Previous Page Next Page 
పెంకుటిల్లు పేజి 14


    రసాస్వాదన అనేది వ్యక్తులపట్ల మనకున్న అభిప్రాయాన్ని బట్టేగాన్ని, కేవలం ఆయా కళ్ళల్లో ఆయా వ్యక్తులకు వున్న చాతుర్యం వల్లనే కాదని రాధతో ఇదివరకు ఇద్దరు ముగ్గురు అని వున్నారు. కాని ఆ విషయం అబద్ధమని రాధ యిప్పుడు తెలుసుకుంది. అతని వాద్య సంగీతాన్ని విని ఆనందించటంలో ఆమెకు అతడిపట్ల వున్న చిరాకు ఏ మాత్రం అడ్డుకోలేకపోయింది.

    ఆకస్మికంగా ఉలిక్కిపడింది. రోడ్డుమీద ఎవరో తనకి కొంచెం దూరంలో నిల్చుని తనవంక చూస్తున్నారు. తన చర్యకు సిగ్గుపడింది. భయపడింది. గబగబ అక్కడ్నుంచి కదిలి నడవసాగింది. ఏమనుకున్నాడో ఏమిటో ఆ వ్యక్తికూడా ఆమెను వెంటాడాడు. రాధ హడలిపోయింది. ఆమె గుండె వేగంగా కొట్టుకోసాగింది. అప్పటికప్పుడే వళ్ళంతా చమట్లు పట్టాయి. తడబడుతూ నడక వేగం ఇంకా హెచ్చించింది. వెనక వస్తున్న మనిషి కూడా నడక వేగం ఎక్కువ చేసినట్లు అడుగుల చప్పుడువల్ల తెలుస్తూనే వుంది.

    జనసంచారంలేని వీధిలో, చీకటి రాత్రిలో వంటరిగా నడిచి వస్తున్నందుకు తనను తాను దూషించుకుంది. తర్వాత ఇంట్లోకి వచ్చి యెలా పడిందో తనకు తెలీదు. గేటులోంచి విసురుగా లోపలకు పోయి ఒక్కసారి వెనక్కీ చూసింది. అతనక్కడ నిలబడి ఈలవేస్తూ చేత్తో ఏదో సైగచేస్తున్నాడు. ఆమె ఎంతో అసహ్యించుకుని గబగబ అక్కడ్నుంచి లోపలకు వెళ్ళిపోయింది. నారాయణ ఏదో రాసుకుంటున్నట్లున్నాడు. అతని గదిలో లైటు వెలుగుతోంది. రాధ గుండె ఇంకా వేగంగా కొట్టుకుంటూనే వుంది. అంతా నిద్రపోతున్నారు. తెలిస్తే ఏమంటారోనన్న భయం. దగ్గరగా వేసివున్న తలుపుల్ని తోసుకుని మెల్లిగా లోపలకు వెళ్ళింది. ఒక ప్రక్కగా నిలబడి తల్లి దండ్రులు వుండే గదిలోకి తొంగి చూసింది. తండ్రి గురకపెట్టి నిద్రపోతున్నాడు. ఆమె నిట్టూర్చి, యిటునుంచి అటు తిరగటంలో నేలమీదవున్న గ్లాసు క్రిందపడి చిన్న చప్పుడు చేసింది. ఒక్కసారిగా ఆమె ఝల్లుమంది. శారదాంబ అప్పుడే మేలుకుందో, అంతకుముందు నుంచే మేలుకునుందో "ఎవరూ?" అంది.

    రాధ ప్రాణాలన్నీ ఉగ్గబట్టుకుని "నేనమ్మా" అంది చిన్నగా.

    శారదాంబ లేచి యివతలకు వచ్చింది. రాధ తల వొంచుకుని నిలబడింది. శారదాంబ శుష్కించిపోయిన పెదాలమీద నవ్వు తెప్పించుకుంటూ "ఏ సినిమాకు పోయావమ్మా?" అంది.

    రాధ జవాబు చెప్పింది.

    "అన్నం తిందువుగాని రా."

    "ఆకలి వేయటం లేదమ్మా."

    "కాస్త ఎంగిలి పడుదువుగాని రద్దూ."

