Previous Page Next Page 
పెంకుటిల్లు పేజి 15

 

   వాసు కొద్దిగా కోపంగా "ఏమిటోయి మహా పెద్ద అప్పులాడిలా పీడిస్తున్నావు. నా దగ్గర ఇప్పుడు లేదు" అన్నాడు.

    "ఉన్నా లేకపోయినా నాడి నాకు యివ్వల్సిందే" అని అవతలివాడు మొండికేశాడు.

    "ఇవ్వకపోతే ఏం చేస్తావు?"

    "మీ ఇంటిలో చేప్పేస్తానని చెప్పానుగా"

    "అయితే చెప్పుకో పో" అన్నాడు వాసు కోపంగా.

    వాసు అలా అనేసరికి అవతలివాడు నిజంగా చెబుతానని బయల్దేరాడు. తన కోపానికి పశ్చాత్తాపపడి "కాస్త ఆగరా బాబూ, అన్నిటికీ అలా కోపమైతే ఎలాగా? నీ డబ్బు నీకు ఇచ్చేద్దామంటే నాదగ్గర చిల్లిగవ్వకుడా లేదాయె. పోనీ ఆ డబ్బు తెచ్చే ఉపాయంకూడా నువ్వే చెప్పు" అన్నాడు.

    "ఇద్దామని వుంటే ఆ మాత్రం ఉపాయాలే ఉండవా ఏమిటి?"

    "చెప్పు చూద్దాం."

    "దొంగతనం చెయ్యి."

    వాసు అదిరిపడ్డాడు. ఇటువంటి సలహా యిచ్చిన ఆ స్నేహితుడిని తనకు సర్వశక్తులూ వున్నట్టయితే నాశనం చేసేవాడు. కాని తను బలహీనుడు. చివరికి ఏమీ అనలేక "నీ సలహా ఎవరిక్కావాలి? పో పో" అన్నాడు.

    మధ్యాహ్నం భోజనానికి యింటికి వచ్చేసరికి వాసుదేవరావు హృదయం భోరున ఏడుస్తోంది. భయం విషయం అలా వుంచి వాడికి యి క్షణంలో సర్వ ప్రపంచం మీద అసహ్యంగా వుంది. చాలామందికి డబ్బు వుంటుంది. తన దగ్గర ఎందుకు లేదు? ఒకోసారి తన స్నేహితుల్లో ఎంతమంది విచ్చలవిడిగా  డబ్బు ఖర్చుచేస్తూ గడుపుతున్నారు. తను అలా ఎందుకు గడపలేడు? ఒకసారి తన బట్టలవంక చూసుకున్నాడు. తనకే అసహ్యంపుట్టింది. ఈ మల్లు బట్టలు వేసుకునే రోజూ బడికి వస్తున్నాడు! పోతున్నాడు. తన కెక్కువ చొక్కాలూ, లాగులూ లేవు. ఉన్నవి నాలుగూ మంచివి కావు. ఆ ఆ మంచివికాని వాటికే అక్కడక్కడ తూట్లు. తను ఈ వ్యత్యాసాలను గురించి అప్పుడప్పుడూ ఆలోచించుకుంటూ వుంటాడు. ఇవన్నీ తలలో మెదిలినప్పుడల్లా బాధతో, అసూయతో కోపంతో శరీరమంతా వణికిపోతుంది. కాని .... ఎందుకో తెలీదు. వాడికో ఆశవుంది. ఎప్పటికన్నా పేదరికమంతాపోయి తానుకూడా ధనవంతుడు కావాలని. తనకు బాగా డబ్బు వచ్చేసినట్లు, విచ్చలవిడిగా ఖర్చు పెట్టేస్తున్నట్లూ, ప్రపంచంలోని సర్వసుఖాలూ అనుభావించేస్తున్నట్లూ అప్పుడప్పుడూ కలలు కంటూ వుంటాడు. కాని అది క్షణికం. అవన్నీ  పగటి కలలూ, రోడ్డుమీద నడుస్తూ కన్న కలలు. ఇంతలో ఏ కారో ప్రక్కనుంచి పోతూ చెవిక్రింద రొద చేస్తుంది. ఈ ఊహలన్నీ పటాపంచలవుతాయి. మళ్ళీ మామూలు మాసిపోయిన బట్టలూ, చెప్పులులేని కాళ్ళూ ఇవన్నీ స్ఫురణకి వచ్చి కలతపెడతాయి. దీర్ఘంగా ఒక నిట్టూర్పు విడుస్తాడు. బీదతనంలో వుండి పేదవాళ్ళ కష్టాలు చూసి పరితపించే చాలామంది పిల్లల్లాగా వాడుకూడా "పెద్దయితే నేను బోలెడంత డబ్బు సంపాదించి మా వాళ్ళందరినీ సుఖపెడతాను" అనుకుంటూ వుంటాడు. కాని పేదవాళ్ళందరూ ఎందుకు డబ్బు రాసులు సంపాదించలేక పోతున్నారో వాడికి తెలీదు.

