అది క్లాస్ రూమ్ లా లేదు. లెక్చరర్,స్టూడెంట్స్ లా లేరు. తమ అక్కయ్యతో కథ చెప్పించుకునే తమ్ముళ్ళూ, చెల్లెళ్ళలా ఉన్నారు. అందరూ కలగలిసి కథ వింటున్నట్టు చిన్నపిల్లల్లా బుద్దిగా, యాంగ్జయిటీగా మేడమ్ ను చూడసాగారు.
'క్లాస్ రూమ్ ఇలా కూడా ఉంటుందా? పర్మషన్ అడిగి, ఇష్టాన్ని తెలుసుకుని క్లాస్ తీసుకుంటారా లెక్చరర్స?! తమ పోర్షనేదో తాము- వింటున్నారా లేదా అనికూడా తెలుసుకోకుండా చెప్పుకుపోతారుగానీ!' అనుకుంది జ్ఞాపిక.
"హి ఈజ్ గ్రేట్ లిరికల్ పోయెట్ అఫ్ ది ఇంగ్లీష్ లిటరేచర్!" మళ్లీ మొదలయింది మెత్తటి ఆమె గొంతు.
ఇక ప్రపంచాన్నీ, రేవంత్ ను కూడా మరిచిపోయింది జ్ఞాపిక.
ఆమె మామూలు పిచ్ లో క్లాస్ చెబుతున్నా ఆఖరి సీట్స్ వరకూ క్లియర్ గా వినిపించసాగింది. అంత కామ్ గా ఉంది క్లాస్! ఆమె ప్రోనౌన్సేషన్ స్పష్టంగా, 'ఇంగ్లీష్ ఇంత అందమైన బాష?!' అనిపించేట్లూ..., ఇంత అద్భుతమైన పోయట్రీ ఇంగ్లీష్ లో ఉందా?! కీట్స్ ఇంత ఆమోఘమైన కవా?!'....అన్న భావనా జ్ఞాపికలో ఏర్పడింది.
ఆమె తన గొంతులోనే కీట్స్ పదాల గుండా పచ్చిక మైదానంలోకి, పావురాల రెక్కల టపటపలోకి, మేఘాల చినుకుల చిటపటలోకి, పూరేకుల ఉయ్యాలోకి, గాలి తరంగాల పల్లకి పైకి, సముద్ర కెరటాల సింహాసనం పైకి, తేనెచుక్కల ఆస్వాదనపు తుమ్మెదు రెక్కల పైకి తీసుకెళ్లి ప్రకృతిలో లీనం చేసింది.
జ్ఞాపిక తన ఉనికే మరిచిపోయింది. రేవంత్ రెండుసార్లు తలతిప్పి చూసినా జ్ఞాపికకు తెలీలా! లీనం... ప్రకృతిలోకి, పరవశంలోకి లీనం! ఆ మెత్తటి గొంతాగిపోయినా అది ప్రతిధ్వనిస్తూనే ఉంది చెవుల్లో!
"ఓ.కే. డియర్స్.... వుయ్ విల్ మిట్ టుమారో ఎట్ దిస్ టైమ్!" అన్నా, అందరూ "థాంక్యూ.... మేమ్!" అన్నా- జ్ఞాపిక సృహలోకి రాలా! ఆమె కదలికల వంక అలాగే చూస్తూండిపోయింది.
ఆమె క్లాస్ రూమ్ దాతబోతుండగా- చటుక్కున లేచి ఆమెవైపు సాగింది!
రేవంత్ లేచి, "ఏయ్ జ్ఞాపీ..." అన్నా వినాలా!
గబగబా ఆమె దగ్గరికెళ్లి- "థాంక్యూ మేమ్! నాకు లిటరేచర్ అంతగా తెలియదు. కానీ, మా డాడీ కొన్ని బుక్స్ ఇస్తుంటారు. అవి మాత్రమే చదువుతుంటాను. మాథ్స్, మెడికల్ ఇన్ఫర్మేషనూ మాత్రమె చదువనుకున్న నాకు- లిటరేచర్ లోని మధురిమ చూపించారు. థాంక్యూ...థాంక్యూ!" అంది ఆనందంగా! "నాకంటూ అక్కయ్య ఉంటే అచ్చం మీలా ఉండాలని కోరుకునేదాన్ని!" అనికూడా చెప్పేసింది ఎమోషన్ లో.
