ఆ తరవాత ఆమె జిన్ కాని, విస్కీ కాని తన ఎదుట తాగడానికి సంశయించటం మానేసింది. మరెన్నడూ నిశ్శబ్దాలతో ఆమె తనని బాధపెట్టలేదు. కాని, మెరుస్తోన్న ఆమె కళ్ళూ పొంగి వచ్చే ఆమె మాటల ధారా అతన్ని మరీ బాధ పెట్టసాగేయి.
ప్లానెటేరియమ్ దాకా వచ్చి పేవ్ మెంట్ మీద నిలబడి ట్రాఫిక్ చూస్తున్నాడు గోపాలం. ఒక దాని వెనుక ఒకటి ప్రతీదీ ఉండవలసిన వాళ్ళకి మూడురెట్ల మనుష్యులతో కిక్కిరిసి వొచ్చే ట్రాములూ, బస్సులూ, చూడ్డం అతనికి చాలా సరదా. ఆ వేలమంది సామాన్యులో, అనుదిన జీవితానికి అన్ని అగచాట్లుపడుతోన్న ఆ మనుషుల్లో తానూ ఒకడని అనుకుని. ఆ బాధలు ఊహించుకుని కొంచెంసేపు పోయాక తన నిజపరిస్థితిని తలుచుకుని ఆనందంగా, సంతృప్తిగా నిట్టూర్చడం అతనికి సరదా.
ఇవేళ ఆ ఆట ఉత్సాహం కలిగించలేదతనికి. వసంత ఎక్కడికి వెళ్ళింది? ఎప్పుడైనా బయటికి వెడితే కారు పంపమని చెప్పడమో, టెలిఫోన్ చెయ్యడమో, అలవాటు ఆమెకి, ఈరోజు ఎందుకు అలాగ చెయ్యలేదు?
రోజంతా వేడిగా లేకపోయినా, విక్టోరియా మెమోరియల్ లో చాలామంది ఉన్నారు. కొన్ని వందలకార్లు రోడ్డుమీదా. ఉత్తరం వేపు మైదానం మీదికీ పార్క్ చేసి వున్నాయి. తాను కారుమీద రానందుకు సంతోషించాడు గోపాలం.
వెళ్ళి ఎవ్వరూ లేని చోట, మొక్కల అవతల గడ్డిలో కూర్చున్నాడు.
మాటిమాటికీ వసంత జ్ఞాపకం వస్తూంది. ప్రతీ నిమిషం యువతులూ, యువకులూ జంటలుగా షికారు చేస్తున్నారు బాటల్లో. ఎంత సంతృప్తిగా చూసుకుంటున్నారు వాళ్ళు పరస్పరం.
సౌందర్యంలో తన వసంత దగ్గరికి రాగలిగిన ఒక్క యువతి అతనికి కనిపించలేదు.- కాని ఆమె మీద క్షణమాత్రం కోపం వచ్చింది అతనికి, వసంత ఎక్కడికి వెళ్ళిపోయింది? ఆమెకి ఎంతమంది స్నేహితులున్నారో లెక్క తెలీదు తనకి- కొంతమంది తనకి తెల్సును. కొంతమంది తనకి పరిచయమాత్రంగా తెల్సును.
ఈ ఆర్నెల్లలో తన జీవితం ఎంత మారిపోయింది!
ఆ రోజులు.....తాను శశిరేఖకీ, వసంతకీ మధ్య ఊగులాడుతూ క్షణక్షణం వెయ్యి నరకబాధల్ని అనుభవించిన ఆ రోజులు...
ఈ రోజు వసంత తనది...తన భార్య. కామన్ స్ట్రీట్ లో ఎంతో చక్కని ప్లాట్ తనది- నెలకి వెయ్యి రూపాయలూ, కారూ... అన్నీ తనవి తాను శ్రీ గోపాల్ ........
శశిరేఖ జ్ఞప్తి అతన్ని కలల్లోనుంచి ఒక్క సారి ఇవతలకి తీసుకొచ్చింది. ఆమె ఎలాగ ఉందో!
పెళ్ళయిన మొదటి రోజుల్లో శశిరేఖ అస్తమానం జ్ఞాపకం వొచ్చేది గోపాలానికి. జరిగిన దానిలో ఎక్కడో తాను పొరపాటుచేసిన అనుమానం మాటిమాటికీ అతన్ని బాధపెట్టేది. వసంత తనకి దగ్గరగా ఉన్న ప్రతి నిముషం శశిరేఖ తననిచూసి బాధగా నవ్వుతోన్నట్టని పించేది అతనికి. ఆమె దూరంగా ఉంటే తన చుట్టూ, దూరంగా ఎక్కడో శశిరేఖ ఉన్నట్టే అనిపించేది తనకి.
