"అర్జెంటు కాకపోతే రేపు మాట్లాడదాం మమ్మీ నాకు చాలా నిద్ర వస్తోంది. డ్రెస్ చేంజ్ చేసుకుని పడుకోవాలి. నిజంగానే ఆమె కళ్ళలో నిద్రకోసం వాచిపోతున్న తహ తహ కనిపిస్తోంది.
విశారదకు కోపమొచ్చింది. "వస్తే వచ్చింది. ఇప్పుడే మాట్లాడాలి" అంది.
లోపలికి వెళ్ళబోతున్నదల్లా వినూత్న వెనక్కి తిరిగింది. "సరే అయితే మాట్లాడు!"
"ఇలారా వచ్చి కూర్చో."
"ఫర్వాలేదు నిలబడే ఉంటాను. మాట్లాడు."
విశారద చాలా అసహనంగా చూసింది. ఆ అబ్బాయి ఎవరు?" అనడిగింది.
"ఏ అబ్బాయి?"
"ఇందాక నువ్వు స్కూటరెక్కి వచ్చావే- ఆ అబ్బాయి."
"అతనా? ధర్మేంద్ర."
"పేరు సరే, అతనికీ నీకూ అంత పరిచయమేమిటి అనడుగుతున్నా?"
"మమ్మీ! ఈ సొసైటీలో రకరకాల వ్యక్తులు పరిచయమవుతూ ఉంటారు. ప్రత్యేకంగా ఒక వ్యక్తితో పరిచయమెలా అయింది అంటే ఏం చెబుతాను?"
"సరే! ఆ అబ్బాయితో అంత క్లోజ్ గా ఎందుకుంటున్నావు?"
"క్లోజ్ గానా? ఏం ఉంటున్నాను?"
"అర్ధరాత్రి వరకూ స్కూటర్ల మీద తిరగడం, రోడ్లమీద నిలబడి మాట్లాడటం, చెయ్యి తీసుకుని ముద్దు పెట్టుకోవటం..."
"ఇంత చిన్న విషయాలకు, అంత ప్రామినెన్స్ ఇస్తున్నావేమిటి మమ్మీ?"
"అర్ధరాత్రి వరకూ పరాయి అబ్బాయితో స్కూటర్లమీద తిరగటం, ముద్దులు పెట్టుకోవటం చిన్న విషయాలుగా తీసుకోమంటావా?"
"ముద్దులు ఎక్కడ పెట్టుకున్నాడు మమ్మీ, చేతిమీదేగా?"
"ఎంత చనువు లేకపోతే అలా ప్రవర్తిస్తాడు?"
"ఆఫ్ ట్రాల్ చేతిని ముద్దు పెట్టుకుంటే ఏమంత కొంప మునిగిపోయింది మమ్మీ? ఏదో! ఒక్కొక్కరికీ ఒక్కో పిచ్చి అవన్నీ పట్టించుకోకూడదు."
"పట్టించుకోకుండా ఉంటె రేపు ఇంకో స్టెప్ ముందుకు వెళ్ళవచ్చు."
"ఇంకో స్టెప్పా? అంటే?"
"ప్రేమించుకోవటం, ఇద్దరి మధ్యా సన్నిహితత్వం పెరిగి జరగకూడనివి జరగటం."
"జరగకూడనివి అంటే?"
"వయసులో ఉన్న ఆడపిల్ల, అబ్బాయి హద్దు మీరితే జరిగేవి."
