Previous Page Next Page 
69 సర్దార్ పటేల్ రోడ్ పేజి 13

 

    "చావు దెబ్బ కొట్టింది" అన్నాడు రామచంద్రమూర్తి . సరిగ్గా ఆ లోపల్నుంచి ఓ పొగలు కక్కే గిన్నె వచ్చి నటరాజ్ ముందు పడింది . నటరాజ్ అదిరిపోయి లేచి నిలబడ్డాడు.
    సీత వచ్చి వాళ్ళ దగ్గర నిలబడింది ఓ చేతిలో గరిటెతో.
    "ఏమిటిది? పొయ్యి మీద పెట్టి వదిలేశావ్?" కోపంగా నటరాజ్ నడిగింది.
    "ఉప్మా అండీ!"
    పొగలు తగ్గేసరికి లోపల ఉప్మా అంతా పూర్తిగా నల్లగా బొగ్గయిపోయి కనిపిస్తోంది. "నీకేమయినా సిగ్గుండా? అది ఉప్మాలా కనబడుతోందా నీకు?"
    "ఇప్పుడదంతా బయట పారేయ్యాల్సిందేగా? మొన్నటికి మొన్న అన్నం మాడ్చేశావ్. ఇంకోసారి కూర బయట పారేయాల్చోచింది. నువ్వు వంటవాడి పని చేయదల్చుకున్నప్పుడు వంటవాడిగానే వుండు రాజకీయాలు, బ్రాకేట్లూ, లాటరీ టిక్కెట్లూ వీటి మీద యిష్టం వుంటే వెనుకేపడి వెళ్ళు. నీ యిష్ట మొచ్చిన వేషాలేస్తూంటే ఆ నష్టాలన్నీ భరించడానికి సిద్దంగా ఎవరూ లేరిక్కడ."
    అంతమంది ముందు అవమానం జరగటంతోనటరాజ్ కి పౌరుషం ముంచుకొచ్చింది.
    ఇదిగో చూడమ్మా! వంటలన్నాక బోలెడు పొరపాట్లు జరుగుతాయి అవన్నీ కావాలని చేస్తున్నానా? ఎవరు మాత్రం చేయరు? నాకు జ్వరమని పడుకుంటే మీరారోజు టిఫిన్  చేశారు గుర్తుందా? ఇంటి బయట వీధి దీపం కింద పడుకునే కుక్క కూడా తినలేదది. దాన్నీ కొంచెం రుచి చూసి అదే పారిపోవటం పోయింది. మళ్ళీ యింతవరకూ ఇటు వైపు తలెత్తి కూడా చూడలేదు పాపం."
    "నువ్వు చేసే వంటల కంటే నయమేలే. అలా నువ్వు పొరబాట్లు చేసేట్లయితే యిక్కడ ఉద్యోగం చెయ్యక్కర్లేదు." మరింత కోపంగా అంది ఆమె.
    రామచంద్రమూర్తి కలవరపడ్డాడు.
    నటరాజ్ నవ్వుతూ ఏమన్నా పడతాడు గానీ , అతని మనసుని గాయ పరిస్తే మాత్రం సహించలేడు.
    "సీతా! అయిందేదో అయిపొయింది. దాని కింత రాద్దాంతం ఎందుకు" అన్నాడు సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తూ.
    "మీరూరికే వెనకేసుకురాబట్టే యిలా తయారయ్యాడసలు. మీరూరుకొండి"
    ఉమాదేవి, మస్తాన్రావ్ ఆమె కోపం చూసి నెమ్మదిగా బయటకు జారుకున్నారు.
    "ఏమిటమ్మా అన్నారు? నేనిక్కడ ఉద్యోగం చేయనక్కర్ల్రేదా? ఎన్నో సార్లు మానేసి మా ఊరు వెళ్ళిపోతానని అంటే రామచంద్రమూర్తి గారే వుండమని బలవంతం చేశారు. లేకపోతే ఈ దిక్కు మాలిన కొంపలో పడుండాల్సిన అవసరం నాకేమిటి? మీ యిద్దరికే ఠికానా లేదు. ఇంక వంట వాడినేం మెయింటేయిన్ చేస్తారు?"
    "ఓహో! అలాగా? ఇప్పుడెవరూ వుండమని బలవంతం చేయటం లేదుగా. ఇంకెందుకున్నావ్ మరి? బయటికెళితే అడుక్కుతినాల్సి వస్తుందని ఇక్కడున్నావ్. నాకు తెలీదా?"
    నటరాజ్ కళ్ళ వెంబడి నీళ్ళు తిరిగాయి ఆ మాటతో. చటుక్కున లేచి నిలబడ్డాడు. కోపం కంటే బాధ ఎక్కువగా కలిగిందతనికి.
