Previous Page Next Page 
సిగ్గేస్తోంది! పేజి 13

  

      "గుడ్.. కనీసం నీ కొడుకునైనా జాయిన్ చెయ్యి" అన్నారు వర్మగారు.
   
    "ధైర్యంగా బతికినవాళ్ళు, పోయాక కూడా బతుకుతారు! ధైర్యంలేని వాళ్ళు ప్రతిరోజూ చస్తుంటారు! నా కొడుకుని ధైర్యంగా బతికేటట్లు పెంచుతాను" స్థిరంగా అంది ధరణి.
   
    "వెల్ సెడ్ మై చైల్డ్!" ఆప్యాయంగా ధరణి తల నిమురుతూ అన్నారు వర్మగారు. వర్మగారి ఇంటినుండి ధరణీ, శ్రీధర్ బైట పడేసరికి చాలా లేట్ అయింది. లాస్ట్ బస్ ఉందో వెళ్ళిపోయిందో తెలియదుగానీ బస్ స్టాప్ అంతా నిర్జనంగా ఉంది. ఎక్కడా ఆటోల జాడేలేదు.
   
    "చందూగాణ్ణి రమ్మన్నా బాగుండేది!" అంది ధరణి.
   
    "పద.... కాళ్ళకి పని చెప్దాం" అన్నాడు శ్రీధర్.
   
    చలిగాలి రివ్వున కొట్టింది. కొద్దిపాటి జల్లులు పడసాగాయి. ధరణి చీర భుజాల చుట్టూ కప్పుకుని నడుస్తోంది.
   
    "ఛ! చచ్చినా బండి ఎవరికీ ఇవ్వకూడదు!" తనకి తనే చెప్పుకున్నాడు శ్రీధర్.
   
    ధరణి పూర్తిగా తడిసిపోయింది. చీర ఒంటికి అతుక్కుపోయి నడవడానికి వీలు కావడం లేదు. లైట్ల వెలుతురులో తారురోడ్డు నున్నగా మెరిసిపోతోంది. వాన హెచ్చింది.
   
    "ఆ చెట్టుకింద కాసేపు ఆగుదాం" అన్నాడు శ్రీధర్. ఆ చీకటి రాత్రి, వర్షం జల్లు- తడిసిన చీరెలో భార్య- అన్నే కలిసి అతడికి ఓ అందమైన, అద్భుతమైన అనుభూతిని కలుగచేస్తున్నాయి. అక్కడే కొంతసేపు గడపాలనుకున్నాడు. అయితే అతడి భావాన్ని ఆమె సరీగ్గా అర్ధం చేసుకోలేదు.
   
    "ఆటోలు కనుచూపు మేరలో లేవు! ఎంతసేపని నిలబడతాం?" కాస్త విసుగ్గా అంది ధరణి.
   
    "ఇంటికి ఫోన్ చేస్తే చందూగడు తగుల్తాడేమో!" ఆశగా అన్నాడు శ్రీధర్.
   
    "ఫోన్ ఎక్కడుంటుందీ?" చుట్టూ చూసింది ధరణి. ఎదురుగావైన్ షాప్ ఒకటి ఓపెన్ చేసి కనిపించింది. "అక్కడనుండి చేద్దాం" అంది.
   
    శ్రీధర్ ఓ నిమిషం ఆలోచనగా చూసి, విధిలేక అటు నడిచాడు. తడిసిన చీర ఒంటిచుట్టూ కప్పుకుంటూ ధరణి అతన్ని అనుసరించింది.
   
    శ్రీధర్ షాప్ అతన్ని ఫోన్ అడిగి ఫోన్ చేస్తుండగా, స్కూటర్ ఒకటి వచ్చి వారి పక్కన ఆగింది.
   
    ధరణి పక్కకి తిరిగి చూసింది. ఎర్రని కళ్ళతో తూలుతూ యాదగిరి "రెండు ఫుల్ బాటిల్ పట్రా!" అంటూ స్కూటర్ మీద వెనకాల ఉన్న వాడికి చెప్పాడు.
   
    "ఏవండీ!" ధరణి పిలిచింది.
   
    శ్రేధర్ "రింగ్ అవుతోంది. లిఫ్ట్ చెయ్యడం లేదు" అంటూ వెనక్కి తిరిగాడు.
   
    ధరణి యాదగిరివైపు కళ్ళతో చూపించింది. యాదగిరి పాకెట్ లోంచి చిన్న బాటిల్ తీసి గడగడా తాగుతున్నాడు.
   
    శ్రీధర్ ఫోన్ పెట్టేశాడు. అతని పళ్ళు పటపటా కొరుక్కున్నట్లు ధరణి గమనించింది. అతను అంత స్పీడుగా, దూకుడుగా నడవడం ఆమె ఎప్పుడూ చూడలేదు! శ్రీధర్ యాదగిరి దగ్గరికి వెళ్ళి, "ఏయ్! స్కూటర్ దిగు!" అన్నాడు.

