Previous Page Next Page 
ప్రయాణంలో పదనిసలు పేజి 14

    రాజరావో పర్యాయం ముసలాయనవంక చూశాడు. ఆయన కళ్ళల్లో గర్వంకానీ, ఆనందం కానీ కనబడ్డంలేదు. చాలా మామూలుగా చూస్తున్నాడాయన.   
    "నా దగ్గర లంచం తీసుకోకపోతే పోవుగాక, నా ప్రయాణాన్ని కష్టాలపాలు చేసివుంటే వుండుకాక- ఎంతో సింపుల్ గా కనబడుతున్న ఈ ముసలాయన అసాధారణవ్యక్తి బహుశా హిందూ దేశంలోని ఉద్యోగస్తులలో ఈయన అపూర్వ వ్యక్తి అయుండాలి. కష్టపడి తిరుపతి వెడితే- కాసిని డబ్బులు ఖర్చు పెడితే - వెంకటేశ్వరస్వామిని చూడవచ్చు. కానీ ఇటువంతు వ్యక్తిని చూడడం ఎప్పుడోకానీ సాధ్యపడదు. ఇలాంటి వారికి చేయెత్తి నమస్కరించాలి-" అనుకున్నాడు రాజారావు. హటాత్తుగా అతని మనసులో తృప్తిలో నిండిపోయింది. చేతులెత్తి నమస్కరించబోయి- అందుకు సరైన సమయం రాలేదని గ్రహించి- ఆసందర్భంగా వుండకూడదని అప్రయత్నం నుంచి విరమించుకున్నాడు.   
    ట్రయిన్ కదిలింది కానీ ఈశ్వరరావు కంపార్టుమెంటులో ఎక్కలేదు. బాలకృష్ణ కూడా ఎక్కలేదు. చౌదరి మాత్రం ఎక్కి- "వాళ్ళిద్దరూ సికింద్రాబాదు బోగీలో విశ్వప్రయత్నాలారంభించారు..." అన్నాడు.   
    ముసలాయన జాలిగా వీళ్ళవంక చూసి- "మిమ్మల్ని చూస్తే జాలిగా వుంది. ఇంకా చాలా ప్రయాణముంది మీకు. రిజర్వేషన్ లేకుండా ఎలావెడతారో, ఏమో-మీకేమీ సాయపడలేకపోయాను__" అన్నాడు.   
    "మీరు తల్చుకుంటే మాకు సాయం చేయగలిగే వారు__" అన్నాడు చౌదరి.   
    మనలో ఏముందండి_ అంతా వాడిలీల. మీకు సాయపడదామనే ఉద్దేశ్యంలేకపోతే ఈ బోగీలోనే ఎక్కనివ్వను. ఈబోగీ అస్తమానం ఇంతరద్దీగా వుండదు. తరచుగా కాళీగానే వెడుతూంటుంది. ఈ రోజు మీ అదృష్టం బాగాలేదు. ఎక్కడచూసినా ఒకటే జనం_" అన్నాడు ముసలాయన.   
    "అది నిజమే-" అన్నాడు చౌదరి-దీపావళి వెళ్ళివచ్చిన మొదటి శనివారం ఈ రోజు అందరూ ఈ రోజే అటుకేసి తిరిగి వెళ్ళిపోతారు__" అతను బొంబాయివైపు దీపావళి ప్రాముఖ్యాన్ని గురించి కాసేపు వివరించాడు.   
    "దొరక్క దొరక్క ఈ తేదీయే దొరకాలా నాకు-" అనుకున్నాడు రాజారావు గుజరాత్ వైపు దీపావళి చాలా పెద్ద పండగ. సెలవులిచ్చేస్తారాసమయంలో చాలా సంస్థలకు అక్కడ పనిచేసే అన్ని ప్రాంతాలవారూ తమతమ ఇళ్ళకు పోయి - మళ్ళీ ఇప్పుడు తిరిగి వెడుతూంటారు.   
