Previous Page Next Page 
వసంతం పేజి 15


    ఇవన్నీ ఐ ఇల్లు చేరేసరికి తొమ్మిది ఐ పోయింది. తాను వెళ్ళేసరికి వసంత నిర్లిప్తంగా కూర్చుంది. తనకి విజయ నాట్యం మాటే జ్ఞాపకం లేదు, వెళ్ళి స్నానంచేసి వొచ్చి "ఏం అలాగ ఉన్నావు?" అన్నాడు ఆమెపక్కన కూర్చుంటూ.
    "ఎక్కడికి వెళ్ళేవు?" అంది వసంత.
    "హాస్పిటల్ కి- ఓ క్లర్కు పాపం, ప్రమాదపరిస్థితిలో ఉంటే అడ్మిట్ చెయ్యడానికని వెళ్ళేను"    
    కోపంగా బాధగా చూసింది వసంత.
    "ఊరివాళ్ళ బాధలన్నీ నీకు కావాలి -నేను ఏం ఐపోయినా నీకు బాధలేదు!" అంది కోపంగా.
    "ఆ మాట అబద్ధం అని నీకు తెలుసును- కళ్ళ ఎదుట అంత అపాయకర పరిస్థితిలో ఉంటే ఎలాగ వొచ్చేసేదీ?" అన్నాడు గోపాలం చిరాకుగా.
    ఆమె మాట్లాడలేదు. అంత అన్యాయంగా ఆమె మాట్లాడుతూంటే ఏమీ అనాలని తనకే అనిపించలేదు.
    భోజనం చెయ్యనని ఆమె వెళ్ళి పడుకుంది. తనకి విపరీతంగా ఆకలివేస్తోంది. భోజనం చేసి నోరు కడుక్కుంటూంటే తనకి జ్ఞాపకం వొచ్చింది-బిషన్ దగ్గర దమ్మిడీ ఉండి ఉండదని.    
    హాస్పిటల్ కి మళ్ళీ వెళ్ళాలని అనిపించలేదు. కాని, ఇంకా తనలో ఉన్న మానవత్వం అతన్ని నిలవనియ్యలేదు.
    బట్టలు వేసుకుని, "బయటికి వెడుతున్నాను వసంతా!" అన్నాడు.
    ఆమె ఏమీ అనలేదు. కిందికివొచ్చి టాక్సీలో హాస్పిటల్ కి వెళ్ళి బిషన్ భార్యకి ఏభై రూపాయలు ఇచ్చి వొచ్చేసరికి పదకొండు గంటలై పోయింది.
    తాళం తీసుకొని గదిలో అడుగు పెట్టేసరికి జ్ఞాపకం వొచ్చింది సాయంత్రం ప్రోగ్రామ్ సంగతి. కనీసం తాను టెలిఫోన్ చేసి ఉంటే బాగుండు ననిపించింది.
    ఆమె ఏదో పుస్తకం చదువుతూంది.
    "సారీ వసంతా..... సాయంత్రం ఇవేళ ప్రోగ్రామ్ మాట జ్ఞాపకం రాలేదు- కనీసం ఫోను చేసి ఉండాల్సింది" అన్నాడు గోపాలం సానునయంగా.
    "నాకు లెక్కలేదు"
    "ఉంది వసంతా. చాలా ఉంది.... కాని, కొంత మానవత్వం ఉంది నాకు"
    పుస్తకం కిందపడేసి. నెమ్మదిగా "నాలో ఆ మానవత్వం లేదు, "ఏం! అంది వసంత.
    తనలో తప్పు ఉంచుకుని ఆమెతో వాదించడం ఇష్టంలేదు. ఆమె కళ్ళలో బాధ తనని మరీ బాధ పెడుతోంది.