    "ఎవర్రా నువ్వు గురూగారినే దబాయిస్తున్నావు?" బాటిల్స్ కొనుక్కొస్తున్న అసిస్టెంట్ అడిగాడు.
   
    "ఇది నా స్కూటర్ మర్యాదగా దిగి నడిచి వెళ్ళండి" అన్నాడు శ్రీధర్.
   
    "ఓ..... నువ్వా అన్నా! పొద్దుగాల ఇస్తా" తూలుతూ అన్నాడు యాదగిరి.
   
    "ముందు దిగు!" గట్టిగా అన్నాడు శ్రీధర్.

    "దిగకుంటే?" అడిగాడు కోపంగా అసిస్టెంట్.
   
    "పోలీసుల్ని పిలవాల్సొస్తుంది" అన్నాడు శ్రీధర్.
   
    యాదగిరి చప్పున "ఇంతడానికి అంత లొల్లి ఎందుకు? పొద్దుగాల ఇస్తా....గమ్మునుండరాదే!" నవ్వుతూ అన్నాడు.
   
    శ్రీధర్ కోపం పెరిగిపోతోంది. ధరణి కంగారుగా చూసింది.
   
    "దిగుతావా లేదా?" స్కూటర్ హ్యాండిల్ పట్టుకుని గొంతు పెంచి అడిగాడు శ్రీధర్.
   
    యాదగిరి కోపంగా చూస్తూ "మర్యాద ఇస్తుంటే ఏంది? పొద్దుగాల ఇస్తా అంటున్న సమజ్ గాలే?" అన్నాడు.
   
    శ్రీధర్ అతని మెడమీద చెయ్యివేసి లాగుతూ "క్రిందకి దిగు మాట్లాడదాం" అని ధరణివైపు తిరిగి "ధరణీ! పోలీస్ స్టేషన్ కి ఫోన్ చెయ్యి!" అన్నాడు.
   
    ధరణి గబగబా ఫోన్ వైపు వెళ్ళింది.
   
    "ఆగుండ్రి!" అన్నాడు యాదగిరి.
   
    ధరణి ఆగిపోయింది.
   
    "చూస్కుందాం?" శ్రీధర్ చేతికి స్కూటర్ ఇస్తూ అన్నాడు.
   
    రెండు సార్లు స్టార్ట్ చేసినా స్కూటర్ స్టార్ట్ అవలేదు. శ్రీధర్ కి విసుగు ఎక్కువైంది. ధరణి సన్నగా నవ్వుతూ "....స్కూటరూ, స్త్రీ ఒకలాటివే. ఎంత తొందరగా స్టార్ట్ అవుతాయా అన్నది, కిక్ కొట్టే మొగవాడి సామర్ధ్యం మీద ఆధారపడి వుంటుంది" అంది. మంచి మూడ్ లో వుంటే ధరణి, మొగాడిలా అంతకన్నా లోతైన పదప్రయోగాలు చేస్తూ వుంటుంది. శ్రీధర్ కే అవి అర్ధంకావటానికి కాస్త టైమ్ తీసుకుంటుంది. భార్య ఏకాంతంలో అలా మాట్లాడటం శ్రీధర్ కి చాలా నచ్చుతుంది. అయితే ప్రస్తుతం అతడు చాలా ఇరిటేటింగ్ మూడ్ లో వున్నాడు.
   
    "...పదకొండున్నర అవుతూంది. జోకులాపు. చలికి ఇది స్టార్ట్ కావటంలేదు. నీకు చలి వెయ్యటంలేదూ? తీరిగ్గా జోకులేస్తున్నావు?" అన్నాడు. ధరణి నవ్వుతూ, "నా మొగుడిక్కొత్తగా వచ్చిన ధైర్యాన్ని చూసి నాలోని చలి దెయ్యం పారిపోయింది. తొందరగా స్టార్ట్ చెయ్యండి. పన్నెండు లోపులో చేరుకోవాలి మనం" అంది, శ్రీధర్ అర్ధం కానట్టు "పన్నెండుకీ దానికీ ఏమిటి సంబంధం?" అన్నాడు.
   
    ఆమె గొంతు తగ్గించి, విశ్వరహస్యం విప్పే వేదాంతిలా "పన్నెండంటే రెండు ముళ్ళూ కలిసే సమయం" అంది రహస్యంగా.
   
    అంతలో స్కూటర్ స్టార్టయింది. ధరణి ఎక్కి కూర్చుంది.
   
