"రండీ ఇలా కూర్చోండి!" అంటూ అతనిని ఆహ్వానించిందామె.
"వీరే మా వారు! ఈయన మాఫ్రెండ్ ఉషాదేవి హజ్ బెండ్!" ఇద్దరినీ పరిచయంచేసింది.
"గ్లాడ్ టు సీ యూ..." కరచాలనం చేస్తూ అన్నాడతను శ్రీనివాసరావ్ చిరునవ్వునవ్వాడు.
"మేము బెంగుళూరులో ఉంటున్నాము. నేను ఆఫీసు పనిమీద వస్తోంటే తనూ వస్తానంది మా మిసెస్. తీరా వచ్చాంకదాని అతికష్టం మీద ఎలాగోలా మీ అడ్రస్ సంపాదించి మిమ్మల్ని చూడగలిగాము" నవ్వుతూ అన్నాడతను.
"ఇక్కడ ఎక్కడ దిగారు?" అడిగాడు శ్రీనివాసరావ్.
"నటరాజ్ హోటల్లో!".
"ఓహో...."
హేమ "టీ" తయారుచేసుకొచ్చివాళ్ళిద్దరికీ ఇచ్చి తనూ ఓ కప్పు తీసుకుని సోఫాలో కూర్చుంది. కొద్దిసేపు కూర్చుని వెళ్ళిపోయాడతను.
"సారీ! మీకు చెప్పకుండా వెళ్ళిపోయాను. ఉష బలవంతంగా తీసుకెళ్ళింది హోటల్ కి వాళ్ళ రూమ్ కి మాపాత ఫ్రెండ్స్ ని మరో ఇద్దరిని కూడా ఆహ్వానించిందట. అందరం కలిసి కాసేపు సరదాగా గడుపుదామని అనేసరికి కాదనలేకవెళ్ళాను....." శ్రీనివాసరావ్ తో అందామె.
శ్రీనివాసరావ్ ఏమీ మాట్లాడలేదు. అతని మనసులో అగ్నిపర్వతాలు రాజుకుంటున్నాయి. హేమ తనను అడగకుండా బయటకువెళ్ళడమేకాదు. ఇంతసేపూ హోటల్లో స్నేహితురాండ్రతో కబుర్లు చెప్తోందిట. అక్కడితో ఆగినా ఫరవాలేదు ఇంతవరకూ ముక్కూ మొగంతెలీని స్నేహితురాలి భర్తను వెంబడేసుకుని విహారాలు చేస్తూ ఇంటికొచ్చింది. తను ఆమె విషయంలో ఏమయినా సహించగలడుగాని ఆమె మరో మగాడితో చనువుగా ఉంటే సహించలేడు. తనకు ఆమె మీద నమ్మకం ఉంది. కాని ఆమె అందం మీదలేదు. ఎలాంటిమొగాడినయినా చలింపజేస్తుందది.
"ఇలా హోటళ్ళకెళ్ళడానికీ, ముక్కూ మొఖం తెలీనివాడితోతిరగడానికీ బుద్దుండక్కరలేదూ?" ఉద్రేకంగా అడిగాడతను.
అతను ఈ విధంగా మాట్లాడతాడనిగానీ, మాట్లాడగలడనిగానీ ఎప్పుడూ ఊహించలేదు. "ఏమిటి మీరనేది?" అందితేరుకుంటూ.
"నామాటలు అర్ధం కూడా కావటం లేదన్నమాట ఇలా నీ కిష్ట మొచ్చినవ్యక్తితో తిరగడం నాకిష్టం లేదని చెపుతున్నాను...."
"తి....రి....గా....నా....." తెల్లబోతూ అందామె.
"వాడిని ఇంటికి తీసుకురావడం తిరగడం కాదా?" హఠాత్తుగా ఆమెకు రోషం పొడుచుకొచ్చింది తను అతని అనుమతిలేకుండా స్నేహితురాలితో గడిపినంత మాత్రాన, ఆమె భర్త మర్యాదకోసం తనను ఇంటివరకూ దిగబెట్టినందుకు ఇన్ని మాటలు పడాలా? అసలిందులో తను చేసిన ఘోరం ఏమిటని?
"మీరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడకండి. అతను పొద్దుపోయిందని ఇంటివరకూ సాయంగావస్తే దీన్ని తిరుగుడనడానికి నోరెలా వచ్చింది?" అంది కోపంగా.
"చేసిన పనికి పడుండక ఇంకా ఎదురుసమాధానాలు కూడానా! నోర్మూసుకుని లోపలకు పో!" ఆమెను లోపలకు తోయబోతూ అన్నాడతను. హేమ అతనిచేతిని విదిలించికొట్టింది.
"నేనేం చేశానని మీరింత దౌర్జన్యం చేస్తున్నారు? మీది ఎంత ఇరుకు మనస్తత్వమో ఇప్పుడు తెలిసింది. ఇన్నాళ్ళూ సంసారం చేసిన భార్యను అర్ధం చేసుకోవడంచేతకాలేదు.