పెళ్ళికి రామానంద్ వొచ్చారు. ఏదో పుస్తకం తెచ్చి ఇచ్చాడు. రేపుచూడాలి అదేమిటో. ఆరోజు తనకి శుభాకాంక్షలు చెప్తూ ఆమె దగ్గిరి నించి టెలిగ్రామ్ వొచ్చింది. లలిత ఆమెకి ఆహ్వానం పంపింది!...
"ఎందుకలాగ చేశావు వొదినా?" అన్నాడు తను, ఆ విషయం తెలిసిన రోజున.
"కనీసం వార్త ఆమెకి తెలిస్తే ఉత్తమం గోపాలం!" అంది వొదిన, ఆలోచిస్తే, నిజం అని అంగీకరించేడు గోపాలం.
వధువుగా వసంత ఎంత సౌందర్యంగా ఉంది!
శేఖర్ మూవీతీశాడు తన కలర్ కెమేరాతో. ఇక్కడికి వొచ్చినరోజున వాళ్ళింటిలో ప్రొజెక్టర్ తెచ్చి. వేశాడు ఆ పిక్చర్ వసంత దాచింది..... మళ్ళా చూడాలి.
శశిరేఖ ఎలాగ ఉందో! ఆ తరవాత ఆమె వార్త ఏమీ తెలియలేదు తనకి...రామానంద్ స్నేహంలో ఆమె బాగానే ఉండి ఉంటుంది....బహుశా వాళ్ళు...
ఆ మాట ఆలోచించాలనిపించలేదు అతనికి.
ఎవరో దగ్గరగా కూర్చుని ట్రాన్సిస్టర్ తో సంగీతం వింటున్నారు. రొదనా అనిపించింది.
చీకటి పడబోతోంది. బయట కార్ల చప్పుడు ఎక్కువౌతోంది. గేట్లవైపు చాలామంది నడుస్తున్నారు.
మరికొంతసేపు అలాగే కూర్చున్నాడు గోపాలం- ఈ ఏకాంతంలో ఏదో ఓదార్పు ఉంది అతనికి. కాని తన దుఃఖ కారణం ఏమిటో అతనికి బోధపడలేదు.....ఒకనాడు కలలుగన్న వన్నీ అధికంగానే నిజమయ్యాయి తనకి... చక్కటి ఉద్యోగం అంత అందమైన భార్య-ఏం కావాలి, తనకి?
ఈ రోజు వసంత కావాలి..... ఉదయం బ్రేక్ ఫాస్టు దగ్గర పది నిముషాలు తప్ప రోజంతా ఆమెని చూడనేలేదు. అందుకే తనకి మనస్సు బాగులేదని అనుకున్నాడు గోపాలం.
మెమోరియల్ ఆవరణ పలచబడిపోయింది. బాగా చీకటిపడిపోయింది.
లేచి ఇంటికి నడిచాడు. క్లబ్ ముందరినించి వెళ్ళడం అతనికి ఇష్టంలేదు. తెలిసినవాళ్ళెవరినీ చూడాలని లేదు. చౌరంగీ రోడ్డుకి వొచ్చి లోవర్ సర్కులర్ రోడ్డుకి వొచ్చేసరికి అట్నుంచి వొస్తూన్న కారు తనని చూసినట్టు పక్కగా ఆగింది.
"హల్లో గోపాలం! ఎక్కన్నించి?"
శేఖర్ నవ్వుతూ దిగి కరచాలనం చేసేడు. అతను ఈ మధ్య మరీ కనిపించడం లేదు-రోజల్లా కొత్తగా కడుతోన్న ఫేక్టరీ దగ్గరే ఉండడాన్న.
'డాక్ కి వెళ్ళేను-నువ్వు?"
"ఫ్రెంచి మోటార్స్ కి వెళ్ళేను- కారు చెడితే బాగుచేయించడానికి. పద- డ్రాప్ చేస్తాను,"
'డిన్నర్ కి ఉంటేనే-"
"అలాగే నయ్యా .... వసంత ఎక్కడ?"
"ఎక్కడికో వెళ్ళింది...."
పెట్రోల్ బంక్ లో నుంచి తిరిగి కామన్ స్ట్రీట్ కి మళ్ళింది కారు. ఇంటికి వచ్చేదాకా శేఖర్ ఏం అనలేదు.
మీదకి వెళ్ళే సరికి వసంత అప్పుడే వొచ్చినట్టుంది. ఎవరికో టెలిఫోన్ చేస్తోంది. అతన్ని చూసి రిసీవర్ కిందపెట్టి, "శేఖర్! మాయమైపోయావనుకున్నాను!" అంటూ ఆహ్వానించింది.
"నువ్వే మాయమయావని గోపాలం వెతుకు తూంటే తీసికొచ్చాను."
