"ఎందుకని?"
"అక్కడ కేవలం శరీరానికే గాక, మనస్సు, బాధ్యత, నీతి అనే అనేక అంశాలకు ప్రాధాన్యత వుండబట్టి."
"మీ భార్యను మీరు చాలా గాఢంగా ప్రేమిస్తున్నారా?"
"చాలా!"
"ఏ సమయంలోనూ, సందర్భంలోనూ, ఆ ప్రేమ అటూ ఇటూ జారదా?"
"జారదు."
"టీ తీసుకొస్తాను" అంటూ ఆమె లోపలికి వెళ్ళి నాలుగయిదు నిముషాల తర్వాత టీకప్పుతో తిరిగివచ్చింది.
"తీసుకోండి" అంటూ కప్పు అతనికందిస్తూండగా, ఆ కదలికలో టీ కొంచెం తొణికి అతని షర్టుమీద పడింది.
"అయ్యో" అని ఆమె బాధపడి కప్పు టీపాయ్ మీద పెట్టి గబగబ ఓ నేప్ కిన్ తెచ్చి కొంచెం తడిపి, నేలమీద మోకాళ్ళపై కూర్చుని టీ పడ్డచోటు షర్టుని తుడుస్తోంది. అతను మెదలకుండా గమనిస్తున్నాడు.
మధ్యలో తలెత్తి అతనివైపు చూసి నవ్వింది.
అతను కూడా నవ్వి ఊరుకున్నాడు.
"ఇలా నేను తుడుస్తూ వుంటే ఎలావుంది?"
"మామూలుగానే వుంది కానీ ఎందుకింత కష్టపడుతున్నావు?"
"మీ షర్ట్ మీద మారకా, అదీ వుంటే మీ భార్య అనుమానిస్తుందని."
అతనికెందుకో అలాంటి సందర్భంలో భార్యప్రసక్తి రావటం కొంచెం కష్టమనిపించింది. అయినాకూడా తన భావాన్ని బయటకు వ్యక్తం చెయ్యలేదు.
"మీ భార్యగారి ఊసు తీసుకొచ్చానని కోపమొచ్చిందా?"
"లేదులే"
"ఆమెగారు చాలా అదృష్టవంతురాలు."
"కాదు నేనే అదృష్టవంతుడ్ని."
"దేనికి?"
"ఆమెలాంటి భార్యను పొందినందుకు."
అతనివంక ఓ చూపు చూసింది. అందులో అసూయలేదు. అభినందన వుంది.
ఆమె మరకను తుడవటం పూర్తిచేసి అతని ముఖంలోకి చూసి నవ్వి లేచి నిలబడింది.
ఆమె మొహం అతనికి చాలా చేరువలోకి వచ్చింది. "ఇప్పుడేమీ కనబడ్డం లేదు" అంది.
అతను వెళ్ళిపోయేటప్పుడు గుమ్మందాకా వచ్చింది. "ఈవేళ చాలా సంతోషంగా వుంది" అన్నది.
"దేనికి?"
"మీకు తెలుసు."
ఆమె కళ్ళలోకి చూశాడు. వాటిలోంచి ఎన్నో భవాలు ఉబుకుతున్నాయి అమాయకత్వంతోబాటు.
ఏదో చెప్పాలనుకున్నాడు. ఈ సందర్భంలో కాదు అని మళ్ళీ ఊరుకున్నాడు.
అతని స్కూటర్ కనిపించినంతసేపు మేడమీదనుంచి చూస్తూ నిలబడింది.
7
సాయంత్రం అయిదున్నరయినా భర్త యింటికి రాకపోయేసరికి చిన్మయికి ఏమీ తోచనట్లుగా, ఒంటరితనం వేధిస్తున్నట్లుగా అనిపించింది.
సోఫాలో కూచుని వీక్లీ తిరగేస్తూ గుమ్మందగ్గర అలికిడయితే తలెత్తి చూసింది.
ఆనంద!
ఆనంద తమయింటికి ఇదివరలో నాలుగయిదుసార్లు వచ్చింది.
"రండి" అంది చిన్మయి లేచి నిలబడి చాలా మర్యాదగా.
ఆనంద లోపలికొచ్చింది. "ఇంట్లో ఒక్కదాన్నీ కూచుని బోర్ కొట్టింది. అందుకని వచ్చాను. మీకేమైనా యిబ్బందా?" అంది.
"ఇబ్బందేముంది! కూచోండి."
"నాకెవరితోనూ మాట్లాడాలనిపించదు. ఒక్క మీ దగ్గరకే రావాలనిపిస్తుంది" అంది ఆనంద.
చిన్మయి నవ్వి ఊరుకుంది.
"ఆ మంజుభార్గవి వాళ్ళింటికి రమ్మని పిలుస్తుంది కాని, నాకే వెళ్ళబుద్ది కాదు. ఆ అమ్మాయి పోకడ నాకంత నచ్చదు."
వస్తూనే ఇతరులగురించి వ్యాఖ్యానించటం చిన్మయికి నచ్చలేదు. అయినా ఆ మాట మొహంమీద చెప్పలేక "దానికేముందిలెండి" అన్నది.
"అలా అనికాదు. ప్రతిదానికి ఓ పద్దతి వుండాలి కదా మొగుడు ఇంట్లో లేనప్పుడు ఆ మొగాళ్ళు రావటం ఏమిటి? వాళ్ళతో రాసుకు పూసుకు తిరగటం, యికయికలూ, పకపకలూ ఏమిటి? ఏమోనమ్మా! నాకిలాంటివి నచ్చవు."
చిన్మయి వినీ విననట్లు ఊరుకుంది.
"నాకంతా ఓ పద్దతిగా వుండాలి. ఇలా పిచ్చిపిచ్చి వేషాలెయ్యటం నాకు నచ్చదు. నా మొగుడైనా సరే, ఏమాత్రం తలతిక్కగా ప్రవర్తించినా నేనూరుకోను. అందుకే అందరూ నన్ను గయ్యాళిదాన్నని అనుకుంటారు. వేళాపాళా లేకుండా యింటికి రావడం, ఇష్టమొచ్చినట్లు చెడుతిరుగుళ్ళు తిరగటం నే సహించను. మొగుడన్నాక నా యిష్టప్రకారం నడుచుకోవాల్సిందే. నేనేం తప్పు చేస్తున్నానని వూరుకోవటం? నేను తప్పు చెయ్యను. నా మొగుడు చేస్తే ఊరుకోను. అంతే" అంది ఆనంద చాలా ఖచ్చితంగా మాట్లాడుతున్నట్లు.
సీనారేకు డబ్బాలో కంకరరాళ్ళు వేసి మ్రోగించినట్లు వళ్ళంతా జలదరిస్తోంది చిన్మయికి. చీటికీ మాటికీ మొగుడు మొగుడు! అని వుచ్చరిస్తూంటే వినడానికి దుస్సహంగా వుంది.
"అన్నట్లు మీవారింకా యింటికి రాలేదనుకుంటాను" అంది ఆనంద వూపిరి పీల్చుకుని.
"రాలేదు" అంది చిన్మయి. రాజీవ్ ప్రసక్తి ఆమె తీఉస్కురావడం యిష్టంగా లేదు.
"రోజూ ఈ టైముకల్లా వచ్చేవారనుకుంటాను?"