    ముసలాయన్నుచూస్తే రాజారావుకిప్పుడాట్టేకోపంగా లేదు. ఆయనతో పిచ్చాపాటీ మాట్లాడేడతను. ముసలాయన, రాజారావు, చౌదరి, శివరాం- అవీ ఇవీ కబుర్లు చెప్పుకున్నారు. నలుగురిలోనూ రాజారావు ఒక్కడే అటూ ఇటూ చెందకుండా మాట్లాడేడు కానీ- మిగతా ముగ్గురిలో ఇద్దరు ఇందిరాగాంధీని సపోర్టు చేస్తూనూ, ఒకరు వ్యతిరేకిస్తూనూ రాజకీయాల గురించి కాసేపు చర్చలు జరిపారు.   
    ట్రయిన్ తాడేపల్లిగూడెంలో ఆగింది. అక్కడ ఈశ్వర్రావు, బాలకృష్ణవచ్చి బోగీలో ఎక్కారు. ముసలాయన వెతుక్కుంటూ వెళ్ళి పిల్చుకువచ్చి ఒకతనికి బెర్తు ఇచ్చిన వైనం రాజారావు ఈశ్వరరావుకి చెప్పగా అతను ముక్కుమీద వేలేసుకున్నాడు.   
    "మనకు హైదరాబాదుదాకా ఫరవాలేదండీ ఆ బోగీలో అతను మనందరికీ సీట్సు ఇస్తానని వాగ్దానం చేశాడు. బెజవాడలో కండక్టరు మారుతాడుగదా- ఈ బోగీలో ఏమైనా పని జరుగుతుందేమో చూడాలి_" అన్నాడు ఈశ్వరరావు రాజారావు మనసు కాస్త తేలికపడింది. కానీ మొట్టమొదటే హైదరాబాదుదాకా రిజర్వేషన్ తీసుకుని వుంటే భువనేశ్వర్ నుంచి హైదరాబాదుదాకా ప్రయాణం సుఖంగా అయిపోయుండేదిగదా అని మనసులో అనుకుని గత జలసేతుబంధన మెందుకని ఆ విషయంలో ఆలోచించడం మానేశాడు.
    వీళ్ళు మామూలు కబుర్లతో చెప్పుకోతగ్గ విశేషాలేమీ లేకుండానే ట్రయిన్ విజయవాడ చేరుకుంది. మధ్యలో ఈశ్వరరావు వెళ్ళి ఏలూర్లో తన సీటు సంగతి మరోసారి రూడీ చేసుకువచ్చాడు.   
    విజయవాడరాగానే శివరాం తను ఊళ్లోకి వెళ్ళి భోజనం చేసి వస్తానన్నాడు మిగతావాళ్ళు ఇద్దరిద్దరు వంతులుగా వెళ్ళి ఫ్లాట్ ఫారంమీద కాంటీన్ లో భోంచేసి వచ్చారు. రహీం తన దగ్గరున్న క్యారేజీ విప్పుకుని రొట్టెలు తిన్నాడు.   
    ఇటు భోజనాలవుతూండగానే ఈశ్వరరావు, బాలకృష్ణ తమతమ ప్రయత్నాలలోవున్నారు ఒకేఒక్క సీటుందన్నాడుట. అంతవరకూ అందరకూ ఇస్తానన్న కండక్టరు వెళ్ళిపోయి కొత్తవాడు రాగానే మారుమాట్లాడకుండా, ఈశ్వర్రావు మాటాడనివ్వకుండా బాలకృష్ణ అది తను తీసేసుకున్నాడుట ఈశ్వరరావుమాత్రం అతని కాళ్ళావెళ్ళాపడి నానా తంటాలు పడి మొత్తంమీద మూడు సీట్సు సంపాదించగలిగాడు. శివరాంతో వారికి నిమిత్తం లేదు. రాజారావుకాక, చౌదరి ఒక్కడే అతని బాధ్యత అయితే బాలకృష్ణ కండక్టరుతో మిగతావారి గురించి మాటాడంపోవడం మాత్రం అతనికినచ్చలేదు. నచ్చక చేయగలిగినదీ లేదు.

 Previous Page Next Page