అలాటి వసంత దగ్గర నాకు పోటీ లేదని తెలుసును..... అతని ప్రవర్తనకి కారణం తెలుసును. నా ముఖం చూసి రామానంద్ ఎంత బాధ పడ్డాడు! వొద్దంటూన్నా జర్నీ బ్రేక్ చేసి ఇంటికి వొచ్చాడు.
ఏమని రాయను గోపాలానికి? అతని పంచ ప్రాణాలూ ఆ అమ్మాయిమీద ఉంటే, నాతో ఏం సుఖపడతాడు? అతను వవొద్దనీ ఎలాగ రాయను? ఏమని రాయను?
పదిసార్లు అడిగాడు రామానంద్. ఏమనీ చెప్పలేక అతను మళ్ళావొచ్చినప్పుడు చెప్తానని తప్పించుకున్నాను. బాధపడ్డాడు.... కాని...
నాన్నగారి ఆస్తి హరించుకుపోయింది.....నా పెళ్ళికి ఇదో, విశాఖరావో ఇల్లు అమ్మాలిట. ఇన్నాళ్ళకి అమ్మా నాన్నగారూ ఒక్కచోట ఉండటం. ఏం పోతే ఏం? కాని, కొత్తగా దొరికిన ఈ ఆనందంలో గోపాలం దూరం ఐపోవాలా?
రామానంద్ ఉద్దేశం నాకు తెలుసును. పాపం! ఎంత బాధపడతాడు నా కోసం!....కాని.... కాని....
గుడ్ బై గోపాలం- పోనీలే- మిగిలిన స్మ్రుతులే దాచుకుందాము.....నువ్వు సుఖపడు..నా ఉత్తరం నీకు అశాంతికన్న ఇవ్వదని తెలుసును. ఆ అశాంతినించీ నిన్ను రక్షిస్తాను.
* * *
కుర్చీలో జేరబడి ఆలోచిస్తూన్న గోపాలానికి టీ ఇచ్చి వెళ్ళబోయింది లలిత.
"నే నంటే కోపం వొచ్చిందా వొదినా?"
లలిత నవ్వి, "లేవయ్యా.....నేనంటే నాకే కోపం వొచ్చింది" అంది.
"ఎందుకని?"
"మొన్న అద్దాన్ని అడిగేను- రాబోయే చెల్లెలు ముందర దివిటీముందర దీపంలాగ ఉంటాననీ, నా జెలసే అనీ, చెప్పింది....అందుకని."
"ఆ మాట ఇంకా నిశ్చయం కాలేదు వొదినా వసంత ఎంత చక్కగా ఉన్నా నీలో ఉన్న దైవత్వం ఆమెలో రాదు. దయచేసి..."
"సరేనయ్యా, నువ్వే ఊరుకుంటే నేనే నిన్ను పలకరించేదాన్ని - జీవితాలతో చెలగాటం మంచిది కాదని అనిపించే నీతో అన్నీ అన్నాను. కాని ఆ రోజు నిశ్శబ్దంగా ఉండిపోతేనే మేలుగా ఉండేది."
"కాదు వొదినా-నీ తరహా వేరు. తప్పు అని నువ్వు అనుకున్నది నీ ఎదుట జరిగితే భరించలేవు నువ్వు..... ఆ ధైర్యం నీకు ఉంది పోరాడేందుకు"
చిత్రంగా అతని కళ్ళల్లోకి చూసి, "కావొచ్చు గోపాలం!.... కాని తప్పు రైటు ఏమిటో ఎవరికీ తెలీదు. అజ్ఞానంలో మనం తీర్పు ఇస్తాం గాని, నిజంగా ఆలోచిస్తే ఎవరు చెప్పగలరు?." అంది.
అతను టీ తాగి కొంచెం ఆగి, "ఏం జరిగినా సరే వొదినా ....నా మీద కోపం తెచ్చుకోకు. నువ్వేం చెప్పినా చెయ్యకపోవడంకాదు. చెయ్యలేకపోవడమేననీ నీకు తెల్సును" అన్నాడు గోపాలం.
"ఇంకెన్నాళ్ళు గోపాలం!....ఇటుపై నీ కోసం వొచ్చినా, ప్రేమవొచ్చినా వసంతది" అతనేదో అనబోయాడు. "కోపంలో వసంత మరీ బాగుంటుందికాదూ?"
ఒక్కసారి ఎంతోహాయిగా అనిపించింది అతనికి. మరుక్షణం సిగ్గుపడి, "అన్నీ నిర్ణయం ఐ పోయినట్లు చెప్పకు వొదినా- ఆలోచనల్లోనే ఉన్నాయి అన్నీ, అసలు వసంత ఏమంటుందో? "అన్నాడు గోపాలం.
