Previous Page Next Page 
రాకోయి అనుకోని అతిథి పేజి 16

   

    అసురసంధ్యా సమయం...
    
    విడిపోయిన గట్ల మధ్య విషాదాన్ని ఆలపిస్తూ సాగే సంధ్యలా వుంది శారదానది...
    
    సమీపంలో రేగిచెట్లు, దూరంగా కొండలు, ఆ కొండల నడుమ క్షతగాత్రుడైన సైనికుడి నుదుట మెరిసే తిలకంలా కనిపిస్తున్న అస్తమయ సూర్యుడు, నిర్జనంగా వున్న ప్రదేశం అందులో పొదిగిన నిశ్శబ్దమూలా ఏకాంత...
    
    వచ్చిన పని పూర్తయింది. బాల్యకౌమారాలను అధిగమించిన యవ్వనం వార్ధక్యందాకా కాకపోయినా కోరింది సాధించేదాకా అయినా నిలబడాలి. పలాయనం కాక పయనంలానే ముందుకు నడవాలి.
    
    బాల్యంలో చిలిపి అల్లరి, కౌమారంలో కలలు నాశనమైనా యవ్వనాన్ని నిజం చేసుకుంటూ నీడలా వెంటాడే గతాన్ని గమ్యందాకా నడిపించాలి.
    
    మూడేళ్ళ జైలు శిక్ష, రాలిపోయిన అమ్మ స్మృతులు, తన ఉనికిని హర్షించని ఆత్మీయులైన వ్యక్తులు... వీళ్ళందరినుంచీ నిబ్బరంగా మనుగడ సాగించాలి.
    
    ఇప్పుడు కాదు- అలా బ్రతకాలని తను జైలులోనే నిర్ణయించుకుంది.
    
    ఆమె లేవబోయింది.
    
    అంతే...
    
    పాదంపై కట్టుకున్న ఇసుక గూడు పగిలిపోయింది. అంతేకాదు... వెంటనే మరో విషయమూ జ్ఞప్తికి వచ్చింది.
    
    ఇందాక రిక్షా తాతకి వున్న డబ్బులన్నీ ఇచ్చేసింది. ఏ ధైర్యంతో అంటే ఆమె దగ్గర జవాబు లేదు. అసలు జవాబు తెలుసుకునే ప్రయత్నం చేయటానికైనా అసలు డబ్బు ముఖ్యమని అంతదాకా అనిపిస్తేగా! ఆమె చుట్టూ కలియచూసింది.
    
    సంజె కెంజాయలపై క్రమంగా పేరుకుంటున్న చీకటివస్త్రం సైతం ఎంతటి అందాన్ని అందిస్తూందని...
    
    ఏటి పైనుంచి పరామర్సగా సాగివస్తున్న గాలి అలలు పాడబోయే తన జీవనగానానికి నేపథ్య సంగీతంలా అనిపిస్తుంటే పైకి లేచింది.
    
    వెళ్ళిపోవాలి.
    
    పోయిన చోటనే వెదికే బాటసారిలా, తను ముందు జారిన చోటినుంచే ప్రయాణం ప్రారంభించాలి.
    
    మసక వెలుతురులో ఏ రూపమో వెలుతురిని అందిస్తున్నట్లు అనిపిస్తే అటు చూసింది.
    
    అది రూపం కాదు... స్మశానంలో కాలుతున్న కాష్టం...
    
    కాలి కాలి అవశేషమై కోల్పోతున్న చివరి రూపాన్ని ఇంకా దాచుకోవాలని విఫల ప్రయత్నం చేస్తూంది.
    
    అప్పుడెప్పుడో నాన్న...
    
    మొన్నెప్పుడో అమ్మ...
    
    చితాభస్మంగా మారిన ప్రదేశం ఇదే కదూ...
    
    ఆమె కళ్ళలో అశ్రువులు పేరుకోలేదు.
    
    పెదవులపై నవ్వు మెరిసింది నిర్వేదంగా.
    
    "కనిపించకుండా నన్ను శాసించి, నాకో గమ్యాన్ని నిర్దేశించిన అదృశ్య రూపమా!
    
    అప్పుడెప్పుడో నువ్వు నన్ను పాడమని ఆజ్ఞాపించావు.
    
    నా హృదయం ఎంత పొంగిపోయిందని! నీ ఆదేశంలో పాడాలని నేను గొంతు విప్పకముందే అమందానాదంలో నా గుండె వెలిగిపోయింది.
    
    చూస్తే ఇంకేముంది? గర్వంగా నవ్వుతున్న నువ్వు కనిపించావు.
    