"హు ఆర్ యూ గర్ల్? ఐయాం వెరీ గ్లాడ్ టు మీట్ యూ!" అంది ప్రేమగా. అసలు ఆమె చూపు, ఆమె మాటా, ఆమె నడతా- అంతా ప్రేమగా, మృదువుగా, ఇష్టంగా ఉంది. 'అసలు మృదుత్వమే ఆమెలోంచి పుట్టిందా...' అనిపించేలా ఉందామె.
'ఐ యాం జ్ఞాపిక M.C.A. స్టూడెంట్!" అని, ఇంతలో రేవంత్ దగ్గరకు రాగానే- "హీ ఈజ్ మై ఫ్రెండ్ రేవంత్! మై సీనియర్ అండ్ మై గైడ్!" అని రేవంత్ ను పరిచయం చేసింది సంభ్రమంగా!
"రియల్లీ...." నవ్విందామె రేవంత్ వైపు చూస్తూ.
"హలో మేమ్... వుయ్ ఆర్ కమ్మింగ్ టు యువర్ హౌస్! హావ్ యు ఎనీ అబ్జెక్షన్?!" అడిగాడు మెత్తగా.
"ఏయ్ఁ! అదేంటీ.... ఆవిడ పిలవకుండానే అడిగేస్తావ్?" అని రేవంత్ కాలు కాలుతో నొక్కి-
"నో మేమ్! మీరు కలిశారు.... చాలు! మీ ఇంటికొచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని లేదు. రేవంత్ కు తొందరెక్కువ.... ఏవీ అనుకోకండీ! ఓ.కే. మేమ్.... వుయ్ విల్ మీట్ యూ ఎగైన్!" అని రేవంత్ వైపు తిరిగి-
"నోర్మూసుకుని పదా!" అంది చిన్నగా.
"నో! యూ బొత్ ఆర్ కమ్మింగ్ టు మై హౌస్!~టుడే యు ఆర్ మై గెస్ట్స్....ఓ.కే.!" అందావిడ నవ్వుతూనే.
"థాంక్యూ....మేమ్!" అనేసి జ్ఞాపిక చెయ్యి పట్టుకుని బైక్ దగ్గరకు తీస్కెళ్లాడు.
"ఏంటలా అడిగేస్తావు! ఇంటికొచ్చేస్తామని! నువ్వు అప్పుడప్పుడు మేనర్స్ మరిచిపోతుంటావు!" కసిరింది ముద్దుగా.
"సరే! ఇప్పుడు మేనర్స్ గుర్తొచ్చింది! ఆవిడ పిలిచింది కదా.... వెళ్దామా, వద్దా?" అడిగాడు రెండుచేతులూ కట్టుకుని- తన ఆజ్ఞ శేరసావహించే భటుడిలా.
"నువ్వడిగేసరికి ఆవిడ రమ్మన్నారు. ఇక వెళ్లకపోతే ఆవిడ్ని ఇన్సల్ట్ చేసినట్లుండదూ... పద!" అంది బైక్ మీద కూర్చుని. "ఇల్లు తెలుసా?" మళ్లీ కసిరింది ముద్దుగా.
"ఆఁ...ఓసారి చూశా!" అన్నాడు నింపాదిగా!
దారి పొడువునా ముద్దుముద్దుగా తిడుతూనే ఉంది. అతను నోర్మూసుకుని పడుతూనే ఉన్నాడు. 'తిట్టడంలో ప్రేమ, పడడంలో ఆనందం ఎంత బావుంటుందో...!' అనుకున్నాడు కూడా!
