Previous Page Next Page 
మిస్టర్ రాంగో పేజి 15

    "ఏం చేద్దామంటారు? చెప్పండి...."
   
    "మళ్ళీ మొదటికొచ్చారా? మీరే ఏదో ఒక విధంగా కాపాడండి...."
   
    ఈసారి రాంగోకు నిజంగా విసుగొచ్చింది.
   
    "ఒక వెయ్యి రూపాయలున్నాయా..."
   
    జాజిబాలకు అప్పుడర్ధమయింది....పరిస్థితి డబ్బుతో ఎడ్జెస్ట్ అవుతుందని!
   
    గబగబా వెళ్ళి తన వానిటీ బాగ్ తెరచి వెయ్యిరూపాయలు లెక్కపెట్టి మేనేజర్ చేతిలో వుంచిందామె.
   
    సరిగ్గా అప్పుడే వచ్చాడు రిసెప్షనిస్ట్....
   
    అతని దగ్గర్నుండి ఏదో వస్తువు తీసుకున్నాడు మేనేజర్.
   
    "మిస్టర్..... ఈ క్షణం నుంచి మీరు భార్యాభర్తలు అంతే.... అందుకు సాక్ష్యం నేనే....కాదని ఎవరూ అనలేరు...." అని, తన చేతిలోని వస్తువుని రాంగోకు ఇచ్చి వెళ్ళిపోయాడతను.
   
    మేనేజర్ వెనుకనే ముసిముసిగా నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు రిసెప్షనిస్ట్....
   
    తన చేతిలోని వస్తువువైపు విభ్రమంగా చూస్తున్నాడు రాంగో....
   
    జాజిబాల ముందుకు నడిచి అతని గుప్పిట తెరచి చూసింది.
   
    మంగళ సూత్రం....రెడీమేడ్ మంగళసూత్రం.....భార్యాభర్తలన్న ప్రతి జంటకూ తప్పనిసరిగా వుండే ఏకైక సాక్ష్యం....
   
    జజైబాల అప్పటికే ఒక నిర్ణయానికి వచ్చింది.
   
    "ఏమిటలా వెర్రిచూపులు చూస్తావ్....ముందు నా మెడలో ఆ తాళి కట్టు".
   
    రాంగో యాంత్రికంగా......మరమనిషిలా కదిలాడు.
   
    జాజిబాల మెడలో మూడుముళ్ళు వేశాడు రాంగో.
   
    సరిగ్గా అప్పుడే.
   
    పోలీస్ జీప్ ఆ హోటల్ ఆవరణలో ఆగింది....
   
                                              *    *    *

   
    హైదరాబాద్ రోడ్లపై మెత్తగా జారిపోతున్నది హీరోహోండా!
   
    అలవాటైన రూట్ లో సాఫ్ట్ గానే డ్రయివ్ చేస్తున్నా.....ఆర్కియాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రేమనాథ్ ఆలోచనలు వేడిగానే వున్నాయి.
   
    గత పది రోజులనుంచీ ఒకటే టెన్షన్!
   
    సీతారాముల పంచలోహ విగ్రహాలు దొరకడం....బుద్దుని దంతపు మంజూష దొరకడం...వాటి చరిత్ర గురించిన ఫుట్ నోట్ రేయింబవళ్ళూ తయారుచేసి ఢిల్లీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్ మెంటుకు....హైదరాబాద్ రీజనల్ ఆఫీస్ కూ....ససబ్ మిట్ చేయడం.
   
    ఇదంతా ఒక ఎత్తు అయితే రేపు ఆ ఖరీదయిన విగ్రహాలను ప్రజల సందర్శనార్ధం మ్యూజియంలో ఏర్పాటు చేయించే అరేంజ్ మెంట్స్ దగ్గరుండి పర్యవేక్షించాలి.
   
    ప్రొఫెసర్ జయరామ్ ఈ విషయంలో చాలా హాపీగా వున్నాడు.
   
    ఇంత తక్కువ సర్వీస్ లోనే ఆయన గైడెన్స్ లో ప్రతిష్ఠాతరమైన పరిశోధనలు జరగడం ఆయనకు తప్పనిసరిగా పేరును తెచ్చిపెడతాయి.
   