    నాకళ్ళల్లో గిర్రున నీళ్ళు తిరిగాయి. దుఃఖంతో కాదు... పగిలిన నా గుండె నీకు నవ్వు తెప్పించగలిగిందన్న ఆనందంతో ఏమైతేనేం... నా బ్రతుకులోని అపస్వరాలన్నిటినీ మరిచి నీ నవ్వుల మధుశ్రుతిలో లీనంకావాలని ఆ రోజే నిర్ణయించుకున్నాను. నాకు తెలుసు గుండె పగిలిన నేను ఇక పాడలేనని ఎంత గొంతు చించుకున్నా నా పిలుపు నీకు వినిపించదనీ తెలుసు. అయితేనేం.... ఆ ప్రయత్నమే నాకో తపస్సుగా మారి ఇప్పటి తమస్సునుంచి నీ వెలుగు కౌగిలిదాకా నడిచే స్ఫూర్తిని అందించే సాధన మౌతుందిగా! నిజం ప్రభూ! నేను చేసే ప్రతి పనిలో నీ జ్ఞాపకాలే ప్రతిఫలిస్తాయి. ఆ జ్ఞాపకాలే నాకు శక్తినందించే దివ్యౌషధాలుగా మారతాయి... అయినా అదేమి దురదృష్టమో... నీ పూజకి సజ్జలో పూలను, గొంతులో గానాన్ని తెచ్చినాగాని నీదాకా చేరకముందే పూలు మాయమయ్యాయి. నా గానమూ ఘనీభవించిపోయింది"
    
    పరిసరాలకు చివరి వీడ్కోలు చెప్పిన ఏకాంత నడవబోతుండగా ఎవరిదో చేయి పడింది భుజంపై...
    
    ఉలికిపాటుగా ఆగి చూసింది.
    
    "అక్కా..."
    
    పెదనాన్న కొడుకు కృష్ణ నిలబడివున్నాడు ఎదురుగా.
    
    మసక వెలుతుర్లో రొప్పుతున్న కృష్ణను చూడగానే అర్ధమయింది.
    
    బహుశా తండ్రి ఆదేశం మీద ఇందాక ఇంట్లోనే ఓ మూల వున్న కృష్ణ ఇప్పుడు రహస్యంగా బయటపడి తనను కలుసుకోవాలని వచ్చి వుంటాడు. పెదనాన్న కొడుకుల్లో అందరికన్నా తనను ఎక్కువగా అభిమానించే కృష్ణంటే ఆమెకీ విపరీతమైన ఇష్టం.
    
    వీడ్ని చూసి నాలుగేళ్ళయిందేమో కదూ! ఈపాటికి ఇంటర్మీడియెట్ పూర్తిచేసి వుంటాడు. చాలా చాలా మాట్లాడాలని వుంది అన్నయ్యలు, వదినల గురించి అదికాదు... ఎవరూ తనను పట్టించుకోని ఆ పల్లెలో కృష్ణరాకే ఆమెకు ఆనందాన్నిచ్చిందో, లేక అతని పిలుపే కొండంత ధైర్యాన్నందించిందోగాని ఆప్యాయంగా తల నిమిరి ఏదో అడగబోయింది.
    
    "ఎక్కడికి వెళ్తావ్?" ముందు కృష్ణే అడిగాడు బిక్కమొహంతో చూస్తూ.
    
    ప్రపంచమంత పెద్ద ప్రశ్న!
    
    నవ్వేసిందామె. తనకంటే చిన్నవాడయిన కృష్ణ తన జీవితగమ్యం గురించి అణువంత భయాన్ని ప్రకటిస్తున్నాడు.
    
    "ఎక్కడికి వెళ్ళాలో నువ్వే చెప్పు"
    
    అతడి తల వాలిపోయింది. ఆమె గురించి తండ్రి ఒకనాడు ఎంత గర్వంగా మాట్లాడింది గుర్తుకొచ్చి "ఎక్కడికి వెళ్ళొద్దు.... రేపటిదాకా ఇక్కడే వుంటే అమ్మా నాన్న కోపం చల్లారిపోతుంది" అన్నాడు అంతకంటే ఏమనాలో తెలీక.
    
    "ఇక్కడే అంటే ఈ ఏటి ఒడ్డునా? లేకపోతే స్మశానంలోని చితుల మధ్యనా?" సాలోచనగా నిట్టూర్చింది. "అసలు నేను వచ్చింది ఇక్కడ వుండటానికి కాదు కృష్ణా! వెళ్ళటానికే... అయితే నేను చేసిన పొరపాటు ఒకసారి నా వాళ్ళనుకున్న వ్యక్తుల్ని చూడాలనుకోవడం"
    
    అతడికి కళ్ళనీళ్ళు పర్యంతమౌతూంది. పాపం అక్కకి ఎవరున్నారన్న ప్రశ్న అతడ్ని ఎంత కలవరపరచిందీ అంటే- ఉద్విగ్నంగా చేయి పట్టుకున్నాడు "నువ్వు తప్పు చేసివుండవని నాన్నకీ తెలుసు అక్కా...అప్పుడప్పుడూ ఆ మాట అనేవారు కూడా"
    
    "నిజమా" ఎంతటి ఆహ్లాదంగా వుందని! స్వగతంలా అందామె-
    
    "ఇంకేం కృష్ణా! ఆ నమ్మకంతో నువ్వూ నన్ను క్షమించెయ్..."
    
    "అక్కా" ఇంతసేపూ కనురెప్పలమాటున దాగిన కన్నీళ్ళు ఇక ఆగలేమంటూ అతడి చెంపలపైకి జారాయి. "నిన్ను నేను క్షమించడం ఏమిటి? నువ్వలాంటి నేరం చేయవని నాకు తెలుసు. అది కాదక్కా... నాన్నతో నువ్వు జరిగిందంతా చెప్పాల్సింది"

 Previous Page Next Page