడని వెళతావ్..... ఎలా వెతికి పట్టుకుంటావ్.... ఇబ్బందులు పడతావ్!" హెచ్చరించింది సరోజ.

 

    "బావ కలుస్తాడనే నమ్మకం నాకుంది" పల్లెటూరి అమాయకత్వంతో అందామె.

 

    "ఎక్కడుంటావ్?"

 

    "మా నాన్న ఫ్రెండ్ సుధాకర్ భండార్ అనే ఆయన మైసూర్ లోనే వుంటారు.

 

    క్రితం సంవత్సరం దసరా ఉత్సవాలకు మైసూర్ వెళ్ళినప్పుడు, మమ్మల్ని నాన్న ఆయనింటికి తీసుకెళ్ళారు. ఆయన అడ్రస్ నా దగ్గర వుంది" చెప్పింది ఇందు.

 

    "ఎప్పుడెళతావ్?"

 

    "ఇవాళ రాత్రి.... విజయవాడ వెళ్ళి, మైసూర్ డైరెక్ట్ బస్ ఎక్కుతాను. బస్టాండ్ కి నువ్వొస్తావా?" అడిగింది ఇందు.

 

    "మీ అమ్మకయినా చెప్తావా......? అడిగింది సరోజ ఆందోళనగా.

 

    "లేదు ఎవరికి చెప్పను..... చెప్తే వెళ్ళనిస్తుందా? నిన్నడిగితే నాకు తెలీదని చెప్పాలి...... తెల్సిందా... ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పొద్దు. ఒట్టు వేయ్!" సరోజ చేత ఒట్టు వేయించుకుంది ఇందు.

 

    "మరోసారి ఆలోచించు ఇందు....." సరోజ మనసులో ఏదో తెలీని భయం ప్రవేశించింది.

 

    అదే రోజు రాత్రి ఇందు, సూట్ కేస్ తో మైసూర్ బయలుదేరింది.

 

                                             *    *    *

 

    మైత్రేయ, మోహిత ఎక్కిన కారు మూడున్నర గంటల తర్వాత మైసూర్ చేరుకుంది.

 

    "రాత్రి యిక్కడ హోటల్లో రెస్ట్ తీసుకుని, ఉదయాన్నే విజయవాడ బయలుదేరదాం. బైదిబై..... అపార్ట్ మెంట్ పరిస్థితి ఏమిటో తెల్సుకోవాలి. సి.ఐ. చంద్రప్పని కూడా ఒకసారి కలవాలి" చెప్పింది మోహిత.

 

    బస్టాండ్ ప్రాంతంలో వున్న  హొటల్ రెయిన్ బో వేపు పోనిచ్చింది కారుని.

 

    హోటల్ రూమ్ లో కెళ్ళాక, డ్రింక్ బాటిల్ ని, మంచింగ్ నీ  తెప్పించింది. కావాలనే ముందు జాగ్రత్తగా , వేరే పేరుమీద రూమ్ బుక్ చేసింది.

 

    "నేను రెండు గంటల్లో వచ్చేస్తాను...... అంతవరకూ నీకు కంపెనీ ఈ డ్రింకే... ఓ.కె...." రూమ్ లోంచి బయటకు వెళ్ళిపోయింది మోహిత.

 

    టి.వీ. చూస్తూ డ్రింక్ తాగుతున్నాడు మైత్రేయ.

 

    ఒక దశ దాటాక, ఆలోచించడం అనవసరం..... ఎలా జరగాల్సి వుంటే అలా జరుగుతుంది. అనే స్థితి ఎవరికయినా ఎప్పుడో ఒకసారి వస్తుంది. ప్రస్తుతం ఆ స్థితిలోనే వున్నాడు మైత్రేయ.

 

    అతనికి అకస్మాత్తుగా హైదరాబాద్ లోని తన కొలీగ్ , రూమ్మేట్ చంద్రబోసు గుర్తుకు వచ్చాడు. హోటల్లోంచి బయటికొచ్చి ఎస్.టి.డి. బూత్ నుంచి హైదరాబాద్ కు ఫోన్ చేశాడు.

 

    అప్పటికి ఇరవై నిముషాల క్రితమే చంద్రబోసు డ్యూటీ ముగించుకుని ఇంటికెళ్లాడని ఆపరేటర్  చెప్పడంతో నిరాశకు గురయ్యాడు మైత్రేయ.

 

    ఆ ఆపరేటర్ కు తనెవరో, ఎక్కడనించి ఫోన్ చేస్తున్నాడో చెప్పలేదు మైత్రేయ.

 

    పదకొండున్నర ప్రాంతంలో రూమ్ కొచ్చింది మోహిత.

 

    "ఎనీథింగ్ స్పెషల్ న్యూస్" అడిగాడు మైత్రేయ.