    శ్రీధర్ కి ఇంకా కోపం తీరలేదు. "బాస్టర్డ్! పిల్లకి ప్రాణం మీదకి వచ్చిందని పసిదాని మీద అబద్దాలు కూడా!" అన్నాడు. ఆమె మాట్లాడలేదు. అతని నడుము చుట్టూ చేతిని వేసి అతని వీపుమీద తన ముఖాన్ని దాచుకుంది. ఇప్పుడు కురుస్తున్న జల్లు ఎంతో ఉల్లాసంగా అనిపిస్తోంది! త్వరగా ఇళ్ళు చేరుకొని అతని కౌగిలిలో ఒదిగిపోవాలని ఆమె తొందరపడుతోంది.
   
    ఇంటికెళ్ళిన అరగంటకి చిన్నముల్లు పెద్దముల్లు పైకొచ్చింది. "ఏవిటి ఇంత మూడ్ లో ఉన్నావు?" అడిగాడు శ్రీధర్. ధరణి తన ముఖాన్ని అతని ముఖం మీద నుండి తప్పిద్తూ 'థాంక్యూ శ్రీ!" అంది.
   
    మనసు పొరలు చీల్చుకునీ, మౌనం రేకు విప్పుకునీ, పెదాల పరదాలు దాటివచ్చే భావాలను నిశ్శబ్దం ఆకలిగా మింగేసింది!
   
                                       5
   
    "నాకు భయంగా వుంది!" అంది స్వీటీ దగ్గిరగా జరిగి-
   
    "అక్కర్లేదు" అన్నాడు రాజేష్ - ఆ అమ్మాయి చెయ్యి పట్టుకుని.
   
    స్వీటీ అతన్ని దూరంగా తోసేస్తూ, "మనం పెళ్ళిచేసుకుంటామా?" అని అడిగింది.
   
    రాజేష్ ఆలోచనగా కళ్ళు చిట్లించి, అప్పుడే పై పెదవి మీద మోలుస్తున్న్ నూగారుని తడుముకుని "నాకింకా పదిహేనేళ్ళేగా! ఇంకొ పదేళ్ళయినా ఆగాలేమో!" అన్నాడు.
   
    "మరి .... మరి ముద్దు ఎందుకు పెట్టుకొంటున్నావు?" స్వీటీ కోపంగా అడిగింది.
   
    "నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి" అన్నాడు రాజేష్.
   
    వాళ్ళిద్దరూ తమ గదుల (డార్మిటరీస్) నుంచి దొంగతనంగా బయటకొచ్చి, హాస్టల్ వెనుకవైపు తుప్పల్లో అర్దరాత్రి మాట్లాడుకుంటున్నారు. పన్నెండేళ్ళే స్వీటీకి ఇదంతా ఒకవైపు భయంగానూ, మరొకవైపు ఉద్వేగంగానూ ఉంది.
   
    "ప్రేమంటే ఇదేనా?" స్వీటీ కళ్ళల్లో ఉత్సుకత మెరిసింది.
   
    "కాదు.... ప్రేమంటే ఇంట్లోంచి పారిపోవాలి. పెద్దవాళ్ళు మనకోసం వెతుకుతూ వచ్చి పట్టుకుని విడదీయడానికి చూసినా భయపడకూడదు! వాళ్ళని ఎదిరించాలి. లాభం లేకపోతే ఇద్దరం కలిసి ప్రాణాలు తీసుకోవాలి" ఆవేశంగా చెప్పాడు.
   
    "అంటే....చచ్చిపోవాలా?" స్వీటీకి ఏడుపొచ్చేసింది.
   
    "ఇప్పటి సంగతి కాహ్డుగా.... ఎందుకేడుస్తావు?" రాజేష్ విసుక్కున్నాడు.
   
    "ఏమో! నాకు భయం ఉంది. ఇలా తుప్పల్లో మనల్ని ఎవరైనా చూస్తేనో!" ఏడుపు ఆపుకుంటూ అడిగింది.
   
    "భయపడకు. నేను నీ శీలాన్ని దోచుకోను" పదిహేనేళ్ళ రాజేష్ అభయం ఇచ్చాడు.
   
    "శీలం దోచుకోవడం అంటే ఏమిటీ?" కన్నీళ్లు తుడిచేసుకుని ఉత్సాహంగా అడిగింది స్వీటీ.
   
    "సినిమాల్లో చూడలేదా?" అడిగాడు రాజేష్.
   
    "చూశాను. అర్ధంకాలేదు. ఒక అమ్మాయిని అబ్బాయి గట్టిగా పట్టుకుని, ఆమె గింజుకుంటున్నా విడువకుండా అదిమిపెట్టి ఏం చేస్తాడు?" అమాయకంగా అడిగింది స్వీటీ.
   
    "అలా అదిమిపెట్టాకా, అబ్బాయి ఆమె మీదకి వంగుతాడు."
   
    "ఆ తర్వాత!!!"

 Previous Page Next Page