    "సరే వెళ్తున్నాను........ఇప్పుడే వెళుతున్నాను. మంచీ మర్యాదా లేని ఇంట్లో చీమూ నెత్తురూ లేనట్లు పడివుండటం నాకూ యిష్టం లేదు" అని విసవిసా తన గదిలోకి నడిచి తన సూట్ కేస్, బ్యాగు తీసుకుని వచ్చాడు.
    రామచంద్రమూర్తికి అతని మీద జాలి కలిగింది.
    "నటరాజ్! ఏమిటివాళ నువ్వూ తొందరపడుతున్నావు?"
    "లాభం లేద్సార్! రోజురోజుకి నేను చులకనయిపోతున్నాను.పేరు వంటవాడే కావచ్చు సార్! కానీ వంటవాళ్ళక్కూడా సిగ్గూ శరం వుంటుంది. వాళ్ళూ మనుషులే. నేను బయటికెళితే అడుక్కుతింటానా? తమ్ముళ్ళు నన్ను నెత్తిన పెట్టుకుంటారు సార్! ఎన్ని సార్లు యింటికి వచ్చేయమని బ్రతిమాలడారు వాళ్ళు, అయినా నేను వెళ్ళలేదు. ఎందుకో తెలుసా సార్? నాకు ఏమున్నా ఏమి లేకపోయినా ఆత్మాభిమానం ఎక్కువ సార్. నన్నేవరయినా పల్లెత్తు మాటన్నా , అవమానపరచినా చస్తే ఆ చుట్టుపక్కల కూడా వుండను. అలాంటి పరిస్థితి వస్తుందేమో అని దూరాలోచన చేసి ఇంటికి వెళ్ళలేదు సార్! నా వాళ్ళ కంటే మీరు ఎంతో ఉన్నతమైన మనసు గలవారని నేనీ ఇంట్లోనే వుండిపోయాను."
    సీత కోపంగా రామచంద్రమూర్తి వేపు చూసింది.
    "మీరూరికే బ్రతిమాలకండి. మనిద్దరం పైసాకు ఠికానా లేనివాళ్ళం కదా! మనదగ్గరెందుకు పోనీండి."
    నటరాజ్ కి పౌరుషం వచ్చేసింది.
    "పోతానమ్మా! మీరు బ్రతిమాలినా వుండనింక. నాకివ్వాల్సిన డబ్బు పడెయ్యండి. ఈ నెలతో కూడా కలిపి మొత్తం ఆరువేల నాలుగొందల రూపాయలు బాకీ. దీనికి సంవత్సరం వడ్డీ కూడా లెక్కేసి నా డబ్బు నా మొఖాన్నా కొట్టండి వెళ్తాను. మీరు చాలా పౌరుషం వున్నోళ్ళు కదా! పైగా డబ్బున్నోళ్ళు . నాలాగా పైసాకు కొరగాని ఫకీర్లు కాదుగా ఇవ్వండి. చూస్తారేంటి? ఇవ్వండమ్మా."
    సీత నిర్ఘంతపోయింది.
    తాము అతనికి సంవత్సరం నుంచీ జీతం యివ్వటం లేదన్న విషయము గుర్తుకొచ్చేసరికి కలవరపాటు కలిగింది. ఆ విషయం తను మార్చేపోయింది.
    ఇప్పుడేమిటి చేయటం? ఇంట్లో ఇంచుమించుగా డబ్బేమీ లేదు. అయినా ఆరువేల రూపాయలు ఎక్కడ నుంచి తెచ్చివ్వగలరు.
    ఆమె మొహం అవమానంతో ఎర్రబడింది. ఏం మాట్లాడాలో, ఏం సమాధానం చెప్పాలో తెలీటం లేదు.
    "మా దగ్గర డబ్బున్నప్పుడు వడ్డీతో సహా పంపిస్తాంలే."
    "అంతవరకూ నేనెందుకు అగాలీ? తక్షణం ఇంట్లో నుంచి బయటకు పోమ్మన్నప్పుడు తక్షణం నా బాకీ నా మొహానా కొట్టాలమ్మా! పెద్ద పౌరుషమున్నోళ్ళుగా మీరు. పెద్ద డబ్బున్నోళ్ళుగా మీరు. మాలాంటి అలాగా జనం దగ్గర బాకీలెందుకు పెట్టాలి? నా డబ్బు అణా పైసాల్తో సహా నాకిప్పుడు పడేయ్యండి. నా దారిన నేను పోతాను."
    సీతకు కళ్ళ వెంబడి నీళ్ళు తిరిగాయి. వీడిప్పుడు నా పరువు తీసేటట్లున్నాడు. ఏం చేయడానికి తోచక రామచంద్రమూర్తి వేపు నిస్సహాయంగా చూసింది.
    అతనికి ఆ పరిస్థితి బాధ కలిగించింది.

 Previous Page Next Page