ఆమె నేత్రాలు క్రోధంతో అరుణిమలయ్యాయి.
తప్పించుకోవాలనుకుంది కాని సాధ్యంకావడంలేదు.
సరిగ్గా అప్పుడు వినిపించింది "స్టాపిట్!"
ముందు అవాక్కయిన ధనుంజయ వెనువెంటనే ఆమె చేయి వదలి శాల్యూట్ చేశాడు "ఎస్ సార్!"
ఆశ్రిత వెనక్కి చూసి నిశ్చేష్టురాలయింది.
యూనిఫాంలో నిలబడివున్న యువకుడు మరెవరోకాదు....
మొన్నెప్పుడో ఫ్లయిట్ లో కలిసి తనని ఆటపట్టించిన వ్యక్తి.... అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్... వశిష్ట...."
"రండి"
వశిష్ట ఆ తర్వాత స్టేషన్ లో నిలబడలేదు...
పై అంతస్తులో వున్న తన ఛాంబర్ కి నడిచాడు ఆమెతోపాటు.
అతడికి అభిముఖంగా కూర్చున్న ఆమె కళ్ళలో ఇంకా విస్మయం చెరిగిపోలేదు.
"నన్నిలా చూడటంలో ఆశ్చర్యంగా వుందా?" మృదువుగా నవ్వాడు వాతావరణాన్ని తేలికపరుస్తూ.
"అదికాదు...." ఆమె క్షణంపాటు దృష్టి మరల్చుకుంది. "వెంటనే మీరు రాకపోతే పరిస్థితి ఏమై వుండేదా అని ఆలోచిస్తున్నాను"
వశిష్టని ఇలా కలుసుకోవడం కో-ఇన్సిడెన్స్ మాత్రమే కాదు ఓ అదృష్టం కూడా.
"సో..." ఆ రోజు ఫ్లయిట్ లో తమ సంభాషణని గుర్తుచేసుకుంటూ అన్నాడు "పోలీస్ డిపార్ట్ మెంట్ మీద సదభిప్రాయంలేదని ఆ రోజు నేను అన్నదాన్ని ప్రాక్టికల్ గా మీరు ఈ రోజు తెలుసుకోగలిగారన్న మాట..."
అది నూరుపాళ్ళు నిజం.... అదిసరే... అసలు ఓ పోలీసాఫీసరు అయ్యుండీ తనను తాను ఓ బిజినెస్ మేన్ గా అతడెందుకు పరిచయం చేసుకున్నట్టు...
"మీరు మామూలు మూడ్ లోకి వస్తే బెటరు" జోవియల్ గా అన్నాడు వశిష్ట. "ఎందుకంటే అందరు సర్కిల్ ఇన్స్ స్పెక్ట్రర్లూ ధనుంజయలే వుండరు- కొందరు వశిష్టలూ వుంటారని నిరూపించటం నాకు ఇష్టం కాబట్టి"
రెండు లిప్తలపాటు తల వంచుకుంది.
అసలు వశిష్ట జాగ్రత్తగా గమనిస్తే అర్ధమై వుండేది ఇప్పటికే.
మొన్న మెరిసిన ఆమె సోగకళ్ళు ఇప్పుడు రెప్పల చూరుమాటున మండుతున్న నిప్పుకణికల్లా వున్నాయి. మౌన గంభీరంగా ఆ రోజు కనిపించిన ఆమె రూపం ఇప్పుడు ధ్యానముద్రతో అణువణువూ నిక్షిప్తమైన అవ్యక్త అంతః స్వరలహరిలా వుంది.
అయినా ఆమె అందంగా వుంది.
పరిచయమైనా అపరిచితమనిపించె ఆమె దృక్కులు మనసు లోతులనుంచి పాయలుగా ప్రవహించి ఆలోచనా స్రవంతుల చిరుసవ్వడిని లోలోనే సమాధి చేసుకుంటూ పట్టుదొరకని అనివార్య విరామమై చిత్రమైన ఆకర్షణకి గురిచేస్తున్నాయి.
