"అలా అని నేననలేదు!".
"మరెందుకిలా చేశావ్?"
ఆమె మాట్లాడలేదు.
"ఆల్ రైట్, పద! త్వరగా రడి అవ్! మనం బయటకెళ్ళి హోటల్లో భోజనం చేసివద్దాం!" "నేనెందుకులెండి! మీరు చేసి రండి!"
"అదిగో! అదే వద్దన్నా! పద త్వరగా!"
"నేను రాను!"
"ఎందుకని?"
"ఉదయం నా విషయం గుర్తులేదు మీకు! ఇప్పుడు మాత్రం ఎందుకు?"
"సారీ హేమా! అయామ్ ఎక్స్ ట్రీమ్లీ సారీ! సరేనా?"
"నేను నిద్ర లేవకపోతే మీరు హోటల్ కెళ్ళిపోయారు అంతేగాని ఆ కాఫీ మీరే తయారుచేసినాకివ్వవచ్చన్న ఆలోచనే మీకు రాలేదు. ఎందుకంటే మీ ఉద్దేశ్యంలో చచ్చేంత వరకూ భార్యే వంటమనిషిగా ఉండాలి. మగాడికి వంటింటితో సంబంధం లేదు. మీరు ఉద్యోగం చేస్తున్నారు. సంపాదిస్తున్నారు. అదేగా మీ ఆధిక్యత! ఆ కారణం చేతేనేను వంటింట్లో మగ్గిపోవాలి!" రోషంగా అందామె.
శ్రీనివాసరావుకి నవ్వు వచ్చింది.
"అదా! నీకు ఊహలెక్కువ హేమా! అలా ఊహించుకోవడంమంచిది కాదు. నేను వంట చేయకూడదని ఎప్పుడూ అనుకోలేదు. నా కసలు కాఫీ చేయడంకూడా రాదు. ఇంతవరకూ ఆ అవసరమే కలుగలేదు. నువ్వేమో నీ మనసుకి తోచిన విధంగా కోపం పెంచుకొని భోజనంకూడా మానేశావ్!" హేమ అతని వంక నమ్మలేనట్లు చూసింది.
"నిజంగా మీకు కాఫీ తయారు చేయడంకూడా రాదా?"
'వట్టు వేయాలా?" నవ్వుతూ అడిగాడతను.
ఆమె సిగ్గుపడింది.
"పద! త్వరగా రడీ అయావంటే అలా కాసేపు తిరిగి భోజనం చేసి వద్దాం!"
మారు మాట్లాడకుండా గదిలోకి నడిచిబట్టలు మార్చుకోసాగిందామె తన ప్రవర్తన తల్చుకొంటే ఆమెకే నవ్వు వచ్చింది.
మర్నాడు ఉదయం తెల్లవారకుండానే తలుపుతట్టినచప్పుడయి లేచివెళ్ళి తలుపుతెరిచిందామె. ఎదురుగ్గా నిలబడ్డ వ్యక్తిని గుర్తుపట్టలేదామె. పంచె, లాల్చీ, కండువా వేసుకొని చేతిలో ఓ బాగ్ పట్టుకొన్నాడతను.
"శ్రీనివాసరావున్నాడా?" అడిగాడతను. వెంటనే భర్త తరపు బందువయి ఉంటాడని గ్రహించిందామె. "ఉన్నారు!" దారి ఇస్తూ అంది ఆమె.
"నేను శ్రీనివాసరావు బాబాయిన్లే...." లోపలికొస్తూ అన్నాడతను.
"అలా కూర్చోండి!" సోఫా చూపిస్తూ అందామె. అతను బాగ్ సోఫాలో పడేసి కూర్చున్నాడు. అతని కళ్ళన్నీ హేమ మీదే ఉన్నాయ్. నైట్ డ్రస్ లో ఉన్న ఆమెను చూస్తూంటే తమాషాగా ఉందతనికి. సినిమాల్లో చూశాడు ఇలాంటి వేషాలు! అంతే!
హేమ వెళ్ళి శ్రీనివాసరావుని నిద్ర లేపింది.
"చూడండి! మీ బాబాయి అట వచ్చారు...." అంది అతనితో శ్రీనివాసరావ్ లేచి కూర్చున్నాడు. "చచ్చాంరానాయనా!" అన్నాడు నవ్వుతూ.
