Previous Page Next Page 
కదిలే మేఘం పేజి 14


    "పార్కులూ, రోడ్లూ, సినిమాహాళ్ళూ.....యిలా వెతకాలండీ.
    "అప్పటికీ రోడ్డుమీద కనిపించిన ప్రతిమనిషి మొహంలోకి పరకాయించి చూస్తూనే వున్నాను."
    "పాపం నాకోసం చాలా శ్రమపడుతున్నారండీ."
    "ఇవేళ ఇద్దరం కలసి బయటకు వెడదాం."
    "నిజంగా నన్ను తీసుకెడతారా అండీ" అంది చాలా ఉత్సాహంగా.
    "అవును చప్పున తెములు".
    "ఒక్క అయిదునిమిషాలండీ" అంటూ బయటకు వొచ్చి బట్టలు ఆరేసివున్న ప్రదేశంలోకి వెళ్ళింది. తీగెకు వ్రేలాడివున్న బట్టలన్నీ ఒకటొకటి తీసి-చేతిమీద వేసుకుంది. లోపలకువొచ్చి వాటిని మడిచిపెట్టటానికన్నట్లుగా మంచం మీద పేర్చింది.
    మహేష్ అటుకేసి చూసి ఉలికిపడి "అయ్యో అదేమిటి?" అన్నాడు.
    "తప్పేముందండీ. బట్టలు నేను ఉతికాను. మీరు రోజు స్నానానికి వెళ్ళేటప్పుడు ఉతుక్కోవటం చూసి నాకీవేళ ఉతకాలనిపించింది. ఏం? మనపన్లు మనం చేసుకోకూడదూ?"
    "అదికాదు....అదికాదు" అన్నాడు చేయెత్తి పేర్చివున్న బట్టలకేసి చూపిస్తూ.    
    "ఏమిటండీ". అన్నది ప్రియంవద అర్ధంగాక.
    "ఏది?" అంటూ ఆమె అతని దృష్టి ప్రసరిస్తోన్నవైపు చూసింది. మిగతా బట్టలతోబాటు-ఓ ప్రక్కన విడిగా-అతని బనీనూ, ఆమెబ్రా ఒక దానిమీద ఒకటి-రెండూ కలిసిపోయినట్లుగా అమిరి వున్నాయి.
    "ఓస్! యింతేనా?- తేలిగ్గా అని అతని సంతృప్తి కోసం అన్నట్లుగా ప్రియంవద వాటిని విడదీయబోయింది. సబ్బువల్ల అతుక్కున్నాయో, ఎలా అతుక్కున్నాయో-అవి వూడిరాలేదు.
    "ఇదేమిటి? ఇంత యిదిగా ఎలా అతుక్కుపోయాయి?" అంటూ ఆమె కొంచం బలం ఉపయోగించి వాటిని లాగబోయింది.
    "వొద్దు చిరిగిపోతాయి" అన్నాడు కంగారుగా.
    "మరి?"
    ప్రస్తుతానికి అలా వుంచెయ్యి. వాటి విషయం రేపు చూద్దాం".
    "అంతసేపు?"
    "ఏం వుంటే?"
    "ఏంలేదు" అంది కళ్ళు క్రిందకి వాల్చుకుని.
    "త్వరగా బయల్దేరు."
    "ఊ" అంది.
    పది నిమిషాల్లో యిద్దరూ రెడీ అయి గది తాళం పెట్టి బయటకు వొచ్చారు. ప్రియంవదకు ఏదో అనుమానంతోచి తల వెనక్కి త్రిప్పి చూసింది. తమ మేడమీద గదిలో నిలబడి సునంద వాళ్ళిద్దరి వంకా చూస్తోంది. ఆమె నవ్వుకుని అతన్తో బాటు ముందుకు నడిచింది.
    
                               *    *    *
    
    ఇద్దరూ కలిసి వీధులన్నీ కలయ తిరిగారు. ఈ అనుభూతి అతనికి కొత్తగా వుంది. వయసులో వున్న....పోనీ వయసువచ్చీరాని ఓ ఆడపిల్ల.....ఆమెతో గమ్యమేమిటో సరిగ్గా తెలీకుండా తను....
    ఒకచోట ఆగి ఐస్ క్రీం తిందామంది. ఇద్దరూ ఐస్ క్రీం పార్లర్ లోకి వెళ్ళి ఐస్ క్రీం తిన్నారు.
    ఒక సినిమాహాలు ముందునుంచి పోతూవుంటే "ఏవండి! సినిమా చూద్దామండీ" అంది గారాబంగా.
    "సినిమాలేదు, ఏం లేదు పద" అన్నాడు కసురుతూన్నట్లుగా.
    "అది కాదండీ సినిమాహాల్లో అతను కనిపిస్తాడేమోనని......"
    "ఆ చీకట్లో ఏం కనిపిస్తాడు? అంత మురిపెంగా వుంటే సినిమా విడిచిపెట్టేవరకూ వుండి. బయటకు వొచ్చిన జనాన్ని చూద్దాం."
    "అమ్మో! అంతవరకూ వెయిట్ చెయ్యాలంటే విసుగు పుడుతుందండీ."
    "ప్రేమించిన వాళ్ళకి విసుగు వుండకూడదు."
    "ప్రేమిస్తున్నప్పుడు వుండదండీ. ప్రేమించి విడిచిపోయినప్పుడు వుంటుంది."
    
