"అతివాగుడెవరిదో ఆలోచిస్తే తెలుస్తుంది.....? ఆ మాట పూర్తవుతూండగానే ఆమె చెంప చెళ్ళుమనిమోగింది. బొటబొట కన్నీరు కారిందామెకు. "ఈ ఒక్క విషయంలోనే మీకు ఆధిక్యత వుంది, మీ పశుప్రవృత్తి యిప్పుడు బయటపడింది...." అందామె రోషంగా.
మళ్ళీ కొట్టబోయాడతను కానీ ఆమె కళ్ళల్లోకి చూసి చేయిదించేశాడు.
"నీ పొగరు తగ్గకపోతే రోజూ నీకిదే శాస్తిజరుగుతుంది...." అనేసి అక్కడినుంచి బయటిగదిలోకి వెళ్ళిపోయాడతను.
హేమ చాలాసేపు అక్కడే శిలాప్రతిమలా నిలబడిపోయింది. ఓ పక్క దుఃఖం మరో పక్క అవమానం, ప్రతీకారం తీర్చుకోవాలన్న కక్ష మనసుని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయ్. అతను ఇలా చేతల్లోకి దిగుతాడని తను అనుకోనేలేదు. భార్యలను కొట్టే భర్తలను చూసి వారెందుకు తిరగబడరా, అలాంటి మూర్ఖులను వదిలి తమ జీవితం తామెందుకు గడపరా అని అనేకసార్లు అనుకుంది కానీ తిరగబడడం ఎంత కష్టమో ఇప్పుడు తెలుస్తోందే. అతను కొట్టగానే షాక్ తిన్నట్లయిపోయింది. అతనలా ప్రవర్తించగలడని ముందే ఊహించివుంటే ఏం జరిగేదో తనకు తెలీదు. బహుశా అతని చెంపకూడా పగలగొట్టడానికి ప్రయత్నించి ఉండేదేమో!
కానీ ఆ తరువాత జరిగేది కూడా తను తేలిగ్గానే ఊహించుకోగలదు. తనను ఇష్టమొచ్చినట్లు గొడ్డులా బాదేవాడతను. అలాంటి పరిస్థితి తెచ్చుకోవడం వాంఛనీయమా? ఆలోచిస్తున్న కొద్దీ దుఃఖం ఆగడం లేదామెకి. అతనికి బుద్ది చెప్పడం ఎలా? స్త్రీని కూడా పురుషునితో సమానంగా చూడాలని ఉపన్యాసాలిచ్చిన తఃనేనా అతని దారుణానికి తల ఒగ్గిందీ? అతనిని వదలిపుట్టింటికెళ్ళడంకష్టమేం కాదు. కావాలంటే అతను తనను కొట్టినట్లు పోలీస్ కి రిపోర్ట్ యిచ్చి అతనికి శిక్ష విధించేలా కూడా చేయగలదు. ఆ తర్వాత ఇంకా ఇద్దరకూ విడాకులే! అందుకూ తనుభయపడడం లేదు! కాని అతనికి అప్పటికికయినా బుద్ది వస్తుందని ఏమిటి నమ్మకం? అలాంటి మొగాళ్ళ అహంకారం మీద దెబ్బకొట్టాలి. వాళ్ళ మనో ప్రవృత్తిమారిపోయేలా గాయపరచాలి. అది ఇంకా చాలా మందిమగాళ్ళు మారేందుకుతోడ్పడాలి. అదీ తనధ్యేయం.
శ్రీనివాసరావ్ కి ఉద్రేకం తగ్గాక తనుచేసిన పనికి పశ్చాత్తాపంతో నిండిపోయింది. మనసంతా నిజానికి సరయిన కారణమేమీ లేకుందానే తను ఆమె మీద చేయిచేసుకున్నాడు. కావాలని తనే ఆమెను కవ్వించిహింసిస్తున్నట్లుంది. అలా చేయడంతప్పే! కానీ తన మనసూ, ఆలోచనలూ, చేతులూ ఇవే తన అధీనంలో ఉండడం లేదు. ఆమె ఇంకా తన పాతధోరణిలోనే ఆలోచించడంవాదించడం ఇవన్నీ తనకు తెలీకుండానే ఆమె మీద ఓ విధమయిన అయిష్టాన్ని పెంచేస్తున్నాయ్.
