Previous Page Next Page 
మంచు పర్వతం పేజి 14

 

       "నిజమే, మంచి అందమైన అబ్బాయిలుంటే బావుండేది. వేరే కబుర్లు చెప్పుకుంటూ రెండురోజులు గడిపేవాళ్ళం" అంది నవ్వుతూ.   
   
    "గడుసుదానివే" అన్నాడతను.
   
    "అలా లేకపోతే మీలాంటి మగాళ్ళతో వేగలేం" అంది.
   
    రాత్రిపదింటికి అతడు దిగాల్సిన స్టేషన్ రావాలి. రైలు రెండు గంటలు లేటు నడుస్తుంది, చాలా చిత్రంగా అతడిమీద కోపం పోయింది.
   
    వైజయంతి పడుకోబోతుంటే అన్నాడతను.
   
    "అర్దరాత్రి నేను దిగిపోతాను. మళ్ళీ ఎప్పుడైనా కలుస్తే సంభాషణ పొడిగిద్దాం. నా స్థానంలోకి ఓ అందమైన రాజకుమారుడు రావాలని కోరుకుంటూ నిద్రపో గుడ్ నైట్"
   
    "థాంక్యూ అంకుల్ అండ్ గుడ్ నైట్!" చెప్పింది నవ్వుతూ.
   
    అతడు దిగిపోయేటప్పుడు మెలకువ వస్తుందనుకుంది కాని రాలేదు. కాని మామూలుకంటే త్వరగానే లేచిందా ఉదయం. మెల్లగా కిందకు దిగబోతూ ఆగిపోయింది ఆశ్చర్యంగా.
   
    కింద బెర్తుమీద చూసింది. అతడు కృష్ణశర్మ కాదు.
   
    పాతికేళ్ళ అందమైన యువకుడు. ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. నల్లటి ముంగురులు ఫాన్ గాలికి నుదుటిమీద నాట్యం చేస్తున్నాయి.
   
    మన్మధుడే పూలబాణాలు వేశాడో, రెక్కలతో ఎగిరి వచ్చిన క్యూపిడ్ వలపు బాణాలు వేశాడో తెలియదు గాని అతడిని చూస్తూ అలాగే నిలబడిపోయింది వైజయంతి 'కృష్ణశర్మ అన్నట్లుగా రాజకుమారుడే దిగివచ్చాడా' నవ్వుకుంది.
   
    ఎవరో తనను నిశితంగా చూస్తున్నారని తెలిసినట్లుగా అతడు కళ్ళు తెరిచాడు. ఇద్దరి కళ్ళూ కలుసుకున్నాయో క్షణం. వైజయంతి గాభరాగా చూపు మరల్చుకుంది. తనెక్కడున్నదీ గుర్తురాగానే దిగ్గున లేచి కూర్చున్నాడతడు.

    ఆమె సందేహం అర్ధం అయినట్లుగా చిన్నగా నవ్వాడు.
   
    "సారీ! రాత్రి నేను వచ్చి పడుకున్నప్పుడు మీరు మంచి నిద్రలో వున్నారనుకుంటాను. నా పేరు శరత్! శరత్ చంద్ర" అన్నాడు.
   
                              6
   
    సరిగ్గా సంవత్సరం తర్వాత వాళ్ళ పెళ్ళి జరిగింది.
   
    అప్పటికి వైజయంతి ఎమ్.ఏ.ప్రీవియస్ పరీక్షలు అయిపోయాయి. సివిల్ సర్వీస్ కి ప్రిపేరవుతోంది.
   
    తన జీవితంలో ఆ ఒక్క సంవత్సరమూ ఎలా గడిచిందో వైజయంతికి ఎప్పటికీ ఆశ్చర్యంగానే వుంటుంది. రైల్లో కలిసిన శరత్ తిరిగి అనుకోకుండా సిమ్లాలో కలవడం, అవంతి కూడా అతడిని ఓ.కే. చేయటం, తాము ట్రెక్కింగ్ పూర్తిచేసుకుని ఢిల్లీ తిరిగి వచ్చేసరికి అతడు తన తల్లిదండ్రులను కలసి తనతో స్నేహానికి అనుమతి తీసుకోవటం అంతా క్షణాల్లో గడిచిపోయినట్లనిపించింది. గుజరాత్ లో పనిచేస్తున్న అతడికి వారానికో ఉత్తరం క్రమం తప్పకుండా వ్రాసేది. అతడి దగ్గరనుంచీ రెగ్యులర్ గా ఉత్తరాలు వచ్చేవి. ఇద్దరూ ఒకరినొకరు బాగా అర్ధం చేసుకున్నారని తృప్తిపడ్డారు.
   
