Previous Page Next Page 
రాకోయి అనుకోని అతిథి పేజి 15

   

      సాయంకాలం కావడంతో కాలేజీలో స్టూడెంట్సు లేరు. వశిష్టని చోసోతూనే సాదరంగా ఆఫీసులోకి ఆహ్వానించారు ప్రిన్సిపాల్. తను వచ్చిందెందుకో వశిష్ట తెలియచేయగానే చెప్పడం ప్రారంభించారు ప్రిన్సిపాల్.
    
    "ఇట్సే పిటీ మిస్టర్ వశిష్టా... ఓ మామూలు సంఘటన ఇలాంటి మలుపు తీసుకోవడం బాధాకరమైన విషయం... స్టూడెంట్సు ఆకతాయిగా ప్రవర్తించడం మామూలే. కానీ రాజేష్ కాస్త శృతిమించి ప్రవర్తించాడు. అప్పటికీ నేను రెండు మూడుసార్లు మందలించాను. సూర్నారాయణగారి గురించి చెప్పి బెదిరించాను కూడా.... కానీ అతను వింటేగా... అసలు ఆ ఏజ్ అలాంటిదిగా... మరింత లిమిట్స్ దాటి ప్రవర్తించాడు... దానితో రాజేష్ విషయంలో సూర్నారాయణగారు ఉపేక్షించలేకపోయారనుకుంటాను"
    
    వశిష్ట ప్రిన్సిపాల్ ముఖ కవళికల్ని గమనిస్తూ వుండిపోయాడు చాలా సేపటిదాకా.
    
    ప్రిన్సిపాల్ మాటల్ని మననం చేసుకుంటూ నెమ్మదిగా అన్నాడు "రాజేష్ కేరక్టర్ దృష్ట్యా అలాంటివాడని మీకు ముందే తెలుసుగా."
    
    "ఎస్!"
    
    "మరి సూర్నారాయణ జోక్యానికి ముందే మీరెందుకు చర్య తీసుకోలేదు"
    
    ప్రిన్సిపాల్ తొట్రుపడ్డాడు.
    
    "కాలేజీ ప్రిన్సిపాల్ గా కేంపస్ లో జరిగే సంఘటనల విషయంలో మీరు రియాక్ట్ కావాలిగా..." ఒక పోలీసాఫీసరుగా వశిష్ట మరే నిజాన్నో రాబట్టాలన్నట్టుగా రెట్టించి అడిగాడు "రాజేష్ నాటీ బాయ్ గా మీకు తెలుసు. శ్వేత హోంమినిస్టరుగారి అమ్మాయని తెలుసు... మరి ఇంత తెలిసిన మీరు రాజేష్ శృతిమించి ప్రవర్తించినప్పుడు ముందే ఎందుకు చర్య తీసుకోలేదు? తీసుకుని వుంటే ఇంతదాకా వచ్చేది కాదుగా"
    
    ప్రిన్సిపాల్ గారికి గొంతు దిగలేదు... సరిగ్గా పదిహేను నిమిషాల క్రితం సాక్షాత్తూ కమీషనరుగానే ఫోన్ చేసి మాట్లాడి వుండకపోతే వశిష్ట అడిగిన ప్రతి ప్రశ్నకీ జవాబు చెప్పేవాడు నిర్భయంగా, కానీ తను వున్నది సవ్యసాచి, సూర్నారాయణలనే ఇద్దరు బలవంతులకి అభిముఖంగా....అందుకే తను అబద్దమే చెబుతున్నాడు... చదువుతో వచ్చిన మేధస్సు సాక్ష్యంగా బ్రతుకుతెరువుని అందిస్తున్న తన ఉద్యోగం సాక్షిగా... ఇంకా... క్షేమంగా బ్రతకాలనుకునే తన కుటుంబం సాక్షిగా...
    
