"మొత్తంగా ఆమెమీద వాలిపోయి, గట్టిగా ఆమెని అదుముకుంటాడు."
"అప్పుడూ?"
"ఏమో!" రాజేష్ బుర్ర గోక్కున్నాడు. "తెలీదు! ఈసారి చూసి చెప్తాను."
"ఎక్కడా?" ఆసక్తిగా అడిగింది స్వీటీ.
రాజేష్ చెప్పబోయి ఆగిపోయాడు.
"నువ్వు చిన్నపిల్లవి! ఇప్పుడు కాదు. తర్వాత చెప్తాను. పద.... పడుకుందాం" అన్నాడు.
ఇద్దరూ దొంగల్లా నక్కి నక్కి తమ తమ డార్మిటరీస్ లోకి వెళ్ళిపోయారు.
స్వీటీ నెమ్మదిగా వచ్చి పడుకోవడాన్ని పూజ చూసింది. పూజకి ప్రతి రెండ్రోజులకి ఒకసారి తల్లి ఉత్తరం వ్రాస్తూ వుంటుంది. ఒకే వూళ్ళో వున్నా తల్లినుంచి అలా ఉత్తరం అందుకోవటం, పిల్లలకి బావుంటుందని ధరణి ఉద్దేశ్యం. అప్పుడప్పుడు శ్రీధర్ కూడా అదే ఉత్తరంలోనే క్రింద - ఓ నాలుగు లైన్లు వ్రాస్తూ వుంటాడు.,
అప్పటివరకూ ఆ ఉత్తరాన్ని పదిసార్లు చదివి, పూజ అప్పుడే పడుకోబోతోంది. అంతలో స్వీటీ వచ్చింది.
"స్వీటీ! ఇంతసేపూ ఎక్కడికి వెళ్ళావు?" అని అడిగింది.
"బాత్ రూంకి" ఠక్కున చెప్పింది స్వీటీ.
"అబద్దం! రెండు గంటలు బాత్ రూంలో ఉంటావా?"
"నీకెందుకూ?" స్వీటీ విసుక్కుంది.
"అబద్దాలు చెప్పకూడదని మోరల్ సైన్స్ బుక్ లో ఉంది చూడలేదా?"
స్వీటీకి టెక్స్ట్ బుక్ మాట ఎత్తగానే దశరథుడి పుత్రకామేష్టీ యజ్ఞం, భార్యలకి పిల్లలు పుట్టడం గుర్తుకొచ్చాయి!
"పూజా, పిల్లలెలా పుడ్తారో తెలుసా నీకూ?" అడిగింది.
"ఓ!" కళ్ళు గుండ్రంగా త్రిప్పుతూ అంది పూజ.
స్వీటీ వెంటనే లేచి కూర్చుని "నీకు రేపు చాక్లెట్ ఇస్తానుగా.... నాకు చెప్పవూ!" అంది.
పూజ లేచి కూర్చుని "ఆకాశంలోనుంచి ఓ దేవదూత చిన్న చిన్న బొమ్మల్ని తెచ్చి అమ్మ పక్కలో వదుల్తుంది. అమ్మ ప్రేమగా ముద్దు పెట్టుకాగానే ఆ బొమ్మలకి ప్రాణం వచ్చి పిల్లలుగా మార్తారు!" అంది.
"ఎవరు చెప్పారూ?" అడిగింది స్వీటీ.
"మా అమ్మమ్మ" ఉత్సాహంగా చెప్పింది పూజ.
"నువ్వు అలాగే పుట్టావా?"
"అవును."
"మీ తమ్ముడు?"
"అలాగే!"
"పాపం ఒక్కళ్ళు కూడా మీ అమ్మకి నేచురల్ గా పుట్టలేదన్నమాట!...." అంటూ పడుకుంది స్వీటీ అటుతిరిగి.
పూజకి అర్ధం కాలేదు. ఆ మాటకొస్తే స్వీటీకి కూడా అర్ధం తెలీదు. ఎక్కడో చదివిన జోక్ అది. రిపీట్ చేసింది. అంతే అర్ధం తెలిస్తే ఈ కథ మరోలా వుండేది.
* * *
"పూజనీ, అభీనీ చూడాలని ఉందక్కా" అన్నాడు ఉల్లిపాయలు తరుగుతున్న చందూ.
పెనంమీద పెసరట్టుని తిరగేస్తున్న ధరణి "అలాగేలేరా! వెళ్ళొద్దాం...దానికి ఇంతగా కళ్ళనీళ్ళు పెట్టుకుని అడగాలా?" అంది.
