ఒక్కసారిగా హాల్లో చప్పట్లు ప్రతిధ్వనించాయి. అందరూ కరచాలనం చేసుకుంటున్నారు. ఏ సంతోషమూ ప్రకటించనివాడు రవి ఒకడే. అసలు సమస్య ఇప్పటినుంచీ ప్రారంభం అయిందని తెలుసు. ఎప్పుడైతే శర్మగారి ఏకఛత్రాధిపత్యం పోయిందని తెలిసిందో ఇక ప్రతివాడూ తనే ఆ కంపెనీ వ్యవహారాలు సరిదిద్దటానికి ప్రయత్నం చేస్తాడు.
....అరగంట తరువాత శర్మ కారు రివ్వున దూసుకొచ్చింది. అంత ముసలాయనా కుర్రాడిలా పరుగెత్తుకుంటూ మెట్లెక్కాడు. రవిని పట్టుకుని వూపేశాడు. "ప్రేమమంజరి గెల్చింది. ప్రేమ మంజరి గెల్చింది. ముఫ్ఫై లక్షలు" అని అరిచాడు. ఆయన మొహం వెయ్యి కాండిల్ బల్బులా వెలిగిపోతుంది. పది నిముషాలపాటు ఏకధాటిగా ఆ గుర్రపు గొప్పతనాన్ని వివరించాడు. చివరికి అసలు విషయానికి వచ్చాడు.
"నేను మన పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం ఇరవైశాతం షేర్లు మన ట్రస్టుకిచ్చి అధికారం వదులుకోవాలి. కానీ నేనలా చేస్తానని వ్రాతపూర్వకమైన ఒప్పందం ఏమీ ఎల్దు. నేను వప్పుకోనన్నా ఎవరూ చేసేదేమీ లేదు" అందరివైపు చూసి నవ్వేడు. "నేను నా ఇరవైశాతం వదులుకోబోవటం లేదు" అని ఆపేడు. అక్కడ సూదిపడితే వినపడేటంత నిశ్శబ్దం ఆవరించింది. ఆ నిశ్శబ్దంలోంచి ఆయన కంఠం తిరిగి వినిపించింది.
"మొత్తం అరవైశాతం షేర్లనీ ట్రస్టుగా పెట్టి రవిని ట్రస్టీగా వుంచుతున్నాను. తేజా టెక్స్ టైల్స్ నుంచి వెలువడే ప్రతీదీ ఈ రోజునుంచి 'రవితేజ'గా వ్యవహరించబడుతుంది".
ఒక్కసారిగా హాల్లో తిరిగి చప్పట్లు వినపడ్డాయి.
ఆ చప్పట్లు కొడుతున్న డైరెక్టర్ల వైపు సాలోచనగా చూశాడు. ఇందులో ఎందరు మనస్ఫూర్తిగా కొడుతున్నారో తెలీదు. శర్మగారు అధికారం వదులుకుంటే దాన్ని తమ చేతిలోకి తీసుకుందామని ఎందరు ఉవ్విళ్ళూరారో తనకు తెలీదు. రేపు తను తీసుకోబోయే నిర్ణయాలని ఎంతమంది సపోర్ట్ చేస్తారో తెలీదు. మొన్న మొన్న వచ్చినవాడు తను.
అతడు తలత్రిప్పి శర్మగారివైపు చూశాడు. ఈ ముసలాయన జీవితంలో మొట్టమొదటిసారిగా గెల్చిన ఆనందంలో ఏవేవో పిచ్చి పిచ్చి వాగ్దానాలు చేస్తున్నాడు. దీనిమీద ఎంతవరకూ నిలబడతాడో చూడాలి. ఏ క్షణమైనా కోపమోస్తే "ట్రస్టూ లేదు- గాడిద గుడ్డూ లేదూ, పొమ్మ" ని అనొచ్చు. ఈ వేడి తగ్గాక మాట్లాడాలి" అనుకున్నాడు. కానీ రవికన్నా ముందే శర్మే అతడితో రెండ్రోజుల తర్వాత మాట్లాడాడు.
రవి ఊహించిన దానికన్నా పెద్ద వ్యాపారవేత్త ఆయన.
"నేనేం తెలివితక్కువ వాడినికాను నిన్ను మేనేజర్ గా చెయ్యటానికి నాకా ఓపిక లేదు. నాక్కావలసిన నెలకి రెండు లక్షల ఖర్చు ఈ కంపెనీ భరించలేకపోతోంది. నా షేరుకి అంత లాభం వచ్చేలా చెయ్యి నిన్ను శాశ్వతంగా ఎమ్.డి.ని చేస్తాను. నేను ఇలా గుర్రప్పందేలాడుకుంటూ, వైన్ తాగుతూ గడిపేస్తాను శేషజీవితం" అన్నాడు.
