Previous Page Next Page 
విశిష్ట పేజి 13

    విద్యార్ధులు కోపావేశాలతో రువ్విన రాళ్ళు ఒకటి రెండు కారు వెనుకవైపు తాకి క్రిందపడ్డాయి.

    "బ్రూట్! పారిపోయాడు!" కసిగా పళ్ళు కొరికారు.

                                         *    *    *

    కరుణ మిగిల్చిన విషాదం నుండి తేరుకోవడానికి చాలా రోజులే పట్టింది అందరికీ.

    ఇంత దారుణం జరిగినా పృధ్విని పోలీసులు అరెస్టు చేయలేదు.

    స్టూడెంట్స్, లెక్చరర్స్, కలిసి కంప్లైంట్స్ ఇచ్చినా అతడి మీద కేసు నమోదు చేయలేదు.

    కొందరు అబ్బాయిలు పోలీస్ స్టేషన్ కి వెళ్ళి పృధ్విని అరెస్ట్ చేయాలని గొడవచేసే సరికి, "ఏరా? ఆ పిల్ల కడుపుకి నువ్వే కారణమట కదా? ఈడ్చుకెళ్ళి బొక్కలో తోసి తోమమంటావా?" అన్నాడు అక్కడున్న ఎస్సై ఆగ్రహంతో కళ్ళెర్రచేసి.

    భయంతో వెనక్కి తగ్గక తప్పలేదు వాళ్ళకి.

    కరుణ పోస్టు చేశానన్న లెటరు ఎవరికీ చేరిందీ, ఎక్కడ మాయమైందీ తెలియదు. అది చిరునామా దారుని చేరకముందే పోలీసులు మాయం చేసి వుంటారని చెప్పుకొన్నారందరూ.

    విశిష్ట మాత్రం అతడికి ఎలాగైనా శిక్షపడేలా చేయాలని, అలాగైతేనే కరుణ ఆత్మకు శాంతి చేకూరుతుందని ఆవేశపడింది.

    కాని సుబ్బరాయశర్మ, మరికొందరు వారించారు.

    "వాడు హోం మినిష్టరు కొడుకు. వాడితో పెట్టుకొని లేనిపోని చిక్కులు తెచ్చుకోవద్దు. చట్టాన్ని రక్షించాల్సిన పోలీసులే వాడి బాబుతొత్తులయ్యాక నువ్వు న్యాయం కోసం ఎక్కడ పోరాడగలవు? జరిగిన అన్యాయం ఎలాగూ జరిగింది. ఇప్పుడు ఏం చేసినా కరుణ బ్రతికిరాదు కదా?"

    కేసు పెట్టడానికి కరుణ తల్లి దండ్రులు కూడా అంగీకరించలేదు.

    "ఇంత కళంకాన్ని మా ముఖాల మీద పులినిపోయిన దాని గురించి ఇంకా ఏం కేసు పెట్టమంటారు.

    ఇప్పటికే సిగ్గుతో చచ్చిపోతున్నాం. మా బంగారం మంచిది కానందుకే ఇలా జరిగింది. ఒకరినని ఏం లాభం.......?" అన్నారు వాళ్ళు ఉదాశీనంగా.

    కరుణ ఆత్మహత్య చేసుకోవడంవల్ల నలుగురూ నాలుగు రకాలుగా వ్యాఖ్యానించసాగారు. ఎవరి ఆలోచనా దృక్పధాన్ని బట్టి వాళ్ళు మాట్లాడారు.

    "పిచ్చిది! ఆత్మహత్య చేసుకొని ఎవరిని సాధించింది? తన నోట్లో మన్ను పోసుకుని తనే పోయింది. కన్నవాళ్ళకి కడుపుశోకం మిగిల్చింది. వచ్చిన కళంకం ఎలాగూ వచ్చింది. బ్రతికి సాధించాల్సిన మాట! తనని మోసగించిన వాడిని న్యాయస్థానంలో నిలబెట్టి శిక్షపడేలా చేయవలసిన మాట. అలా చేయకుండా తనని తనే శిక్షించుకోవడం ఏం తెలివైన పని? ఆ దుర్మార్గుడు నిక్షేపంగా కాలర్ ఎగరేసుకు తిరుగుతున్నాడు కదా?"

    "న్యాయస్థానాల్లో న్యాయం అంత సులభంగా దొరుకుతుందా ఏమిటి మనిషికి? అదీ ఆడపిల్ల తన శీలాన్ని పోగొట్టుకొని బోనెక్కితే క్రాస్ ఎగ్జామినేషన్ పేరుతో మాటలతోనే మానభంగం చేసినంతపని చేస్తారు కదా ఈ లాయర్లు నిన్నతడు అనుభవించాడనడానికి సాక్ష్యం ఏమిటి అంటారు. ఎక్కడో ఏకాంతంలో జరిగే సృష్టి కార్యానికి సాక్షులుండరని ఆ తెలివిమాలిన లాయర్లకి తట్టదు. అతడి వల్లే నువ్వు గర్భవతివయ్యావనడానికి సాక్ష్యం ఏమిటి అంటారు. సెక్స్ విషయం వచ్చేసరికి మనిషి వింత మృగమైపోతాడు. ఎక్కడ లేని ఆసక్తీ, వెకిలితనమూ! సరే -అన్నీ భరించి ధైర్యంగా న్యాయపోరాటానికి దిగితే ఇంట్లో, బయటా ఆమెకు ఎంతవరకు సపోర్ట్ లభిస్తుందన్నది మనం ఆలోచించాలి. చెడిపోయిందే కాక వీధి కెక్కుతానంటే ఏ తల్లి దండ్రులు ఒప్పుకుంటారు? ఇంట్లో వాళ్ళే సహకరించనప్పుడు బయటి వాళ్ళేం సహకరిస్తారు? నాలుగు రాళ్ళు మీద వెయ్యమంటే వేస్తారుగాని!"     

 Previous Page Next Page