ఈ ఉత్తరాలు చూడటానికి ఆయన దినచర్యలో టైము ప్రొద్దున్న తొమ్మిదినుంచీ తొమ్మిదిన్నర వరకూ.
ఆగష్టు ఒకటో తారీఖు తొమ్మిదిన్నరకు ఆయనకి పార్టీ చీఫ్ అవినాష్ తో అప్పాయింట్ మెంటు వుంది. అంటే ఉత్తరాలు చూడటం పూర్తి అయ్యేక.
తొమ్మిదిన్నర వరకూ మామూలుగానే ఆయన మొదటి ఫైలు నెట్టేసేడు.
అవినాష్ ఇంకా రాలేదు.
సాధారణంగా ప్రైమ్ మినిష్టర్ ప్రోగ్రాంలో రావాల్సిన వాళ్ళ ఆలస్యం ఉండదు. ఒకవేళ అలాంటిదేదయినా వుంటే, ఇంకొ విజిటర్ ని పంపటం జరుగుతుంది. ఈ చిన్న చిన్న విజిటర్లు రెండు మూడు నిమిషాల వ్యవధిలో తమ సంభాషణ ముగించాల్సి ఉంటుంది.
అయితే అవినాష్ తో యీ చర్చ దాదాపు గంటసేపు జరగాల్సి వుంది. ప్రతిపక్షం చాలా బలంగా వుంది. పార్టీ ఏ క్షణమైనా మెజారిటీ పోగొట్టుకొనేలా వుంది. అందుకే ఆ రోజు చాలా కీలకమైన చర్చ జరగబోతూ వుంది.
పార్టీ చీఫ్ ఇంకా రాలేదు.
తొమ్మిదీ ముప్పై అయిదు.
సాధారణంగా ఇలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు ప్రజల ఆసక్తిని పక్కకి మళ్లించే సంఘటనల్ని ప్రభుత్వం చేపట్టాలి. దాన్ని గురించి చర్చించటానికే చీఫ్ వస్తున్నది.
తొమ్మిదీ నలభై.
ప్రధానమంత విసుగ్గా రెండో ఫైలు ముందుకు లాక్కున్నాడు. సెకండ్ అసిస్టెంట్ ఆన్సర్ చెయ్యవలసిన ఉత్తరాలు. సావనీరుకి అభినందనలు పంపమనీ- ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి రమ్మనీ - ఇలాంటివి.
ఫైలు పడేసి వెనక్కి వాలబోతూ, మూడో ఫైలు చూసేడు. ఓ కాగితం క్రిందికి జారి, చివర్లో పి.ఎస్. కనబడుతూంది. ప్రధాన మంత్రికి పి.ఎస్. వ్రాసేదెవరా అని కుతూహలంతో ఉత్తరాన్ని బయటకి లాగేడు....."ఆ నక్షత్రానికి ఆకర్షణ శక్తి ఉన్నట్లయితే భూమ్మీది వస్తువులు డానికి వెళ్ళి అతుక్కుంటాయి-"
చాలాసేపు దానివైపే తదేకంగా చూస్తూ వుండిపోయేడు ఆయన.
ప్రతి ఉత్తరానికీ చివర్లో పి.ఎస్. లు వ్రాసే మతిలేని ప్రొఫెసర్ అలవాటు. ఈ కథని ఇంకో మలుపు తిప్పటానికి ఉపయోగపడింది.
చాలా విచారకరమైన మలుపు.
* * *
"ఇండియన్ టైమ్స్" అన్నదిపత్రిక ఆంద్రదేశం నుంచి వెలువడుతుంది. చాలా తక్కువకాలంలో అది ఎక్కువ అమ్మకాన్ని సాధించగలిగింది. డానికి కారణం అది ప్రచురించే అతిశయోక్తులు. మామూలు విషయాన్ని కూడా అందంగా చదివేవారికి కుతూహలం కలిగించేలా ప్రకటిస్తూ ఉంటుంది. నలుగురు చాకుల్లాంటి సబ్ ఎడిటర్లున్నారు. మిగతా దినపత్రికలకి అందని విషయాల్ని కూడా సేకరించి వీళ్ళు ప్రచురిస్తూ ఉంటారు. వాళ్ళల్ల్లో ఒకామె శైలజ.
