ఎంతదూరం నడిచినా ఆయనకీ ఆ నిర్జనమైన ప్రదేశంలో మనుష్య సంచారం కనిపించలేదు.
"పంతులూ! మనం తప్ప ఇలాంటిచోట ఎవరుంటారు చెప్పు?" అన్నాడు గుప్తా.
"భగవంతుని నమ్మండి! తప్పకుండా ఏదో ఒక రూపంలో సాక్షాత్కరించి సహాయం చేస్తాడు" అన్నారు గంభీరంగా.
అలా కొంతదూరం నడిచేసరికి చిత్రంగా ఆ అడవిలో ఓ చెట్టు కింద ఓ వ్యక్తి కూర్చుని, చుట్టూ వున్న యిద్దరి ముగ్గురికి ఏదో చెపుతూ వుండడం కనిపించింది. శ్రీహరిరావుగారు వెనక్కి తిరిగి "నేచెప్ప లేదూ!" అన్నట్లు చూసారు. పిల్లని భుజంమీద వేసుకుని ఆయన దగ్గరగా వెళ్ళి నమస్కరించి, పరిస్థితి వివరించారు. ఆయన అంతా విని, ఓ నిమిషం నిశ్శబ్దంగా వున్నాడు. ఆ తర్వాత అక్కడ కూర్చున్న వాళ్ళల్లో ఒకడితోటి ఏదో చెప్పారు. వాడు నిమిషంలో పొలాలకడ్డంపడి మాయమయి, తిరిగి ఐదు నిమిషాల్లో ఒక పెద్ద చెంబుతో ప్రత్యక్షమయ్యాడు. ఆ చెంబునిండా బెల్లం కలిపినా పాలున్నాయి. ముందాపాలు తాగమని సైగచేశాడు. అందరూ తలా లోటాడూ గటగటా తాగి తమ క్షుద్భాధ తీర్చుకున్నారు. ఆయన అందర్నీ ఒక పాడుపడిన ఇల్లులాంటి దాంట్లోకి తీసుకెళ్ళి అక్కడో లాంతరూ, కుండలో బియ్యం, మంచినీళ్ళూ పెట్టించి, "బండి బాగుచెయ్యడానికి మనిషిని పంపాననిచెప్పి, ప్రొద్దుటే కలుస్తానని" చెప్పి ఆ చీకట్లో కలిసిపోయాడు.
రాత్రి బాగా పొద్దుపోయాకా బండి బాగుచేయించుకుని, మిగతావాళ్ళు కూడా వచ్చి చేరారు. అందరూ తలా ఓ ముద్దాతిని, బల్ల చెక్క లేసుకుని పడుకున్నారు. మరునిమిషంలో కునుకుపట్టేసింది. తెల్లవారింది! ఇంకా బయల్దేరాలి. ఆ లాంతరూ, చెంబూ, కుండా ఆ పెద్దమనిషికి అప్పజెప్పి, కృతజ్ఞతలు చెప్పుకుని వెళదామని కాసేపు చూశారు. అతని జాడేగాక, ఇరుగుపొరుగూ మనుష్య సంచారమేలేదు. ఇదంతా భగవంతుని లీలగా తలచి ఆ లాంతరు ఆర్పివేసి, ఒక నమస్కారం పెట్టి ముందుకు నడిచారు శ్రీహరిరావుగారు. మిగిలినవాళ్ళు ఆయన్ని అనుసరిం
చారు 'చిల్ఫీ' వైపుగా.
చిల్ఫీనుండి ఆ రాత్రికి 'బిచియా' చేరుకున్నారు. బండి ఓ చెట్టు నీడలో ఆపి, ఒక స్కూలు వరండాలో అందరూ పక్కలు పరుచుకుని పడుకున్నారు.
ఆరుబయట ఆకాశం నిర్మలంగా వుంది. అందరూ ఆదమరిచి నిదురపోతున్నారు. శ్రీహరిరావుగారికి కూడా ఆ పూట ఎందుకో చాలా మత్తు కమ్మేసింది. నిదురపోతున్న భర్తనీ, పిల్లల్నీ చూస్తూ పడుకుంది రమణ. ఎక్కడ పుట్టాం? ఎక్కడకొచ్చాం? ఇంకా ఎన్నెన్ని మజిలీలో? ఎప్ప్డుయినా అనుకున్నానా యివన్నీ చూస్తానని? అనుకుంది. అవన్నీ కష్టాల్లా కాకుండా సాహసాల్లా తీసుకునే వయసే అందరిదీ కావడం అదృష్టం.
