"కంగ్రాచ్యులేషన్స్!" అంటూ అతని చుటూ మూగి అభినందనలు తెలిపారు. అందరికీ స్వీట్సూ, హాటూ ఇప్పించే వరకూ వదల్లేదు.
"మీరు మైల్డ్ గా కనబడతారు గానీ చాలా యాక్టివ్ అన్నమాట" నవ్వుతూ అంది గీత. చలపతికి నవ్వాగలేదు.
ఆరోజు ఇంటికి చేరుకునేసరికి సాయంత్రం అయుదున్నర అయిపొయింది. ఆఫీసులో టీ పార్టీ ఇవ్వడం మూలానా తన దగ్గరున్న డబ్బులో చాలావరకు అయిపొయింది. ఇక మిగిలుంది పాతిక రూపాయల పై చిల్లర.
దాంతో నెలంతా గడవాలి! సావిత్రిని ఓ సినిమాకి తీసుకెళితే అది కూడా అయిపోతుంది. ఈ లెక్కలో తన సావిత్రిని సుఖపెట్టగలడా! లేక అందరిలాగానే పరిస్థితులకు తల ఒగ్గేయాటమేనా?
ఆమెని ఓ వంటింటి మరబోమ్మగా చేసి, ఎలాంటి సుఖానికీ నోచుకోకుండా - ఊహూ! వీల్లేదు! సావిత్రి అలాంటి సాదా జీవితం గడపటానికి వీల్లేదు. ఆమె అందరి స్త్రీ కాదు. తనకు తెలుసా సంగతి. ఎవరోప్పుకున్నా ఒప్పుకోక పోయినా అది నిజం!
"ఏమిటా ఆలోచన, ఇంటిలో కొచ్చినా?" నవ్వుతూ అడిగింది సావిత్రి.
"ఏముంటాయ్! నా దగ్గరకొచ్చి నువ్వేం సుఖపడుతున్నవా అని ఆలోచన వచ్చింది. అక్కడున్న కష్టాలన్నీ ఇక్కడా ఉన్నాయ్. ఇరుకు ఇల్లు, చాలీ చాలని ఆర్ధిక పరిస్థితి."
"మీరు కలల్లో ఎక్కువగా విహరించకండి! ఇక్కడ నాకేం తక్కువయిందని! నన్ను ప్రేమగా చూసుకునే భర్త. ఎలాంటి బాధలూ లేని సంసారం - ఇంతకంటే ఇంకేం కావాలి ఏ స్త్రీకి మాత్రం ......."
సాయంత్రం ఇద్దరూ బస్ లో కోఠీ చేరుకొన్నారు. నిజానికి సావిత్రిని సావిత్రిని బస్ ఎక్కించటం చలపతికి చిన్నతనంగా తోచింది. కానీ నెలాఖరువరకూ వున్న డబ్బుతో గడపాలంటే అదొక్కటే మార్గం.
జనాన్ని తప్పించుకుంటూ చేతిలో చెయ్యి వేసుకు నడుస్తున్నారిద్దరూ షాపుల్లోనూ, నడిచే స్త్రీలు కట్టుకున్న చీరలు చూస్తోంటే విలవిలలాడిపోతున్నాడు చలపతి.
ఏమిటీ అన్యాయం! ఏమాత్రం అందం లేనివాళ్ళకి అలాంటి ఖరీదైన చీరలా? సావిత్రికి నేత చీరలా! దేవుడికి పక్షపాతం వుంది!
"సావిత్రీ! కొట్లో బొమ్మకీ కట్టిన చీర చూడు! నీకయితే ఎంతో బావుంటుంది కదూ?" నిరాశతో అడిగాడతను.
"నాకేదయినా బాగానే వుంటుంది! మీరూరికే అనుకోవడమే గానీ!"
చలపతి మాట్లాడలేదు. రేడియోలు, రికార్డు ప్లేయర్లు, ఫాన్సీ సామానులూ, ఖరీదయిన స్నోలూ, పౌడర్లూ సేంట్లూ, అన్నీ తనకి కళ్ళవెంబడి నీళ్ళు తెప్పిస్తున్నాయ్.
"తనలాంటి పక్షులు వాటి జోలికి పోరాదు" రేటు రూపంలో వుందక్కడ.
నెలరోజులు గడిచిపోయినాయ్! తను చేయాలనుకున్న వేమీ చేయలేకపోవడంతో మరింత నిరుత్సాహపడి పోయాడు చలపతి.
సావిత్రిని సుఖ పెట్టటమంటే కేవలం సాయంత్రం కోఠీ కి బస్ లో తీసుకెళ్ళడం వరకే పరిమితమయిపోయింది . ఎలా ఈ పరిస్థితి నదిగమించడం ! తను కన్న కలలన్నీ ఇంత త్వరగా కల్లలయిపోయాయేమిటి?
సినిమాకి బయలుదేరాడు చలపతి. హాలు దగ్గర పెద్దగా రష్ లేదు. క్యూ వేపు నడిచాడు. క్యూలో తనముందున్న శ్రీరామ్ముర్తిని చూడగానే ఆనందంతో పొంగిపోయాడు. వీపు మీద గట్టిగా ఒకటి చరిచాడు. అదిరిపోయి వెనక్కు తిరిగి చుసాడతను.
