పాశ్చాత్యులే వీటిని కనిపెట్టారని ఇటలీవారి వాదన
కరారా ప్రభువు కచ్చడం
ఈ ఇనుపకచ్చడాలు తూర్పు నుంచే పాశ్చాత్య దేశాలకు వెళ్ళాయని చెప్పాను. మన వారంతా అంగీకరిస్తారు; కాని, పాశ్చాత్యులు ఊరుకుంటారా? తెలివితేటలు అన్నీ మేమే గుత్తకొన్నాం అని అనేవారు కదా యూరోపియనులు.
ఈ ఇనపకచ్చడాలను కొత్తగా కనిపెట్టినవాడు ఇటలీలో "పాడువా" ప్రభువు (డ్యూక్) కరారా అన్నవాడని ఒక ప్రతీతి పుట్టించారు. అతడు వాడుక చేస్తూ ఉండిన ఇనపకచ్చడం, వెనిస్ లో డ్యూక్ గారి పాలెస్ (రాజభవనం)లో దొరికింది. దాన్ని జాగ్రత్తగా ఉంచారు. దాని చిత్రమే ఈ క్రింది చూపించింది.
ఇటలీవారి సిద్ధాంతాన్ని పట్టిన్నీ, యూరోపియనుల అభిప్రాయాన్ని పట్టిన్నీ, ఈ కరారా కచ్చడమే మొట్టమొదటిదన్నారు. అంతకు ముందువారు కాబట్టే ఎక్కడా ఇలాంటి వస్తువును చూడలేదు. కాబట్టే అని అనుకోవాలి.
అదేకాకుండా మరొక కారణం గూడా వుంది. అదే ముఖ్యమైనదనుకుంటాను. ఏమిటంటే, ఈ కరారా ప్రభువు పరమ దుర్మార్గుడట.
ఇతనికి 'టైరెంట్ ఆఫ్ పాడువా' అని ముద్దుపేరు పెట్టారు. మనుష్యులను హింసించడానికి ఈ ప్రభువు చిత్రవిచిత్రమయిన సాధనాలు, యంత్రాలు తయారు చేయించేవాడు. పన్నులు వసూలుచెయ్యడానికీ, పగలు తీర్చుకోడానికీ, వినోదానికీ, వేడుకకీ, ఈ డ్యూక్ అనేకరకాలయిన హింసా సాధనాలు నిర్మించాడు.
పర స్త్రీలను తీసుకురావడానికీ వారిని పెట్టరాని బాధలు పెట్టడానికీ కూడా చిత్ర విచిత్రమయిన సాధనాలు తయారు చేయించాడు. తన స్వాధీనంలోనికి వచ్చిన స్త్రీలు, తప్పుదార్లు తొక్కకుండా నొక్కి ఉంచడానికి ఇనపకచ్చడాలు గూడా తయారు చేయించాడు.
ఈ సాధనాలన్నీ కరారా ప్రభువే చెయ్యించాడనీ, అతనే ఈ కచ్చడాలు గూడా కనిపెట్టాడనీ అనుకున్నారు. కాని-నిజం చెప్పాలంటే, ఈ కచ్చడాలూ, అహింసా సాధనాలూ చాలావరకు తూర్పునుంచి అతను సంగ్రహించినవే. కాదూ పోదూ అంటే, కరారా డబ్బు గలవాడు కాబట్టి వాటిని కొంచెం నాజూకుగా తయారు చేయించాడని చెప్పవచ్చును. దేశకాలాలకు తగినట్టుగా, కొంచెం చమత్కారం కల్పించాడని చెప్పవచ్చును.
కరారా కచ్చడం చేయించడానికి కొంత శ్రమపడ్డాడు. 20 ముక్కలతో ఈ కచ్చడం తయారుచేయించాడు. బొమ్మలో 16 ముక్కలే కనబడుతున్నాయి; క్రిందిభాగంలో మరి నాలుగు ముక్కలున్నాయి. ఈ ముక్కలు అన్నీ కీలు సంతనం చేశాడు. నడుమునకుగాని, తొడలకుగాని ఒత్తుకుని ఉండకుండా ఎక్కడికక్కడ వంగుతూ ఉంటుంది ఈ కచ్చడం.
దీనికి లోపల అంతా మెత్తగా శరీరానికి తాకేటట్టు మెత్తని తోలు అస్తర్ వేసి వుంది. ఈ అస్తరే అక్కడక్కడా చినిగిపోయి పటంలో కనబడుతూ ఉంది.
కోలగా రంపంపండ్లతో ఉన్న రంధ్రం ఉన్న రేకు ముందుభాగంలో ఉంటుంది. గుండ్రని రంధ్రంఉన్న రేకుముక్క వెనకనుండేది. రంపపుపండ్లు పెట్టడానికి కారణం వేరుగా చెప్పనక్కరలేదు కదా: తనకు తప్ప ఇంకొకరికి పనికిరాకుండా చేసి పడవేసి ఉంచడానికి ఈ ప్రభువు చేసిన పని ఇది. గుర్రాలకు కక్కులకళ్ళెం వేసినట్టు, తన ఉంపుడుకత్తెలకు ఈ ప్రభువు రంపపు కచ్చడాలు పెట్టాడు.
ఇలాంటివి ఎప్పుడూ చూడనివారూ, విననివారూ కాబట్టి కరారా ప్రభువే వీటిని సృష్టి చేశాడని అనుకున్నారు తెలిసి తెలియని పెద్దలు వయసు మీరిన వృద్ధులు ఆ ఉద్దేశాలనే వారు తమ డైరీలలోనూ, రిపోర్టులలోనూ వ్రాశారు.
కాని, నిజం అదికాదు. 13వ శతాబ్దంలో, ముఖ్యంగా క్రూసేడ్ మతయుద్ధాలు జరిగిన కాలంలో యూరోపియను వీరులు చాలామంది తూర్పుదేశాలకు వచ్చారు. జెరూసలెమ్ కోసం అటు క్రిస్టియనులు ఇటు తురుష్కులు అరబ్బులు పోట్లాడారు. ఆ రోజులలో మన తూర్పున ఈ ఇనపకచ్చడాలు ఆచారంలో ఉన్నాయి.
క్రూసేడ్ యుద్ధాలకు వచ్చినవారికి వీటిసంగతి బాగా పట్టుబడ్డది. ఈ క్రిస్టియన్ వీరులకు గూడా ఇండ్లదగ్గర ప్రేయసులున్నారు కదా: ఇలాంటి సంరక్షణసూత్రాలు ఏమీ లేకపోతే వాళ్ళేమి పోకళ్ళు పోతారో అన్న అభిప్రాయం వీరికిగూడ కలిగి ఉంటుందంటే తప్పా. వీరు ఒకరికి తెలియకుండా ఒకరు. ఒక్కొక్క కచ్చడం తీసుకుని ఇండ్లకు మరలినారంటే అధర్మమా?
వీరిమూలంగా ఈ కచ్చడం పశ్చిమ దిగ్విజయయాత్ర చేసింది. ఈ మాటే సత్యమని నిర్ధారణ చెయ్యడానికి, యూరోపియను భాషలలో అనేకులు వ్రాసిన విషయాలు ఇప్పటికీ రుజువు చూపవచ్చును. ఒక్క దేశంలోకాదు. ఇటలీ, ఫ్రాన్సు, స్పెయిన్ మొదలైన దేశాలలో ఈ వ్రాతలున్నాయి. వీటిని పట్టిచూస్తే, ఈ కచ్చడాల ఆచారం బాగా వ్యాప్తిలో ఉందని రూఢి కదా.