Previous Page Next Page 
మంచు పర్వతం పేజి 13

   

       వాళ్ళలో కాంపిటీషన్ స్పిరిట్ లేదు. అది కలగచెయ్యడానికి ఆమె చేసిన పనులేవీ సఫలం కాలేదు. అనుకున్నట్టుగా ఆ కాలేజీ అన్ని పోటీలలోనూ పాల్గొనలేదు. కాని చాలా సంవత్సరాల తర్వాత కొన్నింటిలోనయినా పాల్గొనడం, ఫస్టు ప్రయిజులు కాకపోయినా అసలు బహుమతులంటూ తెచ్చుకోవడం జరిగింది. వైజయంతి నిరుత్సాహ పడలేదు. మొలకంటూ ఎత్తింది మొక్కగా మారకపోదు అని తృప్తి.
   
    ఆ తర్వాత మరొక విషయంలో వైజయంతి వాళ్ళతో గొడవపెట్టుకోవలసి వచ్చింది.
   
    వైజయంతి క్లాసుమేటు నీరజ ఒక చక్కటి నాటిక వ్రాసింది. ఆ నాటిక చాలా నచ్చింది వైజయంతికి.
   
    పెళ్ళి అనేది స్త్రీ పురుషులిద్దరికీ అవసరమైందేననీ, అలాంటప్పుడు స్త్రీలు ముందుకు వచ్చి ప్రతిఘటించాలనీ, కట్నాలు యిచ్చి వివాహం చేసుకునేకంటే కన్యలుగా వుండిపోవచ్చనీ, డానికి తగిన ఆర్ధిక స్వాతంత్ర్యం స్త్రీ సమకూర్చుకోవాలనీ సోదాహరణంగా, సరళమైన భాషలో బాగా వ్రాసిందా అమ్మాయి ఇంటర్ కాలేజీ కాంపిటీషన్ లో ఆ నాటిక వేయిద్డామంది వైజయంతి కల్చరల్ సెక్రటరీతో ఆమె ఇచ్చిన జవాబు విని అవాక్కయి పోవలసి వచ్చింది.
   
    "ఎంత ఎక్కువ కట్నంయిస్తే అంత మంచి మొగుడొస్తాడు. అయినా ఆస్తిలో భాగం లేనప్పుడు కట్నం తీసుకుంటే తప్పేమిటి? పెళ్ళి పిల్లలు లేకపోతే అది స్త్రీ పరిపూర్ణమైన జీవితమే కాదు" అందామె. మిగతావాళ్ళూ ఆమెను సమర్ధించారు.
   
    ప్రేక్షకులు కంటతడి పెట్టించే నాటకాలకే బహుమతులు వస్తాయని, ఇలాంటి రెవల్యూషనరీ డ్రామాలు వేస్తే కాలేజీ పేరు పాడవుతుందనీ లెక్చరర్లే అనేశారు. వైజయంతి హతాశురాలయింది. ఇంత అధునాతనంగా కనిపించే ఈ అమ్మాయిల్లో అంత సనాతన భావాలా? మార్పు వచ్చేది వేషభాషల్లోనే కాని అంతరంగాల్లో కదా?
   
    కల్చరల్ సెక్రటరీ మరో నాటికను సెలెక్టు చేసుకుంది. ఒక స్త్రీ దయనీయమయిన కథ అది. మొదటినుంచి చివరిదాకా ఆమె కష్టాలుపడుతూనే వుంటుంది.  కన్నీరు కారుస్తూనే వుంటుంది. ఈ సమాజం, పురుషుడు స్త్రీని ఎన్ని హింసలకు గురి చేయగలరో వివరంగా చూపించబడింది. చివరికామె ఆత్మహత్య చేసుకోవడంతో కథ ముగుస్తుంది.
   
    ఆశ్చర్యం ఏమిటంటే ఆ నాటకానికి, హీరోయిన్ పాత్రధారిణికి మొదటి బహుమతులు వచ్చాయి. కాలేజీ అంతా పొంగిపోయింది ఒక్క వైజయంతి తప్ప.
   
    జరిగినదంతా విని నవ్వేసింది అవంతి.

    "మార్పు రావడం అంత సులభం కాదు వైజూ! ఏదైనా అంచెలంచెలుగా రావాలి గాని అకస్మాత్తుగా ఒక్కసారే రాదు. ఎప్పుడూ స్వీటుతినే అలవాటు వున్నా వాళ్ళకు ఒక్కసారి చేదు తినమని బలవంతం చేసి నెగ్గలేవు".
   
    "అంటే నేను చెప్పేది చేదు విషయం అంటావా?"
   