    తన లక్ష్యం పూర్తయ్యేవరకు పెళ్ళిచేసుకోకూడదనుకున్న ఆమె పట్టుదల మాత్రం సడలించుకోవాల్సి వచ్చింది. శరత్ తండ్రికి బాగా సీరియస్ అవడంతో, ఆయన తమ పెళ్ళి చూడాలని పట్టుబట్టడం జరిగింది. పెళ్లయినా తను ఢిల్లీలోనే వుండి చదువుకోవచ్చుననీ, సివిల్ పరీక్షలకు ప్రిపేరవ్వవచ్చుననీ శరత్ మాట ఇచ్చాడు. అది నిలబెట్టుకున్నాడు కూడా ప్రిలిమ్స్ మంచి మార్కులతో పాసయింది వైజయంతి.
   
    ఎమ్.ఏ.ఫైనల్ పరీక్షలు, ఆ వెంటనే సివిల్ సర్వీసెస్ పరీక్షలు రెండూ బాగా వ్రాసింది. ఇంటికి వచ్చేసరికి భర్తకు ఢిల్లీలోనే గవర్నమెంట్ ఉద్యోగం దొరికినట్లుగా శుభవార్త తెలిసింది. అతడు గుజరాత్ నుండి వచ్చేశాడు.
   
    చిన్న ఇల్లు తీసుకుని వేరుగా కొత్తకాపురం పెట్టారు. రోజులు క్షణాల్లో గడిచిపోతున్నాయి. ఆమె ప్రతిరోజూ ఉదయమే లేచి ఎక్సర్ సైజు చేయడాన్ని శరత్ వేళాకోళం చేయడం మాత్రం సహించలేక పోయింది. ఉదయపు వ్యాయామం అవసరాన్ని అతడికి తెలియజెప్పాలనే ఆమె ప్రయత్నం అసలు ఫలించలేదు. ఏడయితేనే గాని నిద్ర లేవడతడు. అలాంటి చిన్న చిన్న విభేదాల్ని మధురమైన సంఘటనలుగా మార్చుకుని ఆనందం పొందేవాళ్ళు.
   
    ఆమె ఎమ్.ఏ. యూనివర్సిటీ ఫస్టున పాసయినట్లు తెలిసిన రోజున శరత్ ఆనందానికి అంతులేదు. పెద్ద పార్టీ యిచ్చేశాడు. రెండు నెలల తర్వాత సివిల్ ఫలితాలు వచ్చాయి. టాప్ ర్యాంక్ లో వుంది వైజయంతి. శరత్ డానికి పెద్దగా సంతోషించకపోవడం ఆమెకుఇ ఆశ్చర్యాన్ని కలిగించింది. కాని ఇంటర్వ్యూ ప్రిపేరవడం మొదలుపెట్టడంలో ఆ విషయానికంత ప్రాముఖ్యం యివ్వలేదు. ఆమె చుట్టూ వున్న స్వచ్చమైన ప్రపంచంలో ఎవరూ ఆమెకు ద్వంద్వ ప్రవృత్తుల గురించీ-కాంప్లెక్స్ ల గురించీ తెలియజెప్పలేదు ఇప్పటివరకూ.
   
    అప్పుడే శరత్ లో అసహనత మొదలయింది. ఇంటర్వ్యూ అంటే చిన్న విషయం కాదు. ప్రపంచ పరిస్థితులను, ప్రాచీన వర్తమాన చరిత్రనూ ఔపోసనం పట్టాలి. ప్రపంచంలో ఏ మూల ఏం జరుగుతున్నదీ నిద్రలో పేలి అడిగినా చెప్పగలగాలి. ఒక యజ్ఞం చేస్తున్నంత దీక్షగా చదవాలి.
   
    "ఎప్పుడూ చదువేనంటావు. ఇంటర్వ్యూకి కూడా ఏమిటంత కష్టపడడం? అయినా నువ్వు సెలక్టవుతావంటే నాకు బాధగా వుంది వైజూ!" అన్నాడు శరత్ దిగులుగా.
   
    "ఏమిటి నువ్వంటున్నది? న్నెఉ పాసవడం నీకు ఇష్టం లేదా?" ఆశ్చర్యంగా అడిగింది వైజయంతి.
   
    "అదికాదు వైజూ! రెండేళ్ళు నీకు ట్రైనింగ్ పీరియడ్ కదా! రెండేళ్ళు నాకు దూరంగా వుండవలసి వస్తుంది. నేనుండలేను. నువ్వయినా వుండగలవా అలా? తలచుకుంటేనే బాధగా లేదూ?" అడిగాడతను.
   
    "లేదు" జవాబిచ్చింది వైజయంతి. "చూడు శరత్, నువ్వు సంపాదించే డబ్బు మనకు సరిపోతుంది. అమ్మా, నాన్నా నాకు కావలసినంత ఆస్తి జమచేసి వుంచారు. కాలక్షేపం కోసం నేను ఏ చిన్న ఉద్యోగమో చేసుకోవచ్చు. కానీ డబ్బు, హోదాల గురించి కాదు నేను ఈ పరీక్ష పాసవ్వాలనుకుంటున్నది. నా ఆత్మసంతృప్తికీ, నా అస్థిత్వాన్ని రుజువు చేసుకోడానికీ!! అది మనిషిగా నా కర్తవ్యం!! మన ఆశయం "పెరుగుదల" అయినప్పుడు కొన్ని కష్టాలు తప్పవు. అవయినా మనం భరించలేనివి కావు. అయినా, ఇలాంటి ప్రశ్నలు రాకూడదనే లక్ష్యం పూర్తి కాకుండా పెళ్ళి చేసుకోనన్నాను. నీ పూర్తి సహకారం వుంటుందని అప్పుడు మాటకూడా ఇచ్చావు. ఇప్పుడు నువ్విలా మాట మార్చడం భావ్యంగా లేదు".
   