"ఓ.కే జ్ఞాపీ! నేను చేసిన తప్పుకు ముందుగా మా ఇంటికి తీస్కెళ్లి, ఆ తరువాత మేడమ్ ఇంటికెళ్దాం...సరేనా? ఇదే నాకు సరైన శిక్ష! అన్నాడు.
"మీ ఇంటికా? అమ్మో.... నేను రాను. నాకు భయం! నేను మేడమ్ ఇంటికే వస్తా! అయినా- చెప్పాపెట్టకుండా నన్ను తీస్కెళ్తే మీ అమ్మగారు ఏమనుకుంటారు? 'ఈ పిల్ల ఇలా బాయ్ ఫ్రెండ్స్ తో తిరుగుతుందేమో....' అని అపార్థం చేసుకోరూ!" కంగారుగా అని, "నేన్రాను బాబూ!" అని తల అడ్డంగా గబగబా తిప్పింది.
"అపార్థం చేసుకొనీ! ఏవవుతుందీ...?"
"సిగ్గు లేకపోతే సరి! అపార్థం చేసుకున్నాక రేపు మన పెళ్ళికెలా ఒప్పుకుంటుంది? మా డాడీ వచ్చి మీ ఇంట్లోవాళ్ళను కలిసి, పెళ్ళి అయ్యాకే మీ ఇంట్లోకి కోడలుగా వస్తా! ముందు ఛస్తేరాను. అట్టగారిల్లంటే భయం నాకు! అత్తగారు ఏవడుగుతారో ఏమో.., నేను భయంలో ఒకదానికొకటి చెప్పేస్తా! ఆవిడ చండికలా నన్ను తిడితే? మా డాడీతోపాటే వస్తా బాబూ! ఒక్కదాన్నే ఛస్తేరాను! బై కాపు... నేను దిగిపోతా!" కంగారు, భయం.
అసలు అత్తలంటే ఆడపిల్లలకు ఎందుకంత కంగారో అర్తంకాలా రేవంత్ కు.
"మా అమ్మెలా ఉంటుందీ, ఎంత గయ్యాళిదీ అనేది తెలుసుకోవా? రేపు పెళ్ళయ్యాక 'ఇంత గయ్యాళిదని ముందే నాకెందుకు చెప్పలేదు?, చెప్తే నిన్నసలు చేసుకునేదాన్ని కాదు!' అని జీవితాంతం తిట్టాడానికా? నువ్వు ముందే వచ్చి చూసుకో తల్లీ మీ అత్తగార్ని.... ఎందుకయినా మంచిది! భవిషత్తులో నేనో అపాయం నుండీ తప్పించుకున్న వాడ్నవుతాను!" సముదాయించ చూశాడు.
"నాక్కావలసిందీ నేను పెళ్ళి చేసుకునేదీ...నిన్ను! మీ అమ్మగార్ని కాదు. ఆవిడ గయ్యాళయినా, కాకపోయినా నాకేం ఫర్వాలా! నీకోసం నేను భరిస్తా! కానీ, పెళ్ళికి ముందు మాత్రం నేను మీ ఇంటికి రాను. మా డాడీ రావాలి...., మాట్లాడాలి... నన్ను మీ ఇంటికి తనే పంపించాలి!" మొండితనం గొంతులో.
'ఆడపిల్లల మొండితనం కూడా అందమే..!' అనుకున్నాడు రేవంత్.
'ఒకవేళ మీడాడీకి మా ఇంట్లోవాళ్ళు నచ్చకపోతే...?" రెచ్చగొట్టాడు.
"నాకిష్టం డాడీ .... అంటే- నన్ను రావణాసురుడి కయినా ఇచ్చి చేస్తారు మా డాడీ!" ఓవర్ కాన్ఫిడెన్స్!
ఆ నమ్మకమే ఆడపిల్లలను ఆలోచించేవిధంగా మారుస్తుందేమో!
"సర్లే జ్ఞాపీ! మేడమ్ దగ్గరకే వెళ్దాం! కానీ, ఆవిడ ముందు నన్ను 'మేనర్ లెస్....' అని తిట్టకేం! కావాలంటే ఆవిడ లోపలికెళ్లాకో, వచ్చేప్పుడో కాలు కసుక్కున తొక్కి మరీ తిడుదువు!" అని మాట తీసుకున్నాడు.