    తల్లి మనసు నొప్పించటం రాధకు ఇష్టంలేకపోయింది. దొడ్లోకి పోయి బావి దగ్గర కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చింది. భోజనం చేస్తూండగా ఎప్పుడు మేలుకుందో ఏమిటో ముసలావిడ "బాగానే వుంది. మరీ అదుపూ ఆజ్ఞ లేకుండా పోతూందే వ్యవహారం" అంది. ఇంకో సమయంలో, ఇంకో సన్నివేశంలో ఐతే నాయనమ్మ మాటలకు రాధ జవాబు చెప్పకుండా వూరుకునేది కాదు. కాని యిప్పుడు ఏమీ అనలేక వూరుకుంది.

    ముసలావిడ హద్దూ, పద్దూ లేకుండా వాగుకుంటూ పోతోంది. తన కాలంలోనా- యివన్నీ బాగులేదన్నది. ఆడపిల్లలకు యింత స్వాతంత్ర్యం కూడదన్నది. దీనికి ఫలితం ఎప్పుడో ఓ అప్పుడు అనుభవిస్తారంది. ఏమి అన్నా తల్లీ కూతుళ్ళిద్దరిలో ఎవరూ నోరు మెదపలేదు.

    కాని స్పష్టంగానో, అస్పష్టంగానో నారాయణ యి మాటలన్నీ వింటున్నాడు. కాని ముసలామె కదా అని మొదట్లో కొంచెం ఉపేక్షించాడు. ఎంతసేపటికి ఆ నోటికి హద్దూ, పద్దూ అంటూ లేకపోయేసరికి లేచి, లోపలికి వస్తూ "ఏమిటి నాయనమ్మా? అర్థరాత్రి పూటయినా మమ్మల్ని కాస్త శాంతిగా వుండనీయవా ఏమిటి?" అన్నాడు.

    ఆవిడ నోరు నొక్కుకుంటూ "అనండిరా బాబూ, అందరూ నన్నే అనండి ఒక రాత్రీ పగలూ లేకుండా ఇష్టం వచ్చినట్లు విచ్చలవిడిగా తిరుగుతున్న దాన్ని అనే వారెవరూ లేరు" అని ఏడుపు గొంతుకతో "మంచి కోసం నేనేం చెప్పినా అర్థం చేసుకోక అంతా నన్ను తిట్టేవాళ్ళే. నేను మరీ పరాయిదాన్ని అయిపోయాను" అని కళ్ళు వొత్తుకుంది.

    నారాయణ విసుగ్గా "చాలు, నువ్వు ఏడుస్తూ కూచుంటే ఓదార్చేందుకు యిక్కడ నీకన్నా పెద్దవాళ్ళెవరూ లేరు అన్నాడు. మళ్ళీ తనే వయస్సు చెల్లిన వాళ్ళు కాబట్టి యీ సరదాలు, కాలక్షేపాలు మీకేం అక్కరలేదు. అయినా అనుభవించవల్సిన ఈడులో కూడా ఒక ఆట, పాటలేకుండా ఇంట్లో కాళ్ళు ముడుచుకుని కూర్చోమంటావేమిటి? సినిమాలకి, షికార్లకి తీసుకువెళ్ళే యోగ్యతా, తాహతూ మనకు రెండూ లేవు. ఎవరో స్నేహితురాలితో వెళ్ళక వెళ్ళక ఒకసారి వెడితే అది కూడా వద్దంటావా? ఇదేనా నువ్వు చెప్పేది? పెద్దవాళ్ళయి చూడదలచుకున్న ముద్దు ముచ్చట్లు ఇవేనా ఏమిటి?" అని నాలుగు దులిపేసి తనూ మళ్ళీ మాట్లాడకుండా ముసలావిడను మళ్ళీ మాట్లాడనీయకుండా చేసి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. తర్వాత ఏమనుకుందో ఆవిడకూడా నోరు యెత్తకుండా అక్కడ్నుంచి వెళ్ళిపోయింది.

    అనంతరం రాధ భోజనం చేయడం ముగించి చేతులు కడుక్కుంటూంటే శారదాంబ వెనుకనుంచి అంది "ఛాయ ఎంతసేపు యేడ్చిందనుకున్నావు?"

    "ఎందుకు?" ఆశ్చర్యంతో అడిగింది కూతురు.

    "నువ్వు సినిమాకి ప్రమీలతో కలసి వెళ్ళావని సుభద్రమ్మగారు కబురు పంపించింది అది విని తననికూడా  తీసుకు వెళ్ళలేదని ఒకటే ఏడుపు."

