ఓ సాయంత్రం వీలుచూసుకొని అతనింటికి వచ్చింది. రామూ బయటకు వెళ్ళాడు. ఆమె లోపలి వెళ్ళేసరికి అతను టేబిల్ మీద గ్లాసు, సోడా, సీసా- యీ వ్యవహారంతో కనిపించాడు.
హఠాత్తుగా లోపలికి వచ్చిన మాలతిని చూసి ప్రదీప్ తడబడ్డాడు. "నువ్వు ముందుగా ఫోన్ చేసి రావాల్సింది" అన్నాడు.
ఆమె అతనికెదురుగా కూర్చుంటూ "ఫోన్ లో నువ్వు సరిగ్గా జవాబు చెప్పడంలేదు" అంది.
"అవునా?"
"ప్రదీప్! యిలా ఎందుకు తయారయ్యావు?"
"ఎలా?"
"ఇలా"
"ఇలా అంటే?"
"ఈ వ్యసనానికి అలవాటుపడి."
"ఏంచెయ్యను మాలతీ?"
"నువ్వు చాలా తెలివైన లాయర్ వి. ఈ వయస్సులోనే మంచిపేరుకూడా సంపాదించుకున్నావు. నువ్వు చెయ్యదల్చుకుంటే బోలెడు ప్రొఫెషనల్ వర్క్ వుంటుంది."
"చెయ్యలేకపోతున్నాను మాలతీ"
"ఆరోజు నిన్ను పార్టీకి పిలవకపోయినా బాగుండేది" అంది మాలతి విచారంగా బహుశా, మా కజిన్ని పరిచయంచేసి నేనే నిన్ను పాడుచేశానేమో."
"మీ కజిన్ వల్ల కాకపోతే యింకోరకంగా అలవాటయి వుండేది. ఇలాంటివి ఆగవు మాలతీ!"
కొంచెంసేపు మౌనంగా, బరువుగా గడిచింది.
"నువ్వు మామూలుగా వుండు ప్రదీప్!"
"మామూలుగా అంటే?"
"ఎప్పటిలాగ."
"...... ఎలా వుండగలను మాలతీ?"
"ప్రదీప్! ఆపేశావేం? డ్రింక్ తీసుకో."
"నువ్వు ఎదురుగా వుంటే.... అలా చెయ్యలేను మాలతీ"
"కంపెనీ యిస్తాను. తీసుకో."
"నావల్లకాదు మాలతీ! ఒక స్నేహితురాలిగా నువ్వంటే నాకు చాలా గౌరవం నీ ఎదుట కొన్ని తప్పులు చెయ్యలేను."
"అయితే రోజూ వచ్చి ఎదురుగా కూర్చుంటాను. అప్పుడు నువ్వు డ్రింక్ మానేస్తావు."
"అన్ని వేలు సంపాదించే ప్రాక్టీస్ మానుకునా!" అని ప్రదీప్ నవ్వాడు.
"నువ్వు మానేస్తానంటే- అన్ని వేలూ వదులుకుంటాను."
"అయితే.... నువ్వు వచ్చేటైముకు నేను యింట్లోనే వుండకుండా వెళ్ళిపోతూ వుంటాను."
మాలతి బాధగా నవ్వింది. "మొదట్నుంచీ నీ గుణం నాకు తెలుసు ప్రదీప్! నీ అంతట నీకు అనిపించాలేగాని, బలవంతాన నిన్ను ఎవరూ ఒప్పించలేరు."
"అవునా?"
కొంచెంసేపు కూర్చుని మాలతి వెళ్ళిపోయింది.
* * *
రాధను చూసి పదిరోజులకు పైగా అయింది. వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే మొహమాటంగా వుంది. కోర్టుకు వెళుతూ వస్తూ కారు స్కూలువైపు త్రిప్పి అక్కడేమైనా కనిపిస్తుందేమోనని చూశాడు. కనబడలేదు.
ఓ సాయంత్రం ఇక వుండబట్టలేక హనుమంతరావుగారింటికి వెళ్ళాడు.
ఆయన ఇంట్లోలేరు. అరుణా, సునీత వున్నారు.
అరుణ గుమ్మంలోనే కనబడింది.
"పాపవుందా?" అనడిగాడు.
"ఉందండీ పడుకుని వుంది.
"పడుకుందా? ఏం?"
"కన్ను నొప్పిగా వుందని."
"అదేమిటి? పదిరోజులయినా యింకా తగ్గలేదా?"
