Previous Page Next Page 
విశిష్ట పేజి 15

    నిర్లిప్తంగా ముఖం త్రిప్పుకొన్న సుబ్బరాయశర్మ అన్నాడు "ఆడది ఇష్టపడినప్పుడు మగవాడు చొరవ చూపితే బాగుంటుందిగాని లేకపోతే అంతకంటే జుగుప్సాకరమైన విషయం మరొకటుండదు"

    కాని ఇష్టంలేని ఆడదాన్ని ఇష్టపడేట్టు చేసుకోవడంలోనే మగవాడి మగతనం వుందని నా ఉద్దేశ్యం!"

    ఆ మాటలు వినిపించిన వైపు తృళ్ళి పడ్డట్టుగా చూసింది విశిష్ట.

    అందగాడు, కొంచెం ముదిరిన బ్రహ్మచారి అయిన పృధ్వీ.

    అందగాడు కాదని ఏ ఆడపిల్లయినా ఆకర్షణలో పడితే వాళ్ళపాలిట అతడు దీపమైపోతాడు. వాళ్ళు శాలభాలుగా మాడిపోతారు.

    అలా మాడిపోయిన కరుణ ఆమె చావు ఇంకా కళ్ళముందు మెదులుతూనే వుంది.

    అంత పబ్లిగ్గా ఆమె చావు సంభవించినా, అతడిమీద ఈగ కూడా వాలలేకపోయింది అతడి తండ్రి హోంమినిష్టర్ కావడంవల్ల . ఇంకొకరైనా అయితే ఈ పాటికి ఉద్యోగం వూడిపోయి జైలు ఊచలు లెక్కబెడుతుండేవాళ్ళు.

    పృధ్వీ మాటలకు సరదాగా నవ్వేస్తూ అన్నాడు కృష్ణవంశీ "అదృష్టవంతుడివి. మధువనితో స్వేచ్చగా తిరిగే మధుపం లాంటివాడివి. మాలాగా పెళ్ళి అన్న సంకెళ్ళు పడలేదుగా? రోజుకో రుచి చూడొచ్చు. నిన్ను చూస్తుంటే భలే ఈర్ష్యగా వుందోయ్ నాకు."

    "ఈర్ష్య దేనికి వంశీ మాస్టారూ! ఎక్కడో తలుపుచాటునుండి మాంగల్యాలు కళ్ళకద్దుకొంటూ వుందే మీ భార్యామణి మీరు బయట చాటు మాటు వ్యవహారాలు సాగిస్తుంటే చూడొస్తుందా? మనిషికి గుండె వుంటే చాలదండీ! గుండెధైర్యం కూడా వుండాలి" అన్నాడు పృధ్వీ.

    "మనిషికి నిజంగా వుండాల్సింది గుండెధైర్యం కాదు! నీతి! 'నాతి చరామి' అని ఒక స్త్రీ చెయ్యి అందుకున్నాక బయటికొచ్చి చూడబోదు కదాని చాటుమాటు వ్యవహారాలు సాగించడం అధర్మమూ. నీకు నా సలహా ఏమిటంటే పెళ్ళి కాలేదుకదాని మన్మధరాజ్యం నీదేననుకోకు. విశృంఖల శృంగారమెప్పుడూ విషాదాంతమౌతుంది. ఎప్పుడో, ఎవరిదో ఉసురు నీకు కొడుతుంది."

    "చాతగాకపోతే నేనూ మాట్లాడతాను ఎన్నైనా సుభాషితాలు!"

    శర్మ దెబ్బతిన్నట్టుగా చూశాడు. "పదేళ్ళక్రితం నువ్వు స్టూడెంట్ వన్న విషయం నీకు గుర్తుండే వుంటుంది పృధ్వీ! గురువుకు శిష్యుడు కొడుకుతో సమానం. ఆ వాత్సల్యంతో చెబుతున్నాను. కరుణ పట్ల నువ్వు చేసిన పని ఎంతమాత్రం మంచిదికాదు. చట్టం నిన్ను దోషిగా పట్టుకోలేక పోయి వుండొచ్చు అది వేరే విషయం. ఆ అమ్మాయిని వివాహం చేసుకోవడం యిష్టంలేనప్పుడు ఆమెను పడక వరకూ ఎందుకు నడిపించావు? ఆమెను గర్భవతిని ఎందుకు చేశావు? అమాయకంగా నిన్నే ప్రేమించి , నమ్మి నీకు తనను అర్పించుకొన్న అమ్మాయికి నువ్వు ఇచ్చిన బహుమానం మృత్యువు. ఆమెను కన్నవాళ్ళ గుండెల్లో చిచ్చురేపావు కదా? నీకిదేమైనా మంచిపని అనిపిస్తోందా?"

