అవాక్కయి చూస్తున్నాడు వశిష్ట... ఆ స్థితిలో సైతం భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ల గురించి అంత విస్తృతంగా మాట్లాడిన ఆమె ముందు లాయరు అనిపించింది. తర్వాత పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పోస్టుగ్రాడ్యుయేట్ గా అనిపించింది. అన్నింటికీ మించి చేవగల సిటిజన్ గా రుజువైంది.
"ఏం... మీకన్నా చాలా పై అధికారి అయిన కమీషనరుపైన, రాష్ట్రశాంతి భద్రథలకి ఇన్ ఛార్జి అయిన హోంమినిస్టరు మీద చర్య ఎలా తీసుకోవాలని ఆలోచిస్తున్నారా?"
"నిజానికి నాకున్న పరిధి దృష్ట్యా అది ఆలోచించి తీరాలి కానీ మీ ఆవేశాన్ని అర్ధంచేసుకున్న ఓ సిటిజన్ గా నేనూ రియాక్ట్ కావడం న్యాయమే అని నాకూ అనిపిస్తూంది. ఏం చేయగలనో వెంటనే నేను చెప్పలేను కానీ ఈ క్షణం నుంచీ ఇన్వెస్టిగేట్ చేయబోతున్నాను....మీరు చెప్పిన ఇద్దరూ నేరస్థులే అయితే తప్పకుండా చర్య తీసుకుంటాను. ఓ వారం గడువివ్వండి"
"నిజాయితీగా అంటున్నారా?"
అదే... సరిగ్గా ఆ ప్రశ్నే అతన్ని బలంగా తాకింది "వాట్ డూ యూ మీన్."
"మీ పరిధి చాలా స్వల్పమని మీరే ఎక్స్ ప్రెస్ చేశారుగా"
అతని మొహం జేవురించింది.
"నేరం చేసింది నా కన్నతండ్రి అయినా నేను ఉపేక్షించను మిస్ ఆశ్రితా" ఉద్విగ్నంగా అన్నాడు. "ఇక్కడ హఠాత్తుగా కన్నతండ్రి అంటూ నేను ఎందుకు మెన్షన్ చేయాల్సి వచ్చిందీ అంటే..."
ఆమె భావరహితంగా చూసింది.
"మీరు చెప్పిన ఇద్దరు వ్యక్తుల్లో ఒకరైన పోలీస్ కమీషనర్ సవ్యసాచి నాకు తండ్రి కాబట్టి"
అప్రతిభురాలైంది ఆమె.
"ఒక నిజాన్ని నిజాయితీగా చెప్పిన నేను మీరనుకునే అందరి మగాళ్ళలో ఒకడ్ని కానూ అనుకుంటే కంప్లెయింట్ రాసివ్వండి"
ఆమె సంకోచించలేదు.... రాసింది అయిదు నిమిషాలలో.
* * *
"మీరా"
ముందు వులికిపడిన శ్వేత ఎదురుగా నిలబడ్డ ఎసిపి, వశిష్టని చూస్తూ సాదరంగా ఇంటిలోకి ఆహ్వానించింది.
రాష్ట్ర హోంమినిస్టర్ బంగ్లాలో అంతగా సందడిలేకపోవటానికి కారణం సూర్నారాయణ టూర్ లో వుండటమే. లేకపోతే ఆ సమయానికి కార్యకర్తలైన గూండాలతో, గూండాల్లాంటి కార్యకర్తలతో కళకళలాడిపోతూ వుండేది.
హాల్లోని సోఫాలో కూర్చున్న వశిష్ట ఖరీదైన ఇంటి పరిసరాల్ని గాక పద్దెనిమిదేళ్ళ వయసులో సౌకుమార్యంకన్నా డబ్బు, పరపతి అందించిన అహాన్ని సొంతం చేసుకుని రాజసంగా నిలబడ్డ శ్వేతని గమనిస్తున్నాడు.
"డాడీ కేంప్ లో వున్నారు" అంది అణువంత బిడియంగా.
