స్టీవర్డ్ వచ్చాడు మెనూకార్డు తీసుకుని.
కొంచెం తికమకపడి స్టీవర్డ్ సహాయంతో ఓ పెగ్గు మెక్ డోల్ విస్కీ ఆర్డర్ చేశాడు.
అందరూ తనవంక చూస్తున్నారా?
మళ్ళీ వెంటనే సమర్ధించుకున్నాడు. చూస్తే చూశారు. తన యిష్టం తన మనసెలా చెబుతుందో అలా ప్రవర్తిస్తాడు.
ఎవరివంకా చూడకుండా విస్కీ వచ్చాక కాస్త కాస్త తీసుకున్నాడు. కొంచెంసేపు గడిచాక చాలా స్వేచ్చగా వున్నట్లు ఫీలయి యితరులగురించి ఆలోచించటం మానేశాడు. తన లోకంలో పడిపోయాడు.
ఇంచుమించు రెండుగంటలసేపున్నాడు అక్కడ మూడు పెగ్గులదాకా తీసుకున్నాడు. ఏదో చిప్స్ లాంటివి తిన్నాడుగానీ, భోజనంగాని, టిఫిన్ గాని ఏమీ చెయ్యలేదు.
బేరర్ కు బిల్ పే చేసి లేచాడు. చాలా మత్తుగా వుందిగాని నిన్న జరిగినట్లుగా తలతిరగటం లేదు. అడుగులు కొంచెం తడబడ్డాయి గాని కంట్రోల్ చేసుకోగలిగాడు. మెల్లగా కారుదగ్గరకు వచ్చాడు.
తాను డ్రైవ్ చెయ్యగలదా? ఫర్వాలేదు అనుకుంటూ స్టీరింగ్ ముందు కూర్చున్నాడు. ఏదో లోకాల్లో వున్నట్లు, తనకు తెలీకుండా ఎక్కడికో వెళ్ళిపోతున్నట్లు అనిపిస్తుందిగాని, కరెక్ట్ గానే డ్రైవ్ చేస్తున్నాడు.
ఇంటికి వచ్చి, డోర్ తెరవటం కొంచెం యిబ్బంది పడినా మొత్తంమీద తీయగలిగాడు.
"బిందూ! బిందూ..."
కొంతసేపటికి గాఢనిద్ర పట్టేసింది.
* * *
మర్నాడు కోర్టుకు వెళుతున్నప్పుడు రాధ కనిపిస్తుందేమోనని చూశాడు. ఎందుకో ఆ పాప అంటే అతనికి అవ్యాజమైన ప్రేమ కలిగింది. కనపడలేదు.
ఆ సాయంత్రం తిరిగి స్కూల్ మీదుగా వచ్చాడు. కనబడలేదు. ఎందుకో చూడాలనిపించింది. రెండుమూడు నిముషాలు తటపటాయించి హనుమంత రావుగారింటికేసి వెళ్ళాడు.
ఆయన ఇంట్లోనే వున్నాడు. ప్రదీప్ ని చూసి "రండి" అన్నారు మర్యాదగా కుర్చీ చూపిస్తూ.
"రాధ కనబడలేదేం?" అనడిగాడు ప్రదీప్.
"రాత్రి కన్ను బాగా ఎర్రబడింది. నొప్పి అనికూడా బాధపడింది. ప్రొద్దుట వాళ్ళ అక్కయ్య డాక్టరుదగ్గరకు తీసుకెళ్ళింది. కన్ జక్టివైటిస్ అనిచెప్పి మందులు రాసిచ్చాడు. కన్ జక్టివైటిస్ అయితే స్కూలుకి వెళ్ళకూడదుకదా. అందుకని యింట్లోనే వుంది" అన్నారాయన.
ఇంతలో రాధ లోపల్నుంచి వచ్చింది.
ఎడమకన్ను బాగా వాచివుంది. ఎర్రగా జ్యోతిలా వుంది.
"పాపా! యిటురా" అని పిలిచాడు ప్రదీప్.
రాధ సంకోచిస్తూ "డాక్టరుగారు... మిగతావాళ్ళకి దూరంగా వుండమన్నారు. లేకపోతే వాళ్ళకికూడా వస్తుందిట" అంది రాకుండా అక్కడే నిలబడి
ప్రదీప్ నవ్వి "వైరల్ కన్ జక్టివైటిస్ ఊళ్ళో తీవ్రంగా వున్నట్టుంది" అన్నాడు.
అంతలో అతనిదృష్టి ప్రక్కనున్న అల్మైరామీద పడింది అందులో చిన్న చిన్న కప్పులు, మెమొంటోలు కనిపించాయి.
"అవన్నీ రాధ గెల్చుకున్నవే. నర్సరీలో చేర్చినప్పట్నుంచీ చదువులోనూ స్పోర్ట్సు అన్నీ ఫస్టే" అన్నారు హనుమంతరావుగారు.
బాగానేవుందిగాని హనుమంతరావుగారికి యీ వయస్సులో యింత చిన్న కూతురేంటి?
