Previous Page Next Page 
పాఠకులున్నారు జాగ్రత్త! పేజి 13


    "ఇందాక చిన్న కథన్నావ్?"
    "అది ఒరిజినల్ కథ! కానీ అందులో ఉపకథ మాత్రం చాలా పెద్దది. మొదలెట్టనా?"
    "సరే రెండువేల పదాలు దాటకుండా చెప్పు"
    "ఇంతకుముందు ఈ రూమ్ లో ప్రఖ్యాత రచయిత ధనుంజయ్ వుండేవాడని నీకు చెప్పాను కదా"
    "రచయితా?"
    "అవును"
    "ఏమి రాస్తాడతను?"
    "నాకూ తెలీదు. కానీ మన హోటల్ సర్వర్ రామనాథం, ఇన్ ఫర్ మేషన్ ప్రకారం అతను హిప్నాటిజం, టెలీపతి, అలోపతి, విలోపతి, సైకోపతి ఇలా చాలా పతుల గురించి రాస్తాట్ట."
    "అంటే వాటి గురించి వ్యాసాలా?"
    "కాదు నవలలు. ఒక ధనవంతుడి కొడుకు హఠాత్తుగా కొన్ని చోట్ల ఆస్తికి వారసుడవుతాడు. ఆ ఆస్తి లాక్కోడానికి అతని బాబాయ్ అతనిని చంపడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తాడన్నమాట. కానీ అతని ప్రియురాలు ఈ విషయం టెలీపతి ద్వారా తెలుసుకుని, సైకోపతీ ప్రయోగిస్తుంది. ఆ తరువాత ఆమె హిప్నాటిజం నేర్చుకుని అతని బాబాయ్ ని హిప్నటైజ్ చేసి ముఫ్ఫయ్ తిప్పలుపెట్టి- ఒకటో రెండో చెరువుల నీళ్ళు తాగిస్తుందట. ఇలా వుంటాయంట అతని నవలలు. చదివి తీరాల్సిందేగానీ ఇలా వుంటాయంట అతని నవలలు. చదివి తీరాల్సిందేగానీ ఇలా వింటే అంత అద్భుతంగా వుండవని రామనాథం అన్నాడు"
    "సరే ఇది ప్రఖ్యాత రచయిత ధనుంజయ్ రూమ్. అయితే ఏమిటి?"
    "శ్రీదేవి అనే అమ్మాయ్ ఆ రచయిత ధనుంజయ్ కి ఫాన్. అంటే మన ఇళ్ళలో తిరిగే ఫాన్ కాదు. అభిమాని అంటామే అదన్నామాట! ఆమె ధనుంజయ్ కి ఉత్తరం రాసింది. అతను రూమ్ మారినట్లు ఆమెకు తెలీదు. అంతేకాదు. ఈ రూమ్ లో ప్రస్తుతం హాండ్ సమ్ ఫెలో ఒకడు దిగినట్లు కూడా తెలీదు. తెలుస్తే నాకే రాసేది. నొ డౌట్ ఎబౌట్ ఇట్!"
    "హరికథ వద్దు! అసలు కథ చెప్పు" చిరాగ్గా అన్నాడు చిరంజీవి.
    "ఓకే- కమింగ్ టు ఒరిజినల్ స్టోరీ. ఆ ఉత్తరం నేను అందుకున్నాను. కవర్లో శ్రీదేవి ఫోటో చూశాను. అంతే అయామ్ లాస్ట్! ఒరేయ్... పెళ్లి అంటూ చేసుకుంటే ఆ పిల్లనే చేసుకుంటాన్రా! లేపోతే ఈ జన్మ కాన్సిల్ చేసేసుకుంటాను. అంతేగాని చిరుతపులినీ, పెద్దపులినీ చేసుకోవడం నా వల్ల కాదు."
    "ఇలా ఊరూ, పేరూ, అడ్రసూ లేని పిల్లను ఫోటోలో చూసి ప్రామిస్తే కె.యన్. కనకారావ్ గతిపడుతుంది నీక్కూడా"
    "కె.యస్. కనకారావా?"
    "అవును"
    "ఎవరతను?"
    "జి.యస్. శంకర్రావ్ కజిన్ బ్రదర్"
    "జి.యస్. శంకర్రావ్ ఎవరు?"
    "సి.కె. రత్నారావ్ ఫ్రెండ్"
    "సి.కె. రత్నారావ్... వద్దులే అతనెవరో మనకెందుగానీ ఇంతకూ కె.యస్. కనకారావ్ కి ఏ గతి పట్టింది?"
    "వాడూ ఇలాగే ఓ అమ్మాయి ఫోటో చూసి ప్రేమించాడు"
    "అంటే వాడూ రచయిత వుండే రూమ్ లోకి మారాడా?"