"ఇప్పటికి కిలో ఉల్లిపాయలు తరిగించావు మహాతల్లీ! కన్నీళ్ళు కార్చక పాలు కారుస్తానా?" కోపంగా అడిగాడు చందూ.
ధరణీ, శ్రీధర్ ఇద్దరూ నవ్వేశారు.
"సీరియస్ గా అంటున్నాను. ఈ రోజు లీవ్ పెట్టక్కా!" అన్నాడు మళ్ళీ చందూ.
"పెట్టొచ్చు కానీ.... మా బాస్!" అని సందిగ్ధంగా ఆగిపోయింది ధరణి.
"ఓ.... రాకాసిని భయపెట్టే బాస్ లు కూడా ఈ ప్రపంచంలో వుంటారన్నమాట!" వెక్కిరిస్తూ అన్నాడు.
"భయంకాదు... ఆలోచన!" కోపంగా అంది ధరణి.
"దానికి నా డిక్షనరీలో వున్న అర్ధం అది!" పుడికించాడు చందూ.
"సరే... పద!" అనేసింది ధరణి.
స్కూల్ గేట్ దగ్గరున్న వాచ్ మెన్ ఆటోని ఆపి ఎందుకొచ్చారో, ఎవరో డీటైల్స్ కనుక్కున్నాడు. ధరణి అతని ద్వారా యోగికి స్లిప్ రాసి పంపించింది.
ఈలోగా చందూ స్కూల్ గ్రౌండ్ నీ, బిల్డింగ్ నీ పరీక్షించి "ఆర్భాటంగానే వుంది! ఫీజులెలా వుంటాయి?" అన్నాడు.
"మిగతా స్కూల్స్ తో పోలిస్తే చాలా రీజనబుల్ గా వుంటాయి!" అంది ధరణి.
"ఈ స్కూల్ యజమాని నిజమైన ఆదర్శవంతుడన్నమాట" అన్నాడు చందూ.
వాచ్ మెన్ వచ్చి లోపలి రమ్మంటున్నారు అని చెప్పాడు. ధరణీ, చందూ హాస్టల్ రూమ్స్ ముందర నించి నడుచుకుంటూ పక్కగా వున్న ఆఫీసులోకి వెళ్తున్నారు. రూమ్స్ లో కొందరు అమమయిలు ఇంకా బెడ్స్ మీద పడుకునే వుండటం ధరణి గమనించింది. ఎందుకిలా పడుకోవడానికి అనుమతించారూ? అస్వస్థతగా వుంటే వాళ్ళ తల్లిదండ్రులకి తెలియజెయ్యాలి కదా! అనుకుంది.
ధరణి ప్రతిదాన్నీ నిశితంగా గమనిస్తుంది. ప్రతి విషయాన్నీ ఇదే చివరిసారీ, ఇదే మొదటిసారీ అన్నట్లు గమనిస్తే జీవితాంతం మరచిపోలేము. అందుకే ధరణికి జ్ఞాపకశక్తి చాలా ఎక్కువ!
యోగి వీళ్ళని చూడగానే లేచి వినయంగా చేతులు జోడించాడు. ఖాదీ కలర్ కుర్తా పైజామా వేసుకుని, కళ్ళద్దాలతో ఆ యువకుడు చాలా సాధారణంగా కనిపించాడు.
ధరణీ, చందూ కూడా నమస్కరించి కూర్చున్నాక, "పిల్లల్ని ఓసారి చూడాలనిపించింది. పైగా పరీక్షలు దగ్గరకోస్తున్నాయి ఎలా చదువుతున్నారో వాళ్ళ టీచర్స్ ని అడగవచ్చునని వచ్చాను" అంది ధరణి.
"మీరు ముందుగా ఫోన్ చేసి రావాలి!" చిరునవ్వుతోనే చెప్పాడు యోగి.
"ఓ... అది ప్రొసీజరా" అడిగింది.
"ఔనమ్మా! ఈ స్కూల్ కి కొన్ని నియమ నిబంధనలున్నాయి. డిసిప్లిన్ అనేది చాలా ముఖ్యం. అందుకే పిల్లలతో బాటు మనకీ కొన్ని రూల్స్ పెట్టాము" అన్నారు.
"ఈసారి నుంచీ అలాగే చేస్తాం!" అంది.
"పిల్లల్ని మేం వెళ్ళి చూడచ్చా" ఆత్రంగా అడిగాడు చందూ, యోగి చందూవైపు తలతిప్పి "ఇతనూ..." అని ధరణి వైపు ప్రశ్నార్ధకంగా చూశాడు.
