"పాపం ఏవీ అనుకోకండి".
"అతననుకోవటం గురించి కాదు నేననేది. నువ్వనుకోవటం గురించి. నువ్వాడపిల్లవికదా"
"అయితే అయ్యానులెండి. ఆడపిల్లయితే నాకలాంటి గొప్పేమీ లేదు నేనూ ఏవీ అనుకోను".
"అదే ఎందుకని?"
"ఎందుకనోమరి. నాకలా కోపం తెప్పించుకోవాలని అనిపించదు.
సునంద ముఖం పాలిపోయింది. ప్రయత్నం మీద నిట్టూర్పు అణచుకుంది.
"అదేమిటండీ అలా అయిపోయారు? అలా మీ గుప్పిళ్ళు బిగుసుకుంటున్నాయేమిటండి".
"ఏమీలేదు".
"ఏమీలేకపోవటమేమిటండి. మీ కాలితో టేబుల్ లెగ్ ని గట్టిగా త్రొక్కేస్తున్నారు. పాపం టేబుల్ అసలే వీక్ గా వుందండీ!"
"మీ ఇద్దరూ కలిసి...."
"చెప్పండి ఆగిపోయారేం?" ఇద్దరూ కలసి.....?
"కాఫీ మీల్సు అవన్నీ ఎక్కడచేస్తారు".
"కాఫీ నేనే కాస్తున్నానండి. మీల్సు క్యారియర్ తెప్పించుకుంటామండి".
"అదిసరే___రాత్రుళ్ళు....?"
"రాత్రుళ్ళుకూడా మీల్స్ అలానే చేస్తామండీ".
"నేననేది మీల్స్ గురించి కాదు".
"మరేమిటండీ? బట్టలు మార్చుకోవడం గురించా? ఇందాక చెప్పాను కదండి అతను పుస్తకాల్లో తలదూర్చడం, నేను డ్రెస్ మార్చటం...."
"అబ్బా! అదికాదు నేనడిగేది నిద్ర.....పడుకోవటం__"
"అదా అండి?" అంది తేలిగ్గా ప్రియంవద "నేను పైన పడుకుంటాను. అతను క్రిందపడుకుంటాడండీ"
"వాట్" ఆమె నుదుటిమీద చెమటలు పడుతున్నాయి.
"అవునండీ నేను మంచంమీద పడుకుంటాను. అతను చాపమీద పడుకుంటాడండీ".
"అదా! "సునంద పమిటచెంగుతో నుదురు తుడుచుకుంది.
"ఓ విషయం చెప్పనాఅండి" అన్నది ప్రియంవద.
సునంద ప్రశ్నార్ధకంగా చూసింది.
"మీరు చాలా అందంగా వుంటారండి".
"నీకన్నానా?"
"అదినాకు తెలీదుగాని. మీరుమాత్రం చాల అందంగానే వుంటారండీ. ఏమండీ! మీరేమీ అనుకోకపోతే ఒకసారి ముద్దుపెట్టుకుంటానండీ!
సునంద తెల్లబోయి ఏదో జవాబు చెప్పబోయేలోపల, ప్రియంవద చప్పునముందుకు వంగి ఆమెబుగ్గమీద ముద్దుపెట్టుకుంది.
"బావుందండీ".
"ఏమిటి?"
"ముద్దండీ".
"సునంద నవ్వకుండావుండలేకపోయింది "యు.....నాటీ"
* * *
సాయంత్రం మహేష్ యింటికొచ్చేసరికి గదంతా మారిపోయి వున్నట్లు కనిపించింది. చిందరవందరగా పడివున్నట్లు కన్పించే వస్తువులన్నీ తీర్చిదిద్దినట్లు సర్దివున్నాయి. బయట ఖాళీప్రదేశంలో ఓ తీగెకు అతని డ్రాయర్లు బనీన్లతోపాటు, ఆమె పరికిణీ. గౌన్లు, ఫ్రాక్ లు, ఉతికి ఆరెయ్యబడి వున్నాయి.
"ఇవన్నీ ఎవరు చేశారు?" అనడిగాడు ఆశ్చర్యంగా.
"నేనే" అంది ప్రియంవద.
"బట్టలుకూడా నువ్వే ఉతికావా?"
"ఏం ఉతికితే?"
"అదికాదు నువ్వు బయటి అమ్మాయివి. ఇలాంటి పనులు చేస్తే నాకు సిగ్గుగా వుండదా?"
