"ఇలాంటి కేసుల్లో న్యాయస్థానాలను ఆశ్రయించడం కంటే నలుగురిని సమీకరించి వాళ్ళ సహకారంతో న్యాయపోరాటం చేయడం సబబంటారు మౌనపోరాటం సినిమాలో చూపలేదూ? అలాగ!"
"ఒక చెడిన పిల్లకు సపోర్ట్ ఇచ్చేవాళ్లు ఎవరుంటారు లెండి. అవన్నీ లేనిపోని ఆలోచనలు. అసలీ దేశంలో ఎవరి సమస్యలు వాళ్ళకు వున్నాయి. ఎవరికెవరూ కారు."
"మరీ అంత నిరాశావాదం పనికిరాదండీ! స్త్రీ శక్తి సంఘటితమైనప్పుడు ఈ ప్రపంచంలో జరుగని పనులంటూ వున్నాయా? ఏదైనా అనుకొని చూడాలి గాని ఏమీ అనుకోకుండా ఏదీ జరుగదనడం తప్పు!"
"ఇంత జరిగాక ఆమె ఏ ముఖం పెట్టుకొని బ్రతుకుతుంది లెండి. బ్రతికినా ఈ సమాజం ఆమెను మనశ్శాంతిగా బ్రతకనిస్తుందా? ఆత్మహత్య చేసుకొని ఎదురుకాబోయే బాధలన్నిటి నుండి ఒక్కసారిగా విముక్తి పొందింది."
కరుణ దారుణమైన చావు కళ్ళముందు ప్రతిక్షణం కదులుతుంటే పృధ్వీ పట్ల ప్రతీకారేచ్ఛతో రగిలిపోయింది విశిష్ట.
"ఎలా అతడికి గుణపాఠం నేర్పాలి" నిరంతరం ఇదే ఆలోచన.
అతడితో పెట్టుకోవడమంటే పులిబోనులో తల దూర్చడమేనని తనకు తెలుసు అయినాసరే! తనేమైనా సరే అతడికి గుణపాఠం నేర్పాలి. ఆడపిల్లలను ఆటబొమ్మలను చేసి ఆడుకొనే అతడిని ఆడపిల్లలకేసి కన్నెత్తి చూడకుండా చేయాలి!
* * *
'అతివలూ, అత్యాచారాలు' సుభాషిణి వ్రాసిన నవలమీద హాట్ హాట్ గా చర్చలు జరుగుతోందక్కడ.
".....ఆడదాన్ని అబలగా పుట్టిస్తూనే ఆయుధాలను ఇచ్చాడు దేవుడు అపర కీచకుల నుండి తనను తాను రక్షించుకోవడానికి. అవి నఖాలూ, దంతాలూ..... స్త్రీకి దేవుడిచ్చిన వరప్రసాదాలు అవి. వాటితో ఎలాంటి మగాడినైనా ఎదుర్కోవచ్చు" అన్నాడు తెలుగు రీడర్ సుబ్బరాయశర్మ. "ఇది నేను కాదు చెప్పింది ఏనాడో మన గాంధీగారు సెలవిచ్చారు."
"అవే నఖాలూ, దంతాలూ మగాడికి ఇచ్చాడా దేవుడు. వాటినే ఆయుధాలుగా ఉపయోగించి తను మనసు పడ్డ ఆడదాన్ని లొంగదీసుకోవచ్చు కదా మగాడు?" కొంటెగా కన్నుకొట్టి అన్నాడు కృష్ణవంశీ.
"కో- ఎడ్యుకేషన్ కాలేజీలో ఆడవాళ్ళు చదవాలన్నా కష్టమే. ఉద్యోగం చేయాలన్నా కష్టమేనండీ. ఈ కాలేజీకి ట్రాన్స్ ఫరై వచ్చాక నా మట్టుకు నాకు ఎన్నో చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ఉద్యోగం వదిలేసిపోతే బాగుండుననిపించిన సందర్భాలున్నాయి. మగాళ్ళరూపంలో నక్కలూ, తోడేళ్లూ, డేగలూ వున్నంతవరకు గంప క్రింద కోడిపిల్లలా ఆడది ఇంటి పట్టునుండడమే క్షేమకరమని నా ఉద్దేశ్యం. బయటికి వస్తే ఏ డేగ కాళ్ళ క్రింద కోడిపిల్ల అవుతుందో , ఏ తోడేలు కోరలమధ్య కుందేలు పిల్ల అవుతుందో తెలియదు!" అంది సుభాషిణి.
"మనం పురోగమిస్తున్నామా? తిరోగమిస్తున్నామా మేడమ్?" విశిష్ట ఆవేశంగా అడిగింది.
"పురోగమిస్తున్నాం అన్న భ్రమలో మనం ముందున్న గోతులను చూసుకోకుండా పడిపోతున్నామేమోనని నా బాధ!"