    ప్రేమనాథ్ మనసులో మరో అసిస్టెంట్ మల్లికా మెదిలింది.
   
    అతని పెదవులపై అప్రయత్నంగా చిరునవ్వు ప్రత్యక్షమయింది.
   
    మల్లిక....కేవలం తనతో పనిచేసే అసిస్టెంట్ ప్రొఫెసర్ మాత్రమే కాదు. తన ప్రతి విజయం వెనుకా, అహర్నిశలూ చేసే ప్రతి కృషి వెనుకా ఆమె సహాయం, ప్రోత్సాహం వుంది.
   
    గత నాలుగేళ్ళుగా ఒకరంటే ఒకరు ఇష్టపడుతున్నా ఇంతవరకూ పెళ్ళి ప్రస్తావన ఎవరూ తేలేదు.... ఇరువైపులా ఎవరికీ ఏ ఇబ్బందీ లేకపోయినా, కొంతకాలంపాటు స్నేహితులుగా మెలగాలి అనే అభిప్రాయమే వాళ్ళ బంధాన్ని పవిత్రంగా వుంచగలిగింది.
   
    జీవితంలో ప్రత్యేకమైన గుర్తింపు పొందాలనే తమ లక్ష్యం నెరవేరింది.
   
    ఇక ఆగవలసిన పనిలేదు.
   
    తమ పెళ్ళి గురించి మల్లికవైపు పెద్దవాళ్ళకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే సరిపోతుంది....
   
    ప్రేమనాథ్ ఆలోచనలు ఒక కొలిక్కి రాకముందే అతని హీరోహోండా ఆర్కియాలజీ డిపార్ట్ మెంట్ ఆవరణలోకి ప్రవేశించింది.
   
    సరిగ్గా హోండా స్టాండ్ వేసి ఆఫీసు మెట్ల మీదకు వచ్చేసరికి డ్యాష్ ఇస్తున్నంత వేగంగా స్టాఫ్ బయటకు పరుగుదీసుకుంటూ ఎదురొచ్చారు.
   
    వాళ్ళలో మల్లిక కూడా వున్నది.
   
    "వాట్ హాపెండ్?" ప్రేమ్ నాథ్ ఆతృతగా ప్రశ్నించాడు.
   
    అప్పుడే అతన్ని చూసిన మల్లిక...." ప్రొఫెసర్....ప్రొఫెసర్" అంటూ ఆపై మాటలు పెగలలేదు ఆమెకు.
   
    గడగడా వణికిపోతోందామె.
   
    కర్చీఫ్ తో ముఖానికి పట్టిన స్నేదాన్ని అద్దుకుంది మల్లిక.
   
    "ఏమైంది ప్రొఫెసర్ గారికి?" ఈసారి స్టాఫ్ ను అడిగాడు.
   
    "జయరామ్ గారికి హార్ట్ ఎటాక్ వచ్చింది. గిలగిల్లాడిపోతున్నారు."
   
    "ఓహ్....గాడ్...."
   
    అప్పటికే అంబులెన్స్ వచ్చి ఆగింది.
   
    నిస్సత్తువగా వాలిపోయి వున్న ప్రొఫెసర్ జయరామ్ నీ చేతుల మీద పట్టి తెచ్చి అంబులెన్స్ లోకి ఎక్కించారు స్టాఫ్.
   
    వ్యాన్ బయలుదేరింది.
   
    హీరో హోండాపై మల్లికను ఎక్కించుకుని వాన్ ను ఫాలో అయ్యాడు ప్రేమ్ నాథ్.
   
    వాళ్ళటు వెళ్ళగానే.....ఇద్దరు వ్యక్తులు ఆ ప్రాంతానికి వచ్చి అరగంటసేపు క్షున్నంగా పరిశీలించడంలో మునిగిపోయారు.
   
                                            *    *    *
   
    ఇన్ స్పెక్టర్ అన్వేష్ జీప్ దిగిన వెంటనే హోటల్ లోకి పరుగుదీశాడు పోలీసు సిబ్బంది ఆ హోటల్ మొత్తాన్ని చుట్టుముట్టింది.
   
    "ఏమిటి సార్.... ఈ హడావుడి?" ఎదురొచ్చిన హోటల్ మేనేజర్ అనుమానంగా అడిగాడు.

 Previous Page Next Page