"ఏమిటండీ అలా చూస్తున్నారు?"
"ఏం లేదు" అంటూ ఏదో తరుముతూన్నట్లు గబగబ బాత్ రూంలోకి వెళ్ళిపోయాడు.
అతని సబ్బంతా అరిగిపోయి వుంది. అతనికి చాలా కోపమొచ్చింది. తన సబ్బు స్నేహితుడు చంద్రం వాడినా అతను ఒప్పుకోడు. పోన్లే కదా అని ఆశ్రయమిచ్చి చూస్తోంటే....."ఇదిగో ప్రియా" అని గట్టిగా కేకేశాడు.
అప్పుడే గది తలుపులు వేసి బట్టలు మార్చుకోబోతోంది. గదమాయింపులాంటి ఆ స్వరం విని ఉలికిపడి "ఆఁ ఏమిటండీ" అంది.
ఎలా చెప్పాలో తెలీక కోపం చంపుకుని "ఏం లేదులే" అన్నాడు.
"చెప్పండి. ఫర్వాలేదు. టవలేదయినా మరిచిపోయారా?"
"లేదు."
"మరెందుకు పిలిచారు?"
"ఊరికినే పిలవాలనిపించింది."
"బాత్ రూమ్ లోకి వెళ్ళాక పిలవాలనిపించట మేమిటండీ?"
అతనేమీ జవాబు చెప్పలేదు. అంతకుముందు ప్రియంవద స్నానం చెయ్యటం మూలంగా ఏర్పడిన పరిమళం బాత్ రూమంతా వ్యాపించి ఓ విధమైన మత్తు కలిగిస్తోంది. అప్రయత్నంగా కోపాన్ని మరచి అతని చెయ్యి ముందుకు కదిలి సబ్బుని తాకింది.
ఆ తర్వాత....ఆ సబ్బు నురగలు వొళ్ళంతా ప్రవహిస్తోంటే ఇదివరకెన్నడూ అనుభవంలో లేని సుఖం ఆవరించసాగింది. టైము తెలియలేదు.
"నన్నన్నారు. మీరెంత సేపు చేశారో తెలుసా?" అనందామె అతను బయటకు వొచ్చాక.
"నేనా? అయిదు నిమిషాలకన్నా ఎక్కువసేపు లేనే" అంటూండగా టేబిల్ మీద వాచీ చేత్తోపట్టుకుని అతని కళ్ళముందు వుంచింది.
"ఏమిటి? నలభయి నిమిషాలకు పైగా అయిందా?" అన్నాడతను ఆశ్చర్యంగా.
"కొన్ని పనులు ఆడపిల్లలు చేస్తే బావుంటాయి. కాని మొగవాళ్ళు చేస్తే బావుండవు"
"ఎలాంటివి?"
"బాత్ రూముల్లో దూరి ఎక్కువసేపు కూర్చోవటం-యిలాంటివి?"
"ఇలాంటివంటే ఇంకేమిటి?"
"బోలెడు వున్నాయి. తర్వాత చెబుతాను.
"తర్వాత చెప్పే లిస్ట్ లో ఒక్కొక్కటే పెరుగుతోంది".
"ఒక మొగా- ఆదా కలిసివుంటే లిస్టులో అలాంటివి పెరగవండీ మీ పిచ్చిగాని?"
అతనికి ఉడుకుమోత్తనం వొచ్చింది. కోపమూ వచ్చింది. ఏదో అందామని ఆమె ముఖంలోకి చూసి ఆగిపోయాడు. ఆమె ఫ్రాక్ వేసుకుని వుంది. కాళ్ళకు స్లిప్పర్లు తల ఎప్పుడు దువ్వుకుందోగాని రెండు జడలుగా విడదీసింది. అప్పుడే విరిసిన గులాబీలా వుంది.
"ఏమిటలా చూస్తున్నారు?" అనడిగింది తెల్లబోయి.
"నీలో కనిపించే....." అనబోయి ఆంజనేయులు గుర్తు వొచ్చి "తప్పు" అనుకుంటూ వూరుకున్నాడు.
* * *
ఆ రాత్రి....
మహేష్ పన్నెండు గంటలదాకా ఎనాటమీ- ఆస్టియాలజీ చదువుకుని కళ్ళు మూతలు పడుతోంటే చేతిలో వున్న స్కల్ ని మంచం అంచున యధా లాపంగా వుంచి చాపమీద పడుకున్నాడు. అలసిపోయి వున్నాడేమో చాపమీద శరీరం వాల్చగానే ఆదమరచి నిద్రపట్టేసింది.