    "కాదు. ఇది ఇంకోరకం కేసు వాడికి పత్రికలు చదవడం అలవాటు ఓసారి ఓ పత్రికలో వాదికిష్టమయిన సీరియల్ రచయిత్రి ఫోటో చూసి ప్రేమించాడు. నీలాగానే పెళ్ళంటూ చేసుకుంటే ఆ రచయిత్రినే చేసుకోవాలని ప్రతిజ్ఞ చేసుకున్నాడు. వెంటనే ఆమెతో కరస్పాండెన్స్ కోర్స్ ప్ర్రారంభించాడు! తనకున్న అర్హతలూ, తన ఆస్తి వివరాలూ, తనకొచ్చే జీతం, ఉద్యోగం, తన రంగూ, రుచీ అన్నీ రాశాడు. దానికో ప్రేమలేఖ జతపరిచాడు. ఆమెను ప్రతిక్షణం చూస్తూ ఆమె సరసనే జీవితం గడిపే అవకాశం తనకివ్వకపోతే తను ఇన్ స్టాల్ మెంట్స్ పద్దతిలో వందేళ్ళు లోపుగానే తనువు చాలిస్తాడని ఫుట్ నాట్ పెట్టాడు"
    "మరా రచయిత్రి వప్పుకుందా?"
    "అలాంటి ఫుట్ నోట్ చూస్తే ఎవరు వప్పుకోకుండా ఉంటారు?"
    "అంటే- పెళ్ళికి వప్పుకుందన్నమాట"
    "ఊహు! లేదు"
    "అదేమిటి? ఎందుకని వప్పుకోలేదు?"
    "వప్పుకునేదేగాని- ఆమె భర్తా, పిల్లలూ, అల్లుళ్ళూ, కోడళ్ళూ వప్పుకోలేదు."
    సింహాద్రి ఉలిక్కిపడ్డాడు.
    "భర్తా, పిల్లలూ, అల్లుళ్ళూ, కోడళ్ళూనా?"
    "అవును"
    "అంటే వాళ్ళంతా ఎవరు? అయ్ మీన్ ఆ అమ్మాయికి భర్తేమిటి?"
    "వెరీ పూర్ అండర్ స్టాండింగ్" అన్నాడు చిరంజీవి జాలిగా. "భర్త లేకపోతే పిల్లలూ గట్రా ఎలా ఉంటారు?"
    "అదికాదు నేననేది! అసలు ఆ అమ్మాయి అమ్మాయి కాదా? అహహ..... నా ఉద్దేశం ఆ అమ్మాయికి పెళ్ళయి పోయిందా?"
    "అయ్ పిటీ యూ! ఇంకా అర్ధం కాలేదన్నమాట! పెళ్ళవకపోతే పిల్లలు ఎలా ఉంటార్రా?"
    సింహాద్రికి అంతా అయోమయంగా ఉంది.
    "పిల్లలు వున్నారు. సరే వప్పుకుంటాం. మరి అల్లుళ్ళూ, కోడళ్ళూ ఏమిటి?"
    "నీకు నిజంగా మెదడు విషయంలో చాలా అన్యాయం చేశాన్రా దేవుడు" మళ్ళీ జాలిపడ్డాడు చిరంజీవి "పిల్లలన్నాక కూతుళ్ళూ, కొడుకులూ ఉంటారా, ఉండరా?"
    "ఉంటారు"
    "కూతుళ్ళూ, కొడుకులూ అన్నాక మరి వాళ్ళక్కూడా పెళ్ళిళ్ళూ, పేరంటాలూ అవుతాయా, అవ్వవా?"
    "అవుతాయ్......అవుతాయ్"
    "మరింకా నీకు అర్ధం కాకపోవడం ఏమిటి?"
    "అంటే.... ఆమెకు అంత పెద్దపిల్లలు కూడా ఉన్నారన్నమాట"
    "అంతేకాదు ఆ పిల్లలక్కూడా పిల్లలున్నారు"
    "మైగాడ్"
    "ఎవరి గాడ్ అయినా సరే! ఫాక్ట్స్ అవి"
    "మారా రచయిత్రి ఏం చేసింది. ఇంకోసారి లాంటి ఉత్తరాలు రాయొద్దని రాసిందా?"
    "ఊహు! చూస్తూ చూస్తూ అంత మంచి ఉద్యోగం వున్న వరుడిని వదులుకోవడం ఇష్టంలేక తన మనవరాలికే ఇచ్చి వివాహం జరిపించింది"
    "మనవరాలికా?" త్రుళ్ళిపడుతూ అడిగాడు సింహాద్రి.
    "అవును"
    "అంటే మనవరాలు కూడా పెళ్ళీడుకొచ్చిన పిల్లేనా?"
    "పెళ్ళీడు పిల్లేమిటి? అప్పటికే యమ్.ఏ. అయిపోయి లెక్చరర్ గా చేస్తొందట అయిదేళ్ళ నుంచీ! అంటే కె.యస్. కనకారావ్ కంటే అయిదారేళ్ళే పెద్దది"
    "మరి కె.యస్. కనకారావ్ ఎలా వప్పుకున్నాడు?"
    "వప్పుకోకేం చేస్తాడు? ఫుట్ నోట్ లో ముందే కమిట్ అయిపోయాడుగా? అదీ రాతపూర్వకంగా కమిట్ అయాడయ్యె- ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఆమె సరసనే జీవితం గడిపే అవకాశం ఇవ్వకపోతే స్లోగా ఛస్తానని"

 Previous Page Next Page