    "నీ దృష్టిలో కాదు కాని వాళ్ళ దృష్టిలో అంతే. తరతరాలుగా వాళ్ళ రక్తంలో జీర్ణించుకుపోయిన సనాతనాచారాలు, నమ్మకాలు అంత తేలిగ్గా పోవు. ఒక్కసారిగా ధనవంతులయి పోవడానికి ఆలోచన చెప్పు. వెంటనే ఆచరణలో పెట్టేస్తారు. ఆర్భాటంగా పెళ్ళిళ్ళు చేసుకోకండి. సింపుల్ గా రిజిష్టరు మ్యారేజీ చేసుకుని మిగిలిన డబ్బుతో అవసరమైన వస్తువులను కొనుక్కోండి అను. నిన్ను వెలివేస్తారు. కొన్ని అలవాట్లకే బానిసలయిపోయిన వాళ్ళు అంత త్వరగా మారలేరు వైజూ".
   
    "మారి తీరాలి అవంతీ! పురుషుడిని గెల్చుకోవాలంటే డబ్బూ, కన్నీళ్ళూ చాలవే. నెగిటివ్ అప్రోచ్' నించి తన వ్యక్తిత్వంతో జయించుకోగలననే పాజిటివ్ అప్రోచ్ రావాలి స్త్రీలలో కనీసం చదువుకున్న వాళ్ళలో నయినా".
   
    వైజయంతి డైరీ పేజీలు తిప్పుతూ అక్కడక్కడా మళ్ళీ మళ్ళీ చదువుకుంటూ ఆలోచనలో పడింది.
   
    ఎలా వుంటారు తన స్నేహబృందం? వాళ్ళకు వస్తున్నట్లుగా ఉత్తరం రాయలేదు. వాళ్ళ దగ్గరనుంచి ఉత్తరాలు లేవు చాలా కాలంగా అనూరాధ మాత్రం రాసిందెప్పుడో వీలైతే ఆమెను కలవాలి ఒక్కసారి. వాళ్ళలో ప్రగతి ఎలా వుందో తెలుసుకోవాలి. హైదరాబాద్ లో వుండేది రెండే రోజులు. అందులో ఒకరోజు ఫ్రెండ్స్ తో కలిసి కాలేజీకెళ్ళి ఆ పొగడ చెట్టుకింద గడిపితే, గతించిణ కాలాన్ని ఒక్కసారి మననం చేసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ...
   
    ట్రైన్ లో సంభాషణ వాగ్వివాదంలోకి దిగడంతో వైజయంతి దృష్టి మళ్ళించింది.
   
    "ఎన్నయినా చెప్పండి. దేశంలో అనాచారం బాగా పెరిగిపోయింది. మన ఆచార వ్యవహారాలమీద సాంప్రదాయాలమీద విలువ తగ్గిపోయి అలా దిగజారిపోయింది. స్త్రీలు బయటకు రావడం మొదలెట్టాక అది మరింతగా పెరుగుతోంది" అన్నాడు కృష్ణశర్మ.
   
    "దానికి నేనొప్పుకొను. ఇలాంటి కబుర్లు చెప్పే-స్త్రీలను అణిచేశారిన్నాళ్ళూ మేమూ మీలాగే బయటకు వచ్చి అన్ని రంగాలలోనూ సమంగా నిలబడుతుంటే సహించలేక యిలా మాట్లాడుతున్నారు" అంటోంది తల్లి.
   
    "పురుషుడిలో ఆ బలహీనత వున్నమాట నిజమే. కాబట్టే స్త్రీ జాగ్రత్తగా వుండాలనేది. నష్టపోయేది ఆమె కాబట్టి" కృష్ణశర్మ కూడా వూరుకోకుండా రెట్టిస్తున్నాడు.
   
    "ఏం నష్టపోతుంది? శీలాన్ని అని కదా మీరనేది? స్త్రీకి మాత్రమే ప్రధానమా ఆ శీలం? మగవాడికి అవసరం లేదా? ఒక స్త్రీని బలవంతంగా చెరిస్తే అది మానభంగం. దానికంటే మించింది అభిమానభంగం. మార్చాల్సింది ఈ దేశపు పురుషున్ని".
   
    "ఊర్కో రజనీ అమ్మాయి ముందు ఏమిటా మాటలు?" చిన్నగా మందలిస్తున్నట్లు అన్నాడు తండ్రి.
   
    "అమ్మాయేం చిన్నపిల్ల కాదు. ఆమె దగ్గర మనం దాచాల్సిన విషయాలు ఏమీలేవు. ఈ తరం అమ్మాయిలలో ఇలాంటి అభిప్రాయాలు చాలా వున్నాయి. మన దగ్గిర చెప్పకపోవచ్చు అయినా మీరూ అందరి మగాళ్ళలాగే ప్రవర్తిస్తుంటారు. నేనే అడ్డుపడకపోతే దానికి పదహారేళ్ళకే పెళ్ళిచేసి బాధ్యత తీరిపోయిందనుకునే వారు" అంది రజని.
   
    ఆ తర్వాత సంభాషణ రాజకీయాలలోకి మార్చేశాడు కృష్ణశర్మ.
   
    వైజయంతికి ఆశ్చర్యమనిపించింది. తల్లి అంతలా వాదించడం ఎప్పుడూ చూడలేదు. ఆమెలో యింత అధునాతన భావాలున్నాయని కూడా అనుకోలేదు.
   
    ఆ విషయమే ఆలోచిస్తూ ఆమె నిద్రపోయింది.
   