"ప్రేమలో నీకళ్ళు కనిపించవుగాని, అనుభవంలో మా కళ్ళు బాగానే ఉన్నాయిలే....మళ్ళీ ఈ సంవత్సరం ఈ రోజుకి...."
ఏమనుకుందో, ఆగిపోయి, కప్పుతీసుకుని లోపలికి వెళ్ళిపోయింది లలిత.
కొంచెం సేపట్లో బడినుంచి బాబు వొచ్చి బట్టలు మార్చుకుని, "ఇవేళ రాత్రి కథ చెప్పాలి." అన్నాడు.
"అలాగే..."
"అన్నీ అబద్ధాలే-"
"నీతోనా?"
"ఆఁ ఆరోజిలాగే కథ చెప్పమంటే నిద్దరోగొట్టేశావు!"
"ఓరి పిడుగా! అదీ నా తప్పే?"
ఇవేళ నిద్ర రాకుండా కథ చెప్పు-ఏం?"
"అలాగే!"
హోమ్ వర్కు చేసుకోడానికని వెళ్ళిపోయాడు బాబు.
* * *
15
తలుపు తెరిచిన శబ్దం విని. తల ఎత్తి చూశాడు గోపాలం.
"గుడ్ మార్నింగ్ బాస్" అంటూ లోపలికి వొచ్చింది స్టెల్లా.
"గుడ్ మార్నింగ్ మిస్, కూర్చోండి, ఏమిటి సంగతి!"
"ఒక రిక్వెస్టు-కాదు....రెండు."
ఆమె కూర్చుని ఆశగా అతనివైపు చూసింది.
"ఏమిటి?"
"నాలుగు వారాలు సెలవు కావాలి."
"ఎప్పుడు?"
"మండే నించి.... ఇరవై రెండో తారీకు"
"గాడ్? ఇంపాజిబుల్...కంపెనీ ఆడిటర్స్ వొస్తున్నారని తెలుసుగా?...
"ఔను" కొంచెం సందేహంగా అంది స్టెల్లా కాని, "నాకు అత్యవసరం."
"ఏమిటి సంగతీ!"
"పెళ్ళి..."
"ఎవరికి?"
ఆమె చిరునవ్వు నవ్వి, "నాకు" అంది.
ఏమనాలో తెలియలేదు గోపాలానికి. ఆఫీసులో పనిచేస్తూన్న స్టెనోలందరిలోనూ స్టెల్లా మంచిది. షార్ట్ హేండ్ లో నైపుణ్యం అటుంచి ఆఫీసులో ఆమెకి తెలియని విషయం లేదు. ఈ ఆరు నెలల్నించీ తనకెంతో సహాయం చేసింది అభిమానంగా.
కాని- ఆడిట్ జరగబోతోంది వచ్చే మూడు వారాలూను. అదీకాక, వికాష్ ముఖర్జీకీ, అనిల్ కీ నాలుగురోజులే సెలవు కాదన్నాడు.
ఆశగా చూస్తోంది స్టెల్లా.
"మీరు వెళ్ళిపోతే పని ఎలాగ?"
"ప్రాన్సిస్ ఉంది.... నా పని అంతా ఆమెకి తెలుసును. అనుకోకుండా అతను వచ్చేవారం డేట్ ఫిక్స్ చేశాడు.... సారీ బాస్...."
"ఆల్ రైట్ - కంగ్రాట్యులేషన్స్. అదృష్టవంతుడు ఎవరు?"
"విన్సెంట్- ఏ.జి ఆఫీసులో పనిచేస్తున్నాడు."
"గుడ్..."
ఆమె లేచి థాంక్స్!" అని ఆమె వెళ్ళబోయి వెనుదిరిగి, "మరో రిక్వెస్ట్" అంది.
"చెప్పండి"
"మీరు వెడ్డింగ్ కి రావాలి- మిసెస్ తో"
"ప్రయత్నిస్తాను-"
"తప్పకరావాలి. చాలా సంతోషిస్తాను. కార్డు పంపే టైమ్ లేదు, ప్లీజ్!"
'ఆల్ రైట్!" అన్నాడు మళ్ళా - కొంచెం విసుగ్గా, అది సంతోషంలో గమనించని స్టెల్లా వెళ్ళిపోయింది.
పనేమీ లేదు- రోజు లాగే. ఇంత పెద్ద కంపెనీకదా, ఎంతపని చెయ్యాలోనని భయపడ్డ తనకి ధైర్యంచెప్పి, మాటిమాటికీ సలహా ఇచ్చి తననీ పండితుణ్ణి చేసింది స్టెలా- తను కాక ఎకౌంట్స్ కీ, టెక్నికల్ కీ లేబర్ కీ మరో ముగ్గురు మేనేజరు ఉన్నారు. తనకి అందరికన్నా సుళువైన పనిలాగ ఉంది...