    "జవాబు చెప్పండి ప్రిన్సిపాల్ గారూ... మీరు హెడ్ గా వున్న ఓ ఇన్స్ టి ట్యూషన్ లో జరిగే ప్రతి ఇన్సిడెంట్ కి మీరు బాధ్యులే అయినప్పుడు రాజేష్ మీద క్రమశిక్షణ చర్యని ఎందుకు తీసుకోలేకపోయారు? రాజేష్ విషయంలో మీరు సంకోచించటానికి అతడేం మంత్రిగారి కొడుకు కాదుగా ఓ మామూలు మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఆఫ్ట్రాల్ ఓ టీచరు కొడుకు... అంతేగా..."
    
    "నేను..." ప్రిన్సిపాల్ గారి గొంతు వణికింది "స్టూడెంట్సునే తప్ప వాళ్ళ బ్యాక్ గ్రౌండ్ గురించి ఆలోచించను ఎసిపిగారూ అసలు రాజేష్ విషయంలో నేను ఎందుకు ఉపేక్షించానూ అంటే..."
    
    "అతడు మీరన్నంత దుర్మార్గుడు అయ్యుండడు కాబట్టి" అర్దోక్తిగా ఖండించాడు ఎసిపి వశిష్ట. "ఎస్ మిస్టర్ ప్రిన్సిపాల్... అది నిజం... కాబట్టే మీరు రాజేష్ మీద ఏ చర్యా తీసుకోలేకపోయారు. థేఉస్కున్తె స్టూడెంట్ కమ్యూనిటీ తిరుగుబాటు చేస్తుందన్న భయం మిమ్మల్ని ఆందోళనపరిచి వుంటుంది అంతేగా..."
    
    బాధగా వుంది... తన మనసు లోతుల్ని తవ్వి అందులో అస్పష్టంగా కనిపిస్తున్న ఓ అమాయకుడైన విద్యార్ధి అస్తిపంజరాన్ని అటాప్సి చేయాలని ప్రయత్నిస్తున్నాడు వశిష్ట.
    
    "అదికాదు వశిష్టా..." అస్థిమితంగా కదిలారు ప్రిన్సిపాల్ గారు. ఓ చిన్న పొరపాటుకి విద్యార్ధిని శిక్షించడం అంటే అతడి భవిష్యత్తుని దెబ్బతీయడమే అన్నది నా అభిప్రాయం.... అందుకే కొంత అవకాశం ఇచ్చాను"
    
    "గూడ్..." వశిష్ట గొంతులో పలికింది అవహేళనో లేక అభినందనో ప్రిన్సిపాల్ గారికి తోచలేదు. "అక్కడ రాజేష్ కి మారే అవకాశం ఇస్తూ ఆలస్యం చేశారు సరే... మరి సూర్నారాయణగారి మనుషులు మీ కాలేజీ క్యాంపస్ లో అడుగుపెట్టి క్లాసురూంలోకి ఎంటరై ఓ స్టూడెంటుని లాక్కుపోతుంటే వెంటనే పోలీసు కంప్లైంట్ ఎందుకివ్వలేకపోయారు... గూండాలకీ మరో అవకాశం ఇద్దామనా"
    
    ప్రిన్సిపాల్ గారికి ముచ్చెమటలు పోశాయి.
    
    "దానికి కారణం ఒక్కటే ప్రిన్సిపాల్ గారూ... ఇందాక మీరన్నట్టు నిజంగా మీరు స్టూడెంట్సు బ్యాక్ గ్రౌండ్ పట్టించుకొని వ్యక్తికాదు...బ్రతకనేర్చిన మనిషి...కాబట్టి సూర్నారాయణలాంటి పరపతిగల వ్యక్తితో పేచీ పెట్టుకోవడం ఇష్టంలేక రాజేష్ ని లాక్కుపోతుంటే సైలెంట్ స్పెక్టేటరుగా నిలబడిపోయారు... అక్కడ రాజేష్ ఓ మామూలు టీచరు కొడుకు మాత్రమే అన్న విషయాలన్నీ మీరు పరిగణనలోకి తీసుకున్నారు. నన్ను మాట్లాడనివ్వండి మిస్టర్ ప్రిన్సిపాల్... అదే రాజేష్ ఓ ముఖ్యమంత్రి కొడుకు అయివుంటే- కనీసం మీ అబ్బాయి అయినా అయివుంటే రియాక్ట్ అయ్యేవారు అవునా"
    