    ఇంటికి వచ్చేసరికి అమ్మా, కృష్ణుడితల్లీ మాట్లాడుతూ కనిపించారు. కృష్ణుడితల్లి సాధారణంగా తమ యింటికి రాదు. ఇవాళ ఎందుకు వచ్చిందో వాసు అక్కడ కూర్చుని సావధానంగా వాళ్ళ మాటలు విన్నాడు.

    రెండు మూడు నిముషాలువాడికి పనికివచ్చే కబుర్లు ఏమీ దొరకలేదు. కాని ఇంతలో కృష్ణుడి తల్లి-

    "మీ పెద్దమ్మాయి సంగతులేమైనా తెలుస్తున్నాయా?" అనడిగింది.

    "ఆఁ ఇవ్వాళ ఉత్తరం రాసింది. అంతా క్షేమంగానే ఉన్నారట" అని కొంచెం ఆగి భారంగా "ఏదో అతను సంపాదించేది వాళ్ళిద్దరికీ అట్లా సరిపోతున్నది" అంది.

    "మీ పెద్దమ్మాయిని చూసి చాలా రోజులయింది. రాధాకంటే మూడు నాలుగేళ్ళు పెద్దదనుకుంటాను."

    "ఊఁ."

    ఇంతలో చిద,బరం గదిలోంచి యేవో నవ్వులు బిగ్గరగా వినవచ్చాయి. ఆట మంచి రసపట్టులో ఉన్నట్లుంది. ఈ విషయం కృష్ణుడి తల్లికి తెలిసిందే కాబట్టి ఆవిడ ఎక్కువ ఆశ్చర్యం చెందలేదు.

    కొంచెం ఆగి ఆవిడమళ్ళీ "అయితే అక్కడినుంచి ఎప్పుడు వస్తుంది!" అని అడిగింది.

    "సంక్రాంతి కేమయినా వస్తుందేమో?"

    లక్ష్మమ్మగారికి ఈ కబుర్లు ఎంతవరకు అవసరమో శారదాంబకు తెలీదు. ఏదో ఆవిడ అడుగుతోంది. తాను సమాధానం చెబుతోంది.

    "మీ రాధకు పెళ్ళెప్పుడు చేస్తారో మరి?"

    అటువంటి ప్రశ్నలు విన్నప్పుడు శారదాంబకి చాలా బాధకరంగానే వుంటుంది. కాని తన యింట్లో పరిస్థితిని పరాయివాళ్ళకి ఏమని చెబుతుంది?

    అందుకని----

    "ఏదండీ! మేమూ అదే ప్రయత్నంలో వున్నాము. దేముడు మేలుచేస్తే ఈ యేడాదిలో ఔతుందనుకొంటాము."

    "ఇంచుమించు మీ నారాయణ పెళ్ళీ, రాధపెళ్లీ ఒకేసారి చేసేస్తారు కాబోలు."

    "ఎలాగౌతుందో ఏమిటో?"

    ఈ సంభాషణ వాసు అక్కడ కూర్చుని వింటున్నాడు. ప్రక్కగదిలో గోడకు అనుకొని నిలబడి రాధకూడా వింటోంది. లక్ష్మమ్మగారు యేం మాట్లాడినా లాంఛనప్రాయంగానే ఉంటుందని ఆమె నమ్మకం. లేకపోతే ఈ కబుర్లన్నీ ఎందుకు?"

    ఆవిడ ఇన్ని ప్రశ్నలడిగితే తను ఒక్కటీ అడగకపోతే బాగుండదని కాబోలు శారదాంబ "మరి మీ ఆనందరావుకి పెళ్ళిచేయరా?" అనడిగింది. ఈ ప్రశ్న లోపల్నుంచి వింటూన్న రాధ మనస్సును గగ్గోలు పరచింది. దీనికి ఎదుటి ఆవిడ యేమని సమాధానం చెబుతుందోనని శ్రద్ధగా వింది.