    "అది కాదు వసంతా - ఆ పరిస్థితుల్లో ఏం చెయ్యమంటావు చెప్పు-"    
    చాలాసేపు గోడమీద కేలండర్ వైపు చూస్తూ మాట్లాడలేదు. క్రమంగా ఆమె కళ్ళు ఎర్రబడి తడితడిగా ఐపోయాయి. "ఎంతమంది జీవితాల్నిగురించి ఆలోచించేది నేను- నాకు ఎవ్వరితోనూ సంబంధంలేదు. నీతో తప్ప. నా మానవత్వం నాకు ఉంది. కాని..."
    ఆమె మాటాడలేకపోయింది.
    గోపాలమూ మాటాడలేకపోయాడు. ఆమె మీద జాలి కలగలేదతనికి. లాలించాలనిపించలేదు.
    ఫ్రిజ్ లో చల్లటినీళ్ళు తీసుకుని తాగి, సోఫాలో పడుకుని ఆమె ప్రవర్తనని పరీక్షించసాగాడు. ఎప్పుడో నిద్దర పట్టిపోయింది.
    
                               *    *    *

    ఆ మాట జ్ఞాపకం వొచ్చింది గోపాలానికి.
    ఆ తరవాత రెండురోజులు వసంత ఇల్లు కదలలేదు- ఇంకేమీ అనకపోయినా, ఆమె చక్కటి కళ్ళల్లో తనమీద ఏదో నేరారోపణ మాటిమాటికీ కనిపించసాగింది. కేవలం ఆ సాయంత్రం నాట్య ప్రదర్శనకి వెళ్ళలేదనే కన్న పెద్ద కారణం ఏదో ఉందని అతనికి చూచాయగా అనిపించింది. కాని, అది ఏమిటో అతనికి తెలియలేదు.
    నాలుగ్గంట్లకి ఆఫీసు వొదిలి న్యూమార్కెట్ కి వెళ్ళేడు. స్టెల్లాకి ఏం ఇవ్వాలో తేలలేదు. ఇలాటి సందర్భాలు అతనికి ఇప్పటిదాకా తారసపడలేదు. దుకాణం తరవాత దుకాణం చూసుకుంటూ వెళ్ళాడు. రకరకాల బట్టలున్నాయి. కాని, చీరలు ఇవ్వడం అన్నివిధాలా అసందర్భంగా ఉంటుంది. చివరికి ఫేన్సీ ఆర్టికల్స్ చాలా చూశాడు. కాని....
    ఏమీ కొనకుండానే ఇంటికి వొచ్చి మీదకివెళ్ళేసరికి వసంత, "పెళ్ళికి వెళ్ళలేదా? అంది ఆశగా లాగ.
    "వెడతాను. ఆరున్నరకి కదా?"
    "ఓ!" అంది.
    ఇంకేమీ ఆమె అనలేదు. తను వెడుతూంటే గుమ్మందాకా వొచ్చి ఏదో చెప్పబోయి ఆగిపోయింది.
    గోపాలం క్షణ మాత్రం ఆగి, ఆమె నిశ్శబ్దంగా ఉండిపోవడం చూసి వెళ్ళిపోయాడు.
    టాలీగంజ్ లో చర్చికి అతను చేరే సరికి ఆరున్నర ఐపోయింది. ఆ అడ్రసు అతనికి సరీగా తెలియక చాలా రోడ్లు తిరగడంతో కొంచెం చికాకూ వేసింది.
    చర్చి చేరుకునే సరికి చాలామంది ఉన్నారక్కడ. అందరూ స్మార్ట్ గా బట్టలు వేసుకున్నారు. ఆడా మగా కలిసి ఏభై మంది ఉన్నారు.
    తనకి తెలిసిన ఒక్క ముఖం కనిపించలేదు. వెనకగా ఒక బెంచీలో కూర్చున్నాడు. ఆర్గన్ సంగీతం వినిపిస్తోంది. వెడ్డింగ్ మార్చ్....