మీరింతఅనుమానపు మనుషులని తెలిస్తే అసలు మీతో వివాహానికే వప్పుకొనేదాన్నికాదు..."
"నువ్వు ఉపన్యాసాలివ్వగలవని నాకు తెలుసు! ఇప్పుడు చెప్తున్నాను విను. అవునే! నేను అనుమానపుమనిషిని నా భార్యను అదుపాజ్ఞల్లో లేకుండా ఎవడితో బడితే వాడితో విహారాలు చేయనిచ్చేంత విశాల మనస్తత్వం నాకు లేదు అవసరంలేదు కూడా. ఒకవేళ నీకు అలాంటి సరదాలుంటే అవన్నీ ఈ రోజుతో సమాధిఅయిపోవాలి. నేను నిన్ను ప్రేమించాను? నువ్వంటే ప్రాణమిస్తాను. నీకేం కావాలన్నా చేస్తాను. కనీ- ఇవన్నీ నువ్వు నన్నూ నామటనూ గౌరవించినంతకాలమే! తెలిసిందా?"
హేమకు కోపంతో కళ్ళ వెంబడి నీళ్ళు తిరిగినయ్ ఇదా అతని నిజస్వరూపం ఎంతటి ఘోరమయిన పరిస్థితిలో ఇరుక్కుపోయింది తను! పైకి చక్కగా కనిపించేరూపం, తీయగా వినిపించిన మాటలూ చూసి అతని ఆంతర్యం కూడా అలాంటిదే అని భ్రమపడి, వివాహానికి వప్పుకుంది. తను మగాడిలో ముఖ్యంగా ఏ పిశాచాన్ని అయితే పారద్రోలాలనుకుందో అదే పిశాచాన్ని తన భర్తలోనే ఎదుర్కోవాల్సివచ్చింది.
"ఓహో! అర్ధమయింది అంటే నేను ఏ మగాడినీ చూడకూడదు మాట్లాడగూడదు! కానీ మీరు మాత్రం కనపడ్డ ఆడదానితో మాట్లాడవచ్చు. మీ ఆఫీసులోని అమ్మాయిలతో విహారాలు చేయవచ్చు! వారితో హోటళ్ళకెళ్ళి విందులారగించవచ్చు. అంతేనా?" రోషంగా అందామె.
శ్రీనివాసరావ్ కేం జవాబు చెప్పాలో తెలీలేదు తనకు తన సెక్షన్ లోనే పనిచేసే రుక్మిణి తోమంచి స్నేహంవుంది. ఆమె బర్త్ డేనాడు ఆమెకున్న కొద్దిమంది సన్నిహితులతో పాటు తననూ డిన్నర్ కు పిలిచింది. ఇవన్నీ హేమకు తెలుసు అయినా తను మగాడు. తనను ప్రశ్నించే అధికారం ఆమె కెక్కడిది?
"అవన్నీ నీకనవసరం! మేమంతా ఒకచోట కలిసి పనిచేస్తాంగనుక పరిచయాలూ, స్నేహాలూ ఏర్పడతాయి. మీ స్నేహితురాలి భర్తతో తిరగడానికి నీకేం అవసరం ఉందీ....."
"అతను నన్ను డ్రాప్ చేయడానికొచ్చాడని ఓసారి చెప్పాను. మీకు సంస్కారంలోపించినంత మాత్రాన అందరూ సంస్కార హీనులయి ఉంటారని అనుకోవడం పొరపాటు"
"అయితే నేను సంస్కార హీనుడినీ, నువ్వు గొప్ప సంస్కారంగలదానివీనూ! అంతేగా?"
"అవును! ఖచ్చితంగా చెప్పగలనా విషయం మీలా కుచ్చింతగా నేను ఆలోచించలేదు."
"ఊరుకుంటున్న కొద్దీ నెత్తికెక్కుతున్నావ్ గానీ ఇక నోర్మూసు కో..." ఆగ్రహంతో అన్నాడతను.
ఆమె చివాలున వెనక్కు తిరిగి ఇంట్లోకి నడిచింది. ఆమెను కోపం దుఃఖం రెండూ మిళితమయి నిస్సహాయురాలిని చేసినయ్. ఆ రాత్రి ఇద్దరూ మాటల్లేకుండానే గడిపారు.
మర్నాడు అతను భోజనం చేయకుండానే ఆఫీసుకెళ్ళిపోయాడు.
అతని ప్రవర్తనతో హేమమనసంతా పాడయిపోయింది. తను అతనిని వివాహంచేసుకోవడం తొందరపాటు నిర్ణయమేమో అన్న ఆలోచన కలిగింది.
తనూ భోజనం చేయకుండానే పడుకుండిపోయింది. మధ్యాహ్నం మూడవుతోండగా 'పోస్ట్' అన్న కేక వినిపించిందామెకు. లేచి వెళ్ళి పోస్ట్ మాన్ అందించినకవరు తీసుకుందామె ఫ్రమ్ అన్న చోట చంద్రకాంత్ అని రాసి వుంది వుత్తరం తీసి ఆత్రుతగా చదవడం మొదలుపెట్టింది.