    దీనికి లక్ష్మమ్మగారు చాలా తేలికగా సమాధానం చెప్పింది. "ఆఁ వాడు పెళ్ళి విషయం ఎత్తితేనే సురసురలాడతాడు. అందులోనూ ఈమధ్య అదోరకంగా ఉండటం మొదలుపెట్టాడు. మౌనవ్రతం అంటూ ఎవరితో మాట్లాడకుండా తలుపులు బిడాయించుకోవటం ప్రారంభించాడు. వాడికి పెళ్ళంటే ఆట్టే యిష్టం వున్నట్లు కనబడదు మరి" అని ముసిముసి నవ్వులు నవ్వింది. తర్వాత కొంతసేపు అతని విషయాలే చెప్పింది. ఇంటిలో కూర్చుని ఏ విధంగా ప్రవర్తిస్తాడో ఏయే పనులు చేస్తాడో వివరంగా చెప్పింది.

    "మీ ఆనందరావు కేమిటండీ బుద్ధిమంతుడు."

    "అందరూ బుద్ధిమంతులే అయినందు కేమిటి లాభం? తల్లిదండ్రుల అచ్చట్లూ ముచ్చట్లూ తీర్చాలనే జ్ఞానం వాళ్ళకి వుండక్కర్లేదూ" అంది ఆవిడ.

    ఈ రీతిగా సాగుతున్న సంభాషణకి ఒక అంతు కనపడకపోయేసరికి వాసుకి విసుగుపుట్టి "అమ్మా అన్నం పెట్టవే" అనడిగాడు.

    "ఓరి వెధవా, నీ విషయమే మరిచిపోయాను. ఇందాకటినుంచీ చెప్పవేమిరా?" అని "రాధా! కాస్త వాసుగాడికి అన్నం పెట్టామ్మా" అని కేకేసింది.

    "వాసు అన్నం తింటూంటే తల్లి - - - వాళ్ళ మాటలు వినిపించీ వినిపించనట్లుగా వున్నాయి. రాధ నెయ్యివేస్తూ "అలా వున్నావేంరా?" అని అడిగింది.

    "ఎలావున్నా?" తమ్ముడు ఉలిక్కిపడి వెంటనే ప్రశ్నించాడు.

    "ఎవరితోనైనా దెబ్బలాడి వచ్చావేమిటి?" అంది రాధ అతని ప్రశ్నకు జవాబు చెప్పకుండా.

    "ఊహుఁ" అని వాడు తల అడ్డంగా తిప్పాడు.

    "మరి?"

    అక్కగారు యీ ప్రశ్న అడగగానే వాడి మనస్సు మళ్ళీ పాడైపోయింది. ఎక్కడలేని భయం ముంచుకువచ్చింది. మళ్ళీ ఇప్పుడు బడికి పోవాలన్న విషయం వాడికిప్పుడే గుర్తువచ్చింది. కాని ఏం చూసుకుని ఏ ముఖం పెట్టుకుని బడికి వెళ్ళాలో వాడికే తెలీదు. ఇవన్నీ గుర్తువచ్చాక వాడకి అన్నం సహించలేదు.

    "అదేమిటిరా"

    తెల్లబోతూ అక్కగారు ఎంత వారిస్తున్నా వినిపించుకోకుండా కంచంలోనే చేయి కడుక్కుని లేచి వెళ్ళిపోయాడు, తర్వాత పుస్తకాలు పట్టుకుని విసురుగా బయటకు వెళ్ళిపోయాడు.

    కాని బడికి ఎలా పోతాడు? పోలేడు. బడికిపోకుండా ఇష్టం వచ్చినట్లు ఊళ్ళో తిరగడానికి వాడికి భయం వేసింది. చప్పున వాడకి సూరిగాడు జ్ఞాపకం వచ్చాడు. సూరిగాడు సాధారణంగా బడికి రాడు. బడికి రాకుండా ఎక్కడ వుంటాడో ఒక్క వాసూ ఏమిటి చాలామందికి తెలుసు. అక్కడ పెద్ద వాళ్ళెవరూ వుండరు. ఈ బడి గొడవ వుండదు ఏమీ వుండదు. వాసుకూడా ఈ సమయంలో అక్కడికిపోతే బాగుండుననుకొన్నాడు.