    నాయనమ్మ తనని కోప్పడినప్పుడూ, ఇంట్లో చెప్పకుండా వెడుతున్నానని మధనపడినప్పుడూ పడిన బాధకన్నా రాధ ఈ మాట విని నీరయిపోయింది. తను నిజంగా పాపిష్టిది. చప్పున ఆమె కళ్ళలో నీళ్ళు తిరిగాయి. తన మనస్సులోనిదంతా తల్లితో చెబుతూ కూర్చుంటే అది పెద్ద ఏడుపుగా పరిణమిస్తుందనే భయంతో, మాట్లాడకుండా పోయి తన ప్రక్కమీద పడుకుంది.

    సాధారణంగా నిద్రపోయేముందు చాలామందికి ఆ రోజు చేసిన పనులన్నీ ఒకసారి నెమరువేసుకుని పడుకొనే అలవాటు వుంటుంది. రాధకు కూడా అటువంటి అలవాటే. ఇవాళ జరిగిన విశేషాలన్నీ తలుచుకుంటూ కొంచెంసేపు ఆనంద తరంగాల్లో తెలిపోతున్నట్లూ, కొంతసేపు విచారపు పుటలల్లో మునిగిపోతున్నట్లూ, మరికొంతసేపు జాలిగా తన హృదయం ద్రవించిపోతున్నట్లు అనుభూతి పొంది, చివరకు ఏ అర్థరాత్రికో భారమైన మనస్సుతో నిద్రపోయింది.


                              10

    తెల్లవారింది. చలి తీవ్రంగా వుంది. రాధ ఆరింటికే లేచి కూర్చుంది. ఒకసారి బద్ధకంగా ఆవులించి, వెచ్చగా దుప్పటి మీద కప్పుకుంది రాత్రంతా సరిగా నిద్ర లేకపోవటంవల్ల కళ్ళు ఎర్రగా వున్నాయి. కొంచెంసేపు అలానే కూర్చునివుండి తరువాతలేచి, వళ్ళు విరుచుకుని, నిలువుటద్ద ముందుకు పోయి నిల్చుంది. ఏమిటో తనలో తనకే ఏదో మార్పు కనబడింది. రోజూ నిద్రలేవగానే ఒకసారి అద్దంలోకి చూచుకోవటం ఆమెకు యీ మధ్యనే అలవాటయింది. కాని రోజూ కనపడని ఓ సంగతి తెలీకుండానే ప్రత్యేకంగా కనబడసాగింది. నిద్రలేక ముఖం నిగారించి వుండటంవల్లా, కళ్ళన్నీ ఎర్రబడి వుండటంవల్లనేమో అనుకుంది.

    బయటకువచ్చి తల్లి పడుకునే గది దగ్గరకు పోయి చూసింది. ఆమె ఇందాకే లేచి వెళ్ళినట్లుంది. చిదంబరం పూర్తిగా  ముసుగు కప్పుకొని పడుకుని వున్నాడు. ఛాయ అప్పుడే లేచి కళ్ళు నులుముకుంటోంది.

    నెమ్మదిగా లేచి గది బయటకు రాగానే ఒక్కసారిగా రెండు చేతులతో పట్టుకుంది రాధ. "వొదులు, నన్నొదులు" అని ఛాయ పెనుగులాడసాగింది.

    "ఊహుఁ, సమాధానం చెబితేగాని వదలను."

    ఛాయ మాట్లాడకుండా విడిపించుకునేందుకు ప్రయత్నిస్తూనే వుంది.

    "కోపం వచ్చిందా?"

    ఛాయ జవాబు చెప్పలేదు. "వదలవేం నన్ను?" తన పెద్ద కళ్ళతో అక్కయ్యవంక కోపంగా చూసింది.

    "రాత్రి నిన్ను తీసుకెళ్ళకుండా సినిమాకు వెళ్ళినందుకు కోపం వచ్చింది కదూ?"

    ఈ మాట వినగానే ఛాయకు ఎక్కడలేని ఏడుపూ వచ్చేసింది. రెండు చేతులతో ముఖం కప్పుకుని ఏడవసాగింది.

    చెల్లెలు ఇంకా ఏడుస్తూ వుంటే అక్కగారి హృదయం ద్రవీభూతమైంది. ముఖంనుండి చేతుల్ని బలవంతంగా విడిపించి, కళ్ళనీళ్ళు పమిట చెంగుతో తుడిచి, బుగ్గలమీద ముద్దు పెట్టుకుంది. ఈ తియ్యని ముద్దుతోకూడా ఆ పిల్లకు శాంతం కలగలేదు. "పో" అంటూ కసితీరా అక్కయ్య ముఖంమీద రక్కి అక్కడ్నుంచి పారిపోయింది.

    తల త్రిప్పి ఇటు చూసేసరికి వాసు లోపలికి వస్తున్నాడు.

