"అబ్బా! ఎంత చక్కటి పేరండీ! రెండురోజులనుండి తలలు బద్దలు కొట్టుకొంటున్నాం! స్వప్న, సంధ్య, జమున...ఈ పేర్ల దగ్గరే ఆగిపోతూంది మా బుర్ర అందుకే మిమ్మల్ని అడిగిరమ్మన్నారు ఆయన. అమ్మగారైతేనే చక్కటి పేరు చెబుతారని! దశమిరోజు పాపపేరుమీద గుళ్ళో దేవతార్చన చేయించి, ఆరోజే పాపకి నామకరణంచేసి, బీదవాళ్ళకి భోజనాలు పెడదామంటున్నారు!"
"సుందరయ్య ఇన్నాళ్ళు మామూలు కారుడ్రైవరుగా కనిపించాడు, రాజ్యం! అతడిలో ఒక గొప్ప మనిషి దాగిఉన్నాడని ఈ మధ్యే తెలిసింది! ఆ పాపని పెంచుకోవాలంటే ఎవరికీ ధైర్యం చాల్లేదు! నాలాంటి సంఘ సంస్కర్తకూడా జనకుతో ఒక అడుగు వెనక్కివేసే సమయమది! అతడు నిస్సంకోచంగా పాపబాధ్యత స్వీకరించాడు!"
"ఆ గొప్పదనం మీ మంచి మనసులోది, ఆమ్మగారూ! మండుటెండలో మందమారుతంలా పిల్లల్లేని మా జీవితాలకి పాప ఓ వరంలా భావించుకొంటున్నాం!"
దశమిరోజు పాపకి నామకరణంచేసి, గుళ్ళో ఆ పిల్లపేరున అర్చన చేయించి పేదలకి భిజనం పెట్టారు సుందరయ్య దంపతులు! సాయంత్రం దేవుడి ప్రసాదమని ఓ కొబ్బరిచిప్ప, ఓ పదిలడ్లు తీసికెళ్ళి సువర్చల చేతిలోపెట్టి నమస్కారంచేసి వచ్చాడు సుందరయ్య.
* * *
ప్రేమీ మరీ బొద్దుగా లేకపోయినా ఆరోఘ్యమ్గా పెరుగుతూంది. ప్రేమీ మనుషుల్ని గుర్తుపట్టడం మొదలు పెట్టేసరికి ఆ పిల్లతో విడదీసుకోలేనంతగా మమతలు అల్లుకొన్నారు రాజ్యం దంపతులు!
సుందరయ్య డ్యూటీనుండి వస్తూనే "ఈ రోజు ప్రేమీ ఏం చేసిందనుకున్నారు?" అంటూ ఎంతో చిన్న విషయాన్ని కూడ ఓ అద్భుతంగాచేసి చెబుతుంది రాజ్యం.
"ప్రేమీ ఇంత పనిచేసిందా?" ఆ అద్భుత లోకంలో అడుగుపెట్టి తనను తాను మరిచిపోతాడు సుందరయ్య. అతడు ఇంట్లో ఉన్నంతసేపు ప్రేమీని క్రిందకు దించడు.
ప్రేమీ తమ జీవితాలలో అడుగుపెట్టకముందు ఆశూన్యం, ఆదిగులు తలుచుకుంటే ఒకనిస్సారమైన అధ్యాయము గడిచిపోయినట్టుగా అనిపిస్తుంది! అసలు ఆ జీవితం ఎలాగడుపగలిగామా అని ఆశ్చర్యం వేస్తుంది! నవ్వులు పువ్వులులేని ఇల్లు ఎంత బోసిగా ఉంటుందో పసిపాపలేని ఇల్లు వెయ్యిరెట్లు బోసిగా ఉంటుందేమో!
పిల్లల్లేకపోతే అదొక ఉదాశీనత మనిషికి. మనం బ్రతికేదెన్నాళ్ళు? మనం పోయాక ఇదంతా ఎవరికోసం? పిల్లలున్న మనిషి ఆలోచన వేరు! తనుపోతేపోతాడు. ఉన్నప్పుడు తన బ్రతుకుతో తన పిల్లలకు సోపానాలు వేయాలని!
రాజ్యం దంపతులు ఏం చేసినా ప్రేమీకోసమే అన్నట్టుచేస్తున్నారు! అసలు మేం బ్రతుకుతున్నదే ఆ పిల్లకోసం అన్నట్టుగా బ్రతుకుతున్నారు!
ప్రేమీని ఆడంబరంగా పెంచకపోయినా అపురూపానికి మాత్రం కొదవలేదు!
