"సరే, ఇక్కడికి వచ్చెవాడా? ఒక్క ఆలనా పాలనా చాతయ్యేది కాదు. ఎంతసేపూ దాంతో మాట్లాడాలని, దాని సరసన వుండాలనే తాపత్రయం తప్ప, సున్నితంగా ఎలా ప్రవర్తించాలో అతనికి తెలిసేదికాదు. ఇహ : దీని విషయం తెలుసుగా, చచ్చే సిగ్గు. ఒక్కొక్కసారి అతన్తో మాట్లాడడానికి దీన్ని పంపాలంటే నా తల ప్రాణం తోకకువచ్చేది. నానా అవస్థా పడేదాన్ని, ఇహ చూసుకో, అది అలసి, సొలసి స్కూలు నుంచి వచ్చేసరికి ధాం, ధూం అని తెగగోల చేసేవాడు. 'మీ అమ్మాయి నాతో మాట్టాడటం లేదు' అనేవాడు. 'సినిమాకు రమ్మంటే రాదు' అని ఫిర్యాదు చేసేవాడు. ఎవరో స్నేహితులు వస్తే వాళ్ళతో మాట్లాడుతూ నామాటే మరచిపోయిందని ముఖం ముడుచుకునేవాడు. పిలవకపోయినా, పెట్టకపోయినా చీటికిమాటికి ఇక్కడకు వచ్చి కూర్చుండేవాడు. వచ్చినప్పటినుంచీ 'సరదాల మాట అటుంచి జగడాలు - నేనీయింట్లో ఒక్కక్షణం వుండను అని వెళ్ళిపోయేవాడు. అక్కడ మాత్రం అతని మనస్సు నిలకడగా వుండేదా - ఏమన్నానా? మూడోనాటికల్లా మళ్ళీ తయారు. నే నెప్పుడన్నా కొంచెం మందలించబోయేసరికి 'నే నేదో చెడ్డవాడ్ని అనుకుంటున్నారేమో మా వాళ్ళ నడగండి, నా మంచితనం చెబుతారు' అనేవాడు. ఈ గొడవల్తో నాప్రాణం విసిగిపోతుందంటే నమ్ము రాధా, 'వీళ్ళు ఎప్పటికైనా దెబ్బలాటలు లేకుండా సరిగ్గా వుండగలుగుతారా?' అని కుమిలిపోయేదాన్ని" అని కొంచెం ఆగి "అదే విచిత్రం. ఇప్పుడు చూసుకుంటే, అంత చక్కగా వుండగలుగుతున్నారో అందుకే కాలం ఎన్ని మార్పులనైనా తెచ్చి పెడుతుందంటాను నేను" అంది.
ఇవాళ రాధ ప్రమీలకోసం వచ్చేసరికి ఆమె యింట్లో లేదు. "ఎక్కడకు పోయిందండీ?" అని అడిగింది రాధ.
"అల్లుడితో కలిసి బజారుకు వెళ్ళింది. వస్తుంది కూచోవమ్మా" అంది సుభద్రమ్మగారు --- అని ఇహ పురాణం మొదలుపెట్టింది.
రాధ అంతా శ్రద్ధగా కుతూహలంగా విని "కాని నాకు ప్రమీల ఈ విషయాలేమీ తెలియనిచ్చేదికాదు" అంది.
సుభద్రమ్మగారు నోరూ, కళ్ళూ త్రిప్పుకుంటూ "అదేనమ్మా" అదేదాన్లో బ్రహ్మాండమైన సుగుణం, సంతోషమనా, దుఃఖమైనా తనలో తనే ఇముడ్చుకుంటుంది గాని తెలివిమాలిన దానిలా బయటకు చెప్పుకోదు" అంది గర్వంగా.
ఇంతలో ఏదో గుర్తుకు వచ్చి మళ్ళీ ఆవిడే అంది ; "నాకెవరూ లేరు ప్రమీల తప్ప. ప్రమీలకు నేను తప్ప పుట్టింటి తరపున ఎవరూ లేరు. నన్ను విడిచి అది వుంటుందా, వుండదా అన్న విషయం అలావుంచి దాన్ని విడిచి నేను వుండలేను. నాకు వున్నది కాస్తా దానికే చెందుతుంది. అందుకని అల్లుడిని ఇక్కడే వుండిపొమ్మని చేబుదామనుకుంటున్నాను. నీ అభిప్రాయం ఏమిటమ్మా?"
రాధసిగ్గుతో "నా అభిప్రాయానికి ఇందులో ఏముంది? మీకెలా తోస్తే అలా చేయండి" అంది.
"అతనుకూడా నా మాట వినకపోడు. ఇద్దరూ చిలకా గోరింకల్లా వుంటే చూసి సంతోషిస్తాను."