ఇంకెవరయినా అయితే ఎగిరిగంతేసి వప్పుకునేవారే కానీ రవి భవిష్యత్తు ఆలోచించాడు.
నేను నా ప్రాణం ధారపోసి కంపెనీని లాభాల్లోకి తీసుకొస్తాను. ఆ తరువాత నన్ను తీసేస్తే?" అని ఎదురుప్రశ్న వేశాడు.
"మరేం చెయ్యాలి? షేర్లన్నీ నీ పేరుమీద మార్చాలా?"
"అక్కర్లేదు పదవి నాకివ్వండి, లాభాలు మీరు తీసుకోండి. కానీ నేను కోరేది IRRIVOCABLE గా వుండాలి. అంతే నా ఆప్లిక్ విభాగం మీద వచ్చే డబ్బు నేను బ్రతకటానికి చాలు. నేనేమిటో చూపించాలంటే అన్ని అధికారాలూ నాకు కావాలి. లాభాలు అవసరం లేదు".
"నా కిష్టమే" అన్నాడు శర్మ.
అలా ప్రారంభమయింది రవితేజ టెక్స్ టైల్స్ కంపెనీ.
ఆ రోజునుంచీ రోజుకి పద్దెనిమిది గంటలు కష్టపడేవాడు రవి! రవితేజ.
* * *
అప్పటికే అతడు కామర్స్ లో డిప్లమా పాసయ్యాడు. మొత్తమంతా ఒక కొలిక్కి తీసుకువచ్చాడు. సంవత్సరం తిరిగేసరికి బ్రేక్ ఈవెన్ అయింది కంపెనీ. అప్పుడే వచ్చినయ్ ఛాందినీ ఆ తరువాత క్రాస్ స్టిచ్ ఆర్గండీ లో కొత్తరకం పెద్ద అంచులున్నవి, ఫారిన్ కలర్లు.....
రెండో సంవత్సరం కంపెనీ లాభాల్ని చూసి "మైగాడ్, తేజా టెక్స్ టైల్స్ తిరిగి ఇన్ని లాభాలు కళ్ళజూస్తుంది అని నేను కలలో కూడా అనుకోలేదు" అన్నాడు శర్మ.
అప్పటివరకు కాస్తో కూస్తో గొణుగుతున్న డైరెక్టర్లు ఎవరైనా వుంటే (మొన్న మొన్న వచ్చినవాడిని అందలం ఎక్కించటం ఏమిటా అని) మూడో సంవత్సరం తిరిగేసరికి సంతృప్తులయ్యారు.
అంచెలంచెలుగా పెరుగుతున్న రవితేజ టెక్స్ టైల్స్ అభివృద్ధి పట్ల అసంతృప్తులైనవారు కొందరు లేకపోలేదు.
వారిలో ప్రముఖులు చెంచురామయ్య అండ్ కంపెనీ.
తగిన రోజుకోసం జాగ్రత్తగా వేచి వున్నారు.
1985 సెప్టెంబర్ లో ఆ రోజు వచ్చింది.
అప్పటికి రవితేజ టెక్స్ టైల్స్ వస్త్ర ప్రపంచంలో మకుటంలేని మహారాజులా వెలుగుతోంది. వంద రూపాయల షేరు వెయ్యి పలుకుతోంది. కంపెనీని విస్తరించటం కోసం మార్కెట్ లోకి వెళ్ళాడు రవి. పెట్టుబడిగా కోటిరూపాయలు తీసుకురావాలని అతడి ఆశయం.
దేశంలోని నాలుగు పెద్ద బ్యాంకుల చైర్మన్ లని కలుసుకున్నాడు. విరివిగా పార్టీ లిచ్చాడు.
అతడి షేర్లని కొనటానికి... చిన్న చిన్న కంపెనీలకి ఆ నాలుగు బ్యాంకులూ అప్పిచ్చేటట్టూ అంగీకారం కుదిరింది.
మంచో.... చెడో తెలీదుగానీ భారతదేశపు కామర్సు చరిత్రలో ఒక నూతనాధ్యాయం ప్రారంభానికి అతడు ఆ విధంగా నాందీ పలికాడు. కొందరే వుంటారు చరిత్రని సృష్టించేవాళ్ళు.
అతడికి తెలియనిదల్లా, తన ప్రతీ చర్యనీ రహస్యంగా చెంచురామయ్య అండ్ కో పరిశీలిస్తూందని.
ఒక ప్రముఖ దినపత్రిక ఈ వార్తని రెడీ చేసుకొని, బాంబులా పేల్చటానికి సిద్దంగా వుందని...
ఆ బాంబుగానీ సరిగ్గా పేలితే, వస్త్ర ప్రపంచంలోంచి రవితేజ పేరు శాశ్వతంగా తొలిగిపోతుంది.