    ఈ వేళ రోజంతా వాడికి కొత్తగా కనిపించింది. ఇలా బడి మానేయంటంగానీ, బలాదూరు తిరగటంగానీ, వాడికి అలవాటు లేదు. మొన్న ఏదో బుద్ధిగడ్డితిని వాళ్ళతో సర్కస్ కి వెళ్ళాడు. దాంతోనే ఇంత చిక్కువచ్చిపడింది. ఇహ జీవితంలో ఇటువంటి తప్పుడు పనులు చేయదలచుకోవటం లేదు తను. కాని ఇప్పుడు చేసిందానికి ఏమిటి జరగబోతోంది? ఈ ఆలోచన్లతో వాసు ఆ ప్రదేశం చేరుకున్నాడు. ఎవరికీ తెలియకుండా గడపటానికి ఆ ప్రదేశం బాగానే వుంది. కాని అక్కడ సూరిగాడు ఒక్కడే వుంటాడనే అభిప్రాయం పొరపాటయింది. తనకు తెలియనివాళ్ళు తనకంటే పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అక్కడ చాలామంది వున్నారు. వాళ్ళంతా కలిసి గోలీకాయలు ఆడుతున్నారు. నవ్వుతూ కేరింతలు కొడుతున్నారు. వాళ్ళు సరదాగా ఆడుకోవటం కాదు డబ్బులతో ఆడుతున్నారు. అప్పుడప్పుడూ బూతులు తిట్టుకుంటున్నారు. వాసుకు అదంతా ఓ క్రొత్త ప్రపంచంలా  కనబడింది. అక్కడ ఎక్కువసేపు వుండటం కూడా అసహ్యంగా కనిపించింది. వాడికి జుగుప్స కలిగించిన విషయం ఇంకోటి కూడా వుంది. సూరిగాడు నోట్లో సిగరెట్టుకూడా పెట్టుకుని, పొగపీలుస్తూ పెద్ద వ్యవహారకర్తలా మాట్లాడుతూ ఆడుతున్నాడు. తను ఇక్కడికియెందుకు వచ్చానా అని విచారించాడు వాడు. సాధ్యమయినంత త్వరలో అక్కడినుంచి బయట పడాలని భావించాడు. వెనక్కి తిరిగి రెండు మూడడుగులు వేశాడు. కాని వాడు, సూరిగాడు చూడకుండా తప్పించుకోలేకపోయాడు.

    "ఏరా వాసూ?" అని వాడు వెనకనుంచి అరవనే అరిచాడు. తెల్లబోయి ఆగిపోయాడు.

    సూరిగాడు బాగా దగ్గరకు వచ్చి ముఖంలోకి చూస్తూ "ఏమిటి వెళ్ళిపోతున్నావు?" అని అడిగాడు.

    వాసు జవాబు చెప్పకుండానే జారుకుందామని ప్రయత్నించాడు. కాని సూరిగాడు చెయ్యి పట్టుకుని "ఆ మహా వెళ్ళావు లేవోయి. ఎందుకొచ్చావో వచ్చావు. కాసేపు ఆడుకుందాం రా!" అన్నాడు.

    వాసు తల అడ్డంగా వూపాడు.

    "ఎందుకని!"

    వాడు వాడి ముఖంలోకి విసుగ్గా చూస్తూ "నాకు ఆడాలని లేదు" అన్నాడు.

    "అయితే ఇక్కడికి ఎందుకు వచ్చావు!"

    "ఊరికనే."

    సూరిగాడు కొంచెంసేపు ఆలోచించాడు. వీడితో వాదన పెట్టుకోవటం వాడికి ఆట్టే సబబైన పనిగా కనిపించటంలేదు. ఆట మంచి రసపట్టులో వుంటే వీడికోసం ఆపి వచ్చాడు. తన వాళ్ళేమో తన కోసం ఎదురుచూస్తున్నారు. "సరే అయితే వెళ్ళు" అన్నాడు కొంచెంసేపు ఆలోచించి వాసు వెళ్ళిపోతానని కదిలాడు. కాని వాడి వెన్నుమీద ఎవరో చరిచినట్టయింది. కాళ్ళు కదలటం కష్టంగా వుండి ఆగిపోయాడు.

    "వెళ్ళవే?"

    వాసు మెల్లగా వెనక్కి తిరిగి వచ్చాడు సూరిగాడు భుజంమీద చేయి వేసి "నాకో సహాయం చేస్తావా?" అని అడిగాడు.

    "ఏమిటి?"

    వాడు దీనంగా ముఖంపెట్టి "పావలా అప్పిస్తావా?" అని అడిగాడు.

    "ఎందుకూ?"

    "నాకు కావాలి."

 Previous Page Next Page