4. దేవీ పృశ్నిపర్ణీ! ప్రాణభయము కలిగించు రోగకారక పాపములను గుట్టమీదికి తీసుకొని పొమ్ము. సర్పములు, పశువులు మున్నగు వానిని భస్మము చేయు దావాగ్నిలో ఆ పాపములను భస్మము చేయుము.
5. పృశ్నిపర్ణీ! ప్రాణాపాయము కలిగించు రోగరూప పాపముల మెడలు వంచి పంపుము. సూర్యోదయమైనంత అంధకారము ఎచటికి చేరునో అట్టి ప్రదేశమునకు నీ ప్రభావమున ఆ పాపములను పంపుచున్నాను.
తొమ్మిదవ సూక్తము - 26
వినియోగము :-
1) గోవులకు పుష్టి కోరువాడు జున్నుపాలను ఈ సూక్తముచే సంపాతన అభిమంత్రణ చేసి తినవలెను. అభిమంత్రించి గోవును ఇవ్వవలెను. ఈ సూక్తముచే జల పూర్ణపాత్రను అభిమంత్రించి కొట్టము మధ్యన పెట్టవలెను.
2) ఒకే రూపు దూడగల ఆవు పాల అన్నమును గుగ్గిలము పిడకల నిప్పులో మూడు రాత్రులుంచి నాలుగవ నాడు సంపాతన అభిమంత్రణలు చేసి భక్షించవలెను.
1. వెళ్ళిపోయిన పశువులు గోష్ఠమునకు మరలి వచ్చును గాక. రక్షించుటకు గాను వాయువు పశువులతో ఉంటున్నాడు. త్వష్ట కడుపులో ఉన్న దూడలకు నామ రూపములు కలిగించుచున్నాడు. అట్టి పశువుల నన్నింటిని సవితాదేవత గోష్ఠమున ఉంచును గాక.
("సినీవాలీ ఏతన్నామికా దేవపత్నీ దృష్టేందు కళామావాస్య దేవతావా" అని సాయణాచార్యులు. సినీవాలి ఆపేరు గల దేవపత్ని లేక చంద్రకళ గల అమావాస్య.
'యా పూర్వా2మావాస్యా సాసినీవాలి' అని గోపథము. అమావాస్యకు ముందుది సినీవాలి.)
3. పశువులు చేరును గాక. అశ్వములు చేరును గాక. సేవకులు ఎక్కువ మంది చేరుదురు గాక. యవలు మున్నగు ధాన్యములు వృద్ది చేరును గాక. అవి సిద్దించుటకు గాను నేను హవిస్సులు హోమించుచున్నాను.
4. ఆవు యొక్క జున్ను పాలను, నేతిని పారించుచున్నాను. బలమునిచ్చు రసమును ఘ్రుతముతో కలుపుచున్నాను. మా పుత్ర, పౌత్రులు కూడ పాడి కలవారు అగుదురు గాక.
5. నేను నా ఇంటికి గోవులను తెచ్చుచున్నాను. పాలను తెచ్చుచున్నాను. ధాన్యమును, ధాన్యశక్తిని తెచ్చుచున్నాను. పత్నులను తెచ్చుచున్నాను. సంతనమును తెచ్చుచున్నాను.
(ఇవి కొత్త సంసారము ఏర్పరచుట.)
అయిదవ అనువాకము
మొదటి సూక్తము - 27
వినియోగము :-
1) వివాదమున విజయమునకు ఈ సూక్తము. దీనిచే 'పాఠామూలము'ను అభిమంత్రించి తినుచు అపరాజిత స్థానము నుండి సభాస్థానమునకు చేరవలెను. దానిని తినుచు ప్రతివాదిచే వాదించవలెను. ఆ 'వేరు' కొరకు హోమము చేసి దానిచే అభిమంత్రించి కట్టవలెను. ఏడు పాఠపత్రముల మాలను అభిమంత్రించి తలకు చుట్టుకొనవలెను.దీనితో అపరాజిత మహాశాంతి యందు 'పాఠమూల' మణిని బంధనము చేయవలెను.
1. పాఠఓషధీ! నేను నిన్ను సేవించువాడను. ప్రతివాదియగు శత్రువు ఏనాటికి నన్ను జయించకుండును గాక. నీవు సహజముగనే శత్రువును ఓడించుదానవు కదా! "ప్రతివాది గొంతును పూడ్చుము అతనికి మాట పెకలకుండును గాక" ప్రాశం ప్రతిప్రాశో జహ్యరసాన్ కృణ్వోషధే"
2. ఓషధీ! గరుత్మంతుడు నిన్ను వెతికి వెలికి తీసినాడు. సూకరము నిన్ను భూమి నుండి సమూలముగ త్రవ్వి తీసినది.
"ప్రాశం ప్రతిప్రాశో జహ్యరసాన్ కృణ్వోషధే"
3. ఓషధీ! అసురులను హతమార్చుటకు ఇంద్రుడు నిన్ను కుడిచేతికి కట్టుకున్నాడు.
"ప్రాశం ప్రతిప్రాశో జహ్యరసాన్ కృణ్వోషధే"
4. ఇంద్రుడు అసురులను జయించుటకు పాఠమూలమును తిన్నాడు.