రాధ ఆవిడ చెప్పే మాటల్ని వింటూ అక్కడే కూర్చుని వుంది. ఆమె ఏది మాట్లాడినా తన గుండెలో గుచ్చుకున్నట్లుగా వుంది. అదివరకెప్పుడూ అనుభవించని బాధ ఒకటి ఈ మధ్య ఇటువంటి మాటలు వింటున్నప్పుడు చెలరేగి తనని నానాహింసా పెడుతోంది. ఇది ఎందుకు వస్తోంది. ఎట్లా విముక్తి అవుతుంది?
సుభద్రమ్మగారు మాటలకన్నా చేతలుచేసే మనిషని తనకు తెలుసు. ఆవిడ మనస్సులో ఏదయినా చేయటానికి సంకల్పించిందో, చేసి తీరుతుంది. ఆవిడ అన్నట్లే ప్రమీల నివాసం అత్తవారింట్లో కాకుండా ఇక్కడే స్థిరపడిపోవచ్చు. దానివల్ల తనకు ఒరిగిందేమిటి? స్నేహితురాలని చూడకుండా ఉండే అవస్థ తప్పుతుంది. చాలా రోజుల్నుంచీ ప్రమీల ఈ ఊళ్ళో గడిపింది. తనూ ఉంది. ప్రమీల ఇహముందు కూడా వుంటుంది. కాని ప్రమీల పెళ్ళి చేసుకుని ఇక్కడ జీవిస్తోంది - తను?"
వాకిట్లో బండి ఆగిన చప్పుడయింది. ఊహలనుండి బయటపడి రాధ తలయెత్తి చూసింది. ముందు ప్రమీలా, తరువాత శ్రీపతీ బండి దిగుతున్నారు. ప్రమీల చేతిలో ఏవేవో కాగితపు పొట్లాలు వున్నాయి. ఆమెలోపలికి వస్తూ స్నేహితురాలిని పరికించి సంతోషంతో "ఎంతసేపయింది వచ్చి" అని పలకరించింది.
రాధ జవాబు చెప్పి శ్రీపతి లోపలకు వస్తూండటం చూసి తన గదిలోకి వెళ్ళిపోయింది. ప్రమీలకూడా ఒకసారి భర్తదగ్గరకు వెళ్ళి ఏదో విషయం చెప్పివచ్చాక ఇద్దరూ కబుర్లలో పడ్డారు.
ఇంతలో సుభద్రమ్మగారు చెప్పిన ఒక సంగతి గుర్తురాగా హఠాత్తుగా "నాతో కబుర్లు చెబుతూ కూర్చుంటే ఎవరికైనా కష్టంగా ఉంటుందేమో" అనేసింది.
ప్రమీల స్నేహితురాలివంక చూసి "అదేమిటే నీవు క్రొత్తగా మాట్లాడుతున్నావే" అంది ఆశ్చర్యంగా.
రాధ నవ్వుతూ "కొత్తగా మాట్లాడుతున్నానా?" అంది.
రాధ ఆ విషయాన్ని గురించి అంతకన్నా వివరంగా చెప్పనూలేదు- ప్రమీల శ్రద్ధగా అడగనూలేదు.
ఇందాక లోపలకు వెళ్ళిన సుభద్రమ్మగారు గదిలోకి వస్తూ "అయితేనూ, బండివాడికి డబ్బు లివ్వలేదా ఏమిటే? ఇంకా నిల్చుని వున్నాడు? అంది.
"అదికాదమ్మా" అని ప్రమీల కొంచెం సిగ్గుపడుతూ మెల్లి మెల్లిగా "మేము ఇవేళ సినిమాకి వెడదామనుకుంటున్నాము" అని చెప్పింది.
"అయితే టైమయిందిగా బయలుదేరవేం?"
"ఇవాళ మాతో రాధకూడా వస్తుంది!"
రాధ నిర్విణ్నురాలై "అదేమిటి ప్రమీలా? మరీ అంత అర్థం లేకుండా మాట్లాడుతున్నావు?" అంది కొంచెం కోపంగా.
"అర్థంతోనే మాట్లాడుతున్నాను."
"బాగానే వున్నాయిలే, నీ వేళాకోళాలు" అసలు ప్రమీల ఇందాక గదిలోకి పోయినప్పుడే భర్తతో అంది. "సినిమాకి ఎవరెవరు వెడదాం?"
భార్య ఇలా యెందుకు అంటోందో గ్రహించుకుని "నీ యిష్టం" అన్నాడు భర్త.
ప్రమీల జంకుతూ "రాధ ఇప్పుడు నా కోసం వచ్చింది. దాన్ని విడిచి వెళ్ళిపోతే బాగుండదు" అంది.
"ఈ విషయం చెప్పడానికి ఇంత సంకోచించడం దేనికి? అలాగే తీసుకురా" అన్నాడు శ్రీపతి.