ఓ రాత్రివేళ ప్రియంవదకు మెలకువ వొచ్చింది- ఇటునుంచి అటు సర్దుకుని పడుకుంటుంటే కాలికి ఏదో తగిలినట్టయి కళ్ళు చిట్లించి చూసింది. వెంటనే గుండె గుబేల్ మన్నట్లయింది. ఆ డిమ్ లైట్ వెలుగులో మంచం అంచున ఏదో ఆకారం కూర్చుని కళ్ళల్లో నీలం రంగు కాంతులీనుతుండగా తన ముఖంలోకే చూస్తున్నట్లనిపించింది. ఆమెకు వొళ్ళంతా చెమటలు పట్టింది. పెదవులు తడి ఆరిపోయినట్లయింది. ఎలాగో శక్తినంతా కూడ దీసుకుని క్రిందకి ఒక్క దొర్లుదొర్లింది పెద్దకేకవేస్తూ.
"ఏమిటి?" అన్న అరుస్తూ మహేష్ లేవబోయాడు. కాని భయంతో గజగజ వణుకుతూన్న ఆమె చేతులు అతన్ని అదిమిపెట్టి వుంచటంవల్ల అంత తేలిగ్గా సాధ్యం కాలేదు.
"అక్కడ....ఏదోవుందండీ.....నా వంక చూస్తోంది..."
"ఎక్కడ?"
"మంచంమీద".
"ఏదీ!" అని తడిమిచూశాడు. అక్కడేమీ కనిపించలేదు. "ఏమీలేదే" అంటూండగా "అదిగోనండి అక్కడ...." అంటూ చేయిపెట్టి చూపించింది. ఆమె క్రిందపడినప్పుడు దొర్లిపోయిన స్కల్ వంక.
"అదా! అది...." దాన్ని ఆమెకు కనిపించకుండ ప్రక్కకు తోశాడు.
నవ్వుతూ "యింత పిరికిదానివా? రాత్రి చదువుకుని నేను పరధ్యానంగా మంచంమీద పెట్టాను. లే అక్కడ పడుకో" అన్నాడు.
"ఉహూ! నాకు భయంగా వుంది అక్కడ పడుకోను."
"మరెక్కడా పడుకుంటావు?"
"ఇక్కడే".
"ఇక్కడా?" అన్నాడు ఆశ్చర్యంగా.
"అవునిక్కడే మీ ప్రక్కన. నాకు భయమేస్తోంటే"
"అయితే మాత్రం అలా ఏం బావుండదు. పోనీ నువ్విక్కడ పడుకో నేను మంచంమీద పడుకుంటాను".
"నేనిక్కడ భయంతో వొణికిపోతుంటే దూరంగా పడుకోమంటారేమిటండీ. చూడండి నా గుండె ఎలా కొట్టుకుంటోందో" అని అతనిచెయ్యి పట్టుకొని సమాధానం కోసం ఎదురుచూడకుండా చప్పున లాక్కుని గుండె మీద పెట్టుకుంది.
లబ్ డబ్.... లబ్ డబ్.......లబ్ డబ్......లబ్ డబ్____
చాలా వడిగా....వడివడిగా.
లబ్ డబ్..... లబ్ డబ్.....
అతని గుండె వేగం హెచ్చింది. చేతిలోంచి ఏదో విద్యుత్ తరంగం ప్రాకి గుండెకు చేరి ఊపిరాడనివ్వకుండా.....
లబ్ డబ్..... లబ్ డబ్
"చూశారా"
"చూశాను".
"ఏమిటి?"
"గుండె చాలా వేగంగా కొట్టు కుంటోంది నాది".
"అయ్యో కర్మమీది కాదండి నాది".
"అవును నీది"
"అబ్బ! పడుకోండి" అని అతనింకా సంకోచిస్తోంటే చెయ్యి పట్టుకుని ప్రక్కకి లాగింది.
చాలా నిస్సహాయుడై పోయినట్లు నిశ్శబ్దంగా అతనామె ప్రక్కన పడుకున్నాడు. కాకపోతే ఆమెవైపు తిరక్కుండా అటువైపు తిరిగి పడుకున్నాడు. చాలా తెలివైన పని చేశాననుకుంటూ.
వెనుకనుంచి ఆమెచెయ్యి వొచ్చి- అతని గుండెచుట్టూ చుట్టుకున్నది. ఆమె చెయ్యిపట్టుకుని తీసివెయ్యటానికి ప్రయత్నించాడు గానీ, ఆ చేతిలోని వొణుకు గమనించి ఆ ప్రయత్నం విరమించుకున్నాడు.