    "అయిందా ఉపన్యాసం! అంత కోపం దేనికి? నిన్ను వదిలి దూరంగా వుండాలన్న బాధతో అలా సరదాగా అన్నానుగాని నీకు అడ్డుతగులుతానని ఎలా అనుకున్నావు? అలా అయితె నిన్ను ఫైనల్స్ కి వెళ్ళనిచ్చేవాడినా? నా భార్య కలెక్టరని చెప్పుకోవడం నాకు మాత్రం గర్వకారణం కదూ! రాత్రి పగలు లేకుండా నువ్వు కష్టపడుతుంటే చూడలేక ఏదో అంటాను. సారీ" లేచి పక్కగదిలోకి వెళ్ళాడు ముఖం చిన్నబుచ్చుకుని.
   
    వైజయంతి నిట్టూర్చింది. కాపురం పెట్టి ఆరు నెలలవకుండానే చిన్న చిన్న భేదాభిప్రాయాలు మొదలయ్యాయి. ఇద్దరం చదువుకున్న వాళ్ళం, సంస్కారవాంతులం ఏ సమస్యనయినా సామరస్యంగా ఆలోచించుకుని పరిష్కరించుకోగలం అనుకునే వాళ్ళెప్పుడూ కాని శరత్ లో అహం పాలు ఎక్కువ అప్పుడప్పుడూ తను కాస్త కన్నీళ్ళతో బ్రతిమలాడుతుంటే అతడికి తృప్తి కానీ అదామెకు ఎందుకో చిన్న పిల్లల మనస్తత్వంలా అనిపిస్తుంది. ఇష్టం లేకపోయినా అప్పుడప్పుడు అతడి కోరిక ప్రకారం ప్రవర్తిస్తుంటుంది. ఇప్పుడూ అదే పని చేసింది. లేచి అతడి దగ్గరగా వెళ్ళింది.
   
    "సారీ శరత్! నిన్ను బాధపెట్టినట్లున్నాను, సారీ!" అతడిని చుట్టేసుకుంది.
   
    ఆ రోజునుంచీ, రోజుకో రెండు గంటలయినా అతడితో ఫ్రీగా గడిపి రాత్రిళ్ళు అతడు నిద్రపోయాక చదువుకోవడం మొదలుపెట్టింది.
   
    ఇంటర్వ్యూ, గ్రూపు డిస్కషన్ అయ్యేవరకూ అంతా టెన్షనే ఇంటర్వ్యూలో అడగనే అడిగారు.
   
    "అంత త్వరగా పెళ్ళెందుకు చేసుకున్నారు? మీ కెరీర్ కి అది అడ్డుకాదా!" అడిగాడొకాయన.
   
    "లేదు పెళ్ళి నా కెరీర్ కి ఏ విధంగానూ ప్రతిబంధకం కాలేదు, కాదు ప్రిలిమ్స్ తో సహా నేను పెళ్ళయ్యాకే పాసయ్యాను. అందుకే ఈ రోజు మీ ముందున్నాను" అంది ధైర్యంగా ఆయన నవ్వుతూ చూశాడామెవైపు.
   
    "మీరు నిర్ణయించుకున్న భవితవ్యానికి పెళ్ళి, పిల్లలు ఇకముందైనా ప్రతిబంధకం కావచ్చునని నేననుకుంటున్నాను. మీ ఉద్దేశ్యం?"
   
    తనను కవ్వించాలనే వాళ్ళ ఉద్దేశం అని గ్రహించిందామె.
   
    "కాదనే నా నమ్మకం. అది వారి వారి ఇండివిడ్యుయాలిటీని బట్టి వుంటుంది. పురుషుడు ఎలా సంసారం చేసుకుంటూ ఉద్యోగ బాద్యతలను నిర్వహించుకోగలుగుతున్నాడో స్త్రీ కూడా అంతే నేను బాద్యతకు కట్టుబడి వుండగలననే నమ్మకం నాకుంది" వైజయంతి కంఠంలో రవ్వంత కూడా తడబాటు కనబడలేదు.
   
    తర్వాత సబ్జెక్ట్ గురించి వరుసగా ప్రశ్నలు వేయడం మొదలు పెట్టారు దేనికీ సంశయం లేకుండా జవాబు లిచ్చింది.
   
    "ఉయ్ విష్ యు ఆల్ సక్సెస్ మేడమ్!" అన్నాడు ఆయన ఆమె బయటకు వస్తుండగా.

 Previous Page Next Page