"నువ్వు కూడా రెచ్చిపోకేం! నాకు పిచ్చిరేగుతుంది మరి!" అని కండిషన్ పెట్టింది.
"ఓ.కే.!" అంటే- "ఓ.కే!" అనుకుని సాగిపోయారిద్దరూ.
ఒక ఇంటిగేటు ముందు బైకాపి, "ఇదే మేడమ్ వాళ్ళిల్లు!" మెల్లగా గుసగుసగా చెప్పాడు.
బోల్డానందం వేసింది. కొంచెంసేపు తనతో మాట్లాడొచ్చు, ఏవైనా బుక్స్ తెచ్చుకోవచ్చు, సర్ ప్రైజింగ్ గా డాడీకి ఫోన్ చేసి, 'నేనీ బుక్ చదివేశానో చ్!' అని చెప్పొచ్చు అనుకుంది.
"నువ్వుండు....!" అని ముందు వెళ్లబోతున్న రేవంత్ ఫర్ట్ పట్టుకులాగి, "ఉండు... నువ్వెళ్లి రసాభాస చేస్తావు. నా పరువు పోతుంది. నీ కాలు తొక్కితొక్కి నా హీల్ అరిగిపోయింది!"
తనే వెళ్లి బెల్ కొట్టింది.
రెండు నిముషాలకు మేడమ్ వచ్చి తలుపుతీశారు. ఇప్పుడు నైటీ వేసుకుంది. ఇంకా వయసు తక్కువ అనిపించింది.
"మే ఐ కమిన్ మేమ్!" అడిగింది.
"విత్ ప్లెజర్! వెల్ కమ్ టు మై లిటిల్ హౌస్!" అని దారి తప్పుకుని సిటౌట్ లో చైర్స్ చూపించి లోపలికెళ్లింది- "జస్ట్ ఎ మినిట్....స్టౌ ఆఫ్ చేసి వస్తాను" అని.
రేవంత్ బయటే ఉన్నాడు.
"రా! ఏంటా ఫోజు...?!" చిన్నగా పిలిచింది.
"నాకు మేడమ్ వెల్ కమ్ చెప్పలేదు కదా! నువ్వు మేనర్స్ తెలీదంటావేమో లోపలికి వస్తే....అని రాలేదు! రానా?" అడిగాడు బయటనుంచే.
"ఇద్దరికీ చెప్పిందిలే రా! ఒక్కొక్కరికీ విడివిడిగా చెప్తారా?!" విసుక్కుంది.
"ఓ.కే. మేడమ్!" అని వచ్చి జ్ఞాపిక పక్కన కూర్చున్నాడు. ఇంతలోకి మేడమ్ స్వీట్ బిస్కట్స్, వాటర్ జగ్, టీ కెటిల్ తో వచ్చారు.
"ఇవన్నీ ఎందుకండీ... మీకు శ్రమ!" గొణిగింది.
రేవంత్ ప్లేట్ తీసుకోబోతుంటే.... కాలు తొక్కింది ఆగిపోయాడు.
"ప్లీజ్ హావిట్! నేనేవీ శ్రమపడలేదు... ఇంట్లో ఉన్నవే ఇచ్చాను. కమాన్... హావిట్!" తనూ ఒక ప్లేట్ తీసుకున్నాక జ్ఞాపిక తీసుకుని రేవంత్ వైపు చూసింది.
"చిత్తం...." అన్నట్టు తలవంచి ప్లేట్ తీసుకున్నాడు.
తింటూతింటూ- "మీ దగ్గర ఏమేమి బుక్సున్నాయి మేమ్? నేను లిటరేచర్ గురించి తెలుసుకోవాలంటే ఏ బుక్స్ తో మొదలెట్టాలి? మీ కిష్టమైన బుక్సేవీ, ఆ బుక్స్ స్పెషాలిటీ ఏంటీ? నాకేవయినా బుక్స్ ఇవ్వగలరా? భద్రంగా తెచ్చిచ్చేస్తాను".... లాంటివన్నీ ఒద్దికగా రేవంత్ కు ఛాన్స్ ఇవ్వకుండా మాట్లాడింది జ్ఞాపిక.