ప్రేమీకి కాళ్ళు వచ్చాక, ఇల్లు గుర్తుపట్టే తెలివివచ్చాక ఇంట్లో ఉండే సమయం తగ్గిపోయింది. ఎప్పుడూ ఎవరింట్లోనో స్నేహితులతో ఆడుకొంటూండిపోయేది! లేకపోతే తండ్రి వెంటపడి రఘురామయ్యగారి ఇంటికి వెళ్ళేది! అక్కడ అజయ్ ఆమె స్నేహితుడు! రామచంద్ర మరొక స్నేహితుడు. రామచంద్ర ఆ ఇంట్లో పనికుర్రవాడు అజయ్ కారమ్స్ కాయిన్స్ అన్నీ చిందర వందరచేసేది. అతడి ఆటవస్తువులన్నీ పాడుచేసేది. అప్పుడప్పుడూ అతడి కోపానికి గురిఅయి దెబ్బలు తినేది! అప్పుడు సువర్చల ఓదార్చేది! అజయ్ ని కోప్పడేది? ఇద్దరికీ రాజీ కుదిర్చేది!
ప్రేమీ పలకాబలపం పట్టుకొని బడికి వెడుతూంటే ఎలా ఉంటుందా అనుకొంటూంటే ఆ క్షణాలు ఇట్టే వచ్చేశాయి! మొదటిరోజు ప్రేమీ సంతోషంగా చక్కగా సింగారించుకొని వెళ్ళింది. బడి అంటే బోల్డెంత మందిపిల్లలు ఉంటారు! చక్కగా ఆడుకోవచ్చు అనుకొందేమో! మాస్టార్నీ, ఆయనచేతిలో బెత్తాన్నీ చూసి హడలిపోయింది.
"అమ్మా! నేను బడికి వెళ్ళను" అని ఆపిల్ల రాజ్యాన్ని వాటేసుకొని హృదయ విదారకంగా ఏడుస్తూంటే రాజ్యం కదిలిపోయింది.
"వెధవ చదువు లోకపోతే లేకపోయింది. ఎలా ఏడుస్తూందో చూడండి! ఇప్పుడేమంత వయసని రెండు రోజులు పోనీండి!"
"చరిత్రలో గొప్పగొప్ప వాళ్ళంత మొదట బడిఅంటే ఇలా ఏడ్చిన వాళ్ళే ఉంటారేమో! నీలాగా ఆ తల్లులు 'రెండురోజులు పోనీయండి' అంటూ ఒళ్ళో కూర్చోబెట్టుకుంటే వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యేవాల్లుకాదు!" భార్యను విసుక్కున్నాడు సుందరయ్య. "పాపా, నీకు చాక్ లెట్ ఇస్తాను రామ్మా!" చేతులు చాచాడు.
"నాకు చాక్ లెట్ వద్దు. నేను రాను." తల్లిని మరింతగా హత్తుకుపోయింది.
"ఛ. అలా ఏడవచ్చా? నువ్వు చక్కగా చదువుకొంటె గొప్పదానివి అవుతావు"
"నేను గొప్పదాన్ని కానక్కరలేదు. నేను అమ్మ దగ్గరే ఉంటాను"
"నువ్వు బడినుండి వచ్చేసరికి అమ్మ నీకు కొబ్బరి ఉండలు చేసి ఉంచుతుంది. నీకు కొబ్బరి ఉండలంటే ఇష్టంగా?"
"నాకు అమ్మంటేనే ఇష్టం."
నీటిలో పంచదారలా కరిగిపోయింది రాజ్యం. "వద్దండీ. అంత ఏడిపించి దాన్ని బడికి పంపకపోతే ఏమైంది?" రాజ్యం ప్రాధేయ పూర్వకంగా చూసింది. "మగపిల్లాడు కాదుగా, చదువులేకపోతే ఎలా అని బాధపడడానికి? ఆడపిల్ల ఎంత చదివినా కుండలు కడగాల్సిందేగా?"
"మీజాతిని మీరే కించపరుచుకొంటున్నారు, రాజ్యం. మిమ్మల్ని మీరే దిగజార్చుకొంటున్నారు! మిమ్మల్ని ఏమహానుభావుడు కూడా పైకి తీయలేడేమో." నిస్పృహగా చూశాడు సుందరయ్య. "ఏశతాబ్దంలో ఉన్నావు, పిచ్చిదానా? మగపిల్లలే చదవాలని చెప్పేకాలమా ఇది? అయినా, మనపాపని ఆడపిల్లగా పెంచదలుచుకోలేదు. మగపిలలడు అనుకొనే పెంచుతను. మగపిల్లాడిలా ధైర్యంగా, స్వేచ్చగా తిరిగేట్టు పెంచుతాను."