"ఫర్వాలేదు..." అతని ప్రక్కనే చోటు చేసుకుంటూ అన్నది జాజిబాల.
"ఆకలి వేయడం లేదూ ...." ఆమె బుగ్గలను ముద్దాడుతూ అడిగాడతను.
"ఎందుకూ వెయ్యడంలేదూ...."
"అయితే టిఫిన్ తెప్పిస్తాను. ఈలోపు నువ్వు ముఖం కడుక్కుని స్నానంచేసి రావోయ్..." అంటూ బడలికగా బెడ్ పై వెనక్కు వాలాడు.
సూట్ కేసు తెరిచి టవల్ తీసుకుని బాత్ రూమ్ వైపు నడిచింది జాజిబాల....
చాలాసేపు అలాగే పడుకుని ఆలోచిస్తుండిపోయిన రాంగో....టిఫిన్ విషయం గుర్తొచ్చి బోయ్ ని పిలిచి టిఫిన్ కు ఆర్డర్ ఇచ్చాడు.
ఒక గంట తరువాత....
ఇద్దరూ టిఫిన్.....టీలు తీసుకున్నారు.
"ఏమయినా మాట్టాడు" అన్నాడు రాంగో.
"ఏం మాట్లాడేది?"
"ఏదో ఒకటి...."
ఆమె కాస్సేపు ఆలోచించిన తరువాత.....
"నువ్వు అన్ని విషయాలు ఆలోచించుకునే ఇక్కడకు తీసుకు వచ్చావా?"
"అవును...." అంటూ జాజిబాలకు దగ్గరగా జరిగాడు రాంగో.
వెన్నెలలాంటి శరీరం మీద మెత్తగా జారిపోతున్న వైట్ కలర్ పైట....నుదుటిమీద పడుతున్న అల్లరి జుట్టు, ప్రేమ వెలుగు నింపుతున్న చిన్న కళ్ళు....
ఒక్కసారైనా ఆమె అందమైన కంఠాన్ని స్పర్శించి తరిద్దామని అతడు ముందుకు వంగి ముద్దు పెట్టుకోబోయాడు.
సరిగ్గా అదే సమయంలో బైట తలుపుమీద చప్పుడయింది.
అప్రయత్నంగా వాళ్ళిద్దరూ విడిపోయారు.
ఇద్దరి కళ్ళల్లోనూ బెదురు....
* * *
ఈ సంఘటన జరగటానికి సరిగ్గా పదిరోజుల క్రితం....ఒక అరుదైన సంఘటన!
ఆంధ్రప్రదేశ్ ఆర్కియాలజీ డిపార్ట్ మెంట్ వారికి దిగ్బ్రమ కలిగించే సంఘటన అనూహ్యమైన రీతిలో వెలుగులోకి వచ్చింది.
కడపజిల్లా లింగాల మండలంలో గల కుందేలు చెర్లోపల్లి గ్రామం వద్ద కొంతమంది వేటగాళ్ళు గతంలో మాదిరే ఒకరోజు వేటకు బయలుదేరారు.
ముళ్ళపంది వారిని చూసి బెదిరి పారిపోవడంతో....పట్టుదలతో వెంబడించారు. ప్రాణ రక్షణకోసం చెట్లకు, పుట్లకు అడ్డంపడి పరుగుదీస్తూ కనిపించిన ఒక కొండబొరియలోకి యాధ్రుచ్చికంగా దూరింది ఆ మూగజీవి'
అప్పటికే రాత్రి సమయం కావడంవల్ల అ పూటకు వేట చాలించి....దాని సంగతి రేపు చూడవచ్చులే అని భావించి ఆ ముళ్ళపంది బయటకు వచ్చే వీలు లేకుండా పెద్ద రాయిని అడ్డంపెట్టి వెళ్ళిపోయారు.
మరుసటిరోజు....
ఆ కొండరాయిని అడ్డం తీసి....ఆ బొరియను పలుగులతో వెడల్పు చేసి లోపలకు ప్రవేశించారు.
ఆశ్చర్యం....!
అది బొరియకాదు....!
అక్కడ ఉన్నది సొరంగం అని తెలియడంతో ఆశ్చర్యంతో తల మునకలైపోయారు.
ఆ అడవి ముళ్ళపంది ఏమైందో తెలియదు కానీ, దానితోపాటు మరొక నాలుగు సొరంగ మార్గాలు వున్నాయి....కానీ అవి దుర్భేద్యంగా వుండడంవలన ఎవరూ ముందుకు వెళ్ళలేకపోయారు.
ఈ వార్త జనంలో వ్యాపించడంతో ఆ సొరంగాన్ని చూడడానికి జనం తండోపతండాలుగా వస్తున్నారు....ఆ నోటా, ఈ నోటా ఈ వార్త ప్రాకిపోయి చివరకు ప్రభుత్వాధికారులకు చేరింది.
ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి హైదరాబాద్ పురావస్తుశాఖ అధికారులు రంగప్రవేశం చేశారు.
పురావస్తుశాఖ పరిశోధనాధికారి ప్రొఫెసర్ జయరామ్. అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రేమ్ నాథ్ మరో అసిస్టెంట్ మల్లికా\ పర్యవేక్షణలో పురావస్తుశాఖ బృందం ఆ బిలంలో రేయింబవళ్ళు త్రవ్వకాలు జరిపారు.
విచిత్రాతి చిత్రంగా ఆ బిలంలో అత్యంత పురాతన మట్టి పాత్రలు, కూజాలు, గంధం చెక్కలు....రాతి పనిముట్లు - మట్టినూనె దీపాలు దొరికాయి....
ఎంతో అనుభవం ఉన్న ఆర్కియాలజిస్టు జయరామ్.....ఆ వస్తువులు బుద్దుని కాలంనాటివిగా గుర్తించాడు.
అంతకన్నా ఆశ్చర్యకరమైన సంచలన విషయం ఏమిటంటే కొన్ని వందల సంవత్సరాలనాటి సీతారాముల పంచలోహ విగ్రహాలు బయటపడ్డాయి.
దాంతోబాటు ఒక దంతపు పెట్టెకూడా దొరికింది.
ఆ కాలంలో ఎవరో భూస్థాపీతం చేసిందిగా భావించిన ఆ దంతపు పెట్టెలోని వస్తువులు చూసి మరింత ఆశ్చర్యపోయారు.
బౌద్దకాలం నాటి వస్తువులతోపాటు ఒక చిన్న భరిణెలో మనిషి దంతాలు భద్రపరచి ఉన్నాయి. వాటిని చూడగానే అవి గౌతమ బుద్దుడు ఉపయోగించిన వస్తువులనీ....బహుశా చిన్న భరిణెలో ఉన్నవి గౌతమ బుద్దునివిగాని అతని శిష్యులలో ఎవరో ఒకరి దంతాలు అయి ఉండవచ్చుననీ ఊహించాడు ప్రొఫెసర్ జయరామ్.
ఆ దంతపు మంజూషను మరింత వివరంగా పరిశోధిస్తే తప్ప వాస్తవాలు వెలుగులోకి రావని తెలియచేశారాయన.
ప్రొఫెసర్ జయరామ్ ఆధ్వర్యంలో సాగిన ప్రాథమిక పరిశీలనలో ఆ పంచ లోహ విగ్రహాల ఖరీదు సుమారు పది కోట్ల రూపాయలుగా అంచనా వేశారు. వాటిలో అంత విలువచేసే బంగారంకన్నా ముఖ్యమైనది వాటి ప్రాచీనత.