భర్త అంగీకరించాకే రాధనుగూడా ఇప్పుడు పిలవటానికి సాహసించింది ప్రమీల. కాని ఆమె అంగీకరించేటట్టు కనపడలేదు. ఈ నిరాకరణకి సిగ్గు ఒకటే కారణంకాదు. భార్యా భర్తల మధ్య తను వెళ్ళటం ఏమిటని ఒకటి. శ్రీపతితో ఆమె ఇంతవరకూ మాట్లాడలేదు. అతన్ని చూస్తేనే అదోరకం భయం. అటువంటప్పుడు అతనితో వెళ్ళటం ఎలా? వీటన్నిటికీ మించిన కారణం ఇంకోటివుంది. తను ఇంటిలో చెప్పి రాలేదు చెప్పకుండా ఎలా వెడుతుంది?
"నేను రాను!" అంది.
ఈ మాటలు ప్రమీల వినిపించుకోకుండా "నువ్వు సినిమా చూసి ఎన్నాళ్ళయ్యింది?" అని ప్రశ్నించింది.
"చాలా రోజులు కావచ్చు."
"మరేం? ఒక సినిమా చుద్దామనిగానీ, ఒక నాటకం చూద్దామని గానీ, కాస్త కులాసాగా కాలం గడుపుదామనీగానీ నీకేం లేవా? ఎంతసేపు నువ్వూ నీ ఇంట్లో సంగతులేనా?"
"మా ఇంట్లో నువ్వు పుట్టినట్లయితే ఇలా అనేదానివేనా-" అని అనలేకపోయింది రాధ.
"కాని నేను రాలేను" అంది.
ప్రమీల బిక్కమొహం పెట్టేదేగాని ఇంతలో సుభద్రమ్మగారు కలిపించుకొని "వెళ్ళవమ్మా రాధా, వెడితే తప్సేముంది? మీ ఇంట్లో ఏమన్నా అనుకొంటారన్న భయమయితే నేను కబురుచేస్తాను. మీవాళ్ళు ఏమీ అనకుండా చేసే బాధ్యత నాది- సరేనా?" అంది.
మనసులో ఒక విషయం చేయటానికి ఇష్టం లేకపోయినా కొన్ని కొన్ని సందర్భాలలో పరిస్థితుల ప్రభావం వల్ల ఆ పని చేయటానికి ఇష్టం లేకపోయినా కొన్ని కొన్ని సందర్భాలలో పరిస్థితుల ప్రభావం వల్ల ఆ పని చేయటానికి పూనుకోవలసి వస్తుంది. రాధ విషయమూ అలాగే అయింది. ఎంతకాదనుకున్నా, ఎంతకూడదనుకున్నా ఆమె ప్రమీల కోరికకు ఎదురుచెప్పలేకపోయింది. ఇంతకీ ఆ భార్య, భర్తలతో సినిమాకి పోక తప్పలేదు.
ప్రమీల ప్రక్కన సినిమాలో కూర్చుంది. ప్రతిక్షణమూ తను వాళ్ళిద్దరి మధ్యా ఏమయినా అభ్యంతరంగా వుందేమోనని భయపడుతూనే వుంది.
శ్రీపతి ఇంత మాటకారి అని ఆమెకు యీ క్షణం వరకు తెలీదు. అతను అంత తీరిగ్గా మాట్లాడుతుంటే వినే సమయంకూడా ఇంతవరకూ ఆసన్నం కాలేదు. ఇదే వాళ్ళ సంభాషణ మధ్య తనేం జోక్యం కలిగించుకోకుండా వింటూ కూర్చుంది. ఇంట్లో చెప్పకుండా వచ్చినందుకు ఆమె బాధపడుతూనే వుంది. వాళ్ళు వేరే విధంగా ఏమయినా అనుకుంటారేమోనని కూడా ఆమె భయపడింది. కాని సినిమా ప్రారంభం అయ్యాక కథలో లీనమైపోయి ఆ కొంచెం సేపయినా అవన్నీ మరచిపోవాలని ప్రయత్నించింది. మధ్యలో ఆమెకు ఇందాక ప్రమీల అన్నమాట గుర్తుకువచ్చింది. అవును. అటువంటివన్నీ మానేసి చాలాకాలం అయింది. ఇటువంటి వినోదాలవల్ల మనోవికాసం కలిగించుకోవాలన్న ఉబలాటంకూడా ఆమెలో ఎప్పుడో అంతరించి పోయింది. కాని ప్రమీల అలా యెందుకు అంది? తమ కుటుంబ విషయాలు ఆమెకు తెలియదా?