    ఇంతలో తతంగం ప్రారంభం ఐంది. అంతా బాగా రిహార్సిల్ చేసిన నాటకం లాగ ఉంది. స్టెల్లా వధువుగా తను రోజూ చూసే మనిషికన్న ఎంతో బాగుంది.
    సిరమనీ అయే సరికి ఏడున్నర దాటిపోయింది. క్యూలో నిలబడి స్టెల్లాని కంగ్రాట్యులేట్ చేసి. రిసెప్షన్ కి రాలేనందుకు క్షమాపణ చెప్పుకుని ఇంటికి బయలుదేరాడు గోపాలం, బయటికి వొచ్చాక ఆమెకేమీ తేలేదని జ్ఞాపక మొచ్చి సిగ్గుపడ్డాడు.
    ఇంటికి వొచ్చేసరికి వసంత డ్రాయింగ్ రూంలో కూర్చుని లైఫ్ మాగజీను చూస్తోంది. తనని చూసి తలఎత్తలేదు.
    "ఏదో తుఫాను రానున్నదని గమనించలేని గోపాలం. "ఇంకా తయారు కావడంలేదా? ఆలస్యం అవుతుంది" అన్నాడు! రాత్రి డిన్నర్ సంగతి జ్ఞాపకం చేస్తూ.
    "ఆలస్యం అవదు - అక్కడికి వెళ్ళడం లేదు." అంది వసంత,
    ఆశ్చర్యపడి "ఏం!" అన్నాడు.
    "ఒంట్లో బాగాలేదు" - అంది వసంత.
    "ఫోన్ చేశావా? .... వాళ్ళేమనుకుంటారు?
    "అంత బాధ ఐతే నువ్వు వెళ్ళు"
    "అక్కడికి వెళ్ళాలని అంత కోరిక లేదని నీకు తెలుసు."
    "తెలీదు. ఒంటరిగా వెళ్ళడం అంటే సరదా నాకు!"
    చెంపదెబ్బలాగ తగిలి చురచురచూశాడు.
    ఆమె నిర్లిప్తంగా పేజీలు  తిరగేస్తుంది.
    అతను చాలాసేపు మాట్లాడలేదు. ఆమె హృదయంలోని రహస్య మార్గాలల్లో సంచరిస్తూ దారి తప్పిపోయాడు. అతనికీ కోపం వొచ్చిందికాని, ఏం చేస్తాడు!
    
                                                         17

    మరోవారం గడిచేదాకా. ఇంట్లో కనిపించక పోయినా అనుభవంలో ఉందని తెలిసే అశాంతి వ్యాపించిపోయింది-చిన్న చిన్న కలహాలు తప్ప అలవాటులేని గోపాలానికి ఆమె నిర్లిప్తతా. నిశ్శబ్దమూ, మరీ బాధకలిగించాయి.
    ఆమె ఈ వారమూ ఎక్కడికీ వెళ్ళలేదు. ఇంట్లోకూర్చుని ఏదో పుస్తకం చదువుకుంటూంది. లేకపోతే రేడియో వింటూనో, రికార్డులు పెట్టుకునో ఆలోచించుకుంటూ కూర్చుంటుంది.
    రెండుమూడుసార్లు అడిగినా, కారణంఏమీ చెప్పలేదు వసంత. ఏమీలేదు అంది.
    ఆమె నిజం చెప్పడంలేదని అతనికి తెల్సును-కాని. ఆమె దాచిన విషయం ఏమిటో అతనికి తెలియలేదు. ఇక్కడ ఆమెకి దుఃఖంకాని, అశాంతికాని కలిగించేందుకు ఏం జరిగింది?
    తన ప్రవర్తన పరీక్షించుకుని అందులో ఏమీ కారణం గమనించలేకపోయాడు గోపాలం. స్టెల్లా పెళ్ళికి వెళ్ళడం ముఖ్యకారణం. కనీసం తనకి తెలిసినంత వరకూ. ఆమెకి ఆరోజు కోసం వొచ్చే కారణం ఎంత వెతికినా తనకి కనిపించలేదు-
    ఉండి ఉండీ అతనికి కోపమూ వొస్తూంది. బాధా కలుగుతోంది.