"ఎక్కడ కనిపించాడు నీకు?"
"టాలీ గంజ్ లో..."
"రోగ్"
"అది నిజమేకాని, ఎక్కడికెళ్ళావు? సాయంత్రం ఫోన్ చేస్తే నీ చెలికత్తె నువ్వులేవని చెప్పింది."
"మాధుర్స్ తెలుసా? అక్కడ బ్రిడ్జి ఆడడానికి వెళ్ళేను. సురేఖ తెల్సునా? వాళ్ళ చిన్నమ్మాయి, ఆమే భర్తా నిన్న వొచ్చారు స్టేట్స్ నించి.....సురేఖ నిన్నడిగింది."
మనస్సు కుదుటబడింది గోపాలానికి. కాని ఈమధ్య ఆమెకి బ్రిడ్జి మీద మరీ సరదా ఎక్కువైపోయింది.
"అన్నంతిని వెళ్ళు.
"పనుంది వసంతా! ఆదివారం వొస్తాను,"
"నీపని నాకు తెలుసులే- ఆ అమ్మాయికి ఫోన్ చెయ్యి".
"ఏ అమ్మాయి?" అన్నాడు గోపాలం, శేఖర్ వైపు తిరిగి.
"అదే నాకూ తెలీదు" అన్నాడు శేఖర్.
నవ్వుతూ "నాకు తెల్సును. రామన్ ఇవేళ మంచి సాంబార్ చేశాడు. అన్నం తిని వెళ్ళు" అంది వసంత.
శేఖర్ వాదించలేదు. రాత్రి పదిదాలా కబుర్లు చెప్పుకుని అతను వెళ్ళిపోయాడు.
సాయంత్రం పడినబాధ అంతా మాయం ఐ పోయింది గోపాలానికి. ఆమెని దగ్గరగా తీసుకుని, "చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయావ్" అన్నాడు.
"సారీ ఇటుపైవి చెప్తాడు. ఏం" అంది వసంత విచిత్రంగా చూస్తూ. అతనిచేతుల్లో ఆమె ఉన్నా, ఇంకా ఆమె దూరంగానే ఉందని పించింది గోపాలానికి. కాని అతను గమనించలేదు.
* * *
16
సరళ పెళ్ళి నిశ్చయం ఐందని రామం దగ్గర నించి ఉత్తరం వొచ్చింది ఉదయం. వచ్చే నెల ఇరవైన ముహూర్తం, పెళ్ళి హైదరాబాద్ లో వరుడు డాక్టరు.
చదివి, చాలా సంతోషించాడు. సరళ విషయంలో తానేమీ చెయ్యకపోయినా, ఈ విషయం తెలియగానే పెద్ద బరువు దింపినట్టయింది అతనికి.
మరుక్షణం తన విధి జ్ఞాపకం వొచ్చింది గోపాలానికి- అన్నయ్య ఎంత కష్టపడినా, ఈ వివాహం చేసేంత డబ్బు ఉండదు అతని దగ్గర. వీలయినంత వేగం, వీలయినంత హెచ్చుతాను పంపాలి.
ఎంత పంపాలి?
తన స్వంత డబ్బు అంటూ ఎంత ఉందో అతనికి తెలీదు. వసంతదీ, తనదీ జాయింట్ అకౌంట్, ఈ విషయంలో ఆమెని అడగడం మరీ అయిష్టంగా ఉంది తనకి. ఆమె ఏమీ అంటుందని కాదు- తాను రెండు వేలు తీసుకున్నా. ఆమె ఎందుకనికూడా అడగదు. కాని-ఆమె డబ్బు నించి తియ్యడం ఇష్టంలేకపోయింది అతనికి.
తనకి టాక్సుపోగా ఏడు వందల చిల్లర వస్తుంది. కనీసం రెండువేలు కావాలి.
అకౌంటెంట్ ని పిలిచి, "నాకు రెండు వేలు ఎడ్వాన్సు కావాలి." అన్నాడు.
అటూ ఇటూ చూసి, "నెలజీతంకన్న ఎక్కువ అడ్వాన్సుగా ఇవ్వడానికి వీలులేదంటే - ఇంకా మీరు పెర్మనెంటు కాకపోడాన్న ఈ విషయం డైరెక్టరు దాకా వెళ్ళాలి. ఏం చెయ్యమంటారు?" అన్నాడు. అకౌంటెంట్.
"చెప్తాను" అని అకౌంటెంట్ ని పంపి ఆలోచనలో పడ్డాడు - ఏం చెయ్యడం?
ఏదో ఆలోచిద్దాం అని. ఆ మాట వెనక్కి పెట్టాడు. ఇవేళ స్టెల్లా పెళ్ళి - చర్చికి వెళ్ళాలి.
