Previous Page Next Page 
మిస్టర్ రాంగో పేజి 14

    ఆ విగ్రహాలను, దంతపు మంజూషను వివరంగా పరిశోధించి మరిన్ని విలువైన చారిత్రక వాస్తవాలను తెలుసుకునేందుకు హైద్రాబాద్ లోని పురావస్తు శాఖ కార్యాలయానికి వాటిని తరలించారు.
   
    పరిశోధన పూర్తి కాగానే ఆ విగ్రహాలను ప్రజల సందర్శనార్ధం మ్యూజియమ్ లో ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో ఉన్నారు ప్రభుత్వ అధికారులు.
   
    ఈ సంచలన వార్త గురించి అన్ని దినపత్రికలు, టి.వి....రేడియోలు అధిక ప్రాధాన్యత ఇచ్చి ప్రజలకు తెలియచేయడంతో పోటీపడ్డారు.
   
    అనుకున్న విధంగానే పరిశోధనలు పూర్తి అయ్యాయి.
   
    ప్రొఫెసర్ జయరామ్ అవి గౌతమ బుద్దుని కాలంనాటివే అని నిర్దారించాడు.
   
    సీతారాముల పంచలోహ విగ్రహాలను....గౌతమ బుద్దుని దంతాలున్న పేటికను ప్రజల సందర్శనార్ధం మ్యూజియమ్ లో ఏర్పాటు చేయవలసిన రోజు....రేపే!
   
                                              *    *    *
   
    జాజిబాల కళ్ళల్లో బెదురు.....
   
    అంతకు మించి వణికిపోతున్నాడు రాంగో....
   
    ఒక నిమిషం తరువాత, స్థిరంగా చెప్పింది జాజిబాల.
   
    "వెళ్ళి తలుపు తియ్....!"
   
    రాంగో, అనుమానంగా ఆమె కళ్ళలోకి చూశాడు.
   
    ఇప్పుడు జాజిబాల భయంగా ఉన్నట్టు కనిపించడం లేదు.
   
    "ప్లీజ్ బాలా.....నువ్వెళ్ళి డోర్ ఓపెన్ చేయి...." అభ్యర్ధనగా చెప్పాడతను.
   
    అతని వైపు విస్మయంగా చూస్తూ...."నువ్వు మగాడివి" అన్నది జాజిబాల.
   
    "కావచ్చు....కానీ నాకు భయంగా ఉంది"
   
    అతని భయం అతనిది....సమయం కాని సమయంలో హోటల్ గది తలుపు చప్పుడు కావడం అతనికి అనేక ఆలోచనలకు తావిస్తున్నది.
   
    "కొంపదీసి తన ఆచూకీ గ్రహించి వెన్నెలా ఫైనాన్స్ కంపెనీ ఓనర్ రాజేంద్రప్రసాద్ పోలీసులను తీసుకుని రాలేదు కదా....లేదా....జజైబాల తరపున బంధువులెవరయినా వచ్చి ఉంటారేమో....?"
   
    అతని ఆలోచనలు అలా సాగిపోతూనే ఉన్నాయి....
   
    ఈసారి తలుపు మరింత చప్పుడయింది.
   
    ఆ గదికి కాలింగ్ బెల్ పనిచేయడం లేదన్న విషయం అప్పటికి వాళ్లకు అర్ధమైంది.
   
    సమస్య ఇప్పుడు కాలింగ్ బెల్ గురించి కాదు బయట నుంచి తలుపులు కొడుతున్నది ఎవరు అనేది ముఖ్యం....
   
    "రాంగో....ఏదయితే అది అవుతుంది....వెళ్ళి తలుపు తియ్యి" శాసిస్తున్నట్టు అన్నదామె.
   
    ఆ మాట టెన్షన్ తో చెప్పి క్రింది పెదవిని పై పంటితో నొక్కి పెడుతున్న జాజిబాలవైపు ఒక క్షణం పరిశీలనగా చూసి ఏమి అనలేక వెళ్ళి తలుపు తెరిచాడతను.
   
    అప్పటివరకు తలుపుకొట్టి అలిసిపోయిన హోటల్ మేనేజర్, రిసెప్షనిస్ట్ గదిలోకి వేగంగా దూసుకువచ్చారు.
   