"చెప్పండి" తదేకంగా చూస్తూ అడిగాడు వశిష్ట "ఏ సహాయం కోరి ఇలా వచ్చారు"?
సత్యానికీ శీలానికీ మధ్య చచ్చిపోయిన శవంలాంటి నిశ్శబ్దం... అదీ క్షణం పాటే.
అతడి ముందు తమ్ముడు రాజేష్ రాసిన ఉత్తరాన్ని వుంచింది.
చదువుతుండగా అతని మొహంలో మార్పుల్ని గమనిస్తూ వుండిపోయింది.
"అయామ్ సారీ!" అన్నాడు ముందు "మీ బ్రదర్ ఆత్మహత్య చేసుకున్నాడన్న మాట"
అతడి గొంతులోని సానుభూతి జీర్ణించుకునే స్థితిలో లేదామె... "కేవలం మా తమ్ముడు మాత్రమే కాదు మిస్టర్ వశిష్టా! మా తమ్ముడి అంత్యక్రియలు పూర్తిచేసివచ్చిన కొన్ని గంటల వ్యవధిలో నాన్న కూడా చనిపోయాడు. కేవలం ఇరవై గంటల్లో నా వాళ్ళనుకున్న ఇద్దర్నీ పోగొట్టుకున్నాను"
ఒక అరుదైన సంఘటనకు వశిష్ట అలర్టయ్యాడు. అదికాదు ఆ క్షణంలో వశిష్టని ఆకట్టుకున్నది... ఒక మామూలు సమస్య మధ్య నిలబడ్డ ఆడపిల్లలా మాట్లాడగలుగుతూంది ఆశ్రిత. కారణం ఏదన్నాగాని రెండు సమాధులమీద దీపాల్ని వెలిగించి ఇంకా ఆ జ్యోతులు ఆరిపోకముందే మేధ నుంచి మనసుని విడగొట్టి ఏ న్యాయం గురించో ప్రశ్నిస్తూంది నిశ్చలంగా...
"పోయిన నాన్నకానీ, తమ్ముడుకానీ తిరిగిరారని నాకు తెలుసు. కానీ నాకు న్యాయం కావాలి. సూర్నారాయణలాంటి వ్యక్తి రాక్షసనీతికి, చట్టబద్దమైన పరిధిలో సహకరించని సవ్యసాచిలాంటి వ్యక్తి అవినీతికీ నేను కోరుకున్న జవాబు కావాలి... అది సాధించడం నా ప్రస్తుత కర్తవ్యం"
"కానీ...." అర్దోక్తిగా అన్నాడు వశిష్ట! "ఒక ఉత్తరం ఆధారంగా చర్య తీసుకోవడం కష్టం... ఐ మీన్.... ఇంతకన్నా రాజేష్ బ్రతికుంటే తనమీద దాడి చేసిన వ్యక్తులపై చట్టరీత్యా చర్యకోసం ప్రయత్నం..."
"అప్పుడు మాత్రం న్యాయం జరుగుతుందన్న గ్యారంటీ ఏమిటి?" అసహనంగా అంది ఆమె. "ఇందాక నామీద విరుచుకుపడ్డ ధనుంజయ లాఠీ దెబ్బలకి మానసికంగా మరింత క్రుంగిపోయేవాడు. చేయని నేరానికి లాకప్ లో మగ్గి సూర్నారాయణ లాంటి వ్యక్తి పలుకుబడి ఎంతదాకా విస్తరించేదీ తెలుసుకుని ఆ తర్వాత తీరుబాటుగా ఆత్మహత్య చేసుకునేవాడు"
"మీరు ప్రోబబులిటేస్ గురించి మాట్లాడుతున్నారు"
"లేదు ప్రాక్టికల్ ప్రోబ్లమ్ గురించి మాట్లాడుతున్నాను"
"పోలీస్ డిపార్ట్ మెంట్ మొత్తం ధనంజయలే కారు."
"మొత్తం కానవసరంలేదు మిస్టర్ వశిష్టా! ప్రముఖుల ఆదేశాన్ని పాటించాలనుకునే పిచ్చికుక్కలు ఒకటీ అరా వుంటే చాలు."