ఉదయం ఆ విషయంలోనూ వసంతతో వాదించవలసి వొచ్చింది.
"ఎవరా అమ్మాయి!" అని అడిగింది వసంత.
చెప్పేడు, "నిన్నూ నన్నూ రమ్మని మరీ చెప్పింది, ఆరున్నరకి వెడితే, ఏడున్నరకి వొచ్చీ వొచ్చును" అన్నాడు.
"నువ్వు వెళ్ళు -నాకా అమ్మాయి ముఖం తెలీదు" అంది వసంత. అదీకాక, ఇవేళ మాధుర్స్ డిన్నర్ కి పిలిచాడు జ్ఞాపకంఉందా? అక్కడికి వెళ్లేందుకు ఆలశ్యం ఔతుంది."
"టైముకి వొచ్చేద్దాం..."
"తయారయ్యేందుకు నాకు టైము ఉండదు, నువ్వు వెళ్ళు."
ఇంక ఆ విషయం వాదించదలుచుకోని స్వరంలో చెప్పింది వసంత. బాధా కోపం, కలిపి పెనవేసుకున్నాయి అతన్ని. కాని ఏమీ అనలేకపోయాడు.
తన ఇంట్లో తన మాట చెల్లలేదన్న బాధకన్న తనమాట వసంత అర్ధంచేసుకోలేదన్న బాధ ఎక్కువగా అనిపించింది గోపాలానికి. ఆమె రూపంలో ఉన్న కోమలత్వం, ఆమె ఆలోచన ల్లోనూ ఉంటే బాగుండుననిపించింది.
ఆమె బాధపడితే తాను తల్లడిల్లిపోతాడు, గత సంవత్సరంలో ఆమెకి కోపం ఎక్కువ సార్లు రాలేదు- కాని వొచ్చిన ఒకటి రెండు సార్లూ తనకి బాగా జ్ఞాపకం ఉన్నాయి.
మూడో నాలుగో నెలలకిందట. న్యూ ఎంపైర్ లో విజయ నాట్యానికి వెళ్దామని ఫోన్ చేసింది, అలాగేనని, పని తొందరలో మరిచి పోయాడు. ఆ సాయంత్రం ఆ ఆఫీసులో పని చేస్తోన్న గుమాస్తా అతనిపేరు బిషనో, అలా టిదే మరేవో - హఠాత్తుగా మహాబాధతో మూర్చపోయాడు.
ఆఫీసులో తనది తప్ప ఎవరిదీ కారు లేదు. అదీకాక అతని బాధచూస్తే ఎంతో జాలివేసింది గోపాలానికి.
అంబులెన్సుకి ఫోన్ చేస్తే ఆ క్షణంలో ఏమీలేదని తెలిసి. తనే అతన్ని తీసికెళ్ళి హాస్పిటల్ లో జాయిన్ చేశాడు. తరవాత డాక్టరు చెప్పాడు అప్పెండిసిటీస్ అని.
అతన్ని ఎడ్మిట్ చేసి కారు అతని ఇంటికి పంపి అతని భార్యని హాస్పిటల్ లోకి తీసుకురావడానికని పంపించి, ఆమె వొచ్చేదాకా అక్కడే కూర్చున్నాడు. అతను చనిపోతాడనే విచిత్రమైన భయం మొదలు పెట్టింది గోపాలానికి అతని భార్య వొస్తే బాగుండును అనిపించింది. నిమిషాలు గడుస్తోన్నకొద్దీ అతని ఆతృత ఎక్కువ కాసాగింది....
బిషన్. అదీ పేరయితే హౌరాడో ఎక్కడో ఉంటున్నాడు. అక్కడికి వెళ్ళివొచ్చేసరికి గంటపైగా ఐపోయింది. ఈలోగా నాలుగైదు సార్లు అనకుండా ఉన్న ఇంకో గుమాస్తాని పర్సు దగ్గరకి పంపి ఎలాగ ఉందని అడిగించాడు. సంతృప్తికరమైన జవాబు రాకపోవడంతో బిషన్ చనిపోతాడనే భయం బలవత్తరం ఐపోయింది. ఆ మధ్యలో ఒకటి రెండుసార్లు ఈ పరిస్థితుల్లో చిక్కుపడినందుకు తనని తానే నిందించుకున్నాడు.
చివరికి ఆమె వొచ్చింది. భయంతో చెదిరి పోయిన చూపులు చూస్తోంది. చిక్కిపోయి ఆ భయంలో మరీనీరసంగా కనిపిస్తోంది. తనని గురించి బిషన్ ఫ్రెండు ఏమిటో బెంగాలీలో చెప్పేడు. ఆమె తనకి నమస్కరించి వార్డులోకి వెళ్ళిపోయింది. ఎంత రిలీఫ్ కలిగింది అతనికి!