సిగ్గుపడడం శ్వేతకి అలవాటు లేదు కానీ తను ఎసిపి. వశిష్టకి కాబోయే భార్యనని తరచూ డాడీ అనడంతో కాబోయే భర్త ముందు కాసింత అణుకువని ప్రదర్శించింది.
"ఓ.కె శ్వేతా..." సూటిగా విషయానికి వచ్చాడు అతను "నేను వచ్చింది రాజేష్ అనబడే ఓ స్టూడెంట్ విషయంలో కొన్ని వివరాల్ని తెలుసుకోవాలని"
మామూలుగా అయితే తొట్రుపడేదే... కానీ అప్పటికి కొన్ని నిమిషాల క్రితమే ఇన్స్ పెక్టర్ ధనుంజయ ద్వారా విషయం తెలుసుకున్న సవ్యసాచి ఆమెకు ఫోన్ చేసి ఒకవేళ వశిష్ట వస్తే ఏం చెప్పాలో వివరించాడు... ఒక మామూలు పోలీసాఫీసర్ విషయంలో అయితే సిటీ పోలీస్ కమీషనరుగా సవ్యసాచి అంతగా పట్టించుకునేవాడు కాదు కాని ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించింది తన కొడుకు....అది కూడా ఓ సమస్యని కాదుగాని వశిష్టలో ఏ మాత్రం అనుమానపు ఛాయలు కనిపించడం అతడికిష్టంలేదు.
"రాజేష్ నీకు తెలుసా?"
"కాలేజ్ మేట్..."
"మొన్నెప్పుడో ఆత్మహత్య చేసుకున్నాడని నీకు తెలుసనుకుంటాను"
శ్వేత తలవంచుకుంది "విన్నాను"
"రాజేష్ ఎలాంటివాడు?"
పది సెకండ్ల విరామం తర్వాత అంది "మామూలుగా అయితే అతడెలాంటి వాడో తెలుసుకునే అవకాశం వుండేది కాదు వశిష్టా...కానీ ఈ మధ్య తరచూ నన్ను టీజ్ చేయడం ప్రారంభించడంతో ముందు ఆకతాయిగా ప్రవర్తించే వ్యక్తనుకున్నాను... చాలా రోజులు పట్టించుకోలేదు.... దానితో మరింత రెచ్చిపోయి చేయి పట్టుకోవడందాకా వచ్చాడు... నేనిక స్పేర్ చేయలేకపోయాను... డాడీకి చెప్పాను... దానితో..."
నిర్లిప్తంగా వింటూ వుండిపోయాడు వశిష్ట... రాజేష్ చివరగా రాసిన ఉత్తరంలోని విషయాలకీ, శ్వేత చెబుతున్న దానికీ పొంతనలేదు. సూర్నారాయణ మినిస్టరైనా తమకు ఫ్యామిలీ ఫ్రెండులాంటివాడు కావడంతో శ్వేత తరచూ తమ ఇంటికి రావడం తెలుసు... అయితే ఏ రోజూ శ్వేతతో ఇంత తీరుబాటుగా వశిష్ట మాట్లాడలేదు. పనిగట్టుకుని మాట్లాడ్డం ఇదే...
"మీ డాడీ రాజేష్ ని ఇక్కడికి రప్పించడం నిజమేనా?"
"రప్పించడమే కాదు... మరో మారు రాజేష్ నా మీద ఎలాంటి ప్రయత్నమూ చేయకుండా వుండటానికి మేన్ హేండ్లింగ్ కీ సిద్దపడ్డారు... అఫ్ కోర్స్... నాకు బాధనిపించింది కానీ డాడీ ఆలోచనా తప్పుకాదు కదా"
వశిష్ట పైకి లేచాడు.
"కాఫీ తీసుకోండి" వారించబోయిన శ్వేతని సున్నితంగా తిరస్కరించి బయటికి నడిచాడు.
అక్కడి నుంచి అతను ఇంటికి వెళ్ళలేదు. సరాసరి కాలేజీ ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళాడు.