Previous Page Next Page 
గోరువెచ్చని సూరీడు పేజి 13

    "రైట్...." క్షణం ఆగిన క్విజ్ మాస్టర్ సత్యేంద్రబసు వున్నట్టుండి పాకెట్ లో నుంచి కొన్ని కార్డ్స్ తీశాడు. "ఇప్పుడు మన దేశానికి ముఖ్యంగా తెలుగు రాష్ట్రానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు అడగబోతున్నాను. మిస్టర్ రాజేంద్రా..."    
    అలర్టయ్యాడు రాజేంద్ర. నష్టపోయింది తిరిగి రాబట్టుకోవడానికిదో అవకాశంలా ఉత్సాహంగా చూశాడు. "పులికాట్ సరస్సు మధ్యలో వున్న ద్వీపం ఏది"    
    టక్కున చెప్పాడు రాజేంద్ర "శ్రీహరి కోట"    
    "మిస్టర్ విశ్వనాథ్....పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష నిర్వహించింది ఎవరి ఇంటిలో?"    
    "బలుసు సాంబమూర్తిగారి ఇంటిలో..."    
    "రైట్.... నౌ మిస్టర్ రాజేంద్రా.... వ్యవహారిక భాషోద్యమానికి నాయకత్వం వహించిందెవరు..."    
    "పానుగంటి లక్ష్మీనరసింహంరావు."    
    "రాంగ్"    
    "వీరేశలింగం పంతులుగారు"    
    "నో..."    
    ముఫ్ఫై సెకండ్లు గడిచిపోయింది.    
    "మిస్టర్ విశ్వనాథ్...వ్యవహారిక భాషోద్యమానికి నాయకత్వం వహించిందెవరు?"    
    "గిడుగు...." హెలూసినేషన్ లో తేలిపోతున్నట్టు నిస్సత్తువగా గొణుగుతున్నాడు విస్సు...రామమూర్తో వేంకట రామమూర్తో స్ఫురించడం లేదు. "యస్....గిడుగు వెంకట రామమూర్తి పంతులు"    
    "వెరీ కరెక్టు...నౌ మిస్టర్ రాజేంద్ర....తెలుగు ప్రసిద్ద చిత్రకారుడు ఎవరు?"    
    "దామెర్ల రామారావు...."    
    "రైట్...." క్షణం ఆగి అన్నాడు క్విజ్ మాస్టర్ "ది లాస్ట్ క్వశ్చనాఫ్ ది ఫస్ట్ సెషన్ - మిస్టర్ విశ్వనాథ్ శబ్ద రత్నాకరం అనే నిఘంటువుని రచించింది ఎవరు."    
    "బహుజనపల్లి సీతారామాచార్యులు"    
    "నౌ మిస్ రీటా మొదటి సెషన్ కి సంబంధించిన స్కోర్ తెలియచేస్తుంది" అన్నాడు సత్యేంద్రబసు-    
    "మొత్తం ఏభై నిముషాలలో అడిగిన ప్రశ్నలు ముఫ్ఫై మిస్టర్ విశ్వనాథ్ పందొమ్మిది ప్రశ్నలకి నూరు శాతం జవాబు చెప్పి నూట తొంభై మార్కులు స్కోరు చేయగా పది ప్రశ్నలకి జవాబులు చెప్పిన రాజేంద్ర వంద మార్కుల్ని సాధించగలిగారు - క్విజ్ మాస్టరు దక్కించుకున్నది పదిమార్కులు."    
    సగానికి పైగా ఆడిటోరియం నిశ్శబ్దంగా చూస్తుండగా మేధస్సుని నిజాయితీగా హర్షిస్తున్న విద్యార్ధులు, పత్రికా విలేకర్లు విశ్వనాథ్ కి అనుకూలంగా చప్పట్లు కొడుతూంటే కృషి సైతం తనను తాను మరిచిపోయింది-    
    ఆ క్షణంలో విస్సు విధించిన షరతు ఆమెకు గుర్తు రాలేదు.    