తను సుధీర్ తో వాదించినదంతా తేలిపోతున్నట్లు భావన! తనే ఓడిపోతున్నాడేమోనని భయం! అనేక విషయాల్లో తనే రాజీపడాల్సివచ్చింది. అదీ అయిష్టంగానే! ఆ తరువాతయినా ఆమె తన దారిలోకొస్తుందన్న ఆశతోనే. ఏ విషయాలెలా వున్నా ఆమె మరో మగాడితో చనువుగా వుండడంమాత్రం తను సహించలేడు. ఎవరయినా అందమయిన అమ్మాయితో పరిచయమయితే తను ఆమె గురించి ఎలా ఆలోచిస్తాడో తనకు తెలుసు. ఆమెకు ఎలాగోలా లోబరుచుకొని, అనుభవిస్తే బావుండునని ఎంతమంది విషయంలో అనుకోలేదు? ఎంతమంది విషయంలో ప్రయత్నాలు చేయలేదు? మరి అందరు మొగాళ్ళూ తనలాంటి వారేగా? వారిని హేమ అందం ఆకర్షించకుండా ఎలా వుంటుంది? ఆమెతో పరిచయం పెంచుకుని ఆమెతో ప్రణయం జరుపుతేబావుండునని వారుమాత్రం అనుకోకుండా ఎలా వుంటారు? ఆ పరిస్థితిరానీయడమే తనకిష్టంలేదు. ఆమె తన అపురూపమయిన బొమ్మ. ఆమె తనదిగానే ఉండిపోవాలి. మరొకరు కన్నెత్తి చూడటంకూడా తనకిష్టం వుండదు.
తను కాలేజీలో చదివేరోజుల్లో కాలేజీపక్కనే డాబా ఇంట్లో ఉండే ఇన్ స్పెక్టర్ గారి భార్య ఏమయింది? అందరితోనూ చనువుగా మసిలేది. ఆమె భర్త ఆమెకుపూర్తిగా స్వేచ్చ ఇచ్చేవాడు. అది కాస్తా ఆమె దుర్వినియోగం చేసుకుని ఓ యువకుడితో లేచిపోయింది. తనమనసులో ఆ సంఘటనబలమయిన ముద్రవేసింది. అదుపూ అజమాయిషీ లేకపోతే ఆమె కాదు ఏ ఆడదయినా అంతేనన్న భయం ఆ రోజునుంచే తన మనసులో చోటు చేసుకుంది.
హేమ అలాంటి స్త్రీ కాదని తనకు తెలుసు ఆమెకు అలాంటి ఆలోచనలురావని కూడా తనకు నమ్మకంవుంది కానీ ఆమె మరోమగాడితో మాట్లాడితే చాలు. తన మీద తనకు అదుపు తప్పుతుంది. నిజానికి చంద్రకాంత్ రాసిన ఉత్తరంలో తను అనుమానపడాల్సిన అంశమేమీలేదు. అతనికి హేమంటే ఉన్న అభిమానానికి విపరీతార్ధం తీయాల్సిన అవసరం లేదు. అయినా తను కావాలని ఆమెను నానా మాటలూ అని ఆమెను నొప్పించాడు. అక్కడితో ఆగక ఆమె ఏదో సమాధానం చెప్పిందని మొట్టమొదటిసారిగా చెంపకూడా చెళ్ళుమనిపించాడు.
