Previous Page Next Page 
ఆఖరి ఘడియలు పేజి 13


    స్మితారాణి మొహంలో కలవరపాటు కనిపించింది కొద్ది క్షణాల పాటు.
    "నాకేం అనుమానం లేదు." అంటూ తలుపులు మూయబోయింది. కానీ అప్పటికే భవానీ శంకర్ గడపలో కొచ్చి నిలబడ్డాడు.
    "నిజంగానే స్మితాజీ! ఉదయం ఆర్. కె. శ్యామ్ ఇంటి సందులో ఆ కారు మీ మీదకు రావటం, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఇంకోకారు మిమ్మల్ని డాష్ ఇవ్వబోయి , యాక్సిడెంట్ కి గురవ్వటం , యిదంతా చూస్తుంటే మిమ్మల్ని ఎవరో వెంటాడి చంపటానికి ప్రయత్నిస్తున్నారని అనుమానంగా ఉంది."
    "నాకేం అనుమానం లేదు. వాళ్ళెవరో మిమ్మల్నే చంపటానికి ప్రయత్నిస్తున్నారేమో."
    భవానీ శంకర్ కొద్ది క్షణాలు ఆలోచించాడు.
    ఆ పాజిబులిటీ కూడా ఉంది. కానీ తనకు తెలిసి శత్రువు లెవరు లేరు. అయినా చంపాలనుకుంటే ఉదయం ఆ సందులో కారు తన మీదకే రావాల్సింది గానీ అది స్మితారాణి మీదకు ఎందుకు వెళుతుంది?
    "అల్ రైట్ స్మితాజీ! ఏదేమయినా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది - బైదిబై తులసి మమ్మీ డాడీ వాళ్ళున్నారా?"
    "మా బావగారికి అనుకోకుండా సింగపూర్ లో జాబ్ వచ్చింది అందుకని మా అక్కతో పాటు వెళ్ళిపోయారు! ఇంకో మూడునెలల వరకూ రారు."
    "అయితే మీరొక్కరే ఉండాలన్నమాట ఇంట్లో. ఈ పరిస్థితులలో మీరు మరింత జాగ్రత్తగా ఉంటేగానీ లాభం లేదు మేడమ్."
    "ముందు మీ మెదడు జాగ్రత్తగా పరీక్షించుకొండి. డిటెక్టివ్ నవలలు మీ ఆరోగ్యానికి మంచిది కాదు" తలుపులు దభేలుమని మూసేసిందామె.
    భవానీశంకర్ ఒక్కసారిగా ఎగిరి బయటకు దూకాడు. లేకపోతే ఆ తలుపు సందులో పడి నలిగి పోవాల్సి వచ్చేది.
    గదికి చేరుకొని బట్టలు మార్చుకుని మంచం మీద పడుకున్నాడతను. అతనికి ఆ నల్లకారు వ్యవహారమే అంతుబట్టటం లేదు. వాళ్ళు స్మితారాణినే చంపాలనుకుంటున్నది ఖాయం, కానీ ఎందుకు చంపాలనుకుంటున్నారో మాత్రం తెలీటం లేదు. ఆ అమ్మాయితో వివరంగా మాట్లాడితే కొన్ని విషయాలు తెలియవచ్చు. ఎవరికి ఆ అవసరం ఉన్నదీ, ఎందుకా అవసరం కలిగిందీ, అన్నీనూ.
    కానీ ఆ అమ్మాయి తనను చూస్తూనే టెర్రరిస్ట్ లా బాంబులు విసిరేస్తున్నట్లు మాట్లాడుతోంది హటాత్తుగా అతనికో ఆలోచన తట్టింది.
    అవును! స్మితారాణి సంగతులు చాలా వరకూ అభిలభానుకి తెలిసుండవచ్చు. రేపోసారి అటో రౌండ్ వెళ్ళి వదినమ్మను కూర్చోబెట్టి జరిగినదంతా చెప్పి ఇన్ ఫర్మేషన్ తీసుకుంటే ఏమయినా ఉపయోగం వుంటుందేమో.
    ట్యూన్ నెంబర్ త్రీ పాడసాగాడు భవానీశంకర్.
    ట్యూన్ నెంబర్ త్రీ ఆ చుట్టూ ప్రక్క వాళ్ళందరికీ చాలా ఇష్టమని అతనికి తెలుసు.
    మరుక్షణంలో తలుపు దగ్గర యధాప్రకారం అరడజను మంది పిల్లలు, నలుగురయిదుగురు చుట్టు ప్రక్కల స్త్రీలు , ఓ కుక్క హాజరయివున్నారు.