రమణ ఆ రోజు మామూలుగా లంచ్ అవర్లో టీ తాగి వచ్చి, తన సీట్లో కూర్చొని పనిచేసుకొంటున్నాడు.
అంతలో ఫ్యూన్ వచ్చి టైమ్స్ ఆఫీసులో ఎవరో అతడి గురించి వేచి ఉన్నారని చెప్పాడు.
సాధారణంగా పత్రికాఫీసుల్లో ఎవరో అతడి గురించి వేచి ఉన్నారని చెప్పాడు.
సాధారణంగా పత్రికాఫీసుల్లో బయటవాళ్ళని లోపలి రానివ్వరు. సెక్యూరిటీ దగ్గరే ఆపుచేసి, ఫోన్ లో కావాల్సిన వాళ్ళని కనుక్కొని, అప్పుడు పంపిస్తారు పాస్ యిచ్చి.
'వచ్చిందెవరూ' అని కనుక్కుంటే ప్రొఫెసర్.
"వెల్ కమ్ టు మై ఆఫీస్" ఆనందంగా ఆహ్వానించేడు రమణ.
ప్రొఫెసర్ వచ్చి ఎదుటిసీట్లో కూర్చొని చుట్టూ చూసేడు. పెద్ద హాలు ఎవరి పని వాళ్ళు తలవంచుకొని చేసుకుపోతున్నారు.
"టీ త్రాగుతరా?" అడిగేడు రమణ.
"టీ కాదు ముఖ్యం. నీతో ఓ విషయం చెప్పటానికి వచ్చేను."
"ఏమిటి?"
"మనం సాయంత్రం ఫ్లయిట్ లో ఢిల్లీ వెళుతున్నాం?"
* * *
శైలజకి జ్ఞాపకశక్తి ఎక్కువ. చాలా సంవత్సరాల తర్వాత చూసిన విషయాల్ని కూడా జ్ఞాపకం పెట్టుకోగలదు. అందుకే ప్రొఫెసర్ ని గుర్తుపట్టింది.
అతడీ ఆఫీసుకు ఎందుకొచ్చినట్లు?
రమణ ముందు కుర్చీలో కూర్చోవటం చూసి ఆమె అక్కడికి వచ్చింది. అక్కడికి ఆమె చేరుకొనే సమయానికి రమణా, ఆయనా ఘర్షణ పడుతున్నారు. శెలవు దొరకదంటున్నాడు రమణ. ఎలాగయినా వీలు చూసుకొమ్మనీ తనకి అక్కడ అసలేమీ తెలియదనీ ప్రొఫెసరంటున్నాడు.
"హల్లో!" అంటూ చేరుకున్నది ఆమె అక్కడికి. "మీరు ఆనందమార్గం కదూ?" కుర్చీలో కూర్చొంటూ అడిగింది.
"కాదు, అయోమయం" అన్నాడు ప్రొఫెసర్.
ఆమె నవ్వి, "సరే, మీ మతిమరుపు చూస్తూంటేనే తెలుస్తూంది, మీరు ప్రొఫెసర్ ఎ. ఎమ్. ఎ.యమ్. అని" అంది.
"మీకు తెలుసా?" రమణ అడిగేడు.
"చాలా కాలం క్రితం పేపర్లో మీ ఫోటో చూసేను."
"నీ జ్ఞాపకశక్తి మెచ్చుకోదగిందమ్మాయ్" అన్నాడు ప్రొఫెసర్.
"ఇలా వచ్చారేమిటి?"
వచ్చిన పని చెప్పేడు ప్రొఫెసర్.
"నాకు శెలవు దొరకదు. చేరి నాలుగు రోజులు కాలేదు. అప్పుడే శలవంటే ఇంటికి పంపించేస్తారు" అన్నాడు రమణ.