ఆమెకి దూరంనించి గుర్రపుడెక్కల శబ్దం వినిపించసాగింది. అది అంతకంతకు దగ్గరవసాగింది కూడా. నెమ్మదిగా కళ్ళు తెరిచి ఆ దిశగా చూడసాగింది. ఒక గుర్రం వచ్చి తమ బండి దగ్గరగా ఆగడం, దానిమీద నుంచి ఒక ఆజానుబాహుడు దిగి తమవైపు అడుగులు వెయ్యడం కనిపించింది. అతని ఒరలో ఒక కత్తి వుంది. తెల్లని గెడ్డం పెరిగి, ఆ వెన్నెల్లో స్పష్టంగా కనపడసాగాడు. ఆమె వెంటనే భర్తని "లేవండి! లేవండి! ఎవరో కత్తితీసుకుని యిటే వస్తున్నాడు" అంటూ కుదిపి లేపేసింది. అయన కళ్ళు నులుముకుంటూ లేచి కూర్చుని చూశారు. అతను దగ్గరగా వచ్చి, "మద్రాసీ బృందం మీరేనా!" అని అధికారం ఉట్టిపడే గొంతుతో ప్రశ్నించాడు. శ్రీహరిరావు "ఔను" అని సమాధానమిచ్చాడు.
"మీరు తన బండి ఎత్తుకు వచ్చినట్లు బండివాడు కేసు పెట్టాడు. నేనిక్కడ తానేదార్ ని" అని చెప్పాడు.
శ్రీహరిరావు పగలబడి నవ్వి, "అతడు కనిపించకపోవడంతోటి బండి మా వెంట తెచ్చాము. అంతేకానీ మేమేమీ దొంగళం కాము" అంటూ తామెవరయినదీ, ఎక్కడికెళుతున్నదీ వివరంగా చెప్పాడు. ఈలోగా మిగతావాళ్ళు లేచారు.
అయన అంతా వివరంగావిని, తను కూడా నవ్వి, "అయితే తెల్లవారగానే బండి పోలీస్ స్టేషన్ లో అప్పజెప్పి, మీ దారిన మీరు వెళ్ళండి. నిద్రాభంగం చేసినందుకు క్షమించండి" అని చెప్పి, గుర్రమెక్కి వెళ్ళిపోయాడు.
ఆ రాత్ర్రంతా బండివాడ్ని తలుచుకుని నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ గడిపేశారందరూ.
ఈసారో మజిలీలో చాలా తమాషా జరిగింది. ఎక్కడ చూసినా చింతచెట్లు, గుత్తులు గుత్తులుగా కాయలు వేళ్ళాడుతున్నాయి. నాగేశ్వరరావూ, కోటయ్యా వెళ్ళి కోతుల్లా చెట్లెక్కాసారు. అందినన్ని కాయలు కోసి, క్రిందికి విసరసాగారు. ఇద్దరూ కుర్రవాళ్ళు, మంచి వయసులో బలంగా వుండేవారు. వారలా కాయలు కోస్తుండగా ఎక్కడినుంచో ఓ లంబాడిపిల్లవచ్చి చెట్టుక్రింద నిలబడింది. వీళ్ళు గమనించకుండా కాయలు కోసి క్రింద పడవెయ్యసాగారు. ఆ పిల్ల మాట్లాడకుండా, అవన్నీ ప్రోగుచేసుకుని పరికిణిలో వేసుకోసాగింది. ఇది చూసిన కోటయ్య "నాగేశ్వరరావూ! అది మన చింతకాయలన్నీ ఎత్తుకుపోతోంది" అని అరిచాడు.
ఇది చూసిన నాగేశ్వరరావు ఒక్కదుటున చెట్టుమీదినుంచి గెంతి "ఏమిటి సంగతి!" అంటూ ఆ పిల్ల జబ్బ పట్టుకున్నాడు. నాగేశ్వరరావు పెళ్లవగానే ఇటే వచ్చేశాడు. భార్య మొహం కూడా చూసెరగడు., అతనికి స్త్రీ స్పర్శ చాలా కొత్తగా అనిపించింది. ఎందుకో హాయిగా అనిపించి అలాగే పట్టుకుని ఆమె కళ్ళలోకి చూశాడు. అమాయకమైన మొహంలో అతని భార్య కనిపించింది. ఏ చేస్తున్నాడో తెలియని స్థితిలో ముందుకు వంగి చటుక్కున నుదుటిమీద ముద్దుపెట్టుకున్నాడు. అప్పుడు వెలువడింది ఆ పిల్ల నోటినుండి సన్నటికేక కోటయ్య తెల్లబోయి చూస్తున్నవాడల్లా, గబ గబా చెట్టుదిగి, నాగేశ్వరరావు చెయ్యి పట్టుకుని- "గొప్పపనే చేశావు! పద, పద అది అరిచి గోల చెయ్యకముందే" అంటూ లాక్కు వొచ్చేశాడు శ్రీహరిరావుగారూ వాళ్ళూ వున్న దగ్గరికి.