అన్నింటికీ నవ్వుతూ విసుక్కోకుండా సమాధానాలు చెప్పి, ఖాళీ అయినా ప్లేట్స్ తియ్యబోతుంటే- "ప్లీజ్..." అని రేవంత్ ఆ పేట్లన్నీ ట్రేలో పెట్టుకుని లోపలికెళ్తుంటే.... "మేనర్ లెస్ నెస్ మొదలెట్టాడు" అని కాలు చూసింది. తన కాలుకు అందేలా లేదు తోక్కుదామంటే! అందుకే ఊరుకుని బలవంతంగా నవ్వి-
"ఒక్కరే ఉంటారా మేడమ్! మీ హస్బెండ్, పిల్లలూ..?" అడిగింది.
"హస్బెండ్ ఎక్స్ పైర్డ్! ఒక్క బాబు మాత్రమే!" అని, "ఉండు... పరిచయం చేస్తాను" అని, "బిట్టూ..." అని పిలిచింది.
వచ్చి గుమ్మానికి అనుకుని, చేతులు కట్టుకుని నవ్వుతూ- "యస్... మేమ్!" అన్నాడు రేవంత్.
"పిచ్చా... రేవంత్ కు?' అనుకుంది జ్ఞాపిక. అంతలోకే-
"ఐ హావ్ ఓన్లీ వన్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్! దటీస్ హి! హీ ఈజ్ మై సన్.... రేవంత్!~" అని, "రేవంత్! షీ ఈజ్ మై ఫాన్... జ్ఞాపిక!" అంది నవ్వుతూ.
రేవంత్ మేడమ్ పక్కనే మేడమ్ కు అనుకుని కూర్చుని, రెండుచేతుల్తో మేడమ్ ను భుజాల మీదుగా పట్టుకుని, భుజంమీద తలపెట్టి కొంటెగా నవ్వుతూ-
"హాయ్... జ్ఞాపికా! వెరీ గ్లాడ్ టు మీట్ యూ!" అన్నాడు చిలిపిగా కళ్ళల్లోకి చూపులు గుచ్చుతూ.
తెరిచిన నోరు అలాగే ఉంచి చూస్తుండిపోయింది.
"కమాన్! ఏంటలా సైలెంటయిపోయావు? బిట్టూకు చిన్నప్పటినుండీ అల్లరిచేయడం అలవాటు. ఈరోజు ప్రాక్టికల్ అల్లరి చేశాడు" అన్నారు మేడమ్.
ఇంకేవీ మాట్లాడలా జ్ఞాపిక.
'ఇదా తన అత్తారిల్లు? నాకు అక్కయ్యలా ఉన్న, గైడ్ లా ఉన్న, ఆత్మీయంగా ఉన్న అమ్మలా ఉన్న ఈవిడా... తన రేవంత్ కు బర్త్ ఇచ్చింది! తన భవిషత్తుకు జీవం పోసింది! అత్తగారంటే అక్కలా కూడా ఉంటారా? అత్తిల్లంటే ఇంత ఇష్టంగా ఉంటుందా!'
ఏవీ మాట్లాడలేని జ్ఞాపిక మూగ మౌనస్థితి అర్థమయిపోయింది రేవంత్ కు. అందుకే అమ్మ చుట్టూ ఉన్న చేతులు తీసి-
"ఓ.కే. మమ్! అప్పడప్పుడూ రామ్మా! నీకిష్టమైన బుక్స్ ఇస్తాను. లిటరేచర్ పరిచయం చేస్తాను" అన్నారావిడ!
అడ్డంగా, నిలువుగా తలూపింది జ్ఞాపిక.
బైక్ మీద నోరు విప్పితే ఒట్టు! రేవంత్ పలకరించాలని చూసినా పలకలా!