    "అక్కయ్యా? నాకో సహాయం చేస్తావా?" అనడిగాడు.

    "ఏమిటిరా?"

    "నాకో పావలా కావాలి."

    "నా దగ్గరెక్కడిది?"

    "పో - నువ్వెప్పుడూ అలాగే అంటావు."

    "అంటే ఎందుకంటాను?"

    వాడు ఏదో గొణుక్కుంటూ వంటింటిలో అమ్మ దగ్గరకు వెళ్ళాడు. అక్కగార్ని అడిగిందే తల్లిని కూడా అడిగాడు.

    "పొద్దున్నే నీకు పావలాతో ఏంపనిరా?" అనడిగింది తల్లి.

    "నాకు కావాలి"

    ఆవిడ కొంచెం ఊరుకుని "నా దగ్గిరలేదు" అంది.

    "ఎవరి దగ్గరా లేకపోతే నాకెవరిస్తారు?" అని వాసు బిక్కమొహం పెట్టి అడిగాడు.

    "అసలు అంత అవసరం ఏమి వచ్చిందో కాస్త చెబుదూ?" వాడు కొంచెం విసుగ్గా "ఆఁ అన్నీ నీకు చెప్పాలేమిటి?" అన్నాడు.

    "చెప్పలేకపోతే పోనియ్యిలే. ఏం చేస్తాం? పోయి మొహం కడుక్కునిరా" అంది శారదాంబ. అమాయకత్వంతో కూడిన ఒక విధమైన కోపం వచ్చింది వాసుదేవరావుకు. అయితే వాడిది ఒకరిమీద కోపం చూపించే వయసుకూడా కాదు అందుచేత ఏమీ అనలేక బావి దగ్గరకు పోయి, పళ్ళుతోముకుంటూ ఏదో ఆలోచించసాగాడు.

    వాడు పావలా అడిగినందుకు తగినంత కారణం వుంది. మొన్న స్కూల్లో ఇద్దరు ముగ్గురు స్నేహితులు సర్కస్ కి వెడుతూంటే వీడికి కూడా వెడదామని బుద్ధి పుట్టింది. కాని ఎప్పుడూ అణా , అర్ధణా కంటే వీడిదగ్గర ఎక్కువ డబ్బులు వుండవు. అన్నయ్యని అడిగితే ఇస్తాడుగాని, ఇది అన్నయ్య దగ్గరకూడా వుండే సమయం కాదు. ఇలా ఆపదలో ఇరుక్కున్న వాసుకు పెట్టుబడి పెడతానంటూ ఒక స్నేహితుడు ఆదుకున్నాడు. ఆ స్నేహితుడి డబ్బులతో మధ్యాహ్నం బడి ఎగగొట్టి సర్కస్ చూశాడు. కాని మరునాటి ఉదయమే పెట్టుబడి పెట్టిన ఆ ఘన మిత్రుడు తన  డబ్బు కోసం వేధించసాగాడు. వాసు ఆశ్చర్యంగా "ఇప్పుడేమి ఇస్తాను. నా దగ్గిర వున్నప్పుడు ఇస్తాను" అన్నాడు. ఆ మిత్రుడు ఒప్పుకోలేదు. ససేమిరా అప్పుడే కావాలని పట్టుపట్టాడు. "ఇవ్వకపోతే ఏం చేస్తావు?" అన్నాడు వాసు. "మీ ఇంటిలో చెబుతాను" అన్నాడతన  ఖండితంగా. వాసుకి భయం వేసి మరునాడు ఇస్తానని చెప్పి అప్పటికి తప్పించుకున్నాడు. అందుకనే వాడికి ఇవేళ లేచినప్పట్నుంచి అది ఒక పెద్ద సమస్యలా కనిపించసాగింది. ఎలాగోలా వాడి అప్పు తీర్చివేయాలి. లేకపోతే ఆ వెధవ స్వభావం తనకు తెలుసు. అన్నంతపనీ చేసే రకం.

    కాని చేయగలిగింది ఏమీలేదు. భయపడుతూనే బడికిపోయాడు. ఆ రోజు అప్పు ఇచ్చిన మిత్రుడికి కనిపించకుండా వుండాలని సాధ్యమయినంత ప్రయత్నం చేశాడు. కాని అదేం లాభించలేదు. ఆపద సమయంలో ఆడుకున్న మిత్రుడు వీడిని చూసీ చూడగానే "ఏరా, నా బాకీ తీరుస్తావా?" అనడిగాడు.

 Previous Page Next Page