"హేమగారూ!
నమస్తే!
ఇంకా నేను గుర్తున్నాననే అనుకుంటాను. మీ ఇంటికి మా అక్క ఉత్తరం రాసి మీ అడ్రస్ సంపాదించింది. ఆ అడ్రస్ లాక్కుని ఆమెకంటే నేనే ముందు మీకు ఉత్తరం రాస్తున్నాను. మిమ్మల్ని నేను గుర్తుచేసుకోని రోజు లేదు. ఏదో ఒక సందర్భంలో మీరు గుర్తుకొస్తూనే ఉంటారు మొన్న మాకాలేజీలో 'భవిష్యత్తులో స్త్రీ' అన్న విషయం మీద డిబేటింగ్ జరిగింది. నేనేం చేసానో తెలుసా? మీరు అదివరలో మాసావనీర్ కి రాసిన వ్యాసం గుర్తుందా? బహుశా మీకు గుర్తులేదేమో....కానీ అదంతా ఇంచుమించుగా కంఠతా పట్టేశాను. డిబేటింగ్ లో అదే చదివేసరికి తప్పట్లు మోగిపోయినయ్. నాకు రెండో బహుమతివచ్చింది. మీ వ్యాసం చదివి నేను బహుమతి గెల్చుకోవడం తప్పేననుకోండి! కానీ బహుమతికోసం నేనాపని చేయలేదు. మీ వ్యాసంలోని ప్రతి అక్షరమూ నా ఆలోచనలకు అనుగుణంగానే ఉంది. అసలు నాకు ఆలోచించడం నేర్పింది కూడా మీరే మీతో మాట్లాడటమే నాకు ఎడ్యుకేషన్ అయింది. మిమ్మల్నోసారి చూడాలనివుంది కానీ ఇప్పట్లో సాధ్యం కాదనుకోండి. మీరెలా వున్నారు? కొత్త జీవితానికి ఎడ్జస్ట్ అయిపోయారా? ఇక వుంటానండీ! మీ ఉత్తరం కోసం ఎదురుచూస్తూ వుంటాను.
మీ
చంద్రకాంత్.
ఆ ఉత్తరం ఆమెకు ఎంతో సంతోషం కలిగించింది. అతను రాసిన విషయాలు పొగడ్తల్లా వున్నాచాలావరకూ నిజాలే. అతనితో తను ఎప్పుడూ మాట్లాడినా తన అభిప్రాయాలన్నీ బలవంతంగా నయినా సరే అతని మీద రుద్దుతూండేది. అందుకే అతనికి తనమీద, తన అభిప్రాయాలమీద గౌరవం ఏర్పడింది. ఆమెగర్వంగా ఫీలయింది.
ఈ ఉత్తరం శ్రీనివాసరావ్ చూడాలి. అప్పుడు గాని తన గురించి అతనికో అభిప్రాయం ఏర్పడదు. ఆ ఉత్తరం టేబుల్ మీద పెట్టిందామె. తరువాత తను వంట ప్రయత్నంలో పడింది. శ్రీనివాసరావ్ వస్తూనే ఉత్తరం చదివాడు.
అతనికి ఆగ్రహం ఆకాశాన్నంటింది. ఎవరీ చంద్రకాంత్? అతనికి హేమకు సంబంధం ఏమిటి? అతగాడికి హేమనోసారి చూడాలనివుందా? ఎందుకు? పాత ప్రణయాన్ని తిరగదోడటానికా? వారిద్దరికీ అలాంటి సంబంధంలేకపోతే ఇంతటిచనువుతో ఉత్తరం ఎందుకు వ్రాస్తాడు? తను మోసపోయాడా? ఏమో! హేమ అందగత్తె! ఎంతమంది ఆమె నాశించారో ఆమె ఏ ఒక్కరికీ లొంగకుండా వుంటుందా? ఆమెకూ ఈ చంద్రకాంత్ కీ అలాంటి సంబంధం లేకపోతే అతని విషయం తనకెప్పుడూ ఎందుకు చెప్పలేదు?
"ఈ ఉత్తరం రాసిందెవరు?" వంటింట్లో ఉన్న హేమదగ్గరకెళ్ళి అడిగాడు శ్రీనివాసరావ్. "మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు!" అతని వంక చూడకుండానే సమాధానం చెప్పింది ఆమె.
"అతనికి నీకూ ఎంతో స్నేహంవుండేదనుకొంటాను" తిరిగి అన్నాడతను.
"అవును!" కావాలనే అందామె.
"మరి స్నేహం వున్నవాళ్ళు పెళ్లెందుకు చేసుకోలేదు?"
ఆమె అతనివేపు కోపంగా చూసింది.
"మీరూ మీ నాగమణి పెళ్లెందుకు చేసుకోలేదు?" అతను నిరుత్తరుడయ్యాడు.
"అతివాగుడు వాగకు! నే నడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పు. అంతే!"