చివుక్కున తలెత్తింది సూర్యాదేవి.
తనకు తెలియని జీవితం చాలా వుందనిపించింది. ఒక్కొక్కర్ని కదిలిస్తే ఎన్నెన్ని కథలు, ఎన్నెన్ని కన్నీళ్ళు, ఎన్నెన్ని నిట్టూర్పులు, ఎన్నెన్ని చక్కలిగింతలు.
ఇంతకాలం తను డబ్బు పంజరంలో ఇరుక్కుపోయింది.
"ఎవరిమీద? చెప్పవా?"
"చెబుతాను ఇప్పటివరకు ఎవరికీ చెప్పని నా జీవితపు కోణాన్ని గురించి చెబుతాను"
సూర్యాదేవి కుడిచేతిని బుగ్గకింద ఆనించుకుని ముందుకి వంగింది.
"ఇది మరొకటి మీద నాకై నేను మనసు పడ్డానో, లేక నా కుటుంబ సభ్యులకోసం కొత్త వ్యక్తిని నా జీవితంలోకి ఆహ్వానించి త్యాగం చేశానో, లేదూ ఈ రెండూ వున్నాయో నాకు తెలియదు. అంతా విన్నాక నువ్వే చెప్పాలి మరి" అంటూ చెప్పడం ప్రారంభించింది మహిత.
"మా ఊరు కాళహస్తికి దగ్గర్లోని పల్లెటూరు. మొత్తం వంద కుటుంబాలు వుంటాయనుకుంటాను అమ్మా నాన్నలకు నేనొక్కదాన్నే సంతానం మొత్తం నాలుగెకరాల పొలం వుండేది. మా ఊరివారందరూ కష్టజీవులు పడమటి కొండల్లో పొద్దుగుంకే వరకు పొలాల్లో పనిచేసే వాళ్ళు అందుకే లగ్జరీగా బాగానే నడిచేవి కుటుంబాలు.
ఇంటర్ పాసయ్యాక ఇక చదువు వద్దన్నారు ఇంట్లో, కాళహస్తి నుంచి తిరుపతికి వెళ్ళి చదువుకోవడం కష్టమై పోయింది. హాస్టల్ లో వుండడం మా కుటుంబానికి భరించలేని భారం అందునే ప్రైవేట్ గా చదవాలనుకున్నాను.
అమ్మా నాన్నలతో పాటు నేనూ పొలం దగ్గరికి వెళ్ళేదాన్ని పశువులకి గడ్డి కోయడం దగ్గర్నుంచి, వరిమోపులు కట్టేవరకు చేసేదాన్ని. మా ఊర్లో కూలీలు కూడా దొరకరు. ఎవరి పనులు వాళ్ళు సొంతంగా చేసుకోవాల్సిందే.
డిగ్రీ ఫస్టియర్ ప్రైవేట్ గా కూర్చుని పాసయ్యాను. సెకండ్ ఇయర్ కూడా ఫీజు కట్టాను. అదిగో ఆ సమయంలో నాకు పెళ్ళి సంబంధం వచ్చింది.
పెళ్ళికొడుకు పేరు సుధాకర్. వెంకటగిరి. నాయుడుపేటల మధ్య నున్న పల్లెటూరు. సుధాకర్ కి అన్నదమ్ములు లేరు, ఉన్నదల్లా ఒకే ఒక చెల్లెలు ఆమెకి పద్దెనిమిదేళ్ళు నిండాయి. పెళ్ళి కాలేదు. పదెకరాలదాకా పొలం వుంది వ్యవసాయమే జీవనాధారం.
ముఫ్ఫైవేల డబ్బూ, పదిసవర్ల బంగారంతో మా పెళ్ళి సెటిలైపోయింది. పెళ్ళిచూపుల్లో సుధాకర్ టక్ చేసుకుని హుందాగా కనిపించాడు.
చదివింది ఇంటరే అయినా అంత స్టయిల్ గా వుండడం నాకు ఆనందం వేసింది. టౌన్ కి మరీ దగ్గర పల్లెకావడం వల్ల నాగరికం అబ్బిందనుకుంటాను. సుధాకర్ చెల్లెలు మధుమతి కూడా అందంగా, అరవిరిసిన బొండుమల్లెలా వుంది. సుధాకర్ తో నా పెళ్ళి జరిగిపోయింది. మూడు రాత్రుల ముచ్చట్లు తీరాక- అత్తగారింటికి బయల్దేరాను.
అమ్మావాళ్ళు రెండు బుట్టలకి జిలేబీలు కాల్చారు. మరో బుట్ట మిక్చర్" తయారు చేశారు.
వాటిని తీసుకుని బయల్దేరాం.
ఆ ఊరు బావుంది. బస్సు దిగి రెండు ఫర్లాంగులు నడిస్తే ఊరొస్తుంది. దాదాపు రెండువందల ఇళ్ళున్నాయి. మొత్తం నాలుగు వీధులు మా ఇల్లు ఓ వీధి చివరలో వుంది. నాలుగు గదుల మిద్దిల్లు గదులన్నీ విశాలంగా వున్నాయి ఇల్లు బాగానే వుందనిపించింది.
మేం వెళ్ళిన మరుసటిరోజు అమ్మ మధుమతి కలిసి సారె పంచడానికి వెళ్ళారు. తెచ్చిన జిలేబీలు, మిక్చర్ అన్ని ఇళ్ళకు పంచేటప్పటికి మధ్యాహ్నం అయింది.
నాన్న రెండోరోజు వచ్చాడు.
'పదివేల రూపాయల్లో నీకు కావాల్సింది చెప్పమ్మా కొనిస్తాను' అన్నాడు.