"మా బ్రదర్" చెప్పింది ధరణి.
"మీరు వెళ్ళకూడదు. వాళ్లనే పిలిపిస్తాను" బెల్ కొడ్తూ చెప్పాడు.
ధరణికి వెంటనే గుర్తొచ్చి "ఇంకా పడుకునే వున్నారు కొందరు, ఎందుకూ?" అని అడిగింది.
యోగి నవ్వి "వంట్లో బాగోకపోవచ్చు!" అన్నాడు.
"మరి ఆ విషయం వాళ్ళ పేరెంట్స్ కి మీరు ఇన్ ఫార్మ్ చేస్తారా?" అడిగింది.
యోగి మళ్ళీ చిరునవ్వు నవ్వి, "పిల్లలు కొద్దిగా నలతపడగానే హడావుడిగా వాళ్ళ తల్లిదండ్రులకి ఫోన్ చెయ్యడమో, మెసేజ్ పంపించడమో చేస్తే మా స్కూల్ కి మిగతా స్కూల్స్ కీ తేడా ఏవిటీ? వారి మొత్తం సకల బాధ్యతలూ మేమే వహించి వాళ్ళకి టెన్షన్ లేకుండా చెయ్యాలనే కదా.... ఈ స్కూల్ ముఖ్యోద్దేశం" అన్నాడు.
"కానీ..." అని ధరణి ఆగిపోయింది.
"మీకంటే ఎక్కువ శ్రద్ద తీసుకోవటానికే మాస్టాఫ్ ఇక్కడ వున్నారు. మీరు నిశ్చింతగా ఉండచ్చు!" చెప్పాడు యోగి.
ఆ మాటకి ధరణి తృప్తిపడినట్టు తల ఊపింది. ఆమె ఏదో అడగబోతూంటే "సార్ .... నిరంజన్ వచ్చాడు" అని ఫ్యూన్ చెప్పాడు.
"రమ్మను!" అన్నాడు యోగి.
యధాలాపంగా టేబుల్ మీదున్న పేపర్ వెయిట్ ని తిప్పుతున్న ధరణి, లోపలి వస్తున్న మనిషిని చూసి కళ్ళు పెద్దవి చేసి అలాగే ఉండిపోయింది. అతడు బస్ లో తనని వేధించి, ఇన్ స్పెక్టర్ తో తన్నులు తిన్న వ్యక్తి!
ధరణి అతన్ని చూసి ఆవేశంతో కట్టెలా బిగుసుకుపోయింది. ఆమె సర్దుకోవటానికి కొంత టైమ్ పట్టింది. ఈ లోపులో అతను వచ్చి యోగి పక్కనున్న చెయిర్ లో కూర్చుని "హలో గురూ! హౌ ఆర్ యూ?" అన్నాడు.
"ఇతను... ఇతను మీకు తెలుసా?" తీవ్రంగా అడిగింది యోగిని ధరణి.
ధరణి ముఖంలోని సీరియస్ నెస్ ని ఆశ్చర్యంగా చూస్తూ "ఏవైందక్కా?" అన్నాడు చందూ.
నిరంజన్ ధరణివైపు చూశాడు. మొహం మాడిపోయింది.
"వాట్ హేపెండ్? ఎనీ ప్రాబ్లెం?" అడిగాడు యోగి.
"ఎస్! ఇతను ... ఇతను ఓ యాన్టీ సోషల్ ఎలిమెంట్! ఆడపిల్లల్ని బస్సుల్లో లైంగికంగా వేధించే శాడిస్ట్! ఇతను మీకెలా తెలుసు?" ఆవేశంగా అడిగింది ధరణి.
"మీరు పొరపడుతున్నారు ధరణి.... ఇతను... ఇతను ఈ స్కూల్ కి...." అని ఆగిపోయి "కూల్ డౌన్! మంచినీళ్ళు తెప్పించమంటారా?" అన్నాడు యోగి.
ధరణి వేళ్ళు ఆవేశంతో పేపర్ వెయిట్ మీద బిగుసుకున్నాయి. ఏ నిమిషానికైనా అది తీసి కొట్టేటట్లుంది. పరిస్థితి గమనించినట్టు "నేను మళ్ళీ కలుస్తా" అని నిరంజన్ లేచి నిలబడి ధరణివైపు ఓసారి చూశాడు.
యోగి నిరంజన్ వైపు చూసి తల ఊపాడు. అతను వెళ్ళాక, "ఇతనికీ, స్కూల్ కీ ఏమిటి సంబందం? ఇందాక చెప్తూ ఆపేశారు?" సూటిగా అడిగింది ధరణి.