ఉన్నట్లుండి వినూత్న గట్టిగా నవ్వేసింది - "ఎదుటి వారి మనసుల మీద నీకెంత అపనమ్మకం మమ్మీ! చూడు మమ్మీ! నాకూ ఓ టెస్ట్, జీవితపు విలువలు, ఆలోచన ఉన్నాయి. ఈరోజుల్లో చదువుకునే ఆడపిల్ల చుట్టూ ఏవో వ్యాపకాలతో అనేక రకాల మనుషులు తిరుగుతూ ఉండటం, కొంతవరకూ సన్నిహితంగా మెలగటం జరుగుతూ ఉంటుంది. అందరితో నవ్వుతూ మెలుగుతూ సరిపెట్టుకుపోతూ ఉండాలి. అంటీ అంటనట్లు ఉండకూడదు. హద్దుమీరేటంత తెలివితక్కువదాన్ని కాదు మమ్మీ- చేతిమీదో, బుగ్గమీదో పెట్టుకున్నంత మాత్రాన ముందూ వెనకా ఆలోచించకుండా నన్ను నేను అర్పించుకునేటంత మూర్ఖురాల్ని కాను. రాత్రివేళ వరకూ తిరగటం, పరాయి అబ్బాయితో స్కూటర్ మీద తిరగటం- ఇవన్నీ కూడా భయంకరమైన నేరాలనుకుంటే ఐయామ్ సారీ! ఐ కాన్ట్ హెల్పిట్" అంటూ విసురుగా లోపలికెళ్ళిపోయింది.
* * *
అర్ధనారీశ్వరరావుగారింట్లో రాత్రి పదకొండు గంటలవేళ ఫోన్ మోగింది. హాల్లో దేవీప్రియ ఒక్కతే కూచుని చదువుకుంటోంది. అన్నయ్యలిద్దరూ తమ గదిలో తలుపులు వేసుకుని పడుకున్నారు. అమ్మా, నాన్నా పడుకునే గది చాలా లోపలగా ఉంటుంది. ఫోన్ రిమ్గాయిన శబ్దం వినిపించదు. దేవీప్రియ ఎందుకైనా మంచిదని ఫోన్ కి దగ్గరగానే కూర్చుంది. ఒక్కసారి రింగవగానే గభాల్న రిసీవర్ చేతుల్లోకి తీసుకుంది.
"హలో" అంది.
"నేను..."
"గొంతు గుర్తుపట్టింది- గుండె గబగబా కొట్టుకుంది. ఒళ్ళంతా చెమట పట్టింది. రిసీవర్ పట్టుకున్న చెయ్యి వణికింది.
"ఇంట్లో అందరూ ఉన్నారు" అంది చలించే కంఠంతో.
"తెలుసు అయినా హాల్లొఇ నువ్వొక్కతివే ఉన్నావు."
"అన్నయ్యలు మెలకువగానే ఉన్నారు."
"వాళ్ళు తలుపులు బిడాయించుకుని గాఢంగా నిద్రపోతున్నారు."
"నీకెలా తెలుసు?"
"నా కన్నీ తెలుస్తాయి మామూలుగా నిద్రపోవటం కాదు. మందుకొట్టేసి ఒళ్ళు తెలీని నిద్రలో ఉన్నారు."
"నీకెలా తెలుసు?"
"అక్షరం పొల్లుపోకుండా ఇందాకటి ప్రశ్నే రిపీట్ చేశావు. చెప్పానుగా నా కన్నీ తెలుస్తాయని."
"మా అన్నయ్యలు మందు కొట్టరు చాలా మంచివాళ్ళు."
అవతల్నుంచి నవ్వు.
"మంచివాళ్ళే... ఐ మీన్ మంచిగా కనిపించినవాళ్ళే చెడ్డ పన్లు చేసేది."
"మా అన్నయ్యలకి చెడ్డపన్లు చెయ్యాలన్నా భయం. ఎందుకంటే మా నాన్నకి తెలిస్తే చంపేస్తారు."
"తెలిస్తే చంపేస్తారు కానీ తెలియదుగా!"
"ఎప్పుడో ఒకప్పుడు తెలీకుండా ఎలా ఉంటుంది?"
"తెలీదు కనీసం చాలా కాలంవరకూ, ఎందుకంటే తానంటే పిల్లలకు చచ్చేటంత భయమనీ, ఏవిధంగానైనా తప్పుచేసే అవకాశం లేదని మీ నాన్న పిచ్చిభ్రమలో ఉన్నాడు కాబట్టి..."
దేవీప్రియ ఏమీ మాట్లాడలేదు. ఈ సంభాషణంతా ఆమెకు కొత్తకొత్తగా ఉంది. ఇది వరకు తెలీని ఎన్నో విషయాలు తెలుస్తున్నట్లనిపించింది.
"అయితే మా అన్నదమ్ములు నిజంగానే తాగుతున్నారంటావా?"