"నీకు నేను ఊరికినే అప్పు యివ్వను. కావాలంటే మాతో ఆడి గెల్చుకు పో."
వాడు గుండె వేగంగా కొట్టుకుంది. ఈ సూరిగాడు లేనిపోని సమస్య తెచ్చిపెట్టేటట్లు వున్నాడు. ఎలాగయినా తప్పించుకుందామని "ఆడటానికి నా దగ్గర డబ్బులెక్కడివి?" అన్నాడు.
"నేనప్పు ఇస్తాను."
"కాని నే నాడను"
"ఎందుకని?"
"నాకు ఇటువంటి ఆటలంటే ఇష్టం వుండదు. నువ్వు పావలా ఇవ్వకపోయినా ఫర్వాలేదు" అంటూ వాసు అక్కడ్నుంచి వెళ్ళిపోదామని బయలుదేరాడు. కాని సూరిగాడు వెనకనుంచి "ఆగు" అని అరిచాడు. వాసు ఆగి బిక్క మొహం వేసి "ఎందుకు?" అన్నాడు.
"ఏమిటీ నీ వుద్దేశం? ఇక్కడకు వచ్చి ఆడకుండా యెలా తప్పించుకు పోదామనుకున్నావు? సరే పో యెలా యిక్కడ్నుంచి బయటపడతావో నేను చూస్తాగా" అన్నాడు. వాసు హడలిపోతూ నిలబడే సరికి వాడింకా విరగబడి నవ్వుతూ "అరే పోరా! ఇంకా ఆగుతావేమిటి?" అని మిగతా వాళ్ళవంక చూస్తూ "చూడండిరా మనవాడు మనతో ఆడకుండానే వెళ్ళిపోతాడట" అని ఇంకా నవ్వాడు. వాడి నవ్వుతో మిగతా వాళ్ళంతా శ్రుతి కలిపి యింకా గట్టిగా యికిలిస్తూనే నవ్వేశారు. వాసుకి భయంవేసింది. అక్కడే నిలబడి వాళ్ళందరి వంకా చూశాడు. అంతా తన కంటికి యమకింకరుల్లా కనిపించారు. వాళ్ళ నవ్వు రాక్షసులు నవ్వే నవ్వులావుంది. తను ఒక్కడు వాళ్ళుపదిమంది వున్నారు. అవసరంవస్తే వాళ్ళు తనని ఏమయినా సరే చేసేట్లుగా వున్నారు. అప్రయత్నంగా వాసు కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఏదో చెప్పబోయేసరికి మాట తడబడింది.
"నీ ఉద్దేశం ఏమిటి. నన్ను వెళ్ళనియ్యవా?" అన్నాడు సూరిగాడి వంక తిరిగి వణుకుతూ.
"నిన్ను నే నేమన్నానురా? పో పో వెళ్ళిపో."
అక్కడ్నుంచి వెళ్ళిపోవటం ఎంత కష్టమైన విషయమో గ్రహించాడు. తను ఇక్కడికి బుద్దిలేకుండా ఎలా వచ్చాడు? చేస్తున్న ప్రతిపనీ పొరపాటనిపించింది. ధైర్యంచేసి ఒక అడుగువేశాడు. వెనుకనుంచి ఇరవై పద ధ్వనులు వినిపించి ముందు దూకుతున్నట్లుగా అనిపించింది. పెద్దపెట్టున నవ్వులు వినిపించాయి. ఏవేవో గుసగుసలు కూడా వినిపించాయి. వీళ్ళంతా కలిసి తనను.....
వాడింకా ఒక్క క్షణమైనా ఆలోచించుకోలేదు, చటుక్కున వెనక్కి తిరిగి వెనక్కి తిరిగి కళ్ళ నీళ్ళు కారుతుండగా "సరే ఆడతాను" అన్నాడు గాద్గదికంగా.
సూరిగాడు సంతృప్తి పొందిన చిహ్నంగా ఒకసారి యికిలించి "నాకు తెలుసు, ఇక్కడకు వచ్చిన వాళ్ళెవరూ ఆడకుండా పోలేదురా" అని పిలిచాడు.
