Previous Page Next Page 
నీ మీద మనసాయరా పేజి 14


    
    ఆ మాటల్లో కొంత కసికూడా లేకపోలేదు.
    
    ఆమెని బయటపెట్టి లోపల మేం సుఖపడడం నాకు ఎబ్బెట్టుగా వుంది. కానీ నేనేం చేయగలను? ఆమె పెళ్ళికి డబ్బు ఎలా తేవడం? ఎంత ఆలోచించినా నాకేమీ తోచేదికాదు.
    
    ఓ రోజు మధ్యాహ్నం భోజనాలయ్యాక నేనూ, మధుమతి విస్తర్లు కుట్టడానికి కూర్చున్నాం.
    
    మా సంభాషణ పెళ్ళిమీదికి మళ్ళింది.
    
    "ఇన్నేళ్ళయింది కదా. పెళ్ళి సంబంధాలే చూడలేదా నీకు?" అని అడిగాను.
    
    "రెండు సంవత్సరాల ముందు, అంటే పెళ్ళికి సంవత్సరం ముందున్న మాట. హరికి నన్నిచ్చి చేయాలనుకున్నారు. హరి అంటే తెలుసా? మన ఇంటికి నాలుగు ఇళ్ళకవతల. అతనికి అమ్మ వుంది. నాన్న లేడు. ఉన్నది అన్న ఒక్కడే దినకర్ అతని భార్య సువర్చల"
    
    "సువర్చలంటే ఆ సన్నటి అమ్మాయి కదా బావి దగ్గర చూస్తుంటాం- ఆమే కదా"
    
    "ఆఁ అంతా అయ్యాక కట్నం దగ్గర, బంగారం దగ్గర గొడవొచ్చింది. పాతికవేలూ, పదిహేను సవర్ల బంగారం కావాలన్నాడు దినకర్. అది నావల్ల కాదు. పెళ్ళి జరిపిస్తానన్నాడు అన్న దాంతో సంబంధం బెడిసి కొట్టింది. ఆ తరువాత ఇంట్లో నా పెళ్ళి చేయాలన్న ఆలోచన ఎవరికీ వున్నట్లు అనిపించడం లేదు"
    
    ఆమె మాటల్లో బాధ సుళ్ళు తిరుగుతోంది.
    
    "పోనీలే- పెళ్ళి లేకుండా ఇలానే వుండిపోతాను. లేదంటే ఏర్పేడు ఆశ్రమంలో చేరిపోతాను"
    
    "ఛీఛీ! అలనాటి మాటలెందుకులే" అని ఆమెకు కాసేపు ధైర్యం చెప్పాను.
    
    ఈ మాటలు విన్నాక హరిని చూశాను. వీధిలో పోతుంటే గమనించాను. పిల్లాడు బాగానే వున్నాడు. వెంకటగిరిలోని ఓ ఐస్ ఫ్యాక్టరీలో పని చేస్తున్నాడు. అతని అన్నయ్య దినకర్ ఎప్పుడూ తారసపడలేదు. ఉదయం పొలం వెళితే ఇక సాయంకాలమే ఇంటికి రావడం. దాంతో అతన్ని చూడలేకపోయాను.
    
    మరోపదిరోజుల కనుకుంటాను. హరి, దినకర్ తల్లి చనిపోయింది. అప్పుడు నేను ఊర్లోలేను. వ్యవసాయం చేయడానికి మూడువేల రూపాయలు కావాల్సొచ్చాయి. వాటికోసం మా పుట్టింటికి వెళ్ళాను. అక్కడ పరిస్థిథీ బాగా లేదు. నానా తంటాలుపడి నాన్న ఆ డబ్బు ఇచ్చాడు. నేను వచ్చేటప్పటికి చాలా రోజులైంది.
    
    "హరి అమ్మ చనిపోయింది. నిన్ననే కర్మకాండ అయింది" అని చెప్పింది మధుమతి.
    
    ఆ సాయంకాలం ఒంటరిగా వున్నాను. మధుమతి దేవాలయం దగ్గరికి వెళ్ళింది. వంటంతా ముగించి వీధి వరండా మెట్లమీద కూర్చున్నాను.
    
    లోకం మీద రాత్రి వలను విరిసినట్లు చీకట్లు దిగుతున్నాయి. కడుపులోని ఆకలి ఎలుకను తరిమెయ్యడానికి ముంత పొగను పెట్టినట్లు అక్కడక్కడా ఇళ్ళ నుంచి పొగపైకి లేస్తోంది. ఊరకుక్కలు ఇంకా భోజనం టైమ్ కానట్లు అటూ ఇటూ తిరుగుతున్నాయి.
    
    చీర కాస్తంత వదులైనట్లు అనిపించడంతో సరిగా కట్టుకుందామని ఇంట్లోకి వెళ్ళాను. హాల్లో తలుపు కవతలున్న రూమ్ లోకి దూరి చీర విప్పాను.
    
    తిరిగి కట్టుకోవడానికి కొంగును లంగాలోపలికి దోపి కుచ్చిళ్ళు పోసుకుంటున్నాను.
    
    ఏదో అలికిడైతే చివుక్కున తల పైకెత్తాను.
    