శ్రీనివాసరావుకి ఆలోచిస్తున్న కొద్దీ ఆమె మీద జాలి పెరిగిపోసాగింది. ఇప్పుడేమిటి చేయడం? తన మనసులోని పశ్చాత్తాపమంతా ఆమెకు తెలియజేసితనే పరిస్థితులలో ఆమె పై చేయిచేసుకున్నాడో వివరించి తనను క్షమించమని అడగాలా? అలా అడిగితే ఆమె తనను ఇకనుంచీ చులకనగా చూడదుకదా? తను ఆమెకు భయపడి అలా క్షమార్పణ అడిగాడని అనుకొనే అవకాశం ఉందా? అసలు తను అడిగినంత మాత్రాన ఆమె క్షమిస్తుందా? ఈ సంఘటన అంత తేలికగా తుడిచివేయగలుగుతుందా? ఏమో! తనకు నమ్మకంలేదు. అయినా ఆమెను బ్రతిమాలాల్సిందే. లేకపోతే తనమనసులో అశాంతి పేరుకుపోతుంది. నెమ్మదిగా వంటింటివేపు నడిచాడు శ్రీనివాసరావ్. ఆమె ఇంకా గోడకానుకునే నిలబడి వుంది అతన్ని చూస్తూనే మొఖం తిప్పుకుందామె. ఆమె దగ్గరగా నడిచాడతను ఆమె అక్కడి నుంచి విసురుగా బయటకు వెళ్ళిపోబోయింది. చటుక్కున ఆమె చేయి పట్టుకుని ఆపాడతను.
"హేమా! నేనే తొందరపడ్డాను! క్షమించు...." అన్నాడు ఆమెను దగ్గరకు తీసుకోడానికి ప్రయత్నిస్తూ.
ఆమె అతని చేతిని విడిపించుకుని దూరంగా జరిగింది. "మీతో మాట్లాడడమేనా కసహ్యం" అంది ద్వేషం నిండిన కళ్ళతోచూస్తూ.
"సారీ హేమా! తప్పు జరిగిపోయింది. నేను ఎంత అవివేకంగా ప్రవర్తించానా అని నన్ను నేనేనిందించుకుంటున్నాను...."
ఆమె మాట్లాడకుండా అక్కడినుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నించింది. అతను ఆమెను రెండు చేతులతో చుట్టివేసి తన కౌగిట్లోకి లాక్కున్నాడు.
"హేమా! తప్పు నాదేననివప్పుకుంటున్నాగా! ఇంక మర్చిపోలేవా?"
"నన్నువదలండి!" అతనికౌగిలినుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ అందామె.
అతను ఆమెను మరింతగా అదుముకున్నాడు. "హేమా ప్లీజ్ మాట్లాడవూ?"
"ఇంత అనుమానపడే మనిషి దగ్గర ఉండటం నాకిష్టం లేదు." కఠినంగా అందామె. "సారీ హేమా! ఆ ఉత్తరం చూడగానే నాకు కోపం వచ్చింది. నాకు కోపం వచ్చింది. నాకుతెలీకుండా నీకలాంటి స్నేహితుడున్నాడనీ ఆ విషయం నువ్వు రహస్యంగా దాచావనీ అనిపించింది....."
"అవునండీ! అలా దాచేదాన్నయితే ఆ ఉత్తరం మీ టేబుల్ మీద ఉంచాల్సిన అవసరంనాకేముందీ? చింపి పారేస్తే మీకు తెలిసేదా?"
"నిజమే! అవన్నీ అప్పుడు నేను ఆలోచించలేదు...." పశ్చాత్తాపంతో అన్నాడతను. హేమకొంత మెత్తబడింది. చేసింది తప్పని అతను తెలుసుకున్నప్పుడు తను ఎందుకు క్షమించకూడదు?
"మీరో విషయం గుర్తుపెట్టుకోండి! ఆడది తప్పు చేయాలనుకొంటే భర్త కళ్ళుకప్పటం ఏమంత కష్టంకాదు. మీరు దండించినంత మాత్రాన నన్ను అదుపులో ఉంచుకోగలననుకోవడంకూడా పొరపాటే!" కోపం అణుచుకొంటూ అందామె.