"ఎందుకు ఢిల్లీ?" అడిగింది శైలజ.
"ప్రధానమంత్రి స్వయంగా రమ్మన్నారు....."
అప్పటివరకూ కుర్చీలో వెనక్కివాలి, కబుర్లు చెబుతూన్నదల్లా ఈ మాటతో నిటారుగా అయి, "ప్రధానమంత్రా?" అంది.
ప్రొఫెసర్ ఉత్తరం చూపించేడు.
దాంతో ఆమెకు కుతూహలం పెరిగింది. "అసలు విషయం ఏమిటి? మొత్తం అంతా వివరంగా చెప్పండి" అంది.
నక్షత్రం గురించీ-అది భూమి దగ్గరికి రావటం గురించీ అంతా చెప్పేడు. ఒకక్షణం ఆమె మౌనంగా ఆలోచిస్తూ వుండి పోయింది.
తరువాత, "ఒక షరతుమీద రమణకి లీవు ఇస్తాం" అంది.
"ఏమిటి?"
"ఈ విషయాన్ని ఢిల్లీలో ఎ పత్రిక్కీ మీరు ముందు వెల్లడి చెయ్యకూడదు."
"సరే దానికేముంది" అన్నాడు ప్రొఫెసరు. "ఒకవేళ వెల్లడిచేసినా ఎవరూ నమ్మరు. అసలు నేను వ్రాసిన ఓ పిచ్చి ఉత్తరానికి అంత ప్రాముఖ్యత రావటమే నాకు ఆశ్చర్యంగా వుంది. నావన్నీ కాకుల లెక్కలు" అన్నాడు.
ఆమె నవ్వి, "మాకు కావలసినవి అలాటి వార్తలే. లోకులు కాకులు" అంది. ఆ సాయంత్రం బోయింగ్ లో ప్రొఫెసర్, రమణ కలిసి ఢిల్లీ వెళ్ళారు.
* * *
ఆ మరుసటి రోజు ఇండియన్ టైమ్స్ పత్రికలో ఒక మూల బాక్సుకట్టి ఒక వార్త పడింది ఇలా-
ఆగష్టు, నాలుగు, అంతరిక్షం.
భూమిమీద సకల చరాచరాలు నాశనం కాబోతున్నాయా? ప్రొఫెసర్ ఆనందమార్గం అంచనా నిజమయ్యే పక్షంలో ఆ రోజు ఎంతో దూరంలో లేదు. ప్రాక్సిమా సెంక్చువరీ అనే నక్షత్రం భూమికి దగ్గరగా దూసుకువస్తోంది. కొన్ని వేల కోట్ల మైళ్ళవేగంతో వస్తూన్న యీ నక్షత్రం, భూమి యొక్క పరిధిలోకి ఆగష్టు పదిహేడు ప్రొద్దున్న పదకొండు గంటల పదినిమిషాలకి ప్రవేశించి, మూడు సెకన్ల కాలం పాటు వుండి అనంతవిశ్వంలోకి వెళ్ళిపోతుంది. అయితే భూమిలో వుండే పదార్ధాలన్నీ పోటీ పడి ఆ నక్షత్రాన్ని చేరుకోవటానికి తొందరపడడంతో భూమి పేలిపోతుంది. కాగితంలో పకోడీలు దట్టంగా కూరి నొక్కితే పేలినట్టు భూమి పేలిపోతుందా? పదిహేడో తారీఖు వరకూ వేచి చూద్దాం. ప్రొఫెసర్ మాటలేగానీ యదార్ధమైతే ఆ తర్వాత చూడటానికి మనం ఎలానూ వుండము.
_మా విలేఖరి
ఇండియన్ టైమ్స్ పత్రిక అతి తొందర్లోనే పైకి రావటం చూసి ఓర్వలేని మరో దినపత్రిక మధ్యాహ్నం ఎడిషన్ లో ఇలా ప్రకటించింది-