"ఓరి రాస్కెల్! నువ్వా!" ఆశ్చర్యంగా అన్నాడు చలపతిని చూస్తూ.
"ఎక్కడ దొరుకుతావా అని చూస్తున్నాను! ఇక్కడన్నమాట , నువ్వు సామాన్యంగా దొరికే చోటు!" నవ్వుతూ అన్నాడు చలపతి.
"లేదు రా బాబూ! చాలా రోజుల తరువాత సినిమా కొచ్చాను. ఇంతకూ నువ్విక్కడెం చేస్తున్నావ్?"
"ఉద్యోగం!"
"ఓరినీ - ఎంతకాలమయింది?"
"మూడు నెలలు దాటింది?"
"బావుంది! ఇల్లెక్కడ?"
"మలక్ పేటలో!"
"పెళ్ళయిందా?"
"అదిగో, అక్కడ నుంచుంది చూడు! బ్లూ చీర! నా భార్య."
"ఒరీనీ - చాలా ఎడ్వాన్స్ లో ఉన్నావ్! ఎంతకాలమయింది పెళ్ళయ్?"
"నెల దాటింది! అంతే?"
"ఒరీనీ - రీసెంట్ అన్నమాట! ఈ మధ్య శ్రీకాంత్ కనబడ్డాడులే ఓ సారి! నీ గురించి అడిగాడు! నాకేమీ తెలీదని చెప్పాను! నువ్వు కనబడి చాలా కాలమయిపోయిందట! అందుకని బెంగ పెట్టుకున్నాడుటవాడు!" నవ్వుతూ అన్నాడు శ్రీరామ్మూర్తి.
"అంటే- వాడు ఇక్కడే ఉన్నాడా?"
"నిక్షేపంగా - ఇన్ కంటాక్స్ డిపార్ట్ మెంట్ లో పెద్ద ఆఫీసరు . కారూ, వ్యవహారం చాలా దర్జాగా ఉన్నాడ్లె!"
"వాడి అడ్రసేమిటి? నాకు వాడిని చూడాలనే వుంది!"
"నా డైరీలో వుంది! కనుక్కోవడం తేలికే! అబిడ్స్ దగ్గరే ఆఫీసు! ఇల్లేమో బంజారాహిల్స్ దగ్గర !........" బుకింగ్ విండో దగ్గర చేరుకున్నారిద్దరూ.
చలపతి వారిస్తున్నా వినకుండా ముగ్గురికి తనే టిక్కెట్లు తీసుకొన్నాడు శ్రీరామ్మూర్తి.
"సావిత్రీ ఇడుగో! వీడు నా ఫ్రెండ్ శ్రీరామ్మూర్తి! నాతొ పాటు కాలేజీలో చదివాడు!"
సావిత్రి సమస్కరించిందతనికి.
"ఇంతకూ నువ్వేం చేస్తున్నావురా?" చలపతి అడిగాడు.
"ఆర్టీసీలో కంట్రోలర్!"
"పెళ్ళయిందా?"
"ఇంకా లేదు! మనం హల్లో కూర్చుని వివరాలు మాట్లాడుకుంటే బావుంటుంది! లేకపోతే ఇక్కడుండగానే సినిమా వదిలేసే అవకాశాలెక్కువున్నాయ్! నవ్వుతూ అన్నాడు శ్రీరామ్మూర్తి. ముగ్గురూ హాల్లోకి నడిచారు.
సినిమా వదిలేవరకూ ఏవేవో పాత విషయాలన్నీ గుర్తుకు తెచ్చుకుంటూనే గడిపారిద్దరూ. సావిత్రి మాత్రం సినిమాలో లీనమయింది.
ఇద్దరూ ఒకరి అడ్రస్ లు ఒకరు తీసుకొని విడిపోయారు. ఆటోలో ఇల్లు చేరుకున్నారు చలపతీ, సావిత్రీ.
వీలయితే మర్నాడే శ్రీకాంత్ ని కలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు చలపతి. ఆ రాత్రంతా సావిత్రికి శ్రీకాంత్ గురించి చెపుతూనే వున్నడతాను.
* * *
"నిజంగా ఎంత మంచి స్నేహితుడో తెలుసా సావిత్రీ! నా ప్రాణం లాంటి వాడనుకో. నాకు తెలీకుండా వాడే పనీ చేసేవాడు కాదు. నేనూ అంతే ! అన్నీ వాడికి చెప్పాల్సిందే. ఇప్పుడు నేను కనబడితే ఎంత ఆనందపడిపోతాడో తెలుసా? అసలు మననికరోజుకోసారయినా కలుసుకొందే వుండలేడు."
"అలాగయితే రేపే ఓసారి వెళ్లి కలుసుకొండతన్ని" అంది.
"నేనూ అదే అనుకుంటున్నాను. వీలయితే సాయంత్రం మనింటికి తీసుకొస్తాను."
"అలాగే! నేను స్పెషల్ టిఫిన్ చేసి వుంచుతాను మీ కోసం!"
చలపతి మళ్ళీ శ్రీకాంత్ గురించిన విషయాలు చెప్పడం మొదలు పెట్టాడు మధ్యలో అనుమానం వచ్చి చూసేసరికి సావిత్రి గాడనిద్రలో వుంది.
* * *