                               *    *    *
    
    మరునాడు సాయంత్రం కాలేజి నుంచి వొచ్చేసరికి రికార్డంతా పూర్తిగా గీసేసి వుంది. అతను పేజీలన్నీ తిరగేసి "వండ్రఫుల్. మా ఎనాటమీ ట్యూటర్ కీ నాకూ అసలు పడదు. ఇది చూశాడంటే స్పెల్ బౌండ్ అయిపోవల్సిందే" అన్నాడు.
    "వొట్టి వండ్రఫుల్ అంటే చాలదు. ప్రెజంటేషన్ కావాలి."
    "ఏం కావాలి చెప్పు, ఐస్ క్రీం ఇప్పించనా?"
    "అబ్బ! ఎప్పుడూ ఐస్ క్రీమేనా ఏమిటండీ?"
    "మరి?"
    "తర్వాత చెబుతాలెండి అంది తలవంచుకుని.
    మంచంమీద బనీనూ! ఆమె బ్రా ఒకదాని కొకటి అతుక్కుని కనిపించాయి.
    "ఇంకా రాలేదా?" అన్నాడు వాటిని చేతిలోకి తీసుకుంటూ.
    "ఇందాకట్నుంచీ ప్రయత్నిస్తున్నానండీ. ఒకదాన్నుంచి ఒకటి ఊడిరావటంలేదు. గట్టిగాలాగితే చిరిగిపోయేలా వున్నాయి."
    మహేష్ కూడా ప్రయత్నించాడు. ఆశ్చర్యం అవి ఎంతకూ వూడి రాలేదు. ఆమె బ్రా అతని చేతుల్లోవుంటే ఎందుకో వొళ్ళు గగుర్పొడిచి నట్లయింది. కాని పైకి తేలలేదు.
    "ప్రస్తుతానికి ఇలావుంచుదాం" అన్నాడు వాటిని మంచంమీద వుంచేస్తూ.
    
                              *    *    *
    
    స్నానం చెయ్యటానికి ఆమె బాత్ రూంలోకి వెళ్ళింది. తన సబ్బు లోపలకు తీసుకెళ్ళటం మరిచిపోయింది. తీరా బట్టలు తీసేసి స్నానానికి కూర్చున్నాకగాని ఆ విషయం గుర్తురాలేదు. గూట్లో మహేష్ వాడే సబ్బు వుంది. ఒక్కక్షణం సంకోచించి ఆ సబ్బు తీసుకుని-వొళ్ళు రుద్దుకుంది. ఎప్పటికంటే ఎంతో హాయిగా వున్నట్లనిపించింది. ఎంతసేపటికీ స్నానం నుంచి లేవాలనిపించలేదు. ఇంకా ఇంకా వొళ్ళు రుద్దుకుని సబ్బు సగంవరకూ అరగదీసి పారేసింది. అంతకుముందెప్పుడూ చన్నీళ్ళతో స్నానం చేసి ఎరుగదు. ఎప్పుడన్నా వేన్నీళ్ళు లేకపోతే బాత్ రూంలోనే చిందులు త్రొక్కేది. ఇప్పుడా చన్నీళ్ళే ఊహించలేని ఉల్లాసాన్ని కలగచేస్తున్నాయి.
    బయట మహేష్ చాలా అసహనంగా వున్నాడు. ఈ ఆడపిల్లలింతే. బాత్ రూం లొ దూరితే అంతసేపు ఏంచేస్తారో తెలీదుగాని ఒక్కపట్టాన ఊడిపడరు.
    ఓ అరగంట తర్వాత ఆమె బట్టలు చుట్టబెట్టుకుని, గదిలోకి వొచ్చే సరికి "ఏమిటింతసేపు?" అని అరుద్డామనుకుని ఆమెవంక చూసి ఆగిపోయాడు. ముఖమంతా ముత్యాలవంటి బిందువులతో నిండివుంది. జుట్టుకొద్దిగా తడిసి కొన్ని ముంగురులు ముఖంమీద పడుతున్నాయి. శరీరం నిండా చుట్టుకున్న వోణీ కొంచెం కొంచంగా శరీరంమీద తడిసి చెమ్మగిల్లుతూ, అంతకుముందు లేని చలి యిప్పుడు ఆరంభమై, అందమైన చిన్న వొణుకుగా మారుతోంది. అతని నోట్లో మాట నోట్లోనే వుండిపోయింది.

 Previous Page Next Page