    సైనికుడిలా అతడు సాగిస్తున్న పోరాటాన్నే గమనిస్తూంది.    
    "నౌ - లెట్స్ గో టు ది ఫైనల్ సెషనాఫ్ ది కాంపిటీషన్"    
    మిగతా పదినిముషాల కార్యక్రమాన్ని కొనసాగించాలనుకుంటుండగా కనిపించింది-    
    పోలీసులు దూసుకొస్తున్నారు లోపలికి.   
    ఏం జరుగుతున్నదీ అర్ధంకాక అందరూ నిశ్చేష్టులవుతుండగానే డయాస్ పైకి వచ్చేశారు-    
    "ఏం జరిగింది. ఏమిటిదంతా" అడిగింది కృషి వారికి అడ్డంగా నిలబడి-    
    "సారీ మేడమ్ - ఈ కాంపిటీషన్ జరగటానికి వీల్లేదు- "జవాబు చెప్పిన పోలీసాఫీసర్ దూకుడుగా విశ్వనాథ్ వైపు నడిచాడు-    
    జారిన షాల్ వెనుక రక్తసిక్తమైన విస్సు శరీరం ఆమెలో ఎంతటి ఆందోళన రేపిందీ అంటే కెవ్వుమనబోతూ ఆగింది-    
    అంతసేపూ ప్రాణాలను ఉగ్గబట్టుకుని క్షతగాత్రుడయిన సైనికుడిలా పోరాడిన విస్సు యిక ఓపిక నశించినట్టు తలవాల్చేశాడు.    
    హఠాత్తుగా ఆడిటోరియంలో హోరు మొదలయింది....జనం పదులు వందల సంఖ్యలో డయాస్ పైకి తోసుకొస్తుంటే "వాట్ హేపెండ్" కంగారుగా అడిగింది.    
    ఆ క్షణంలో కూడని షరతు విధించిన విస్సు పై కోపం లేదు- గెలుపు కోసం అతడు సాగించిన సంగ్రామానికి అసాధారణంగా స్పందించిపోతూ అతడికి చేయూతనివ్వాలన్న వివసత్వానికి లోనైంది.    
    "చూశారుగా మేడమ్- హి యీజ్ స్టేబ్డు - ఇతడిపై హత్యా ప్రయత్నం జరిగింది. ఈ స్థితిలో ఈ వ్యక్తికి కావాల్సింది ప్రాణం నిలుపుకోవడమా పోటీలో నెగ్గడమా-"    
    యస్సై అన్న మాటల్లో విస్సుపై సానుభూతి కన్నా పోటీలో నెగ్గకూడదన్న ఆలోచనే ధ్వనించింది.   
    ఇలా జరగటానికి కారణం ఏమిటీ అన్నది తెలుసుకోవడానికి తర్క శాస్త్రంలో ప్రావీణ్యత అవసరం లేదు. మామూలు అవగాహన చాలు. ఓ పథకం ప్రకారం విస్సు పోటీకి రాకుండా ఏర్పాటు జరిగితే గాయపడి యిటు వచ్చాడు.    
    అది యిచ్చిన మాట నిలబెట్టుకోవాలన్న ఆలోచనో లేక గెలిచి తీరాలన్న దృఢ సంకల్పంతో చేసిన సాహసమో ఆమెకీ తెలీదు. కాని విశ్సుని అభినందించకుండా వుండలేకపోయింది.    
    స్పృహలేని నిన్ను యించుమించు మోసుకువెళుతున్న పోలీసులతో వెళ్ళలేదు.    
    వెంటనే చేయాల్సిన కార్యక్రమం మరొకటుంది.    
    చరిత్రలో చాలా ట్రేజడీలకి కారణం మంచికీ, చెడుకీ జరిగిన పోరాటాలు మాత్రమే కాదు, చెడుకీ చెడుకీ జరిగిన యుద్దాలు కూడా.....విస్సు వ్యక్తిగతంగా ఎలాంటి వాడయినా గాని చాలా శత్రువులున్నాగాని మరో శత్రువు చేత గాయపరచబడినవాడు....అదీ కూడని సమయంలో.    