చిన్నప్పుడెప్పుడో ప్రక్క ఇంటి వాళ్ళతో ఆడటం తప్పితే వాసుకు ఈ ఆటలో ప్రావీణ్యంలేదు. కాని ఇలా తప్పనిసరి అయ్యేసరికి ఎలాగో అలా ఆట ఆడటానికి పూనుకున్నాడు. సూరిగాడు ముందుగా ఒక పావలా బదులిచ్చాడు. దాంతో వాసు ఆడి గెల్చుకోవాలి. ఈ ఆటలో చేతులు తిరిగిన ఆ మిగతా వాళ్ళతో అలాగే ఆడాడు. కాని అప్పుతెచ్చుకున్న పావలా పదినిమిషాల్లోనే అయిపోయింది. "నా దగ్గిర డబ్బు అయిపోయింది" అన్నాడు బిక్కమొహంవేసి. సూరిగాడు ఇంకో పావలా ఇచ్చి ఆడమన్నాడు. వాసు నిరాకరిద్దామనుకున్నాడు. కాని సూరిగాడి మొహం చూసేసరికి భయం వేసింది. మళ్ళీ ఇంకో పదినిమిషాలన్నా గడవకముందే అది కూడా అయివూరుకుంది.
"ఏమయినా సరే నేనింకా ఆడను" అన్నాడు వాసు మొండి ధైర్యముతో లేచి నిల్చుంటూ.
"ఎందుకని?"
"ఆడదల్చుకోలేదు"
"సరే, అయితే నాకు ఇవ్వవలసిన బాకీ యిచ్చి వెళ్ళు" సూరిగాడు గదమాయించాడు.
"నా దగ్గర డబ్బులేదని ఇందాకే చెబితినిగా?"
"నా కదేం తెలీదు. కావాలంటే మళ్ళీ అప్పు యిస్తాను ఆడు. లేకపోతే నా డబ్బు నాకు యిచ్చి మరీ కదులు."
"నా దగ్గిర ఏమీ లేందే యెలా యిచ్చేది?"
"నీ దగ్గిర ఏమీ లేదేం?"
"ఊహుఁ"
సూరిగాడు అదేదో భయంకరమైన భంగిమపెట్టి బిగ్గరగా నవ్వాడు. "నీ దగ్గిర ఏమీ లేదు కదూ? అయితే నీ జేబులోది ఏమిటి?"
వాసు భయంతో జేబుని గట్టిగా పట్టుకుని "పెన్ను!" అన్నాడు.
"అదిచ్చేసెయ్యి."
"ఇవ్వను."
"ఇవ్వవూ? ఇవ్వవూ? ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా?" ముఖంలో ముఖం పెట్టి భీకరంగా చూశాడు సూరిగాడు. తరువాత గిరుక్కున తిరిగి "ఒరేయ్ చూడండ్రా? వీడు మనకి డబ్బు బాకీ వున్నాడు. కాని యివ్వడట. వీడికేం శిక్ష విధిస్తే బాగుంటుంది!" అన్నాడు.
ఇంతలో "ఉరి" అని అరిచాడు వొకడు.
"కాదు, చిత్రవధ"
ఇంకో బుద్ధిమంతుడైన కుర్రాడు సానుభూతితో కలుగజేసుకుని "పాపం, కాస్త బాకీకి ఇంత పెద్ద శిక్ష విధించడం ఏమీ బావుండలేదు. వీడిని దేశబహిష్కరణ చేద్దాం" అన్నాడు.
"మహా లావు దిగివచ్చాడయ్యా పెద్ద సానుభూతిపరుడు! నా సంగతి తెలుసుగా? లాన్ జాన్ సిల్వర్ లాంటి వాడిని. అడ్డువచ్చిన ప్రతి ఒక్కణ్ణి నరికేస్తాను. తస్సదియ్య.....నా దగ్గర మాటంటే మాటే. చెప్పండి వీడికి; యీ వాసుగాడికి ఉరిశిక్ష బావుంటుందని నేను ఉద్దేశిస్తున్నాను. మీలో ఇది యెంతమందికి యిష్టమో చేతులు ఎత్తండి."
కొంచెంసేపు అంతా నిశ్శబ్దంగా వుంది. అందరి ముఖాలు భయంతో పాలిపోయి వున్నాయి. నెమ్మదిగా వాళ్ళలో వాళ్ళు గుసగుస లాడుకోసాగారు.