"ప్రాశం ప్రతిప్రాశో జహ్యరసాన్ కృణ్వోషధే"
5. ఓషధీ! ఇంద్రుడు నీ ప్రభావమున అడవి కుక్కల వంటి అసురులను నిరుత్తరులను చేసినాడు. అట్లే నేను శత్రువులను నిరుత్తరులను చేయుదును.
"ప్రాశం ప్రతిప్రాశో జహ్యరసాన్ కృణ్వోషధే"
6. రుద్రదేవా! నీవు జలమును సహితము ఔషధము చేయగలవాడవు. నల్లని జటాజూటము కల వాడవు. కర్మముల చేయించువాడవు.
"ప్రాశం ప్రతిప్రాశో జహ్యరసాన్ కృణ్వోషధే"
7. ఇంద్రదేవా! ఎవడు తన యుక్తిచే ఓడించునో వాని ప్రతికూల ప్రశ్నలను పరిమార్చుము. నీవు నీశక్తిచే నన్ను ప్రతివాది ప్రశ్నలను తిప్పికొట్టు వానిని చేయుము.
రెండవ సూక్తము - 28
వినియోగము :-
గోదానమందున చౌలకర్మమునను దేనిచే తల్లిదండ్రులు పుత్రుని మూడు మారులు ఒకరు ఇంకొకరికి ఇవ్వవలెను. మూడు నేతి ముద్దలను దీనిచే సంపాతన, అభిమంత్రణ చేసి పుత్రునకు తినిపించవలెను.
1. అగ్నిదేవా! ఈ బాలుడు నిన్ను సేవించువాడు. ఇతనిని ఆరోగ్యముగా వర్ధిల్లచేయుము. ఇతడు రోగములు, మృత్యువు తాకక వార్ధక్యము వరకును, నూరేళ్ళు జీవించును గాక. మిత్రదేవుడు తల్లివలె ఇతని దగ్గర ఉండి రక్షించును గాక. మిత్ర సంబంధమైన ద్రోహ జనిత పాపముల నుండి రక్షించును గాక.
2. పగటి దేవత మిత్రుడు. రాత్రిదేవత వరుణుడు ఉభయులు ఏకమనస్కులై ఈ బాలకునకు వార్ధక్యము వరకు మృత్యువు కలుగకుండ చేయుదురు గాక.
అగ్నిహోత. సర్వజ్ఞుడు. అతడు విశ్వేదేవతల మూల స్థానమునకు చేరి ఈ బాలకుని దీర్ఘాయుష్కుని చేయును గాక.
(అగ్ని సహితముగా సమస్త దేవతలు ఈ బాలునకు దీర్ఘాయువు ప్రసాదింతురు గాక అని.)
3. అగ్నిదేవా! నీవు పుట్టిన, పుట్టనున్న పశువులకు, ప్రజలకు సామ్రాట్టువు. ఈ బాలుని ప్రాణములకు అపానములకు హాని కలిగించకుము. మిత్రులు గాని అమిత్రులు గాని ఇతనిని వధించకుందురు గాక.
4. బాలకా! పిత్రురూప ద్యులోకము, మాతృరూప భూలోకము ఏకమనస్కులై నీకు వార్ధక్యము వరకు మృత్యువు కలిగించ కుందురు గాక. భూదేవి వడిలో ప్రాణాపానములతో "శతంహిమాః" నూరు హేమంతములు జీవింతువు గాక.
వ్యాఖ్య - కొంతకాలము హేమంతముతో సంవత్సరము మొదలైనది. అందుకే "శతం హిమాః" ఇప్పుడు గ్రిగేరియన్ సంవత్సరము హేమంతము. జనవరితో మొదలగుచున్నది.
కొంతకాలము సంవత్సరము శరత్కాలముతో మొదలైనది. అందుకే "శరదాం శతం"
ఇప్పుడు మన సంవత్సరము వసంతము. చైత్రము తో మొదలగుచున్నది. కాని ఇది వేదమున కనిపించదు. ఇది తరువాత ఏర్పడి ఉండ వచ్చును. చిగుర్చు వసంతముతో కోరికలు చిగుర్చు ఉగాది వచ్చుట సహజముగ, శాస్త్రీయముగ తోచుచున్నది.
5. అగ్నిదేవా! ఈ బాలకునకు ఆయుష్యము, తేజస్సు కలిగించుము. మిత్రావరుణులారా! ఇతనికి సంతానోత్పాదక శక్తి ప్రసాదించండి. భూదేవీ! తల్లి వలె ఇతనికి సుఖములు కలిగించుము. విశ్వేదేవతలారా! వార్ధక్యము వరకు ఇతనిని సర్వసంపన్నుని చేయండి. మూడవ సూక్తము - 29
1. పృథ్వి యొక్క రసము సేవించువారికి భగదేవత దేహబలము ప్రసాదించును గాక. అగ్ని ఆయువును, సూర్య బృహస్పతులు వర్చస్సును ప్రసాదింతురు గాక.
(పృథివి యొక్క రసము అనగా వినియోగమున చెప్పిన చిలికిన రసము అని సాయాణాచార్యుడు.)
2. జాతవేద అగ్నీ! ఇతనికి ఆయువు ప్రసాదించుము. త్వష్ణా! నీవు పుత్ర, పౌత్రాది అధిక సంతానము నిమ్ము. సవితాదేవా! నీవు ధన, సంపద సమృద్దిని, శతశరత్తుల ఆయువును కలిగించుము.