    క్షణం ఆగిన వశిష్ట అన్నాడు "ఇంతవరకూ ఇంత జరిగినా మీరెందుకు మీ చర్యల్ని సమర్ధించుకుంటున్నారూ అని నేను నిలదీయడంలేదు ప్రిన్సిపాల్ గారూ...ఖచ్చితంగా జరిగిందేమిటో ఇప్పటికయినా చెప్పండి. విద్యార్ధుల శ్రేయస్సు కోసం ఆలోచించే ప్రిన్సిపాల్ ఆ విద్యార్ధులకి తండ్రిలాంటివాడే అన్న సత్యాన్ని మీరూ నమ్మితే... రాజేష్ మరణాన్ని నిశ్శబ్దంగా అంగీకరించి రేపో మాపో జరిగే అతడి కర్మకాండకి ప్రేక్షకుడిగా నిలబడడం మీ తండ్రి మనసుకి భరింపశక్యంకాని విషయంగా మీరు భావిస్తే వాస్తవాలతో బయటికిరండి... దేనికో భయపడి నిజాన్ని ఖననం చేసే ప్రోసెస్ లో మీరు పాపాన్ని మూటగట్టుకోకండి"
    
    "లేదు" ఆయన కంపించిపోతున్నాడు. "నేను అబద్దం చేపప్డం లేదు... నిజమే మాట్లాడుతున్నాను... రాజేష్ పొరపాటు మూలంగానే అతడు శిక్షింపబడ్డాడు.... ఇంతకన్నా నేనేమీ చెప్పలేను"
    
    "థేంక్స్ ఎ లాట్"
    
    పైకి లేచిన వశిష్ట ఇక మాట్లాడదేమీ లేదన్నట్టు బయటికి నడిచాడు.
    
    నిస్సహాయంగా కుర్చీలో కూలబడ్డ ప్రిన్సిపాల్ కళ్ళలో ఓ నీటిబిందువు ఉబికితే అది అతడి తప్పుకాదు! అంతగా కదిలించాడు వశిష్ట ఓ తండ్రి మనసుతో ఆలోచించి నిజం చెప్పమన్న అతడి మాటలకు నిజం చెప్పేవాడేగాని, ఎలా చెప్పగలడని? పోయిన రాజేష్ కోసం ఆలోచిస్తే ఇప్పుడు తనకి బ్రతికివున్న ఇద్దరు కొడుకులున్నారుగా... తండ్రి మనసుతో వాళ్ళ గురించీ తను ఆలోచించాలిగా!
    
    ఇది బ్రతకనేర్వడమో, బ్రతుకుతో రాజీపడటమో అతడికే తెలీదు. కాని ఇలాగే బ్రతకాలీ అన్నది ఇప్పటి థియరీ! దీన్ని అతిక్రమిస్తే రాజేష్ లా రాలిపోవాలి. రాజారాంలా సమాధి కావాలి...
    
    భారంగా కళ్ళుమూసుకున్న ప్రిన్సిపాల్ ఇప్పుడు కన్నీటి సిరాతో వెల్లవేయబడ్డ తెల్లకాగితంలా వున్నాడు.
    
    మరో పది నిమిషాలకి వశిష్ట ఇంటికి చేరుకున్నాడు నిజాన్ని తండ్రినుంచి రాబట్టాలన్న ఆలోచనలతో.
    
                                            *    *    *

 Previous Page Next Page