నాకు ఏడుపొచ్చింది. కూతురికి పెళ్ళి చేయడం ఎంత కష్టమో చూస్తున్నాను. పెళ్ళి అనుకున్నప్పట్నుంచీ డబ్బు మంచినీళ్ళలా ఖర్చవుతోంది. అమ్మ అయితే సారెకోసం జిలేబీల్ని ఓ రాత్రంతా మేల్కొని కాల్చింది.
కట్నం ఇవ్వడమే కాకుండా ఇప్పుడు మళ్ళీ పదివేల రూపాయలకి సామాను కొనిస్తానంటున్న నాన్నను చూసి ఏడుపొచ్చింది.
"ఇప్పుడు అవన్నీ ఎందుకులే నాన్నా" అన్నాను.
"లేదమ్మా అలా అనకు, నువ్వు సుఖంగా వుంటే మేం సుఖంగా వున్నట్టు లెక్క" అన్నాడు నాన్న.
ఇష్టం లేకపోయినా ఒప్పుకున్నాను. ఆ మరుసటిరోజు నేనూ, సుధాకర్, మధుమతి, మానాన్న నెల్లూరు వెళ్ళాం. ఏమేం కొనాలో ముందే లిస్టు రాసుకున్నాం. టి.వీ. మిక్సి, దుప్పట్లు, హీటర్, ఐరన్ బాక్స్, బట్టలస్టాండూ, హేంగర్లూ, ఇంటికి మరీ అవసరమైనవన్నీ కొన్నాం తిరిగి వచ్చేటప్పటికి సాయంకాలమైంది.
ఇంటి దగ్గర పొలం పనులున్నాయని అమ్మా, నాన్న అప్పుడే వెళ్ళి పోయారు.
నేనొక్కదాన్నే మిగిలిపోయాను.
రోజులు గడిచేకొద్దీ నాకు ఇంటి పరిస్థితులు, మనుషుల ప్రవర్తన అర్ధం అవుతూ వచ్చింది.
ఆర్ధికంగా చితికిపోయిన కుటుంబం అది. వ్యవసాయం తప్ప మరో ఆదాయం లేదు. అత్తామామలు ముసలివాళ్ళు, బయటికెళ్ళి పనులు చేసే స్థితిలో లేరు. ఇక సుధాకర్ దేనినీ సీరియస్ గా తీసుకునే రకం కాదు. కష్టపడి పనిచేసి, పైకి రావాలన్న తపన ఏ కోశానా లేదు. వ్యవసాయం గురించి పట్టించుకునేవాడు కాదు. ఎప్పుడూ అలా మజ్జుగా, మన్ను తిన్న పాములాగా రూమ్ వదిలేవాడు కాదు. ఆకాశం విరిగి మీద పడిపోతూ వుందని ఎవరైనా అన్నా 'అంతేకదా' అని పడుకున్న చోటు నుంచి కదిలే రకం కాదు.
మధుమతికి పద్దెనిమిదేళ్ళు అనుకున్నానుగానీ ఇంకా ఎక్కువే. ఇరవై నాలుగేళ్ళు. నా వయసేనన్న మాట. ఆ పిల్లకి పెళ్ళి పిచ్చి. ఇంకేం చేయను తోచక పెళ్ళన్నా చేసుకుందామానుకున్నట్లు మాట్లాడేది. చాలా సంవత్సరాల ఒంటరి జీవితం బోర్ కొట్టేసినట్లుంది. అందునా తన వయసే వున్న నేను రాత్రయితే భర్తతో కలిసి గది తలుపులు బిడేయించేసుకోవడం భరించ లేకుండా పోతోంది.
కానీ ఆ పిల్లకి పెళ్ళి చేయాలన్న ధ్యాస సుధాకర్ కి లేనేలేదు.
"ఏం చేయమంటావ్? పెళ్ళి చేయాలంటే కనీసం డెబ్బై అయిదు వేలన్నా చేతిలో వుండాలి. డెబ్బై అయిదువేల రూపాయలు కాదు కదా అన్ని చిల్లపెంకులు కూడా లేవు. నువ్విచ్చిన ముఫ్ఫైవేలూ అంతకు ముందున్న చిల్లరబాకీలు తీర్చడానికి, పెళ్ళి ఖర్చులకి అయిపోయింది" అనేవాడు.
"మరి ఆ పిల్లకి పెళ్ళి-వయసు కూడా తక్కువేం కాదు. ఇరవై నాలుగేళ్ళు ఏ వయసులో ముచ్చట ఆ వయసులో తీరాలని ఆమెకి మాత్రం వుండదా."
"ఎప్పుడు జరగాలని వుంటే అప్పుడు జరుగుతుందిలే" అని లైట్ ఆర్పేశాడు.
మా గదిలో లైటు ఆరడం, హాల్లో పడుకున్న మధుమతి కళ్ళు లైట్లలా విచ్చుకుంటాయని నాకు తెలుసు. భార్యాభర్తల గదిలో లైటు ఆరిపోవడంతోనే ఏం ప్రారంభమవుతుందో ఆ పిల్లకి మాత్రం తెలియదా?
కొన్ని రోజులకి మధుమతి ఈ విషయాన్ని డైరెక్టుగా మాట్లాడ్డం ప్రారంభించింది.
"చలిగాలి రివ్వున తగుల్తోంది వదినా. అయితే నీకేంలే. గదిలో వెచ్చ వెచ్చగా హాయి హాయిగా గడుపుతావ్" అనో, "తొమ్మిధై పోయింది గదా గదిలోకి వెళ్ళు. గదిలోకి వెళ్ళడమంటే స్వర్గంలో కాలు పెట్టడమే గదా" అనో కామెంట్ చేసేది.