    ఏ కథకయిన ఓ గమ్యం నిర్దేశించబడటానికి కథానాయకుడు అవసరమన్న సత్యమే నిజమయితే ఈ రోజు విస్సు హీరో అది అందరికీ తెలియ చెప్పాలి...    
    అక్కడున్న పత్రికా విలేకర్లను గుర్తించిన కృషి అవకాశాన్ని జారవిడుచుకోలేదు.    
    క్విజ్ మాస్టర్ సత్యేంద్ర బసు ఆధ్వర్యంలో ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసింది అదే ఆడిటోరియంలో.    
    ఆ విషయాన్ని గుర్తించకపోవడం ఇంత తెలివినీ ప్రదర్శించిన లాయర్ రంగధాం పొరపాటు.    
                                 *    *    *    *   
    అపరాత్రి దాటుతోంది...    
    చీకటి కాటుక క్రీ నీడలలో నగరానికి ఓ మూల విధ్యుద్దీపాలనడుమ అపోలో హాస్పిటల్.    
    ఆపరేషను థియేటరు బయట కూర్చుని వుంది కృషి...    
    ప్రెస్ కాన్ఫరెన్స్ ముగించి సరాసరి ఇటు వచ్చిన కృషి మూడు గంటలుగా అక్కడే కూర్చుని వుంది.    
    స్పృహ కోల్పోయిన విస్సు రూపం ఒక్కటే కాదు - మొన్నెప్పుడో కారులో కూర్చుని బెదిరించి మరీ డబ్బు లాక్కుపోయిన విస్సు - ఆ తర్వాత మేధావిలా కనిపించి గెలిస్తే ఒక రాత్రి నాతో గడపగలవా? అన్న విస్సు కళ్ళలో చిలిపితనమూ గుర్తుకొస్తుంటే బడలికగా కళ్ళు మూసుకుంది.    
    విస్సు బ్రతుకుతాడా...    
    అసలు తను బ్రతకాలనే కోరుకుంటుందా.
    అలా కోరుకోని నాడు తన స్థాయి దిగి ఇలా ఎందుకు వచ్చింది.    
    మొన్న అతడు విధించిన షరతు కన్నా లక్ష్యం కోసం ప్రాణాలు సైతం ఒడ్డగల అతడి మొండితనమే జ్ఞప్తికి వస్తుంటే...   
    ఎవరీ మనిషి అనుకుంది...    
    ఎందుకు తనకు పరిచయమయ్యాడు...    
    పదేపదే తన గురించి ఆలోచించే పరిస్థితి నెందుకు సృష్టిస్తున్నాడు.    
    ఇన్నిసార్లు కలవడం కాకతాళీయమో లేక కావాలని జరుగుతుందా...    
    నిద్రలాంటి నిశ్శబ్దంలో మేమున్నామంటూ కదిలే ఆలోచనల పొరల్లో... ఎక్కడో, ఎప్పుడో ఒకసారి నవ్వినట్లు నవ్వి అంతలో అదృశ్యమైన ఓ అద్భుతం మిగిల్చిన జ్ఞాపకాల మరకల్లో ఆమె సతమతం అవుతుండగానే ఎవరో పిలిచినట్టయి కళ్ళు తెరిచింది.    
    ఎదురుగా డాక్టర్ శమంత్....అంతసేపూ విస్సుకి సర్జరీ చేసిన డాక్టర్....    
    "హౌ ఈజ్ హి డాక్టర్" అడిగింది ఉద్విగ్నంగా.    
    "నిజానికి అంత బ్లీడ్ అయ్యేక ఏ పేషెంటూ బ్రతికే అవకాశం లేదు మిస్ కృషి. కాని మృత్యువుతో చాలా మొండిగా పోరాడుతూ ప్రాణం నిలుపుకున్నాడు...."    
    "థాంక్స్ డాక్టర్" మనసు తేలిక పడుతుంటే కృతజ్ఞతగా అంది.    