"మీరు ఆవేశాన్ని ప్రదర్శింస్తున్నారు తప్ప నా పాయింట్ అర్ధం చేసుకోవటం లేదు."
"స్టేండిన్ మై షూస్ అండ్ దెన్ టాక్ మిస్టర్ వశిష్టా" ఉద్విగ్నంగా కాదు బాధావేశాల్ని అదిమిపెడుతూ అంది ఆమె. "మరెవరి సమస్య గురించో ఆలోచిస్తూ మాట్లాడే మూడో వ్యక్తిలా కాదు- నా సమస్యని మీ సమస్యగా జీర్ణించుకుని అప్పుడు మాట్లాడండి, దగాపడ్డ ఓ తమ్ముడి కథ అర్ధమౌతుంది... ఒక బలవంతుడు హూంకరించిన గాలికే ఆరిన ఓ కొవ్వొత్తి మరణవాంగ్మూలం మీకు స్పష్టంగా వినిపిస్తుంది. రాజేష్ అనబడే నా తమ్ముడు వయసు పైత్యంతో రాబందులా ఓ వున్నింటి అమ్మాయిని ఆకట్టుకోవాలనే వ్యక్తి కాదు వశిష్టా. తన రెక్కల చప్పుడికి తానే కంగారుపడే ఓ చిన్న పావురాయి... కాబట్టే తనను పట్టి బంధించి కాల్చకుండానే తన అస్థికల్ని ఉపయోగించి ఏ మాయజూదానికో పావుగా ఉపయోగించబోతే దారుణంగా గాయపడ్డాడు. తన శరీరంపైనే కాక తనకు జన్మనిచ్చిన తండ్రి ఒంటిమీద కూడా కనిపించిన కమిలిన నెత్తుటి చారికల్ని చూసి భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు నేను ప్రయత్నిస్తున్నది చేయని నేరానికి నా తమ్ముడి మనసుని గాయపరచిన సూర్నారాయుణ్ణి ఉరికంబం ఎక్కించాలనీ కాదు... నా తండ్రి అభ్యర్ధన విని సకాలంలో జోక్యం చేసుకోని సవ్యసాచిలాంటి ఓ పోలీస్ కమీషనర్ బర్తరఫ్ చేయబడాలనీ కాదు.... న్యాయబద్దంగా వాళ్ళు దోషులుగా సంఘంముందు తలవంచాలి. తమ తప్పులకి చట్టపరిధిలో వారిద్దరూ శిక్షింపబడాలి అంతే... దానివలన మీకొరిగేదేమిటీ అనే మీ ప్రశ్న విని నేను సంతృప్తి పడలేను కాబట్టి మీ పరంగా నేను కోరుతున్నది కనీస న్యాయం... నా తమ్ముడు చివరగా రాసిన లేఖను మీరు మరణవాంగ్మూలంగా తీసుకుంటారో లేక చేవలేని సాక్ష్యంగా భావిస్తారో నాకు అనవసరం... ఐ వాంట్ జస్టిస్...మనిషికి ప్రాణహాని కలిగించే నేరాల్ని డీల్ ఐపిసి 299 నుంచి 311 వరకూ మీరు ఆలోచనలోకి తీసుకొంటారా లేక గాయపరచిన నేరానికి ఐపిసి 319 నుంచి 388 వరకూ పరిగణనలోకి తీసుకుంటారా? అదీ కాని నాడు బలవంతంగా క్లాసులోనుంచి నా తమ్ముడ్ని లాక్కుపోయి నిర్బంధంగా కట్టి కొట్టిన నేరానికి ఐపిసి 339 నుంచి 358 సెక్షన్ల పరిధిలో కేసు బుక్ చేస్తారా అన్నది నాకు తెలీదు... సూర్నారాయణ మీద మీరు చర్య తీసుకోవాలి... అంతేకాదు నిస్సహాయస్థితిలో వున్న మనిషి ఆర్తనాదాన్ని విని చలించని పోలీస్ కమీషనరు సవ్యసాచినీ కోర్టుద్వారా ప్రశ్నించాలి...ప్లీజ్..."