మేనేజి మెంట్ మీద పుస్తకంతీసి చదవడం ప్రారంభించేడు-మామగారి సహాయం తో. ప్రోద్బలంతో B I M కి చదవడం. ఇన్స్తి ట్యూట్ లో జాయిన్ అవడం జరిగింది.
వారానికి మూడో నాలుగో రోజులు సాయంత్రం కాలేజీకి వెళ్ళాలి. ఇంకో ఆరునెలలు.... ఫైనల్ ఎగ్జామ్ ఇవేళ క్లాసు లేదు- కనీసం. వర్షం లేకపోతే, విక్టోరియా మెమోరియల్ కి వెళ్ళవొచ్చును.
"హల్లో!"
కృష్ణన్ - అకౌంట్స్ మేనేజర్ - వొచ్చాడు. అతను చార్టర్డ్ అకౌంటెంట్, చాలా సరదా ఐన మనిషి.
"రండి"
కృష్ణన్ కూర్చుని సిగరెట్ తీసుకుని అతనికి ఆఫర్ చేశాడు, వొద్దన్నా, పుచ్చుకుని వెలిగించక తప్పిందికాదు గోపాలానికి.
టీ తెప్పించేదా?"
"కాఫీ ఇవ్వండి-వొచ్చేవారం ఆడిట్ అని తెలుసునా" బోయ్ ని కాఫీకోసం పంపించి. ఆఁ ఏం? అన్నాడు గోపాలం.
"స్టెలా ఆమె వెళ్ళిపోతే చాలా కష్టం.
"ఆమెకి పెళ్ళిట కాదనడం ఎలా?"
నవ్వేడు కృష్ణన్ అందులోనే మేనేజిమెంట్ రహస్యం. ఇదేం గవర్నమెంట్ ఆఫీసుకాదు గదా! ఆమె పెళ్ళికన్న ఆడిట్ ముఖ్యం."
"ఏదో ఒకటి చెయ్యాలి - మాట ఇచ్చేశాను.
కాఫీ వొచ్చింది. తాగుతూ, "అదే డెసిషన్ మేకింగ్ లో కష్టం. మగవాళ్ళంటారూ, అమ్మాయికి సెలవిచ్చేశారని-బెంగాలీలు అంటారూ. 'వావ్ లకి ఇచ్చేరని-"
"అది అబద్దం!"
"అవును. కాని. నిజానికీ, మేనేజిమెంటుకి చాలా దూరం పోర్టుస్ట్రైక్ చూశారుగా టెంపరరీ లేబర్ కోసం రిక్రూటి మెంటు అయినా, ఇవేళ పెర్మినెంట్ చెయ్యమంటారు. దానికోసం పెర్మనెంటూ, టెంపరరీ - అందరూ హర్తాల్! ఇందులో నిజమేమిటి. న్యాయంఏమిటి.
గోపాలం ఏమీ అనలేదు. ఆమె స్వంత పెళ్ళికోసం ఒక అమ్మాయికి సెలవివ్వడం ఇంత విమర్శ నీయంగా ఉంటుందని అతనికి తెలియ లేదు ఇప్పటిదాకా.
కొంచెంసేపు ఆగి, కృష్ణన్. "రేసేస్ కి వొస్తారా? రేపుమంచి కార్డు వుంది?" అన్నాడు.
నో థాంక్స్ " అన్నాడు గోపాలం.
"అదృష్టవంతులు మీరు-మిసెస్ గోపాలం కిందటివారం కనిపించేరు. బూక్వీన్ మీద నేను ఏభై. ఆమె వందా పారేసుకున్నాం. చెప్పేరా?"
ఆశ్చర్యపడ్డాడు గోపాలం. ఆమె తనకి చెప్పనేలేదు!
"అలాటి విషయాలు చెప్పదావిడ?" అన్నాడు.
"అదృష్టవంతులు" అని మళ్ళీ అని వెళ్ళి పోయాడు కృష్ణన్. ఆలోచనలో పడి టైమయాక ఇంటికి వెళ్ళిపోయాడు గోపాలం.
అతను వెళ్ళేసరికి వసంత ఇంట్లో లేదు.
టీ తాగి "అమ్మగారు ఎక్కడికి వెళ్ళేడు?" అని అడిగేడు సర్వెంటుని" - తెలియదు సార- ఎవరో టెలిఫోన్ చేసే వెళ్ళిపోయారు" అన్న జవాబు విని నిట్టూర్చి బయటికి నడిచేడు.