    వాళ్ళను గమనించిన జాజిబాల హృదయం తేలికపడింది.
   
    హోటల్ మేనేజర్ మాత్రం ఇద్దరివైపు మార్చి మార్చి గుర్రుగా చూశాడు.
   
    "మీ ఇద్దరికీ పెళ్ళి కాలేదు కదూ...." అతను వేసిన మొదటి ప్రశ్న అది!
   
    అతని ప్రశ్నలో కొంత వ్యంగ్యమూ ఉన్నది.
   
    రాంగో ఏమీ చెప్పలేదు కానీ అతనివైపు తినేసేలా చూస్తున్నాడు.
   
    అసలు ఆ టైమ్ లో వచ్చి తమను ఇబ్బంది పెడుతున్నదేకాకుండా....ఏదో పెద్ద ఘనకార్యం సాధించినట్టుగా 'మీకు పెళ్ళికాలేదు కదూ!' అని అడుగుతున్న ఆ మేనేజర్ పీక పిసికి చంపెయ్యాలన్నంత కోపం వచ్చిందతనికి.
   
    జాజిబాల మాత్రం సిగ్గుతో తలొంచుకు నిలుచున్నది.
   
    "మరి కాసేప్పటిలో పోలీసులు ఈ హోటల్ ను రెయిడ్ చేయడానికి వస్తున్నట్టు సమాచారం అందింది. హోటల్ అంతా గాలిస్తే మీలాంటివి రెండు జంటలు బయటపడ్డాయి. మీరు మరీ టీనేజ్ లవర్స్ లా వున్నారు. మిమ్మల్ని ఇలాచూస్తే మాత్రం బ్రోతల్ కేసు క్రింద లాక్కెళ్ళిపోతారు. మిమ్మల్ని చూస్తుంటే పరువు కలిగిన కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళలాగే కనిపిస్తున్నారు కాబట్టి. ముందుగా చెబుదామని వచ్చాను...." అన్నాడు హోటల్ మేనేజర్.
   
    పోలీసుల మాట ఎత్తేసరికి ఇద్దరి ముఖాలు పాలిపోయాయి.
   
    "నిజం చెప్పడం మీకే మంచిది..."
   
    "పెళ్ళి కాలేదన్నమాటే కానీ.... పెళ్ళి చేసుకోవడానికే తిరుపతి వెళుతున్నాం.....రిజర్వేషన్ దొరకక ఇలా హోటల్ గది తీసుకోవాల్సి వచ్చింది...."అప్పటికప్పుడు ఆలోచించి చెప్పింది జాజిబాల.
   
    ఆడపిల్ల అయినా అంత ధైర్యంగా ఉన్నది ఉన్నట్టు చెప్పినందుకు ముచ్చటపడ్డాడు మేనేజర్.
   
    "మిమ్మల్ని నేను నమ్ముతాను.... కానీ పోలీసులు మిమ్మల్ని అర్ధం చేసుకోకపోగా, మీపై కేసు పెట్టడానికే ప్రయత్నిస్తారు....."
   
    "అవును సార్...అందుకే మీరే ఏదో ఒకటి ఆలోచించి మమ్మల్ని ఈ గండం నుంచి గట్టెక్కించండి....మీకు ఇలాంటివి మామూలే కాబట్టి మీరు ఎలా చెబితే అలా చేస్తాం...." దీనంగా అభ్యర్ధించాడు రాంగో.
   
    మేనేజర్ ఆలోచనలో పడిపోయాడు.
   
    వెంటనే అభయహస్తం ఇవ్వకుండా సీరియస్ గా ఆలోచిస్తున్న మేనేజర్ ను చూస్తుంటే రాంగోకు తిక్కకోపం పుట్టుకొచ్చింది. అయినా తమాయించుకుంటున్నాడు....అవసరం తమది అన్న విషయం గుర్తొచ్చిందతనికి.
   
    రెండు నిమిషాల తరువాత రిసెప్షనిస్ట్ చెవిలో ఏదో చెప్పిపంపించాడు మేనేజర్.
   
    వాచీకేసి టైమ్ చూసుకుంటూ తిరిగి అడిగాడతను....

 Previous Page Next Page