"ఏదో గోతిలో పడ్డట్టే వుందే సుభాషిణిగారు. లేకపోతే ఇలా బాధ పడరు" సుభాషిణికేసి అదోలా చూస్తూ అన్నాడు మరో లెక్చరర్ భీంరావు.
"నేను గోతిలో పడలేదు. గోతిలోకి లాగే ప్రయత్నాలు మాత్రం బలంగా జరుగుతున్నాయి" కోపమో. బాధో ఆమె ముక్కుపుటాలు అదరసాగాయి.
"ఇంతకీ ఆ మగ తోడేలు ఎవరో?" మరొక నారదముని కనుబొమ్మలు అదోలా కదిలాయి.
"ఈ వృద్ధకన్య కోసం ఎవరు ట్రై చేస్తారులే! అదంతా ఆవిడ భ్రమ. అందరూ తననే చూస్తున్నారని, అందరూ తనకోసమే పడిచస్తున్నారని!" అక్కడే వున్న పృధ్వీ గొంతు తగ్గించి అన్నాడు.
"చెప్పేరోజు వచ్చినప్పుడు తప్పక చెబుతాను. వూరికే కాదు పది మంది ముందు చెప్పి చెప్పిడిచి కొడతాను" కసిగా అంది సుభాషిణి.
"కాని సుభాషిణిగారూ........!" సుబ్బరాయశర్మ మొదలుపెట్టాడు "ఈ మగాళ్ళు వూరికే అలా తోకాడిస్తారు. ఆడది ఇష్టపడనంతవరకు ఏ మగాడూ ఏమీ చేయలేడు ఇష్టపూర్తిగానో, బలవంతంగానో లొంగిపోతే తప్ప మగాడు ఏ ఆడదానిమీద ఆధిపత్యం సంపాదించలేడని నా ఉద్దేస్యం. అది మాత్రం ష్యూర్" తన తొడనే బల్ల అన్నట్లుగా వాయిస్తూ అన్నాడు.
"ఎంత దారుణంగా మాట్లాడుతున్నారండీ? ఆడవాళ్ళమీద జరిగే అత్యాచారాలన్నీ వాళ్ళ ఇష్టంమీదనే జరుగుతున్నాయంటారా?" కోపంగా అడిగింది సుభాషిణి.
"లొంగితే తప్ప లొంగని ఆడదాన్ని ఏ మగాడూ ఏమీ చెయ్యలేడని చెప్పాగాని యిష్టంతో లొంగుతున్నారని చెప్పానా?"
"లొంగడం వేరు! లొంగదీసుకోవడం వేరు. ఆ తేడా గుర్తించాలి మీరు!"
"అక్కడే వుందికదండీ! సృష్టి రహస్యం?" కృష్ణవంశీ అందుకొన్నాడు. "ఫస్ట్ నైట్ గదిలోకి అడుగుపెట్టిన నవవధువుసైతం భర్త ఒడిలో తనకు తానుగా వాలిపోదు! అక్కడా మగాడే ముందడుగు వేస్తాడు. ఆమె చేతుల్ని సున్నితంగా అందుకొని పాన్పు దగ్గరికి నడిపించి, లాలించి, బుజ్జగించి ఎంతో అవస్థపడితే తప్ప ఆమెలో సిగ్గుపొరలు తొలగవు. కన్నె మధువును ఆస్వాదించాలంటే మగాడే చొరవ చూపాలి..........అటు చూడండి మేడమ్! పెట్టకోసం పుంజు ఎలా అవస్థ పడుతోందో?"
పరువానికి వచ్చిన పెట్ట, కూతకొచ్చిన పుంజు! ఆత్రంగా మీద పడబోతున్న పుంజు నుండి తప్పుకుపోతోంది పెట్ట. అలుపెరుగకుండా పెట్ట వెనుక పరుగెడుతోంది పుంజు. అసలే ఎర్రగా వున్న కళ్ళు మరింత ఎర్రబడిపోతున్నాయి. చెట్లచుట్టూ తిప్పి తిప్పి ముప్పతిప్పలు పెడుతోంది పెట్ట.
అందరి దృష్టి అటే కేంద్రీకృతమైంది.
మగవాళ్ళు నిర్లజ్జగా, ఒక రసవత్తర సన్నివేశం చూస్తున్నట్టుగా చూస్తుంటే ఆడవాళ్ళు సిగ్గుపడుతూ చూసీ చూడనట్టుగా చూస్తున్నారు.
పరిగెత్తలేక అలసిపోయినట్టుగా వున్న పెట్టమీదికి లంఘించి ఇంత సేపు సతాయించిందన్న కసితో పెట్ట జుట్టు తన ముక్కుతో పట్టి పొడుస్తూ పొడుస్తూ...... పెట్టను పుంజు ఆక్రమించుకొంటున్న ఆ సన్నివేశాన్ని జన్మ తరించినట్లుగా చూశారు మగవాళ్ళు.