    అలవాటు ప్రకారం అయిదున్నరకే మెలకువ వచ్చింది. కిందకు దిగితే తల్లి దండ్రులకు డిస్ట్రబెన్స్ అని కాసేపు అలాగే పడుకుంది. కాని అది చాలా ఇబ్బందికరంగా అనిపించి చప్పుడు చేయకుండా కిందకు దిగి బాత్రూం వేపు వెళ్ళింది.
   
    కృష్ణశర్మ తలుపు దగ్గర కూర్చుని బ్రష్ చేసుకుంటున్నాడు.
   
    "గుడ్ మార్నింగ్ బేబీ!" అన్నాడు నవ్వుతూ.
   
    "గుడ్ మార్నింగ్" ముక్తసరిగా చెప్పి బాత్రూంలోకి వెళ్ళి పోయింది. ఆమె కాలకృత్యాలు ముగించుకుని సీటు దగ్గిరకు వచ్చేటప్పటికి తెల్లవారుతోంది.
   
    కృష్ణశర్మ కాఫీ రెడీగా పెట్టాడామెకోసం. కిటికీలోంచి చల్లటిగాలి వీస్తోంటే వేడి కాఫీ తాగుతోంటే ఎంతో బావుంది. అంతలో ఏదో స్టేషన్ వచ్చింది. శర్మ లేచి వెళ్ళి న్యూస్ పేపర్లు కొనుక్కువచ్చాడు. ఒకటి వైజయంతి చేతిలో పెట్టి, రెండోది విప్పి చదవడంలో మునిగి పోయాడు.
   
    వైజయంతి పేపరు తిరగేస్తూ కూర్చుంది. ఈ లోపల తల్లిదండ్రులిద్దరూ లేచి బయటకు వెళ్లారు. పేపరు మూసేసి బద్దకంగా ఒళ్ళు విరుచుకుంది వైజయంతి ఎక్స్ ర్ సైజు లేకపోవడం ఏమిటోగా అనిపిస్తుంది.
   
    "ఏమిటమ్మా ఈ రోజు ముఖ్య విషయాలు?" అడిగాడు శర్మ.
   
    "మీరూ పేపరు చూశారుగా! నన్నడుగుతారేం?" అనబోయి "ఏముంది, ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఎక్కడ ఏమన్నారు? ఏవేం ఇనాగరేట్ చేశారు పాకిస్తాన్ లో ఎంతమంది చచ్చిపోయారు. ఇవే, రోజూ వుండేవే" అంది విసుగ్గా.
   
    "అదికాదు, ఉగాండాలో ఈదీ అమీన్ ప్రెసిడెంటు ఒబొటేని గద్దెదించాడు. రాజ్యం చేజిక్కించుకున్నాడు. సోవియట్ రష్యా పంపించిన శాల్యూట్-1 ఆకాశంలో సోయూజ్-10తో లింక్ ఏర్పరచుకుంది. ఇవన్నీ నువ్వు గుర్తుపెట్టుకోవలసిణ విషయాలు అయ్యేయస్ కి ప్రిపేరవటం అంటే ఇలాంటి విజ్ఞానం అంతా కావాలి. ఈ మధ్యనే అన్యాక డామ్ ని ఇనాగురేట్ చేశారు. ఈజిప్టులో అదే రోజో చెప్పగలవా? జనవరి పదిహేను. ఇలాంటి జనరల్ నాలెడ్జి, జనరల్ అవేర్ నెస్ బాగా వుండాలి సివిల్ సర్వీసెస్ పాసవడానికి. అదేం అల్లాటప్పా వ్యవహారం కాదు. ప్రతిరోజూ పేపరు కటింగ్స్ తీసి స్క్రాప్ బుక్ తయారు చేసుకోవడం చాలా అవసరం నీకు యు హావ్ టు వర్క్ హార్డ్, రియల్ హార్డ్" అన్నాడతను సీరియస్ గా.
   
    వైజయంతి అతదివైపే చూస్తూ కూర్చుండిపోయింది.
   
    "మనిషి ఎలాంటివాడైనా కానీ, అతడి అభిప్రాయాలూ, గుణాలూ ఏమైనా కానీ అతడినుంచి నువ్వు నేర్చుకోవలసిన గుణం ఏదో ఒకటి వుండవచ్చు. అందుకే అందరితో మాట్లాడు. వాళ్ళ మాటల్లో నీ కవసరమైన పాయింటు ఏదో ఒకటి దొరక్కపోదు" అని వ్రాసుకుందాపూట డైరీలో.

   
    ఆ తర్వాత ప్రయాణం బోర్ కొట్టలేదామెకు. రోజంతా కృష్ణశర్మతో కబుర్లు, వాదనలు అతడికి చాల జనరల్ నాలెడ్జి వుంది.
   
    "నాలాంటి ముసలాడు దొరికాడని తిట్టుకున్నావ్ గదూ? ఎవరైనా వయసులో వున్న అబ్బాయి అయితే కంపెనీ బావుండేది" అన్నాడతను వెక్కిరింపుగా.

 Previous Page Next Page