"మా అమ్మాయిలను పరిచయం చెయ్యలేదు కదూ" అని కూతుళ్ళని లోపల్నుంచి పిలిచి "ఇది మా పెద్దమ్మాయి సునీత టెన్త్ వరకూ చదివాక యిహ చెప్పించలేక ఆపుజేశాను. ఇది రెండో అమ్మాయి అరుణ. ఇదికూడా నిరుడే టెన్త్ పాసయింది. దీనికీ అంతటితో ఆపుచేసేశాను. వీళ్ళు పుట్టాక చాలా ఏళ్ళకి రాధ. కడుపులో వుండగా ఎబార్షన్ చేయించేసేద్డా మనుకున్నాను గాని, మొగపిల్లవాడు పుడతాడనే ఆశతో వూరుకున్నాను. ఇది పుట్టినప్పుడే పురిట్లో జబ్బుచేసి నాభార్య...." అంటూ కళ్ళు ఒత్తుకుని "వీళ్ళ భారాన్ని నాకు వదిలేసి తను వెళ్ళిపోయింది"
"అయ్యో!" అన్నాడు ప్రదీప్ అప్రయత్నంగా.
"నాది చాలీచాలని జీతం. వెనక దమ్మిడికూడా ఆస్తిలేదు. వీళ్ళిద్దరూ కుట్టుమిషనూ, ఎంబ్రాయిడరీ నేర్చుకుంటున్నారు కాని వీళ్ళిద్దరి పెళ్ళిళ్ళ భారం నామీద..."
ప్రదీప్ కి ఏమి జవాబు చెప్పాలో తోచక నిశ్శబ్దంగా ఊరుకున్నాడు.
"అన్నట్లు మీరేం చేస్తారో అడగనేలేదు."
"నాపేరు ప్రదీప్! నేను లాయర్ని."
"మీవంటివారితో పరిచయం కావటం మా అదృష్టం. మీ శ్రీమతిగార్ని కూడా ఒకసారి తీసుకురండి."
"ఆమె లేదు" అన్నాడు ప్రదీప్.
ఆయనకు సరిగ్గా అర్ధంకాలేదు. "అంటే" అన్నాడు కళ్ళజోడు సవరించు కుంటూ.
"చనిపోయింది డెలివరీలోనే."
"అయ్యో" అన్నారు హనుమంతరావుగారు చాలా విచారంగా "పిల్లలు?"
"మొట్టమొదటి కాన్పే అది తల్లీ, పిల్లా యిద్దరూ..."
రెండునిముషాలు బరువుగా, మౌనంగా గడిచాయి.
"అరుణా! బాబుగారికి కాఫీ తీసుకురామ్మా" అన్నాడాయన.
అరుణ అక్కడ్నుంచి కదలబోయింది.
"వద్దండీ నేనింటికి వెళతాను" అని ప్రదీప్ లేచి నిలబడి "వస్తానండీ" అని సెలవు తీసుకుని రాధవంక చిరునవ్వుతో చూసి కారుదగ్గరకు వెళ్ళి పోయాడు.
* * *
చీకటి పడింది. గతరాత్రి అనుభవం మళ్ళీమళ్ళీ కావాలని కోరుతుంది మనసు. ఆ అనుభూతి బాగుంది. ఆ నిషా బాగుంది. కాని బార్ కి వెళ్ళటం అంతమంది మధ్య కూర్చోవటం ఆ రాత్రివేళ శరీరం స్వాధీనంలో లేనిస్థితిలో తిరిగిరావటం ఏమంత సుఖంగా అనిపించలేదు.
ఇంట్లో ఫ్రిజ్ వుంది. ఐస్ క్యూబ్స్ వున్నాయి.
"రామూ!" అని పిలిచాడు.
"అయ్యగారూ!"
చిన్నకాగితంమీద ఓ పేరురాసి, ఓ వందరూపాయల నోటు యిస్తూ "దగ్గర్లో వున్న వైన్ షాపుకు వెళ్ళి యీ బాటిల్, ప్రక్కనే ఎక్కడ్నుంచయినా బిస్లరీ సోడాలూ తీసుకురా" అన్నాడు.
"అయ్యగారూ!" అన్నాడు రాము వారించబోతున్నట్లుగా.
"ఒరేయ్, అడ్డుచెప్పకుండా నే చెప్పినట్లు చెయ్యి, ఇష్టంలేకపోతే పన్లోంచి మానెయ్యి" అన్నాడు ప్రదీప్ కటువుగా.
రాము గుడ్లలో నీరుక్రుక్కుకుంటూ ఆ నోటు, కాగితం తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు.
7
అప్పట్నుంచీ, ప్రతీరోజూ సాయంత్రంనుంచీ అదో రొటీన్ అయిపోయింది.
మాలతి రెండుమూడుసార్లు అతనికి ఫోన్ చేసింది. అతను దొరకలేదు. ఒకసారి త్రాగుతూ వున్న స్థితిలో ఆమెతో మాట్లాడటమిష్టంలేక ముక్తసరిగా మాట్లాడి రిసీవర్ పెట్టేశాడు.