"ఆడవాళ్ళు మాట్లాడకుండా ఎక్కువసేపు వుండగలుగుతారన్న సత్యాన్ని నేనింతవరకు నమ్మలేక పోయేవాణ్ని. కాని ఇప్పుడు ప్రత్యక్షంగా చూడగలుగుతున్నాను."
ఈ మాటలు రాధని ఉద్దేశించి, ఆమె వినకూడదనే ఉద్దేశంతోనే మెల్లగా అన్నాడు శ్రీపతి ప్రమీలతో. కాని రాధకు ఈ మాటలు ఎలాగూ వినిపించాయి.
ఆమెకు నువ్వు వచ్చింది. "ఈ మనిషి ఇప్పుడింత తెలివిగా మాట్లాడగలుగుతున్నాడు. కాని సుభద్రమ్మగారు చెప్పిన ప్రకారం ఒకప్పుడు యీయనేనా అంత మొరటుగా ప్రవర్తించింది."
సినిమా అయిపోయాక జట్కాయెక్కి ప్రమీల ఇంటిదగ్గర ముగ్గురూ బండి దిగారు.
"ఒంటరిగా వెళ్ళగలరేమో అడుగు" అన్నాడు శ్రీపతి.
రాధకు ఈ మాట వినిపించి "వెళ్ళగలను" అంది ప్రమీలతో అన్నట్లుగా.
శ్రీపతి బండివాడికి డబ్బులు ఇచ్చేసి లోపలకు వెళ్ళిపోయాడు. ప్రమీల స్నేహితురాలి చేతిని తన చేతిలోకి తీసికొని చీకట్లో ముఖాన్ని చూడటానికి ప్రయత్నిస్తూ "కోపం వచ్చిందా" అని అడిగింది.
"ఎందుకా."
"నిన్ను బలవంతంగా తీసుకువెళ్ళానని?"
రాధ నవ్వటానికి ప్రయత్నిస్తూ "లేదులే" అంది.
"కాని నువ్వు ఏమీ చూడలేదనుకుంటాను. అక్కడ కూర్చున్నంతసేపూ ముళ్ళమీద కూర్చున్నట్లు బాధపడ్డావు కదూ?"
"అలా అని నీ అంతరాత్మ చెప్పిందా?"
ఈ వ్యంగ్యానికి ప్రమీల సమాధానం చెప్పలేక చిన్నగా నవ్వింది.
"చాలా రాత్రయింది. వెళ్ళివస్తాను" అని రాధ చెప్పి బయలుదేరింది.
ఆమె నేలమీద వేసే ప్రతి అడుగూ, చుట్టూ మంటలున్నప్పుడు తప్పించుకో వీలులేని మనిషి అనుకోకుండా తడబడి చివరికి మంటల్లోనే వేసినట్లుగా వుంది.
వీధులన్నీ చాలావరకు నిర్మానుష్యంగా వున్నాయి. చాలా చీకటి రాత్రులలో వంటరిగా నడవటం రాధకు అలవాటు లేదు. కొంచెం భయం వేసింది. కాని తప్పేదేముంది. అలాగే నడవసాగింది. కాని "వదినా!" అని తమాషాగా పిలిచే కృష్ణుడి ఇంటిముందు వచ్చేసరికి ఆమె అనుకోకుండా ఆగిపోయింది. ఆ ఇంట్లోంచి రోడ్డువైపు వున్న ఒక గదిలోంచి శ్రవణానందంగా వినిపిస్తూన్న ఒక వాద్య సంగీతం ఆమెను ముగ్ధురాలిని చేసింది. స్తబ్దురాలై ఒకటి రెండు నిముషాలు అలానే నిలబడి పోయింది. ఆ గదిలో లైటు వెలుగుతోంది. కిటికీ తలుపులు తెరుచుకునే వున్నాయి. ఆ కిటికీలోంచి చూస్తే లోపల ఏం జరుగుతుందో స్పష్టంగా కనిపిస్తుంది. రాధ అటువైపు చూసింది. ఆనందరావు యిటు తిరిగి కూర్చుని తనూ అందులో లీనమైపోయినట్లుగా బహు సున్నితంగా ఆ జంత్రాన్ని మ్రోగింప చేస్తున్నాడు. అది బుల్ బుల్ అని రాధకు తెలుసు. కాని ఇంత మధురంగా, హాయిగా, తీయగా శబ్దతరంగాల్ని పుట్టించే శక్తి అతని చేతుల్లో వుందని ఆమెకు యింతవరకూ తెలియదు. అలాగే కొంచెం సేపు వింటూ నిల్చుంది. అది నలుగురూ నడిచే దారి అనీ, ఒకవేళ ఆనందరావు వెనుదిరిగి తనని పసిగడితే తను చాలా నగుబాటుపాలు కావలసి వస్తుందనీ ఆమె ఆ సమయంలో మరిచిపోయింది.