సూరిగాడు మహా వీరుడిలాగా గర్జిస్తూ "చెప్పండి. భయపడి చస్తారేమిటిరా? మీలో ఒకరికీ దమ్ముల్లేవా! హుఁ" అని తుపుక్కున ఉమ్మేసి "తస్సదియ్య........ చవట పీనుగులు, ఒక్కడూ పనికిరాడు" అని గొణుక్కుంటూ "నా పేరేమిటో తెలుసా! లాంజన్ సిల్వర్!" అని ఘీంకరించాడు.
ఒక్కసారి చేతులన్నీ పైకి లేచాయి. సూరిగాడు అంతా కలియచూచి "భేష్, మాటంటే అలా వుండాలి" అని లేచి వాసు దగ్గరకు వచ్చాడు. వాడి ముఖాన్ని రెండు చేతుల్తో పట్టుకుని క్రూరంగా చూస్తూ, "మరేమిటి? వాళ్ళంతా నిన్ను చంపేద్దామంటున్నారు. డబ్బు ఇస్తావా? చస్తావా? అన్నాడు
"ఇస్తాను, ఇస్తాను" అని గొణిగాడు.
వాసు ఇందాకకట్నుంచి యిదంతా తెల్లబోయి పరికిస్తూనే వున్నాడు. వాడి శరీరమంతా చెమటలు పట్టిపోయింది. గజగజమని వణుకుతున్నాడు.
సూరిగాడు కళ్ళు విజయగర్వంతో ప్రకాశించాయి. "రైట్ . అది మంచిపిల్లవాడు చేసే పని" అన్నాడు చిటిక వేస్తూ. కాని అక్కడున్న సిబ్బందిలో ఒకడికి ధర్మ సందేహం వచ్చింది.
"ఎలా యిస్తాడు? ఇందాక లేదని?"
"ఇంటికిపోయి తీసుకువస్తాడు"
"ఇంటి దగ్గరమాత్రం దొరుకుతుందని నమ్మకం యేమిటి?"
"ఛస్, అదంతా నీకెందుకురా? దొంగతనం చేసి తీసుకువస్తాడు. జేబులు కొట్టి తీసుకువస్తాడు. నువ్వు నోరు మూసుకో" అన్నాడు సూరి.
ఈ మాటలు విన్న వాసుకు వళ్ళు ఝల్లుమంది. తనని వీళ్ళంతా కలిసి దొంగతనం చేయమని ప్రోత్సహిస్తున్నారు. ఇందాక స్కూల్లో ఆ వెధవకూడా యిదే సలహా యిచ్చాడు- దొంగతనం.
వాసుకి కళ్ళు తిరిగినట్లుగా తోచింది. మగతగా, ఏదో కలలో అంటున్నట్లు "అలాగే తెస్తాను."
"ఆగు" సూరిగాడు వొక్క అరుపు అరిచి ముందుకు వచ్చాడు. "నువ్వు మళ్ళీ వస్తావని మాకు నమ్మకం ఏమిటి?"
"అయితే ఏం చెయ్యను?"
"అంతదాకా యీ పెన్ను మా దగ్గిర వుంచు" అని సూరిగాడు చొరవగా వాడి జేబులోంచి పెన్నులాగి తీసుకుని "ఇహ పో" అన్నాడు. వాడు అలా పెన్ను తీస్తుంటే వాసుకు చెప్పలేని బాధ కలిగింది. అది కొనటానికి ముందు ఎంత చరిత్ర వుందో అక్కడున్న వాళ్ళలో వొక్కడికీ తెలీదు. దానిని అన్నయ్య చేత కొనిపించటానికి తను యెంత అవస్థ పడ్డాడో, యెన్ని రోజుల పోరుపెట్టాడో, యెన్నిసార్లు ఏడిపించాడో అదంతా స్మృతి పథంలో ఒక్కసారి మెదిలినట్లయింది. అందరివంకా ఒకసారి అసహ్యంగా చూసి, యింటివేపు శరవేగంతో పరుగెత్తాడు.
ఇంటికి పోయేసరికి అంతా నిశ్శబ్దంగా కనిపించింది. అమ్మ వంట యింట్లో యెక్కడో వుంది. అక్కయ్య యెక్కడుందో కనిపించలేదు. ఇవాళ పేకాట స్నేహితులు అప్పుడే వెళ్ళిపోయినట్లున్నారు. నాన్న ఒక్కడే ఆ గదిలో మంచం వేసుకుని గుర్రుపెట్టి నిద్రపోతున్నాడు.
