ఇక్కడ ఉదయం ఏడున్నరకల్లా ఇంట్లోంచి బయట పడాలి. తిరిగి ఇల్లు చేరేటప్పటికి రాత్రి ఏడవుతుంది. వారంలో అయిదు రోజులూ అంతే క్రమశిక్షణని ఇక్కడ బాగా పాటిస్తారు. అలాంటి క్రమశిక్షణలకు అలవాటు పడిపోయిన నేను అక్కడ వాతావరణంలో సుఖపడలేను. పదింటికి ఆఫీసైతే పదినరకు వచ్చి అరగంటలో 'టీ' కి వెళ్ళే ఆ బద్దకస్తుల మధ్య నేను మనుగడ సాగించలేను. పైగా ఇక్కడ రీసెర్చి స్కాలర్లకు అన్ని సదుపాయలు సమకూరుస్తారు. నా ప్రతిభకు గుర్తింపు వుంటుంది. అక్కడ ఎంతమంది సైంటిస్టులు ఫ్రస్టేషన్ తో ఆత్మహత్యలు చేసుకుంటున్నారో నీకు తెలియంది కాదు. అన్నీ తెలిసి అక్కడకు రావడం అవివేకం. నా రీసెర్చి ఇలాగే కొనసాగితే కొద్ది సంవత్సరాల్లో ప్రపంచానికి ఉపయోగపడే కొత్త సిద్దాంతాన్ని కనిపెట్టగలనన్న నమ్మకం నాకుంది. నా ప్రగతిని స్వయంగా చూడటానికి, నా కోసం నేను నిర్మించుకున్న ఈ చిన్న గృహాన్ని చూడడానికి నువ్వేరా వెంటనే ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకో.
నీ
అవంతి".
వైజయంతి వెళ్ళడానికే నిశ్చయించుకుంది. మూడు నెలల లీవు అప్లయ్ చేసింది. పాస్ పోర్ట్ వచ్చాక చెప్పింది శరత్ కు ప్రయాణం విషయం.
"నీ ఫ్రెండు నిన్నొక్కదాన్నే రమ్మని వ్రాయడమేమిటి? అదేం సంస్కారం? అయినా మనకేం తక్కువయిందని ఆమె నీకు టిక్కెట్ కొనడం? మనం విడిగా వెళదాంలే వరల్డ్ టూర్ కి" అన్నాడతడు.
"మనకు ప్రపంచమంతా తిరిగే తాహతు వుంది. నిజమేగాని, మేమిద్దరం కలిసి గడపగల సమయానికి విలువ కడితే అదంతా ఏ మూలకి?"
"అదంతేలే నాతో గడపడం తప్ప నీకు మరెవరితో వున్నా సంతోషమే".
"ఎవరితోనయినా కాదు, అవంతితో మాత్రమే శరత్! ఇప్పటికి చాలాసార్లు మనమధ్య ఇలాంటి గొడవలు జరిగాయి. నాకు అన్నింటికన్నా ముఖ్యం 'నేను'. ఆ తర్వాత అవంతి. ఆ తర్వాతే నువ్వయినా, అమ్మా, నాన్న అయినా మా బంధం ఏమిటో నీకు అర్ధంకాదు".
"కనీసం నీకు నీ మీద తప్ప ప్రేమ మరెవ్వరిమీదా లేదని ఒప్పుకున్నావు సంతోషం యు ఆర్ ఎ సెల్ఫ్ ...సెంటర్ద్ ఉమెన్".
"ప్రతి మనిషి ముందు తనను తాను ప్రేమించుకోవడం తప్పదు. అది కాదన్న వాళ్ళంతా హిపోక్రట్స్ నేను అన్నం తినడం నీ కోసం, గాలి పీల్చడం నీ కోసం అన్న హిపోక్రసీ నాలో లేదు. అందుకే ధైర్యంగా ఒప్పుకున్నాను".
శరత్ కి బాగా కోపం వచ్చి వెళ్ళిపోయాడు.
7
అవంతి ఇల్లు చిన్నదైనా చాలా నచ్చింది వైజయంతికి.
"అవంతీ! ప్రతి మనిషి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి ఏకాంతం కావాలని కోరుకుంటాడు. ఎంత హాయిగా వుందిక్కడ. కేవలం నీ కోసం నువ్వు బ్రతకగలుగుతున్నావు. మరెవ్వరి ఆధారమూ లేదు. ఈ యింట్లో నాకెంతో సంతోషంగా వుంది".