ఈ మధ్య వసంత తరుచు వెళ్ళిపోతోంది ఎక్కడికో - రాత్రి ఎనిమిది దాటేదాకా రాదు. ఒకవేళ తానింట్లో వుంటే సాయంత్రం తననీ క్లబ్బుకి బయలుదేరదీస్తుంది.
క్లబ్బు తనకి పడదు. డ్రింక్స్ అంటే తనకి మరీ అసహ్యం. డ్రింక్స్ వొద్దంటే. పోనీ. బీరు తాగుతావా అంటారు. వాళ్ళ దృష్టిలో బీర్ డ్రింక్ కాదు.
రెండుమూడుసార్లు వసంత విస్కీ తాగడం చూశాడు. ఎంత "లైట్" గా ఉన్నా మొట్టమొదటిసారి తనకి షాక్ లాగ అయింది ఆమె తాగడం చూసి.
ఆరోజు ఇప్పటికీ తనకి జ్ఞాపకం ఉంది-బయట వర్షం పడుతోంది. తనూ, బెనర్జీ, వసంతా మిసెస్ బెనర్జీ - అరుణా బ్రిడ్జ్ ఆడుతూంటే బెనర్జీ తనని, "పార్ట్ నర్! ఏం తాగుతావు?- మీరు, మిసెస్ గోపాల్?" అన్నాడు.
"నాకేమీ వొద్దు" అన్నాడు గోపాలం.
వసంత మాట్లాడలేదు. బెనర్జీ తనని చాలా బలవంతంచేసినా, లెమన్ కన్న బలమైనదేదీ తాను తీసుకోలేదు. బెనర్జీ మూడు విస్కీలూ, లెమనూ ఆర్డరు చేశాడు. ఆశ్చర్యంలో, అనుమానంతో ఏమీ అనలేకపోయాడు గోపాలం.
"గోపాలంది చాలా బలమైన స్వభావం...ఈ క్లబ్ లో ఉన్న నలుగురు తాగనివాళ్ళల్లో ఆయన ముఖ్యుడు" అన్నాడు బెనర్జీ.
"ఎప్పుడో తప్ప వసంతా ముట్టుకోదు- బహుశా ఆమెకి అవసరంలేదు!" అంది అరుణ తననీ, ఆమెనీ వరసగా చూస్తూ.
వవంత బుగ్గలోకి ఎరుపువొచ్చింది....కాని, ఈమాటకి కాదని తెలుసు, తనకి.
ఆ తరవాత అట్టేసేపు ఆడలేదు. లైబరీకి వెళ్ళిపోయాడు తాను. వొచ్చేసరికి వరండాలో కుర్చీలు వేసుకుని వసంతా, అరుణా, బెనర్జీ, మరెవరో ఆవిడా మాట్లాడుకుంటున్నారు. నలుగురి చేతుల్లోనూ గ్లాసులున్నాయి. అది ఎన్నో డ్రింకో అతనికి బోధపడలేదు.
ఇంటికి వొచ్చేదాకా తనుకాని, వసంతకాని ఏం అనలేదు. రాగానే ఆమె స్నానానికి వెళ్ళి గంటతరవాత వొచ్చింది.
భోజన సమయంలోనూ ఆమె ఏమీ మాట్లాడ లేదు. ఆమెని ఎలాగ మందలించడమో అతనికి తెలియకా. ఆమెని ఏమీ అనే ధైర్యం కూడగట్టుకోలేక అతనూ ఏమనలేదు- తన పిరికితనానికి తననే నిందించుకున్నా. ఆమె కళ్ళల్లో బాధా చిహ్నాలు చూసి. తన నిశ్శబ్దమే ఉత్తమం అనుకున్నాడు.
భోజనం అయాక కొంచెంసేపు తిరిగిరావడం అలవాటు ఇద్దరికీ. చెయ్యీ చెయ్యీ కలుపుకు నడుస్తూంటే రోడ్డుమీద- ముఖ్యంగా పార్కు స్ట్రీట్ లో తమవొంక తేరిపారి చూస్తూన్న మనుష్యుల్ని చూసి ఆనందించడం దినచర్య ఐపోయింది వాళ్ళిద్దరికీ.
ఆ రోజు ఆమె రానంది.
ఒంటరిగా విడామ్ సేలస్ దాకా నడిచి. చుట్టు తిరిగి చౌరంగి రోడ్డులోంచి ఇంటికివొచ్చాడు. వొచ్చేసరికి ఆమె పడుకుంది. ఆమెని లేపడం ఇష్టంలేక డ్రాయింగ్ రూం లో లైటు వేసుకుని చాలాసేపు చదివి వెళ్ళి ఆమెని లేపకుండా నిద్రపోయాడు.