    వసంతకి కావలసిందేమిటి? ఏ విచిత్రమైన ఆల్కహనలు ఆమెకి అనవసరంగా ఈ దుఃఖాన్ని, ఈ కోపపూరితమైన నిర్లిప్తతని కలిగిస్తున్నాయి?
    ఆమెకి ఇవ్వగలిగిన వేమీ, తన హృదయం తప్పించి - అతని దగ్గర లేవు. ఆ విషయం తమరిద్దరికీ తెలుసును. తన ఆఫీసులో గడిపే ఏడు గంటలూ తప్పిస్తే మిగిలిన కాలమంతా సుమారుగా ఆమెతోనే గడుపుతున్నాడు తాను. ఈ చిన్న చిన్న విషయాల్లో- వీటిలో తననిస్సహాయత గుర్తించీకూడా- ఆమె ఎందుకిలాగ సుఖశాంతులు నాశనం చేస్తోంది?
    ఆమెమీద బాగా కోపం తెచ్చుకునే కాఠిన్యం లేదు గోపాలంలో. ఏదో తాను తప్పుచేశాననే నమ్మిక అతన్ని బాధపెట్టి, అతన్నే నేరస్థుడిగా చేసింది.
    బాల్కనీలో కూర్చుని ఆలోచిస్తూన్న గోపాలం ఆలోచనలు ఆపి రోడ్డుమీదకి చూడసాగాడు. చిన్న చినుకులు పడుతున్నాయి. రోడ్డు మీద నడుస్తోన్న మనష్యులు తరత్వరగా నడక సాగిస్తున్నారు. ఎదురిఇంట్లో లాన్ లో నించి కుర్చీలు తీసి లోపల పడేస్తున్నారు.
    క్రమంగా వర్షం పెద్దదై పోయింది. జల్లు వొస్తూంది. ఎంతో చల్లగా ఉంది.
    సముద్ర తీరాన తాను కూర్చుని గడిపిన రోజులు జ్ఞాపకం వొచ్చాయి- వెను వెంటనే ఆ రోజుల్లో తన పరిస్థితి శశిరేఖ, తరవాత వసంత.... ఆ రోజుల టార్చర్- అన్నీ జ్ఞప్తికి వొచ్చాయి.
    వొదిన...ఆమె ఏం చేస్తోందో! ఆ పాడు రోజుల్లో ఎంత అభిమానంగా ఆదుకుంది! క్షణ క్షణం తనకి తల్లిగా, స్నేహితురాలిగా, గురువుగా, ఎంత సహాయం చేసింది.
    ఈ రోజు వొదిన ఉంటే బాగుండును- తన బాధ అంతా ఆమెకి చెప్పుకున్ను. ఆ రోజు ఇక్కడికి వొచ్చేసే ముందర రోజు. తనకి బాగా జ్ఞాపకం ఉంది. వసంతా వొదినా రాత్రి తొమ్మిది దాకా ఏవో కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. వెంకట్రామ్ ఎవరో వస్తే సాయంత్రం నించీ వాళ్ళతో ఉండిపోయి, తానుడ్రాయింగ్ రూమ్ లో కూర్చుని కలలు కంటున్నాడు. బాబు నిద్రపో యాడు అన్నం తిని, ఎప్పుడో.    
    ఆ రోజు లన్నిటిలోనూ తనకి మరుపురాని క్షణం ఆ రాత్రి....సెలవు తీసుకుంటూ వొదిన వసంతని కౌగలించుకుని ఎంతో ఆప్యాయంగా ముద్దు పెట్టుకోడం, తన మనస్సులో ఉన్న వెయ్యి పాలెపట్లని ఆ క్షణంలో తుడిచి పారేసింది వొదిన- ఆమెకి తానారోపించిన ఎన్నో మాటలకి తననే దోషిగా చేసింది వొదిన.