    హాల్లో దినకర్.
    
    సిగ్గుతో ఒళ్ళంతా కుంచించుకు పోయింది. అ కంగారులో చీరనంతా ఎదపైకి వేసుకున్నాను. సిల్కుచీర నిలబడలేదు. మళ్ళీ కిందకు జారింది.
    
    దినకర్ అలానే గుడ్లప్పగించి చూస్తున్నాడు.
    
    యుద్ధం ప్రారంభానికి ముందు మ్రోగించే నగరాల్లా వుండే నా పాలిండ్లు అతని కనురెప్పల మధ్య అద్దం పడుతున్నట్లు కళ్ళు ఆర్పడం మానేశాడు.
    
    ఠక్కున గదిమూలకు పరుగెత్తి చీర కట్టుకున్నాను. అతనికి ఎదురు పడాలంటే ఏదోగా వుంది. కానీ నేను తప్ప ఎవరూ ఇంట్లో లేకపోవడం వల్ల తప్పింది కాదు.
    
    ఇబ్బందిగా నవ్వుతూ హాల్లోకి వచ్చాను.
    
    "మా అమ్మ చనిపోయింది నిన్ననే కర్మకాండ తీరింది. అందుకే వచ్చాను" అన్నాడు.
    
    చాలా అందంగా వున్నాడతను. వయసు ముఫ్ఫై పైమాటే. మీసాలు లేకపోవడం వల్ల ఏ గంధర్వుడో భూమిమీదికి దిగినట్లున్నాడు. 'చక్కెర' అన్నాడు.
    
    అప్పుడు గుర్తొచ్చింది నాకు. తల్లిదండ్రులు చనిపోయినప్పుడు, చనిపోయిన రోజునుంచి కొరివి పెట్టిన పెద్ద కొడుకు ఊర్లో ఎవరింటికి రాకూడదు. కర్మకాండ తీరిన మరుసటిరోజు అందరి ఇళ్ళకూ వచ్చి, ఏదో తీపి తినిపోతాడు. అదీ ఆచారం. అందుకే అతనొచ్చాడు. లోపలికెళ్ళి చక్కెర డబ్బాతో వచ్చాను.
    
    అతను చేయి చాచాడు. రెండు స్పూన్లు పోశాడు.
    
    "మిమ్మల్ని ఇదే మొదటిసారి చూడడం" అంటూ నోట్లో చక్కెర పోసుకున్నాడు.
    
    అంతకుముందు అలా జరక్కుండా వుంటే బాగానే మాట్లాడేదాన్ని ఇప్పుడు ఏదో అడ్డం పడుతోంది. అందుకే చిన్నగా నవ్వి లోపలికి వెళ్ళిపోయాను.
    
    చక్కెర డబ్బా పెట్టి తిరిగి వచ్చేటప్పటికి అతను వెళ్ళిపోయాడు. రెండో రోజు యధాప్రకారం నేనూ, మధుమతీ కలిసి బావికి నీళ్ళకెళ్ళాం.
    
    ఆ బావి దినకర్ ఇంటికి ఎదురుగ్గా వుంది.
    
    ఎప్పుడూ లేంది ఆ సాయంకాలం దినకర్ వరండాలో తచ్చాడుతూ కనిపించాడు.
    
    నాకోసమే పొలం నుంచి త్వరగా వచ్చేడేమోనన్న సందేహం మొదలైంది. ఇలాంటి సందేహాలు రావడం వీటిల్లో మొదటి మెట్టు అనుకుంటాను.
    
    రెండోరోజు ఉదయం నీళ్ళకు వెళ్ళినప్పుడు కూడా వున్నాడు. నా సందేహం నిజమేననిపించింది.
    
    ఇక అప్పటినుంచి బావి దగ్గరికి వెళ్ళడం దినకర్ వున్నాడో లేడోనని నా కళ్ళు అతని వరండాలో పెంపుడు పావురాయిల్లా వాలేవి. బెదురు బెదురుగా చూసేవి. పావురాళ్ళు కూడా అంతే. ఎవరైనా వస్తారేమోనని అదేపనిగా కంగారు పడుతుంటాయి.
    
    నేను చూడగానే దినకర్ ఏదో ఒకటి చేయడం ప్రారంభించాడు. చేయెత్తడమో, టాటా కొట్టినట్లు చేయి అలా వూపుతూ తలమీద పెట్టుకోవడమో, నమస్కారం పెట్టినట్లు రెండు చేతులూ జోడించడమో చేస్తున్నాడు. నావైపు నుంచి సిగ్నల్స్ పోవడంలేదు.
    
    అంతవరకు పెద్దమనిషిగా వున్నవాడు చిన్నపిల్లాడైపోయాడు. ఇంతకు ముందెప్పుడూ ఇలాంటి వేషాలు వేయలేదని తెలిసింది ఎవరైనా ఎదురుపడ్డా తలవంచుకుని వెళ్ళిపోయేరకం. మరి ఆరోజు నన్నలా చూడడంతో మనసు చలించిందా?
    
    అంతలో ఊర్లో కొంతమంది మైరావణ నాటకాన్ని నేర్చుకోవడం మొదలుపెట్టారు.

 Previous Page Next Page