 

    "రవీంద్రనాథ్ మర్డర్ కేసుని సి.బి.సి.ఐ.డి.కి అప్పగిస్తున్నార్ట.... కొంచెం జాగ్రత్తగా వుండమని హెచ్చరించాడు సి.ఐ. చంద్రప్ప.... బైదిబై..... నీకోసం నందిగామ నుంచి మీ మేనమామ  వచ్చి ఎంక్వయిరీ చేసి వెళ్లాడట."

 

    ఆ మాటకు ఉలిక్కిపడ్డాడు మైత్రేయ. తన విషయం తెలిసి మేనమామ ఎంత బాధపడ్డాడో? తను మేనమామని కలుసుకుని ఏం జరిగిందో చెప్తే....."

 

    విజయవాడ వెళ్ళాక, వీలయితే అక్కడనించి వెళ్ళాలి మనసులో అనుకున్నాడు మైత్రేయ.

 

                                             *    *    *

 

    సరిగ్గా ఉదయం ఏడున్నర గంటలు.....

 

    మైసూర్ బస్ స్టేషన్ లో, నందిగామ నుంచి వచ్చిన బస్సు ఆగింది. అందులోంచి  సూట్ కేస్ తో ఇందు దిగింది. మెయిన్ ఎంట్రన్స్ లోంచి బయటకు వచ్చి, ఆటోస్టాండ్ దిశగా నడిచింది.

 

                                           *    *    *

 

    సరిగ్గా అదే సమయంలో-

 

    హోటల్ రెయిన్ బో గేట్ లోంచి మారుతి కారు బయటికొచ్చింది.

 

    డ్రైవింగ్ సీట్లో మోహిత కూర్చుంది. పక్కన కూర్చున్నాడు మైత్రేయ.

 

    సర్కిల్ ఇన్ స్పెక్టర్ పేరలైజ్ కావటంతో, వాళ్ళంతగా భయపడటంలేదు బయటికెళ్ళటానికి.

 

    గేరు మార్చింది మోహిత. బస్టాండ్ కెళ్ళే జంక్షన్ లో ట్రాఫిక్ ఐలాండ్ దగ్గర రెడ్ లైట్ వెలిగింది.

 

    సడెన్ గా  బ్రేక్ వేసింది మోహిత.

 

    ఆ స్పాట్ కు ఎడమవేపున వుంది ఆటోస్టాండ్. యధాలాపంగా తలతిప్పి ఆటోస్టాండ్ వేపు చూశాడు మైత్రేయ.

 

    ఆటోవాలాతో ఒకమ్మాయి బేరమాడడం కన్పించిందతనికి. ఆ సమయంలో ఆ అమ్మాయి వెనక్కి తిరిగి వుండడం వల్ల ముఖం కన్పించలేదు. అంతలో గ్రీన్ లైట్ వెలిగింది.

 

    కారు సర్రుమని ముందుకు దూసుకుపోయింది.

 

        
                                             *    *    *

 

    ఆటో ఎక్కి కూర్చుంది ఇందు.

 

    అప్పుడామె చూపులు వరుసగా వెళ్ళిపోతున్న కార్లమీదున్నాయి.

 

    ఆటో స్టార్టయింది.

 

    ముందు వెళుతున్న రెండు కార్లలో, ఒక కారులో తన బావ వున్నాడని తెలీదు ఇందుకు.

 

    ఒక్కొక్కప్పుడు జీవితంలో ఎదురయ్యే దురదృష్టానికి నిర్వచనాలుండవు. సంఘటనలే వుంటాయి.

 

                                            *    *    *


    
    సిద్ధార్థ లేఅవుట్ దగ్గర ఆటో ఆగింది. ఆటో దిగిపోయి, సూట్ కేస్ తో ముందుకు నడిచింది ఇందు.

 

    పదినిముషాల తర్వాత డోర్ నెంబర్ దొరికింది.

 

    ఉత్సాహంగా కాలింగ్ బెల్ ప్రెస్  చేసింది ఇందు.

 

    నడి వయసున్న మగ మనిషి తలుపు తీశాడు.

 

    "ఎవరు కావాలమ్మా?" అడిగాడాయన.

 

    "సుధాకర్ భండారీగారు" నెమ్మదిగా చెప్పింది ఇందు.

 

    "టి.వీ. సీరియల్స్, యాడ్ ఫిలిమ్స్ తీసే భండారీ గారేనా?" అడిగాడాయన.

 

    "అవునండి" నెమ్మదిగా అంది ఇందు.

 

    "మేం ఈ ఇంట్లో దిగకముందు వరకు ఆయన ఇక్కడే వుండేవారు. కొత్తగా ఎక్కడికి మారింది నాకు తెలీదమ్మా..... కానీ వాళ్ళ బాబులు నిరూప్, అనూప్ చదివే స్కూల్ దగ్గరలోనే ఇల్లు తీసుకున్నట్లు తెలుసు.... నువ్వాయనకే మవుతావు....?"   

 Previous Page Next Page