Previous Page Next Page 
యుగాంతం పేజి 14

  

     "ఒక ప్రముఖ దినపత్రిక ప్రకటించిన అసత్యవార్త వల్ల నగరంలో అలజడి. 'ప్రళయం వస్తుంది' అని ఆ పత్రిక ప్రకటించడం వల్ల ప్రజలు భయకంపితులవుతున్నారు. గుండె జబ్బు వున్నవాళ్ళ పరిస్థితి మరింత ప్రమాదకరమయింది. ఈ వార్త మూలాన తన ఆరోగ్యం దెబ్బతిన్నదనీ, డానికి నష్టపరిహారంగా యాభైవేల రూపాయలకి దావా వెయ్యబోతున్నాననీ హైకోర్టు న్యాయవాది ఒకరు ప్రకటించారు."
   
    ఈ వార్త చూసి, ఇండియన్ టైమ్స్ ఎడిటర్ కంగారు పడ్డాడు. అనవసరమైన చిక్కుల్లో యిరుక్కోవటం యిష్టంలేదు. శైలజని చీవాట్లు పెట్టేడు.
   
    మనిషి మనుగడమీద జూదం మొదలయింది.
   
                                                                         *    *    *
   
    ఆగష్టు నాలుగు-ఢిల్లీ
   
    పదకొండు గంటలకి అప్పాయింట్ మెంట్.
   
    తొమ్మిది గంటలకి సెక్రటేరియట్ కి చేరుకున్నారు యిద్దరూ రమణ గుండె వేగంగా కొట్టుకొంటోంది. ప్రధానమంత్రితో తను స్వయంగా మాట్లాడబోతున్నాడు. కలలో కూడా వూహించలేని విషయం అది.
   
    పావుతక్కువ పదింటికి అప్పాయింట్ మెంట్ ఆర్డర్ వెరిఫికేషన్ జరిగింది. ప్రోగ్రామ్ షీట్ లో పేరు వ్రాయబడింది.

    పావుతక్కువ పదకొండుకి విజిటర్స్ ఛాంబర్ లోకి ప్రవేశం లభించింది. ఆ ఛాంబర్ లోకి ప్రవేశం లభించింది. ఆ ఛాంబర్ లోకి వెళ్ళాలంటే కారిడార్ లోంచి నడవాలి. అక్కడే విజిటర్లు ఏవయినా ఆయుధాలు ధరించిందీ లేనిదీ పరీక్ష జరుగుతుంది.
   
    పదకొండు కొడ్తూ వుండగా డ్రాయింగ్ రూమ్ లోకి ప్రవేశించారు. ప్రధాని జగదీష్ చంద్ర వీళ్ళని చూసి విష్ చేసి కూర్చోమన్నాడు. రమణ ఎగ్ జైట్ మెంట్ తో వూపిరి బిగపట్టేడు.
   
    వాళ్ళకి యివ్వబడిన సమయం అయిదు నిముషాలు.
   
    "మీరేనా ప్రొఫెసర్?"
   
    తలూపేడు. నిముషంపాటు మామూలు సంభాషణ.
   
    "నక్షత్రం ఒకటి భూమివైపు వస్తుందని ఎందుకు భావిస్తారు మీరు?" విషయం కదుపుతూ అన్నాడు.
   
    "చూసేడు కాబట్టి"
   
    "ఎక్కడ?"
   
    "నా టెలిస్కోప్ లో."
   
    "మీ దగ్గర టెలిస్కోప్ వుందా?"
   
    "ఉంది."
   
    "మనదేశంలో వున్న మిగతా అబ్జర్వేటరీస్ కనుక్కోలేని విషయాన్ని మీరు ఎలా కనుక్కొన్నారు?"
   
    "మనదేశంలో ఎక్కడా నా దగ్గరున్నంత పెద్ద టెలిస్కోప్ లేదు. మనదేశంలోనే కాదు, ప్రపంచంలోనే లేదు."
   