    వెడుతూ, "రేపు వొస్తాను గోపాలం.....వసంతని పువ్వుమల్లే చూసుకో, కాని, మాటిమాటికీ ఆలోచించుతూ ఉండు, మాటిమాటికీ చెప్పేదానికి వొదిన వుండదు" అంది వొదిన.
    మూర్ఖంగా, 'ఏమిటి ఆలోచించేది వొదినా!' అన్నాడు గోపాలం.
    బాధగాలాగ నవ్వి. "ఆ మాట చెప్పడం కష్టం. కాని, ప్రతీసుఖానికి ఖరీదు ఉంటుందనిజ్ఞాపకం ఉంటుందనీ దైవం ఎంత సుఖంఇస్తే అంత ఖరీదు ఏదో రూపంలో పుచ్చుకుంటాడని జ్ఞాపకం పెట్టుకో. ఏదైనా, నీ మనస్సులో ఉన్నంతమాత్రాన చాలదు .... ఎప్పుడైనా అవతలి వాళ్ళకి తెలిసేలాగ చెప్పడం ముఖ్యం... అవన్నీ ఆలోచించు" అంది వొదిన.    
    ఆ సాయంత్రంనుంచీ వసంత నించి దూరంగా ఉండిపోయిన బాధలో ఆమెవేపు చూసినప్పుడల్లా అధికమవుతూ వొచ్చిన వేదనలో ఆ మాటలు బోధపడలేదు. బహుశా, ఆ సంగతీ వొదిన గమనించే ఉంటుంది.
    ఇవేళ కనీసం వాటిలో ఒక భాగం తనకి అర్ధమౌతూన్నది, కాని, అందరు ఆడవాళ్ళూ, అందరు మనుషులూ ఇలాగే వుంటారని అతననుకోలేదు. వొదిన చెప్పింది అందరికీ వర్తిస్తుందని తాననుకోడం తప్పని గ్రహించాడు. తెలివిగా, అభిమానంగా వసంత విషయమే ఆమె చెప్పింది.
    లేచి లోపలికి వెళ్ళేడు. వసంత ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతూన్నది. ఆమె ముఖంలో హఠాత్తుగా ఆనందం వికసించింది.
    పది రోజుల ముసురు తర్వాత సూర్యోదయం లాగ కనిపించింది వసంత. ఆమెలో ఉన్న తమస్సంతా ఒక్కసారి హరించిపోయింది.
    'ఏమిటి సంగతి?" అన్నాడు గోపాలం.
    'గుడ్ న్యూస్.....లతాసేన్ ఫోన్ చేశారు. క్లబ్ డే గురించి. బ్యూటీ కంటెస్టు పెడుతున్నా రుట."
    పరీక్షగా చూశాడు గోపాలం.
    "రేపు అనౌన్స్ చేస్తారు. జడ్జెస్ ఎవరో తెలుసా? నో - చెప్పను, నువ్వే చూద్దూగాని?"
    "నువ్వూ పోటీ చేస్తావా?"
    నవ్వింది. అతన్ని కౌగలించుకొని. "గోపాలం కి చెప్పు- నీకు జ్ఞానం ఎప్పుడు వొస్తుంది? అంది నవ్వుతూనే.
    ఆ మాటకి బాధపడాలో ఆమె సాన్నిహిత్యం మళ్ళీ అనుకోకుండా లభించినందుకు సంతోషించాలో తెలియక తికమక పడుతూన్న గోపాలాన్ని ఆమె చేతుల మెత్తదనం. ఆమె కళ్ళ సౌందర్యం జయించేయి. చెప్పలేని రిలీఫ్ కలిగింది అతనికి. ఆమె చాంచల్యంలోనూ ఎంత తియ్యదనం ఉంది? అనిపించింది అతనికి.
    వర్షం కుండపోతగా కురుస్తోంది.

                                 *    *    *

 Previous Page Next Page