    "కాకపోతే మరో నాలుగైదు రోజులపాటు అంటే స్పుహలోకి వచ్చేదాకా చాలా జాగ్రత్తగా అతడ్ని కాపాడుకోవాలి."    
    "ఆ బాధ్యత మీకే వదిలి పెడుతున్నాను డాక్టర్.... ఎన్ని లక్షలు ఖర్చయినా ఫర్వాలేదు.....హి మస్ట్ బి సేవ్డ్-"    
    సాలోచనగా చూశాడు డాక్టర్.    
    ఓ కోటీశ్వరుడి మనవరాలైన కృషికి అతడేమవుతాడో ఎందుకు అతడిపై అంత ఆసక్తిని ప్రదర్శిస్తుందో అర్ధం కాకపోయినా నెమ్మదిగా అన్నాడు "మరో పది నిముషాలు ఆలస్యమైతే అతడికి నూరేళ్ళూ నిండిపోయేవి మిస్ కృషి...అప్పుడు మీరెంత డబ్బు ఖర్చు చేసినా లాభం లేకపోయేది."    
    "అయినా సరే..." ఓ బ్లేంక్ చెక్ అతడికి అందించింది కృషి. "దయుంచి ఫార్మాలిటీస్ గురించి నన్ను ఇబ్బంది పెట్టకండి....ఈ చెక్ మీ దగ్గరుంచుకొని అన్ని ఏర్పాట్లూ పూర్తి చెయ్యండి - ఇలా ఎందుకంటున్నానూ అంటే ట్రీట్ మెంట్ కి సంబంధించి నా పేరు గోప్యంగా వుండాలి కాబట్టి, ఇది నా కండిషన్ కాదు...రిక్వెస్ట్ మాత్రమే."   
    ఆమె ఎవరో తెలిసిన డాక్టర్ శమంత్ ఆమెను ఇబ్బంది పెట్టకుండా చెక్ అందుకున్నాడు.    
    "ప్లీజ్ డాక్టర్" బయలుదేరుతూ మరోసారి అభ్యర్ధించింది. "నేను డబ్బు ఇచ్చిన విషయం ఎవ్వరికీ తెలియనివ్వకండి....ముఖ్యంగా పేషెంటుకి. ప్లీజ్."    
    కృషి మరో అర నిముషానికల్లా లాంజులో నుంచి హాస్పిటల్ కార్ పార్కింగ్ ఏరియాకి వచ్చింది.    
    "మేడమ్"    
    ఆమెను చూస్తూనే ఓ మూల కూర్చున్న సూరి ముందుకొచ్చాడు. గుర్తుపట్టిందామె. ఆ రోజు తన చేతిలోని వేలెట్ ని లాక్కుపోయిన విస్సు స్నేహితుడు.    
    ఇంతచేసినా యింకా విస్సు ప్రాణాల కోసం ఆమె తీసుకున్న శ్రద్దకే కళ్ళు చెమ్మగిల్లాయో లేని విస్సు అదృష్టానికి ఆనంద భాష్పాలు రాలాయో కృతజ్ఞతగా చేతులు జోడించాడు మాటలు రానట్టుగా.    
    ఆ క్షణంలో ఆమె ఆలోచిస్తున్నది ఒక్కటే....ఏదైనా గోప్యంగా వుంచాలనుకుందో అది సూరికి తెలిసిపోయింది.    
    "క్షేమంగా తిరిగి వచ్చాక మీ స్నేహితుడికి చెప్పు.....బ్రతకటానికీ, జీవించటానికీ చాలా తేడా వుంది... ఏదోలా బ్రతికేయటం కాదు జీవితమంటే....దానికి ఓ అర్ధం కావాలి. కనీసం ఈ పునర్జన్మతోనైనా కొత్త మనిషిగా దర్శనమిస్తే సంతోషిస్తానని చెప్పు."    
    సూరి జవాబుని ఆశించనట్టుగా కారువేపు నడిచింది.    
    కారు నడుపుతూ అనుకుంది సూరి తననే చూశాడేమో కాని తను డాక్టర్ తో అన్న మాటలు వినలేదుగా...

 Previous Page Next Page