    జగదీష్ చంద్ర, అవినాష్ అతడివైపు చిత్రంగా చూసేరు. కొంచెంసేపు ఎవరూ మాట్లాడలేదు.   
   
    "ఆ నక్షత్రం భూమివైపే వస్తుందని ఎందుకనుకొంటున్నారు? ఒకవేళ వచ్చినా అది పదిహేడో తేదీనాడే వస్తుందని నమ్మకం ఏమిటి?"
   
    "లెక్కలు కట్టేను."
   
    "మీ దగ్గర కంప్యూటరుందా?"
   
    "నా మెదడే కంప్యూటరు."
   
    "ఎనభై ఎనిమిది తొంభై మూళ్ళెంత?" అవినాష్ నవ్వుతూ అడిగేడు.
   
    "ఎనిమిదివేల నూట ఎనభై నాలుగు"
   
    ధిగ్ర్బమ....
   
    మళ్ళీ కొంచెం నిశ్శబ్దం.
   
    "ప్రపంచంలో ఏ ఆస్ట్రానమిస్టు కనుక్కోలేనిదాన్ని మీరు ఏ పరికరమూ లేకుండా కనుక్కున్నానంటారా?"
   
    "నేను కనుక్కున్నది నిజమవనూవచ్చు, కాకపోనూవచ్చు. ప్రపంచం సంగతి నాకు తెలీదు. ఏ అబ్జర్వేటరీ పని చెయ్యటం లేదు."
   
    జగదీష్ భ్రుకుటి ముడిపడింది. "పని చెయ్యటం లేదా?" సాలోచనగా అన్నాడు.
   
    అయిదు నిమిషాలైపోయినట్టు సంకేతం మరికొంత సమయం పొడిగింపబడింది.
   
    జగదీష్ అన్నాడు. "ఆ నక్షత్రానికి మీరన్నట్టు ఆకర్షణ శక్తిగాని వుంటే, వస్తువులే కాదు, అన్ని పదార్ధాలూ దాన్ని చేరుకుంటాయి కదా."
   
    "అది ఆ నక్షత్రపు ఆకర్షణ శక్తిని బట్టి వుంటుంది."
   
    "అంటే....."
   
    "ఒక అయస్కాంతం ఇనుప ముక్కని ఆకర్షిస్తుంది. ఆ నక్షత్రంలో వుండే అయస్కాంతం బంగారంమీద ఎక్కువ ప్రభావాన్ని చూపించగలిగితే...అన్నిటికన్నా ముందు బంగారం భూమినుంచి వెలుపలికి వెళ్ళిపోవటానికి ప్రయత్నిస్తుంది."
   
    "ఏ గ్రహపు ప్రభావం ఏయే లోహాలమీద ఎక్కువగా వుంటుందని మీరనుకుంటున్నారు?"
   
    "క్షమించండి నేను ఆస్ట్రానమిస్ట్ ని, జియాలజిస్ట్ ని కాను" అన్నాడు ప్రొఫెసర్. "ఏదిఏమైనా, పదిహేడో తారీఖు, పదకొండింటికి అత్యంత సమీపంగా వస్తుంది కదా, అప్పుడు అన్ని వస్తువులూ దానివైపు ఆకర్షితమవుతాయి."
   
    "నా ప్రశ్నని మీరు సరిగ్గా అర్ధం చేసుకోలేదు" అన్నాడు జగదీష్. "ఆ నక్షత్రం దేన్ని బాగా ఆకర్షించగలదో అది భూమిని వీడి తొందరగా అటువైపు వెళ్ళిపోతుంది. ఉదాహరణకి అది ఇనుముని బాగా ఆకర్షిస్తుందనుకోండి. పదకొండు గంటలా పదినిమిషాలకి ముందే భూమి యొక్క లితోస్పియర్ లో వుండే 19శాతం ఇనుము అటు వెళ్ళిపోతుంది. అంటే భూమి బ్రద్దలవటం ప్రారంభిస్తుందన్న మాట. అవునా?"
   