బైక్ ఆగి, బైకు మీంచి దిగాక- రేవంత్ "బై..." అని కళ్ళతో నవ్వగానే-
చటుక్కున వంగి హ్యాండిల్ మీదున్న అతని గుప్పెటమీద ముద్దుపెట్టి, "బై..." అని కళ్ళల్లోకి చూసి వెళ్లిపోయింది గబగబా! ఆ కళ్ళల్లో నీటిపోర!
అడక్కుండా మొట్టమొదటిసారి అమ్మకాక, మరో స్త్రీ ఇచ్చిన ముద్దు! ప్రేమ సంకేతం! ఉద్వేగపు చిహ్నం! ఆనందపు లహరి! సంతోషపు మధురిమ!... చెప్పలేని భావాల సమూహపు వత్తిడి కలిపి తన గుప్పెట పైన వేసిన లిప్ స్టిక్ చిహ్నానికి ఆర్తిగా తన పెదవులను అద్ది... బైక్ స్టార్ట్ చేశాడు సంతృప్తిగా-
'ఐ లవ్ యూ జ్ఞాపీ!' అనుకుని.
అదే రోడ్డుకు మలుపు దగ్గర నాలుగు కాళ్లు-నాలుగడుగులు ముందుకేసి, నాలుగు కళ్ళు- ఆ బైక్ మలుపు తిరిగేదాకా చూసి, చేతిలోని ప్యాకెట్ చింపి బ్రౌన్ ఘగర్ ని డైరెక్ట్ గా నాలుకపై పోసుకుని, పాము బుస విడిచినట్టు బలమైన శ్వాస వదిలి వెనుదిరిగాయి.
10
జ్ఞాపిక రూమ్ లో కొచ్చేసరికి రేవతి గబగబా ఎదురొచ్చింది.
రేవంత్ చూపించిన అద్భుతానికి- తను బహుమతి ఇచ్చిన ముద్దు తాలూకు ఎమోషన్ ఇంకా తగ్గలేదు జ్ఞాపికలో! ఎదురొచ్చినా రేవతిని దోసిట్లోకి మొహం తీసుకుని గబగబా ముద్దులు పెట్టేసి, తలకు తల ఢీకొట్టి, కామిని పక్కకొచ్చి భుజాలమీద చేతులేసి- "లాల్లలాలా! లాలల్లాలా!" అని ఆనందానికి కారణం తెలీకపోయినా- వాళ్ళు కూడా హుషారుగానే ఎంజాయ్ చేస్తూ-
"వాట్ యార్! ఎనీథింగ్ స్పెషల్...?' కోరస్ గా అడిగారు.
"య్యా! ఇంకనుంచీ ఎవ్విరీథింగ్ ఎ స్పెషల్ మినిట్!" అంది మెల్లగా బాడీ షేక్ చేస్తూ.
"ఏమయిందీ.... ఎందుకు?" అడిగింది స్పూర్తి యంగ్జయిటీ తట్టుకోలేక.
"ఏవవుతుందీ! నేను చెప్పనా! స్ఫూర్తి బైక్ మీదెళ్లి 'ఐస్ క్రీం పట్రావే...' అంటే- పెళ్ళి చేసుకొచ్చింది. జ్ఞాపిక బైక్ మీదెళ్లి మిరపకాయ బజ్జీలు తేకుండా వచ్చి ముద్దులు పెట్టేసి డాన్స్ చేస్తూంది. రేపు కామీ కూడా బైక్ మీదెళ్లి చికెన్ సమోసా తేకుండా అందర్నీ వాటేసుకుంటుంది! నాకే....ఖర్మ- నాకే... బైకూ లేదు, పెళ్ళీలేదు, ముద్దుల్లేవు, వాటేసుకోవడాలూ లేవు. కనీసం ఐస్ క్రీం, బజ్జీలు, సమోసాలు కూడా లేవు!" తలమీద రెండుచేతులూ పెట్టుకుని దిగులుగా కూర్చుంది రేవతి.