"నేను సంతోషంగా వున్నానన్నమాట నేనూ, నువ్వూ తప్ప మరెవ్వరూ ఒప్పుకోవడంలేదు. ప్రతివాళ్ళూ నాకు పెళ్ళి కాలేదని ఒంటరిదాన్ననీ తెగ జాలిపడిపోతున్నారు. వాళ్ళను చూసి నేను జాలి పడతాను".
"హిపోక్రసీ అవంతీ! ఒక రచయిత్రి వ్రాసినట్లు 'భర్తలను వదలి వెళ్ళడం పాపంకాదు' అని ఏ సాధుమహారాజైన చెబితే మన దేశంలో నూటికి తొంభైతొమ్మిది మంది గృహిణులు ఇల్లొదిలి వెళ్ళిపోతారట. నా విషయమే చూడు. చాలా గాఢంగా ప్రేమించుకున్నవాళ్ళం అది ప్రేమో, ఆకర్షణో తెలియకుండానే పెళ్ళి చేసేసుకున్నాం. ఈ రోజు కేవలం స్వార్ధంతో కలిసి బ్రతుకుతున్నాం. మన సంఘంలో రాజకీయ నాయకులూ, రచయితలూ, సినిమా యాక్టర్లూ, హోదాలో వున్నా ఆఫీసర్లూ ముఖ్యంగా "స్త్రీలు" తప్పుచేసినా వెంటనే పేపర్లోకి ఎక్కుతుంది. నా అస్థిత్వాన్ని రుజువు చేసుకోవాలని ఓ పెడిస్టల్ మీద కెక్కాను. అడుగు వేసేటప్పుడు జాగ్రత్తపడకపోతే కిందపడి కాళ్ళూ, చేతులూ విరక్కొట్టుకుంటాను.....పదిమంది నన్ను పొగుడుతుంటారు కాబట్టి నా భర్త ఆ గొప్పతనాన్ని ఫీలవుతుంటారు. ఏకాంతంలో మాత్రం నామీద తన అధికారాన్ని నిరూపించుకోవాలని తాపత్రయ పడతాడు. మన సమాజంలో భర్త అనేవాడు ఎప్పుడయినా పై మెట్టులో వుండాలని ఆరాటపడతాడు. అతడో సగటు మనిషి అతడిమీద జాలివేస్తుంది. అంతే" నవ్వేసింది వైజయంతి.
"అందరు మగవాళ్ళు అలాగే వుంటారంటే నేనొప్పుకోను వైజూ! నీ అనుభవం నీకు నేర్పిన పాఠం యిదంతా నేనీ ఏకాంతాన్ని నా సంతోషం కోసం ఎంచుకున్నాను అదే ఏకాంతాన్ని అనుభవిస్తూ ప్రతిక్షణం బాధపడేవాళ్ళు వుండవచ్చు. ఆలోచిస్తే పెళ్ళి అనేది చాలా మంచి ఇన్ స్టిట్యూషన్ కాని పరస్పర అవగాహన లేకపోవడం, స్వార్ధం, డబ్బు దాన్ని కలుషితం చేస్తున్నాయి" అంది అవంతి.
వైజయంతికి ఒప్పుకోక తప్పలేదు.
* * *
మూడు నెలలపాటు అమెరికా అంతా తిరిగి వచ్చి హైదరాబాద్ లో డ్యూటీలో జాయినయింది వైజయంతి. ఆ రోజునే వినాయక చవితి కమ్యూనల్ రయట్స్ తో ఉద్రిక్తంగా వుంది పరిస్థితి.
ఇది మరో రకం సమస్య వైజయంతి తీరిక లేకుండా బాధ్యతా నిర్వహణలో పడిపోయింది.
ఎంత బిజీగా వున్నా తన బాల్య స్నేహితురాళ్ళని కలవాలని ఆమె మర్చిపోలేదు. ఒకప్పుడు "టిమిడ్ జీనియస్" (పిరికి మేధావి) గా వాళ్ళ దృష్టిలో నిలిచిపోయిన తను "ట్రబుల్ షూటర్"గా ఎంత మంచి పేరు తెచ్చుకున్నదీ తెలియచెప్పాలని ఎదురు చూస్తోంది- 1988 ఏప్రిల్ నెల కోసం.
* * *
విశాల
ఇంటర్ పరీక్షా ఫలితాలు వచ్చాయి. వైజయంతి, భార్గవి, అనూరాధ ఫస్ట్ క్లాసులో పాసయ్యారు..విశాల మాత్రం సెకండు క్లాసులో పాసయింది. తనకు మాత్రం తక్కువ మార్కులు రావడం చాలా బాధ కలిగించింది.