    అయితే ట్యూన్ ఆఖరి దశ కొచ్చేవరకూ అతనికా విషయం తెలీక పాట ఆపలేదు. చివరకు ఎలాగయితేనేం ట్యూన్ నెంబర్ త్రీ ఆగిపోయింది.
    ప్రేక్షకులందరూ ట్యూన్ నెంబర్ ఫోర్ పాడమని బ్రతిమాలటం ప్రారంభించారు. హటాత్తుగా ఆ గది పక్కనే వున్న పెంకుటింట్లో నుంచి ఒక స్త్రీ కేకలు వినిపించాయ్. ఒక్క ఉదుటున లేచి ఆ ఇంటి దగ్గరకు పరుగెత్తాడు భవానీ శంకర్.
    ఒక స్త్రీ నులక మంచం మీద పడుకుని బాధతో విలవిలలాడుతుంది. ఆమె పిల్లలు  మంచం దగ్గర బిక్క మొహం వేసుకుని చూస్తున్నారు.
    "ఏమిటి? ఏం జరిగింది?" అడిగాడు భవానీశంకర్.
    "కడుపు నొప్పి బాబూ - అప్పుడప్పుడూ అలాగే వచ్చి ప్రాణం తీస్తుంది! బాధతో మెలికలు తిరుగుతోందామె.
    "ఒరేయ్ కిట్టూ వెళ్ళి అటో తీసుకురారా! హాస్పిటల్ కి తీసుకేల్దాం" ఓ కుర్రాడిని పురమాయించాడు భవానీ శంకర్. రెండు నిముషాల్లో అటో వచ్చింది.
    "నేను హాస్పిటల్ కి వెళ్ళితే నా పిల్లల్ని ఎవరు చూస్తారు బాబూ వద్దు నేను వెళ్ళను" వారిస్తూ అందామె.
    "నీ పిల్లలకేం మునిగిపోదులే పద. అంతా నేను చూసుకుంటాను సరేనా?" ఆమెను తీసుకుని కిట్టూ గాడితో పాటు గవర్నమెంటు హాస్పిటల్ కి చేరుకున్నాడు భవానీ శంకర్.
    ఆమెతో పాటు అవుట్ పేషెంట్ వార్డులోకి జొరబడ్డాడతను. క్యూని తప్పించుకుని తిన్నగా డాక్టర్ దగ్గర కెళ్ళిపోయాడు.
    "గుడ్ మార్నింగ్ డాక్టరు! ఈమె కడుపు నొప్పితో బాధ పడుతోంది. ఎపెండిసైటిస్ అని నా అనుమానం! వెంటనే పరీక్ష చేస్తే."
    డాక్టర్ అతని వేపు ఎగాదిగా చూసాడు.
    "వెళ్ళి క్యూలో రా!" అన్నాడు చిరాకుగా.
    "ఎక్కువ బాధపడే వాళ్ళను ముందుగా చూడాలి డాక్టర్! ఈ పద్దతిని తెలుగులో ఏమంటారో మీకు తెలుసుండదు బహుశా! "మానవత్వం" అంటారు దీన్నే ఉర్దులో "ఇన్సినియత్ " అంటారు బెంగాలీలో"
    డాక్టరు మొహం కందిపోయింది కోపంతో.
    "బయటికెళతావా? ఫ్యూన్ ని పిలిచి గెంటించమంటావా?"
    భవానీశంకర్ జేబులో నుంచి చిన్న కెమెరా బయటకు తీశాడు.
    అల్ రైట్ డాక్టరు మేము క్యూలోనే రావాలని అంటే అలాగే వస్తాం . కానీ ఈమె కేమయినా ప్రమాదం జరిగిందంటే మాత్రం మీ ఉద్యోగం, మీ ప్రాణాలూ కూడా రిస్కులో పడతాయ్! నేను ప్రెస్ ఫోటోగ్రాఫర్ని! ఈ కేసు గురించి మొత్తం వివరాలన్నీ ఫొటోలతో సహా అన్ని పేపర్లలోనూ న్యూస్ వచ్చేస్తుంది. ఆ ఫోటోలు చూశారంటే జనం ఏం చేస్తారో మీకూ తెలుసు. ఈ మధ్యే ఓ పేషెంటు డాక్టర్ లంచగొండితనం వల్ల చనిపోతే జనం డాక్టరుని ఊరితీశారు" ఆమెను బయటికి నడిపిస్తూ అన్నాడు భవానీశంకర్.

 Previous Page Next Page