"లోపలకురండి."
ఒకక్షణం తటపటాయించి యింట్లోకి వెళ్ళాడు. ముందుగది దాటాక, యింకో చిన్నగది. రాధ మంచంమీద పడుకునివుంది. ముఖం గోడవైపు త్రిప్పి వుంది.
"రాధా! నిన్ను చూడటానికి అంకుల్ వచ్చారు" అంది అరుణ.
రాధ చాలావేగంగా ఇటువైపు తిరిగింది. అతన్ని చూడగానే ఆమెముఖంలో గొప్ప సంతోషం కదిలిపోయింది.
"అంకుల్!" అంది.
అరుణ మంచానికి దగ్గరగా ఓ కుర్చీ లాగింది.
కన్ను మునుపటికన్నా బాగా ఎర్రబడి, జ్యోతిలా వుంది. రెండోకన్ను కూడా ఎర్రబడిపోయింది.
పదిరోజులు దాటిపోయింది. కన్ జక్టివైటిస్ అయితే ఇన్నాళ్ళు వుంటుందా?
"పాపా! ఎలావుంది?" అనడిగాడు.
"అంకుల్! బాగా మంటగా, నొప్పి అనిపిస్తుంది. రోజూ స్కూల్ పోతుంది అంకుల్! పరీక్షలు కూడా దగ్గరకు వస్తున్నాయి."
"తగ్గిపోతుంది పాపా! ఫర్వాలేదు" అన్నాడు.
"ఇంట్లో....ఏమీ తోచటంలేదు అంకుల్! ఒకసారి నన్ను బయటకు తీసుకెళ్ళు అంకుల్. మీ యింటికి తీసుకెళ్ళు."
"మా యింటికా..ఏముంది పాపా!"
"చదువుకుందామన్నా... యీ కళ్ళు..." అంది రాధ దిగులుగా.
"ఎవరు చూస్తున్నారు" అనడిగాడు అరుణని వుద్దేశించి ప్రదీప్.
"మా ఫ్యామిలీ డాక్టరుగారే మా యింటిలో ఏది వచ్చినా ఆయనదగ్గరకే వెళుతూ వుంటాం" అని చెప్పింది అరుణ.
"కూడా ఎవరు వెళుతున్నారు?"
"నేనుగాని, సునీతగానీ వెళుతున్నాం ఆయన బాగా అనుభవమున్నవారే. శ్రద్దగా చూస్తున్నారు. ఈ మధ్య ఎక్కువగా ఆయనదగ్గరకు ఇలాంటి కేసులే వస్తున్నాయి.
"బహుశా రెండు మూడురోజుల్లో తగ్గిపోతుందేమో" అన్నాడు ప్రదీప్.
కొంచెంసేపు కూర్చుని వెళ్ళిపోయేందుకు లేచాడు.
"అంకుల్! నాకు తగ్గిపోతుందా?" అనడిగింది రాధ దీనంగా.
"తప్పకుండా తగ్గిపోతుంది పాపా! నువ్వు హాయిగా పరీక్షలకు వెళతావు."
"అంకుల్! నువ్వు అప్పుడప్పుడూ వస్తూ వుండవా? నాకేం తోచటంలేదు."
"తప్పకుండా వస్తూ వుంటాను పాపా!"
అతను వచ్చేస్తుంటే మర్యాదకోసం అన్నట్లుగా అరుణ కారుదాకా వచ్చింది. అంతవరకూ చాటుమాటుగా నిలబడ్డ సునీత గుమ్మంలోకి వచ్చి తన విశాలనేత్రాలు కదిలిస్తూ అతనివంక వింతగా చూస్తుంది.
"పాపను జాగ్రత్తగా చూస్తూ వుండండి" అంటూ ప్రదీప్ కారెక్కాడు.
* * *
తర్వాత అయిదారురోజులదాకా వెళ్ళటం కుదరలేదు. ఆరోజు ఉదయం లేస్తూనే రాధ ఎందుకో పదేపదే గుర్తువచ్చింది. ఆ అందమైన ముఖం, చురుకుదనం, చదువుకోవాలన్న ఆరాటం... ఆమెరూపం అతన్ని వెన్నంటి తరుముతుంది.
పదిగంటలకల్లా తెమిలి హనుమంతరావుగారింటికి వెళ్ళాడు.
కారాగిన చప్పుడు విని లోపల్నుంచి అరుణా, సునీత పరుగెత్తుకు వచ్చారు.