"ఎందుకూ? తలనొప్పి బాపతా?" అడిగిందామె.
"అదేంకాదుగానీ-కొంచెం పాతకాలం మనిషి!" ఆమె కూడా నవ్వింది.
"ముందుమీరెళ్ళి మాట్లాడండి! లేకపోతే ఇక్కడికివచ్చినా వచ్చేస్తారు...."
శ్రీనివాసరావ్ లేచి బయటిహాల్లోకి నడిచాడు.
"ఎప్పుడొచ్చావ్ బాబాయ్?" పలుకరించాడతను.
"ఇప్పుడేరా! కోర్టు పనుండి ఇట్లా వచ్చాను! ఎలావుంది కొత్త సంసారం?"
"బాగానే వుంది!"
"అమ్మాయికి కొంచెం షోకెక్కువనుకుంటానే!"
శ్రీనివాసరావ్ ఉలిక్కిపడ్డాడు. "ఎందుకని?" అన్నాడు ఆశ్చర్యంగా.
"ఆ మరేంలేదు! ఆ డ్రస్సూ, యవ్వారం చూస్తూంటే కొంచెం ఇదిగా ఉందిలే!"
"అదంతా మామూలే లే! ఇంట్లో అంతా బావున్నారా?" సంభాషణ మార్చడానికి ప్రయత్నిస్తూ అన్నాడతను.
లోపలిగదిలో వాళ్ళ మాటలువింటున్న హేమకి వళ్ళంతా కంపరమెత్తినట్లయిపోయింది. హాల్లోకి నడిచివాడిని బయటకు గెంటుదామా అన్నంత కోపం వచ్చింది.
కొద్దిసేపటి తర్వాత వాళ్ళిద్దరూ మొఖాలు కడుక్కున్నాక కాఫీలు అందించిందామె.
"నీళ్ళు తోడమ్మాయ్! స్నానం చేయాలి!" అన్నాడతను కాఫీ తాగుతూ.
"పనిమనిషి లేదండీ!" అనేసి చటుక్కున వెనక్కు తిరిగి వెళ్ళిపోయిందక్కడినుంచి.
శ్రీనివాసరావ్ ఖంగారు పడ్డాడు. ఆమెకు కోపం వచ్చిందని తెలుస్తూనే ఉంది. కానీ బాబాయికి అలాజవాబు చెప్పడం నచ్చలేదతనికి. నీళ్ళు తోడడం ఇష్టంలేకపోతే తనతో చెప్పాలి. తనే తోడేవాడు. లేదా ఇంకేదేనా చేసేవాడు. పెద్దా, చిన్నా లేకుండా" పనిమనిషి లేదండీ" అని చెప్పేయడమేమిటి?
"నీళ్ళుతోడమంటే పనిమనిషి లేదంటుదేమిట్రా?" అర్ధంకాక శ్రీనివాసరావుని అడిగాడు అతను.
"మరేంలేదు బాబాయ్! కొంచెం ఆలస్యం అవుతుందని అలా చెప్పిందన్నమాట! అంతే!" సర్దిచెప్తూ అన్నాడు శ్రీనివాసరావ్. వంటింట్లో ఉన్న ఆమె దగ్గరకు నడిచాడతను. కాఫీ తయారు చేస్తోందామె. "హేమా! అలా పెద్దా, చిన్నా లేకుండా సమాధానాలు చెప్పడమేనా? నీకు కష్టంగా ఉంటే నాతో చెప్పు! నేను చేస్తానాపని! అవతల ఆయనేమనుకుంటాడు?" అన్నాడు కోపం అణచుకుంటూ.
"అలాంటివాళ్ళేమనుకున్నా నేను లెక్క చేయను! పోనీలేగదాని ఊరుకున్నాను. లేకపోతే ఆయనవాగిన వాగుడికి బయటకు గెంటాల్సింది"
బాబాయి అన్నమాట ఆమె విన్నదని తెలిసిపోయింది శ్రీనివాసరావుకి. "ఆయనేమన్నాడు పాపం!" సందేహనివృత్తికోసం అడిగాడతను.