"ఎందుకు సిగ్గు? నేను బయటి అమ్మాయిని కాదు. మరదలు పిల్లను.
అతను ఉలికిపడి ఆమె ముఖంలోకి చూశాడు. ఆ కళ్ళలో ఎప్పుడూ తొణికిసలాడే చినిపిజీరతోబాటు, కొత్తగా కనిపించిన బాధ్యత అతన్ని విస్మయపరిచింది.
"మరదలుపిల్ల. బయటివాళ్ళకోసం కాని, మనకోసం కాదు."
"నాకు తెలుసు" అన్నది మెల్లగా. "ఒక వేషం వేసుకున్నప్పుడు ఆ పాత్ర తాలూకు ప్రభావం పాత్రధారిమీద పడుతూ వుంటుంది!
అతనేమీ జవాబు చెప్పలేకపోయాడు. టేబుల్ మీద నీట్ గా సర్దివున్న ఎనాటమీ రికార్డును చూసి "సీనియర్ అవార్డు రేపో ఎల్లుండో యిచ్చేయాలి. అతను తొందర పడుతున్నాడు" ఈ రాత్రికి నైట్ అవుట్ చేసయినా సరే రికార్డు పూర్తిచేయాలి అనుకుంటూ యధాలాపంగా రికార్డుబుక్ చేతిలోకి తీసుకుని పేజీలు తిరగేస్తూ నివ్వెరపోయాడు. అందులో బొమ్మలు చాలా వరకూ గీయబడి వున్నాయి. అవసరాన్ని బట్టి ఉపయోగించే రంగులతో స్కెచ్ పెన్సిల్ తో స్పష్టంగా చాలా అందంగా గీయబడి వున్నాయి.
"ఎవరు యీ పని చేసింది?" అన్నాడు కోపంగా.
"నేనే ఏం? తప్పుచేశానా?"
"రికార్డు వెయ్యటమంటే కేవలం బొమ్మలు అందంగా వెయ్యటం కాదు. ఎనాటమీ లొ బోలెడు మసిల్స్, ఆర్టరీస్, నెర్ వ్స్ అన్నీ వుంటాయి వాటి రిలేషన్స్ ఏమాత్రం తప్పులేకుండా వేసి- పేర్లు కరెక్టుగా రాయాలి."
"తప్పులేకుండా వెయ్యటానికే ప్రయత్నించానండీ. అయినా ఒకసారి చూడండి."
అతను ఆమె వేసిన బొమ్మలన్నీ క్షున్నంగా పరిశీలించాడు. ఆశ్చర్యం! ఎక్కడా ఒక్క పొరపాటు కూడా లేదు. ఎంతో అనుభవమున్నవారు వేసినట్లు చాలా పొందికగా తు.చ తప్పకుండా వున్నాయి.
చిలిపిగా, అల్లరిగా కనిపించే యీమెలో ఎంత జీనియస్ వుంది. అనుకుంటూ "కంగ్రాట్సు" అన్నాడు.
"హమ్మయ్య ఎక్కడ తిడతారో అని హడలిపోతున్నానండీ" అన్నది ప్రియంవద తేలిగ్గా ఊపిరి తీసుకుంటూ.
"ఏం చదువుకున్నావు?" అనడిగాడు కుతూహలం అణచుకోలేక.
"పెద్దగా ఏమీ చదువుకోలేదండీ."
"ఇదిగో చూడూ.....నిన్నే మని పిలవాలో తెలియడంలేదు."
"ప్రియా!" అని పిలవండి.
"అలా పిలిస్తే-ఎలాగో వుంటుంది."
"ఫర్వాలేదండీ ఒట్టి పేరేకదండీ."
"సరే ప్రియా!"
"అదీ! అలా పిలవాలండీ."
"ఇప్పుడేం చెయ్యనా అని ఆలోచిస్తున్నాను."
"దేన్ని గురించండి?"
"ఆంజనేయుల్ని వెతకటం గురించి."
"మా కుట్టీగురించా?"
అవునన్నట్లు తల ఊపాడు.
"ఏముందండీ? సినిమాల్లో చూపిస్తూ వుంటారు కదండీ. చెట్టులూ, పుట్టలూ, కొండలూ, అడవులూ."
"ఈ ఊళ్ళో కొండలూ, అడవులూ లేవుగా."