    "వట్టి పుణ్యానికి నన్నొక విలన్ గా చిత్రిస్తున్నారే!" హర్ట్ అయినట్టుగా అన్నాడు పృధ్వీ.  "ఆమెను నన్ను ప్రేమించమని అడిగానా? ఆమే ప్రేమించింది. ఆమె కన్నె వయస్సు ఆమెను మాయలో ముంచింది. జోడు కోసం తహతహలాడిపోయేట్టు చేసింది. నేనేం రుషినీ, బ్రహ్మచారినీ కాదుగా? మానవుడిని. సామాన్య మానవుడిని. ఆమె ఇష్టంతోనే ఆమెకు గర్భదానం జరిగింది. సృష్టం సహజంగా ఆమెకు గర్భం వచ్చింది. ఇందులో నేను కావాలని చేసిన తప్పేంటో అర్ధంకావటంలేదు."

    అతడి మాటలు వింటుంటే విశిష్టకే కాదు, అందరికీ అసహ్యంతో ఒళ్ళు జలదరించిపోయింది.

    "పాపం ఋష్యశృంగుడి అంతటి అమాయకుడివి!" పళ్ళు కొరికాడు కృష్ణవంశీ.  "నీ ప్రోత్సాహం లేకుండానే నిన్ను ప్రేమించిందా కరుణ? నువ్వేదో మాయమాటలు చెప్పకుండానే నీకు తనని అర్పించుకుందా?"

    "నేను ఏ మాయమాటలూ చెప్పలేదు. నన్ను నమ్మండిసార్! అందగాడిని, మంచి పొజిషన్ లోవున్న వాడిని. నన్ను భర్తగా పొందాలని ఆమె ఆశపడితే అందులో నాదెంతవరకు తప్పుందంటారు? నన్ను భర్తగా పొందాలన్న దురాశతో నావల్ల వలపు జల్లులు కురిపించి, తన యవ్వనాన్ని నాకు ఎరగా వేసిన ఆడదానిమీద జాలి పడతారేం? నీవల్ల నాకు కడుపొచ్చేందోచ్! పెళ్ళి చేసుకుంటావా, చైవనా అని పబ్లిక్ లో నిలబడి బ్లాక్ మెయిల్ చేసిందంటే ఆ ఆడది ఎలాంటిదో మీరొకసారి ఆలోచించండి!"

    "నీవల్ల తల్లి కాబోతున్న ఆడదానికి నువ్వు భర్తవి కావడానికి ఏమిటి అభ్యంతరం?" శర్మ అడిగాడు.

    "నాకు ఇప్పుడప్పుడే పెళ్ళి చేసుకొనే ఉద్దేశ్యం లేదు. పోతే పెళ్ళికి ముందే కన్నెతనాన్ని పోగొట్టుకున్న ఆడదంటే అసలిష్టంలేదు. కాలేజీ లోనూ, బయటా కరుణలాంటి గడుసమ్మాయిలు నన్ను ఎగరేసుకుపోవాలని చూస్తుంటారు. వాళ్ళందరికీ నేను భర్తగా లభించగలనా? నేనేం మాయలు నేర్చిన కృష్ణుడినా, నన్ను కోరుకున్న వాళ్ళందరినీ పెళ్ళాడి అందరినీ అలరించడానికి?"

    "ఎందుకు సార్ అనవసర వాదవివాదాలు? ఇప్పుడాయన పెళ్ళి చేసుకోవాలనుకొన్నా ఆమె అందని తీరాలకు వెళ్ళిపోయింది. అంతా అయిపోయిన దానికి ఇప్పుడు చర్చించి లాభమేమిటి?" నిర్వేదంగా అంది సుభాషిణి.

     "రామలీల వేడుకల్లో తగలబడిపోయే బొమ్మలా నిలువునా తగలబడి పోయిన కరుణ -అబ్బా! ఇంకా ఆ దృశ్యం నా కళ్ళముందు మెదులుతూనే వుందమ్మా. ఇతడిని మార్చకపోతే మరొక కరుణ కథ మొదలవుతుందని నా భయం" అన్నాడు శర్మ.

    కరుణ గుర్తుకువచ్చి అందరి మనసూ కలుక్కుమన్నట్టుగా అయింది ఒక పృధ్వీకి తప్ప.

                                             *    *    *

    విశిష్ట తండ్రి రామకృష్ణకి మూడురోజుల నుండి జలుబూ, జ్వరం! సుస్తీతో ఆయన పడక దిగడంలేదు. ఆయన బడి నుండి వస్తూనే ఇంట్లోకి కావలసిన సరుకులు, కూరగాయలు అడిగి తెచ్చేవారు. మూడురోజుల నుండి ఆయన బయటికే వెళ్ళకపోవడంతో ఇంట్లో కూరగాయలవీ నిండుకున్నాయి. నెలాఖరు కావడంతో పప్పు, ఉప్పులాంటివి కూడా అయిపోయాయి.

    "అన్నీ అయిపోయాయి. రేపు వంట ఎలా చేయాలని తల్లి సణుగుతోంటే -

    "నేను వెళ్ళొస్తాను డబ్బులూ సంచీ ఇవ్వమ్మా" అంది విశిష్ట.

    "నేను వెళ్ళి తెస్తాలే అక్కా!" అంది చెల్లెలు శర్మిష్ట. చదువుతోన్న పుస్తకం మూసేస్తూ.

 Previous Page Next Page