శ్రీనివాసరావ్ కి ఆమె మాటల్లో నిజంకనిపించింది. మరోసారి ఆమె మీద చేయి చేసుకోకూడదని నిశ్చయించుకున్నాడు.
మర్నాడు తను పంపిన కథ ప్రచురింపబోతున్నట్లు పత్రిక నుంచి ఉత్తరం వచ్చిందామెకి.
ఆమె మనసు ఆనందంతోనిండిపోయింది తమస్త్రీలు అనుభవిస్తున్న బానిస జీవితానికి నిరసన తెలియజేయడానికి ఇదో మంచి సాధనంగా కనిపించిందామెకి. విప్లవనారీ సమితి ద్వారా తాము పెద్దగా సాధించిందేమీ లేదు. అది తమ ఊరివరకే పరిమితమయిపోయింది కానీ రచనా వ్యాసంగంవల్ల మరెన్నో వాస్తవాలని మరింత విస్తృతంగా వెలుగులోకి తీసుకురావచ్చు. మరెంత మందినోమేల్కొలపవచ్చు.
అప్పటికప్పుడే కూర్చుని మరోకథ రాయడానికి ప్రయత్నాలు ప్రారంభించిందామె. ఈసారి ఏ కత రాయాలా అనేది ఆమెకి ఓ సమస్య అయిపోయింది. ఎంతసేపు ఆలోచించినా ఎటూ తోచడం లేదామెకి హఠాత్తుగా అంతకుముందురోజు తనకూ శ్రీనివాసరావుకీ మధ్యజరిగిన సంఘటన కదిలిందామె మనసులో అవును! అలా తనకోన్యాయమూ, భార్యకో న్యాయమూ పాటించేమగాడి గురించి అల్లాలికథ. ఆ కథ శ్రీనివాసరావ్ కీ ఇంకా అలాంటి మొగాళ్ళందరికీ చురక పెట్టినట్లుండాలి ఆడదాన్ని పశుబలంతో కట్టిపడవేయగలమనుకోవడం అవివేకమని నీతిపాఠం చెప్పాలి.
ఉత్సాహంతో వ్రాయడం సాగించిందామె. శ్రీనివాసరావ్ వచ్చేవరకూ రాస్తూనే ఉందామె. లోపలికొస్తూనే సరాసరి ఆమె దగ్గరకు నడిచి "టీ ఇవ్వా త్వరగా! నేను వెళ్ళాలి మళ్ళీ!" అన్నాడు బట్టలు మార్చుకుంటూ.
"ఎక్కడికి?" అడిగిందామె.
"మా ఫ్రెండ్స్ రూమ్ లో పార్టీ ఉందివాళ! అయినా అన్నిటికీ 'ఎక్కడికి? ఎందుకు?' అని అడగటంమంచి అలవాటుకాదు!" విసుగ్గా అన్నాడతను.
"ఎందుకని!"
"మగాడన్నాక లక్షపనులుంటాయి. లక్షవ్యాపకాలుంటాయి. అవన్నీ నీకు చెప్పి చేయాలా ఏమిటి?"
హేమకోపం అణచుకొంటూ వంటింటివేపు నడిచింది. టీ తయారు చేస్తూండగానే అతను రడీ అయి వంటింటిలోకి వచ్చేశాడు.
"ఏమిటి? ఇప్పుడు తయారు చేస్తున్నావా?"
"అవును!"
"ఎందుకని? రోజూ రడీ చేసి ప్లాస్కులో ఉంచేదానివిగా!" ఆమె మాట్లాడలేదు.
"ఓహో.....రచయిత్రివి కదూ! అందుకని ఇంటిపని బద్ధకం కలుగజేస్తున్నట్లుంది పోనీ వంట మనిషిని ఏర్పాటు చేయమంటావా?" హేళనగా అన్నాడతను.
"మీరు అస్తమానం వేధించకుండావుంటే వంటమనిషిని ఏర్పాటు చేసినంత ఫలితం!" అందామె 'టీ' కప్పులో పోసి అతని కందిస్తూ.
అతను హేళనగా నవ్వాడు.