"తెలీనట్లు నటించకండి! అలా ఎందుకన్నాడో కూడా నాకు తెలుసు. ఆయన దృష్టిలో ఆడది ఓ గొడ్డు లాంటిది. తెల్లవారుజామునే నిద్రలేవాలి! చలిలో ఛస్తూ వీధి వాకిలి ఊడవాలి నీళ్ళు జల్లిముగ్గులేయాలి. మొగాడిని నిద్రలేపి సేవలు జేయాలి. పైట నిండుగా కప్పుకుని ఎవరయినా మొగాడు ఎదుటపడితే తల భూమిలోకి దించుకుని నమ్రతతో పక్కకు తొలిగిపోవాలి.....నేను ఈ విధంగా కనిపించకపోయేసరికి సహించలేక నోటికొచ్చినట్లు మాట్లాడేశారు. షోకులెక్కువట! సానిదానిలా కనిపించానేమో ఆయనగారి కళ్ళకి....."
ఉద్రేకంగా అంటోన్న ఆమె వంకనిస్సహాయంగా చూస్తూండిపోయాడు శ్రీనివాసరావ్. అతనికి కోపం, భయం రెండూ కలుగుతున్నాయ్ ఈ సమయంలో వివాదం పెంచుకుంటే అవతలబాబాయి ముందు అవమానంపొందాల్సి వస్తుంది. ఇంకేమీ మాట్లాడకుండా తనే మరో స్టవ్ అంటించిదాని మీద నీళ్ళుకాయసాగాడతను. తనేనీళ్ళు తోడి ఆయనను స్నానానికి పిలిచాడు. ఆయనస్నానం చేసి వచ్చేలోగా తన దగ్గర్లోనే ఉన్న హోటల్ కెళ్ళి ఇడ్లీలు పార్సెల్ చేయించుకొచ్చాడు. కాఫీ టిఫిన్ ముగించి ఆయన కోర్టు కెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయాక "అమ్మయ్య" అనుకొన్నాడు శ్రీనివాసరావ్ గండం గడిచినట్లు.
ఆ సాయంత్రం ఆయన కోర్టునుంచి సరాసరి తన ఆఫీసుకే వచ్చి ఊరెళ్ళిపోతున్నానని చెప్పి వెళ్ళిపోవడంతో శ్రీనివాసరావు సంతృప్తిగా గాలి పీల్చుకున్నాడు.
హేమ విషయంలో తగు జాగ్రత్తతీసుకోకపోతే ఆమెను ముందు ముందు అదుపులో ఉంచడం కష్టమవుతుందనిపిస్తోంది. ఇవాళ బాబాయి విషయంలో మొండికేసింది. రేపు మరొకరవ్వచ్చు వాళ్ళకి జరిగే అవమానం సంగతలా ఉంచి తన పరువు మర్యాదలసంగతేమిటి? వాడు పెళ్ళానికి దాడిసే వెధవ అన్న పేరు వస్తే తనెలా సహించగలడు? ప్రతి చిన్న విషయానికీ తగవులు పెంచుకొనేగుణం తనకి నచ్చదు. కొద్దిరోజులు ఆమెతో రిజర్వ్ డ్ గా ఉండాలి మనసువిప్పి మాట్లాడకూడదు. బహుశా అప్పుడైనా ఆమె తప్పు తెలుసుకుంటుందేమో! అప్పటికీ ఆమె తన ప్రవర్తన సరిదిద్దుకోకపోతే తరువాతేం చేయాలో తనకు తెలుసు.
ఆ సాయంత్రం అతను ఇంటికొచ్చేసరికి ఇల్లు తాళం వేసి ఉంది. ఆశ్చర్యంతో పాటు కోపం కూడా కలిగిందతనికి. తనువచ్చే సమయానికి ఇంట్లో లేకుండా ఎక్కడకువెళ్ళినట్లు? అంత అవసరమయిన కార్యక్రమాలేమున్నాయ్?
పక్కింటామె అతన్ని చూసి తాళంచెవి తెచ్చి ఇచ్చింది.
"హేమగారు వాళ్ళ స్నేహితురాలువచ్చి బలవంతం చేస్తే ఆమెతో పాటు వెళ్ళారు" అందామె.
"సరేలెండి!" అనేసి తాళం తీసుకుని లోపలకు నడిచాడాతను. బట్టలుకూడా మార్చుకోకుండా ఆమెకోసం ఎదురుచూస్తూ కూర్చున్నాడు.
బాగాచీకటిపడ్డాక వచ్చిందామె ఆమెతోపాటు మరోకతనుకూడా లోపలికొచ్చాడు.