    ప్రొఫెసర్ ఒక క్షణం ఆలోచించాడు. "అలా అవటం సాధ్యమైవుంటే, ఆ కదలిక ఏదో ఒక పదార్ధంలో తొందర్లో మొదలవుతుంది" అన్నాడు.
   
    "తొందర్లో అవటం కాదు, అయింది" నెమ్మదిగా స్ఫుటంగా అన్నాడు జగదీష్.
       
    శ్రోతలు ఉలిక్కిపడ్డారు.
   
    గదిలో సూదిపడ్తే వినపడేటంత నిశ్శబ్దం.
   
    ".....నేను స్వయంగా చూసేను. నెలరోజుల క్రితం ఒక పెద్ద రాయి గాలిలో ఎవరో లేపినట్టు పైకి లేచి క్రిందకు పడి పోయింది. నా ఉద్దేశం ఆ రాతిలో వున్న పదార్ధం ముందుగా ఆకర్షణ శక్తికి లోనవుతోందన్నమాట" అంటూ లేచాడు. "ఆ పదార్ధం ఏమిటో కనుక్కోండి. దానివల్ల మీ థియరీకి ఏదయినా లాభం కలుగుతుందేమో చూడండి. మీ రిపోర్టు నాకు పంపండి-"
   
    ఇద్దరూ షేక్ హ్యాండిచ్చి బైటకొచ్చారు.
   
    "ఏమిటిదంతా?" అవినాష్ అడిగేడు వాళ్ళు వెళ్ళేక.
   
    "మానవుడి జీవితానికి ఆఖరి రోజు వచ్చిందని యీ ప్రొఫెసర్ అంటున్నాడు. అది ఎంతవరకు నిజమో తెలీదు. అదే నిజమై.....ఈ మానవజాతి అంతరించిపోతే......అప్పుడు యీ రాజకీయాలుండవు. మనిషీ మనిషీ డబ్బుకోసం, కీర్తికోసం, పదవికోసం కట్టుకొని చావటం వుండదు. ఒకవేళ అది నిజం కాకపోతే - అధీ మనకి లాభమే. ప్రజల దృష్టి అటు మళ్ళుతుంది. మనిషికి ప్రాణంకన్నా తీపి యింకొకటి లేదు. నెలరోజులపాటూ దేశంలో ఏ నోట విన్నా అదే సమస్య వినిపిస్తుంది. ప్రతీ పేపరు ఎక్కువస్థలాన్ని ఆ విషయం రాయడానికే కేటాయిస్తాయి. ఈ లోపులో మనం బలం పుంజుకోవచ్చు. మనస్థాపాన్ని సుస్థిర పర్చుకోవటానికి ఈ పదిహేను రోజులూ చాలు. ప్రజల దృష్టి డైవర్ట్ చెయ్యటానికి ఇంతకన్నా మంచి విషయం ఇప్పట్లో ఇంకొకటి వుంటుందని నేను అనుకోను." పార్టీ చీఫ్ నవ్వేడు. మనిషి మనుగడమీద రాజకీయ చదరంగం ప్రారంభమైంది.

 

                                                                       *    *    *

                                                                  
   
    ఢిల్లీ, ఆగష్టు నాలుగు రాత్రి.
   
    చేతులు రెండూ తలక్రింద పెట్టుకొని వెల్లకిలా పడుకొని ఆకాశంకేసి చూస్తున్నాడు ప్రొఫెసరు.
   
    పక్కనే ఇంకొ పక్కమీద రమణ.
   
    టైమ్ తొమ్మిదయింది. ప్రధానిని కలుసుకొని అప్పటికి పదిగంటలు కావొస్తూంది.
   
    "రాయి గాలిలో లేవటం చిత్రంగా వుంది" అన్నాడు రమణ.
   
    "అందులో చిత్రం యేముంది? అందులోని ఒక పదార్ధం ఏదో ఆకర్షణకి లోనై వుంటుంది."

 Previous Page Next Page