అన్నయ్య గదిలోకి వెళ్ళాడు.
అన్నయ్య డ్రాయరు సొరుగలో ఏవేవో చిల్లర డబ్బులు వుంటాయని తనకు తెలుసు. వాటిని ఇప్పుడు తను సంగ్రహించాలి. ఒకసారి అటూ యిటూ చూశాడు. ఎవరూ కనిపించలేదు. నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ డ్రాయర్ ని సమీపించాడు. వాడి గుండెలు వేగంగా కొట్టుకోసాగాయి. క్షణక్షణానికి ఉలిక్కిపడుతున్నాడు. ఇటువంటి పనులు వాడికి అలవాటు లేదు. ఒక మూలనుంచి "తప్పు -పాపం" అనిపిస్తోంది. చెయ్యి వెనక్కీ ముందుకూ ఆడుతోంది. చేద్దామా వద్దా అన్న ఆ రెండింట్లో మొదటిదే యెక్కువగా ప్రోత్సహించగా ఆ మధ్యాహ్నం .......మూడు గంటల వేళ యిల్లంతా నిశ్శబ్దంగావున్న సమయంలో వొక పాపకార్యం చేశాడు-----పన్నేండేళ్ళ కుర్రావాడు వాసుదేవరావు.
ఎలా లోపలికి పోయాడో అలాగే బయటకు వచ్చాడు. వాడి అదృష్టవశాత్తు యింట్లో వాళ్ళెవరూ చూడలేదు. ఒకసారి నలుప్రక్కలా చూసి, అరమైలుదూరంలో ఆ రహస్య ప్రదేశానికి దౌడు తీశాడు.
వగరుస్తూ వచ్చిన వాసుని చూసి సూరిగాడు ముందుకు వచ్చి "తెచ్చావా" అన్నాడు. వాళ్ళంతా ఆటమాని వీడి రాకకోసం ఎదురు చూస్తున్నట్లుగా వున్నారు. ఒక దిన్నమీద చుట్టూ కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. చౌకరకం సిగరెట్లు పెదాలమధ్య యిరికించి రకరకాలుగా పొగ వదుల్తున్నారు. వాళ్ళలోవాళ్ళు నవ్వుకుంటూ, పేలుకుంటూ కులాసాగా వున్నారు.
"ఊఁ" అని గొణిగాడు వాసు.
"ఇటుపడెయ్యి" సూరిగాడు చేయిజాపాడు. వాసు చేతిలోంచి వాడి చేతిలోకి ఏదో విసురుగా పడింది! లెక్క చూసుకుని సంతోషంగా ------
"భేష్, మంచిపిల్లవాడు యెప్పుడూ యిలాగే చేస్తాడు. ఒరేయ్, వాడి పెన్ను యెవరి దగ్గర వుంది? ఇచ్చెయ్యండిరా" అని అరిచాడు.
అందులోంచి ఒకడు "అదికాదు సూరీ. వీడి పెన్ను యివ్వకుండా యెగవేస్తే మన్ని చేసేదిమిటి?" అన్నాడు.
"ఛ, అలా వీల్లేదు" అని క్రోధంతో గర్జించాడు. "ఒరేయ్, నేనంటే యెవరో తెలియటంలేదు మీకు. నే నెవర్నో తెలుసా? లాంజాన్ సిల్వర్ని!" అని ఆవేశంతో వళ్ళు తెలియక కుంటుకుంటూ ముందుకు వచ్చాడు. వాసుకు తప్ప అక్కడున్న వాళ్ళలో ఎవరికీ నవ్వాగలేదు. విరగబడి పగలబడి నవ్వేశారు.
"ధూత్, మీలో ఒకరికీ బుద్ధిలేదు. ఇంకో క్షణం తర్వాత ఎవడిపళ్ళన్నా బయటకు కనిపించాయంటే వాడ్ని, యిదిగో --- యీ కాలితో తంతాను ఊఁ" అని ఘీంకరించాడు. నిజంగా ఒక్క క్షణంసేపట్లో అంతా సర్దుమణిగిపోయింది.
సూరిగాడు ముందుకు వస్తూ "యిదిగో యీ పెన్ తీసుకో. డబ్బు లేకుండా మళ్లా యీ ప్రాంతానికి రాబోక, తెలిసిందా?" అని అరిచాడు.