వగరొస్తూ,మ్ పరిగెత్తుకుంటూ వచ్చిన ఆ ఇద్దర్నీ చూస్తూ "ఏం జరిగిందర్రా!" అనడిగారు వాళ్ళ పంతులు.
ఇద్దరూ మొహమొహాలు చూసుకున్నారు.
ఇంతలో జరగవలైస్న ఉపద్రవం జరగనే జరిగింది. ఓ పదిమంది లంబాడీవాళ్ళ నేసుకుని, ఆ పిల్ల రానే వచ్చింది. వాళ్ళొస్తూనే గొడవ గొడవగా మాట్లాడసాగారు.
"వాళ్ళేమంటున్నారో అర్ధం కావడంలేదు. మీరన్నా చెప్పండి" అన్నారు మిత్రబృందం వీళ్ళ నుద్దేశించి.
కోటయ్య, నాగేశ్వరరావు వైపోసారి చూసి వూరుకున్నాడు.
ఆ పిల్ల అభినయం చేస్తూ, నాగేశ్వరరావు తన చెయ్యి పట్టుకున్నాడని చెప్పింది.
"అమ్మయ్యా! అంతే చెప్పింది" అనుకున్నాడు నాగేశ్వరరావు.
"ఔనా" అన్నట్లు చూశారు శ్రీహరిరావు.
తరువాత వాళ్ళతో అతను పెళ్ళయినవాడనీ, ఏదో పొరపాటున చెయ్యి తగిలించాడనీ చెప్పి, ఓ పది రూపాయిలిచ్చి వదిలించుకున్నారు. ఆ పిల్ల వెనక్కి తిరిగి వెళ్తూ, వెళ్తూ నాగేశ్వరరావుని చూసి నవ్వడం, శ్రీహరి రావుగారి దృష్టిని దాటిపోలేదు. "ఏవయ్యా! ఇంటివైపు గాలి మళ్ళిందా?" అనడిగారు.
అతను సిగ్గుపడి తల వంచుకున్నాడు.
నెమ్మదిగా 'పండరియా' చేరారు. అక్కడో పెద్దగేటు కనపడింది. బహుశా ట్రావెలర్స్ బంగళా అయ్యుంటుంది అనుకుంటూ గేటు తీసుకుని లోనికెళ్ళారు.
చౌకీదారు వీళ్ళనీ, వీళ్ళు గోల గోలగా మాట్లాడుకునే తెలుగునీ చూసి హడలిపోయాడు. ఎంత కొట్టినా తలుపులు తెరవకుండా లోపల గజ గజా భయంతో వణుకుతూ కాలక్షేపం చేశాడు. ఆ రాత్రి బృందం అరుగు మీదే కాలక్షేపం చేశారు.
ప్రొద్దుటే చౌకీదారు పరిగెత్తుకుంటూ, మేజిస్ట్రేట్ దగ్గరకెళ్ళి, "ఓ తండా మనుషులు బందిపోట్లలా వున్నారు. రాత్రంతా అరుగుమీద గొడవ చేశారు" అని చెపుతుండగా, శ్రీహరిరావు ఖద్దరు బట్టలతో నమస్కారం పెడుతూ ఆయనకి ఎదురెళ్ళాడు.
"వీళ్ళే, వీళ్ళే నే చెప్పినవాళ్ళు" అన్నాడు వాడు.
"మీరెవరూ? ఎందుకని మా చౌకీదారు భయపడుతున్నాడు?" అని ఆయన అడిగాడు.
శ్రీహరిరావుగారు తామెవరో, ఎక్కడికెళుతున్నారో సవినయంగా మనవి చేసుకున్నాడు. ఆయన అంతా విన్నాక నవ్వుతూ, బంగళా తాళాలు ఇప్పించి, వంటపనీ చేయించి తను కూడా వాళ్ళతో కలిసి భోంచేసారు.