ఎక్కడో పొరపాటు జరిగిందనీ, తను పరీక్షలు చాలా బాగా వ్రాశాననీ రెండు రోజులు ఏడ్చింది. ఆమె విషయం బాగా తెలిసిన ఇంట్లో పెద్దలు పరీక్షల్లో జరిగే అవకతవకలు గురించి సోదాహరణంగా తిట్టిపోసి ఆమెను అనునయించారు. చిత్రమేమిటంటే వాళ్ళు కూడా మార్కులు దిద్దేవాడు సరిగ్గా చూసి వుండడని మనస్ఫూర్తిగా నమ్మేరు.
విశాల బి.యస్సీ లో చేరింది. భార్గవి గుంటూరు వెళ్ళిపోవడం, అనూరాధ మరో కాలేజిలో చేరడంతో స్నేహితులు ముగ్గురూ దూరమయ్యారు ఒకే ఊళ్ళో వున్నా అనూరాధని ఎక్కువగా కలిసేది కాదు విశాల.
విశాలది చాలా గమ్మత్తయిన మనస్తత్వం.
ఆమెకూ, ఆమె బావ విశ్వనాధానికీ పెళ్ళి చేయాలని చిన్నప్పటి నుండీ పెద్దవాళ్ళు అనుకుంటున్నదే ఆమెకు విశ్వం అంటే లోపల ఇష్టమే కాని బెట్టుసరిగా నేను ఇప్పుడే పెళ్ళి చేసుకోననీ, బాగా చదువుకుంటానన్నీ గొడవ చేస్తుండేది. కాలేజీలో చేరిన కొన్నాళ్ళకే ఆమెకో విషయం చూచాయగా తెలిసింది.
విశ్వనాధానికి మేనకోడలు వరసయిన జ్యా అతడిని ప్రేమిస్తున్నట్టూ, విశ్వం కూడా ఆమె వైపు కాస్త మొగ్గు చూపిస్తున్నట్లూ! ఆమె గుండె గుభేలుమంది. తనవాడనుకున్న విశ్వం పరాయివాడవుతాడన్న భావన ఆమె భరించలేకపోయింది. వెంటనే తనను బాగా గారాబం చేసే బామ్మ దగ్గిర మొరపెట్టుకుంది. పెళ్ళంటూ చేసుకుంటే విశ్వం బావనే చేసుకుంటాననీ లేకపోతే బావిలో దూకి చస్తాననీ బెదిరించింది. ఆ బామ్మే చూస్తుండగా ఓ రాత్రి పూట ఆ ప్రయత్నమూ చేసింది.
అంతే! ఆమె కోరుకున్నట్టుగా ఆ వైశాఖ మాసంలోనే ఆమె పెళ్ళి విశ్వంతో జరిగిపోయింది.
ప్రేమను మాటల్లో వ్యక్తీకరించడం కంటే అది నిరూపించడానికి చేసిన ఒక్క ప్రయత్నం ఎక్కువ ప్రభావం చూపుతుంది. విశ్వం మామూలు మనిషి తన కాబోయే భార్య 'విశాల' అని చిన్నప్పటినుంచి వింటున్నా ఆమె తనపట్ల ఆ భావం కనపర్చకపోవడం, జయ చూపులోనూ, చిన్న చిన్న చేతల్లోనూ తన ప్రేమను తెలియపర్చడం అతడిని అటువేపు ఆకర్షితున్ని చేశాయి. కాని విశాల ప్రాణత్యాగ ప్రయత్నం తెలిశాక జయ ప్రేమ మరుగున పడిపోయింది.
పెళ్లవగానే ఎంచక్కా చదువు మానేసి ఇంట్లో పనిపాటలు చేసుకుంటూ బావతో కలిసి తోడికోడళ్ళు సినిమాల్లో నాగేశ్వర్రావు, సావిత్రిల్లా 'ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే అలుపూ సొలుపేమున్నది' అని యుగళ గీతాలు పాడుకోవచ్చునన్న విశాలకు ఆశాభంగం కలిగింది.
పెళ్ళి పందిట్లోనే మామగారు "మా కోడలికి చదువుకుని ఉద్యోగం చేయాలని చాలా కోరిక అందుకే ఇప్పట్లో పెళ్ళి వద్దని గొడవ చేసేది. బాగా చదివే పిల్ల చదువు మానడం దేనికి? చదివిస్తాను" అంటుండగా వింది.