ఈ రంగాలన్నీ సిద్దమైన పదిహేను రోజులకి....
రవితేజ షేర్లు..... కోటిరూపాయలు విలువగలవి - మార్కెట్ లో విడుదలయ్యాయి.
రవితేజ కంపెనీ కాపిటల్ మార్కెట్ లోకి రాగానే, ముందు అనుకున్న ప్రకారం, చిన్న చిన్న కంపెనీలన్నీ ఆ షేర్లు కొన్నాయి. కోటిరూపాయలు పదోరోజుల్లో జమ అయ్యాయి. అది గొప్ప సంచలన వార్తగా పాకిపోయింది. అప్పటికీ 'ఆర్టీ' చీరెల గురించి అందరికీ తెలుసుకాబట్టి - అది ఎవరికీ అంతగా అనుమానం కలిగించలేదు. రవితేజ షేర్లు కనీసం ఓ పది అయినా తమవద్ద వున్నాయని చెప్పుకోవటం ఫ్యాషన్ అయింది. ఎక్కడ పెరుగుదల వుంటుందో అక్కడ శతృత్వం కూడా వుంటుంది.
చెంచురామయ్య అండ్ కో వారికి, కేంద్ర ఆర్ధికమంత్రితో దగ్గర సంబంధాలున్నాయి. కేంద్రంలో వున్న పార్టీ తాలూకు దినపత్రిక ఆ విధంగా చెంచురామయ్యకి దగ్గరైంది.
వేటగాడు వల పరచుకుని కూర్చున్నట్టు ఈ పత్రిక తాలూకు మనుష్యులు రవితేజా చుట్టూ వేచి వున్నారన్న సంగతి మూడో కంటికి తెలీదు. అంత పకడ్బందీగా జరిగింది. రవితేజ కంపెనీ ఫైనాన్స్ డిపార్టుమెంటులో చెంచురామయ్య మనుష్యులు 'ప్లాంట్' చేయబడ్డారు.
మొత్తం రంగం అంతా సిద్దం చేసుకొని ఆ పత్రిక దీన్నంతా ఒక వార్తగా ప్రచురించింది. ఆ తరువాత యీ కోటి రూఅపయాల వెనుకవున్న వ్యవహారమంతా, బ్యాంకుల పేర్లతో సహా ఎక్కడెక్కడ ఏ యే స్థాయిలో ఎవరెవరు సమావేశమైందీ, ఎవరెవర్ని ఎలా సంతృప్తి పరిచిందీ వివరంగా నెల రోజులపాటు వ్యాసాలుగా ప్రచురించింది. సి.బి.ఐ. దీనికోసమే ఎదురు చూస్తున్నట్టు రంగంలోకి దిగింది. వస్త్ర ప్రపంచంలోకి ధృవతారలా దూసుకువస్తున్న రవితేజా టెక్స్ టైల్స్ కి ఇది పిడుగుపాటులా తగిలింది.
శర్మ బేజారెత్తిపోయాడు. ఒకానొక స్టేజిలో మొత్తం షేర్లన్నీ అమ్మేసి, వ్యాపారం నుంచి తప్పుకుందామా అనికూడా ఆలోచించాడు. రవితేజ, మరి ముగ్గురు డైరెక్టర్లే ధైర్యంగా వున్నారు. ఏదొచ్చినా ఎదుర్కోవటానికి సిద్దంగా నిలబడ్డారు వారు.
వ్యాపారంలో ఇది నైతికం - ఇది అన్యాయం అని ఏమీ లేదు. కోర్టు...ఇది చట్టవిరుద్దం అని తేల్చేవరకూ దోషి కాదు. మూడు నెలల పాటు షేరు మార్కెట్టు కదిలిపోయింది. రిజర్వ్ బ్యాంక్ నోటీసులమీద నోటీసులు యిచ్చింది. అందరి దృష్టి ఈ కంపెనీ మీదే పడింది. అయినా కేసుపెట్టబడలేదు- కారణం రవితేజ కంపెనీ చేసింది చట్టవిరుద్దం కాదు. నైతికంగా తప్పయితే అయి వుండవచ్చు. అది వేరే సంగతి. ఒక నేరంగా దీన్ని చట్టపరిధిలోకి తీసుకురావటానికి చెంచురామయ్య ఆర్ధిక మంత్రి ద్వారా చాలా ప్రయత్నించాడు. ఒకవైపు ఇది చేస్తూ, రెండోవైపు ప్రజలకి ఆర్. టి. చీరెల మీద సానుభూతి (ఈ పదం కరక్టేనా?) పోయేలా ప్రోపగండా చేయించాడు. ప్రజల సొమ్ము తినేసిన కంపెనీ అనే భావం ప్రజల్లో కలిగించటానికి ప్రయత్నం చేశాడు.